"అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా....?" అప్పుడే తన గదిలోకి వస్తున్న ఐనాందార్ ని చూసి ప్రశ్నించాడు సిద్దేశ్వర్ ఓబరాయ్.
    
    "అన్నీ పకడ్బందీగా ఏర్పాటు చేసాను. ఎస్.ఐ.కి, టెక్సీషియస్ కి తప్ప మరెవరికీ తెలీదు. ఆ ఇద్దరూ నిజాయితీపరులే. ఇకపోతే మూడోరోజు...అదే ఈరోజూ ఫోన్ కాల్ వస్తుందని గ్యారంటీ ఏమిటనే నా ఆలోచన" ఐనాందార్ సిద్దేశ్వర్ ఎదురుగా కూర్చుంటూ అన్నాడు.
    
    "హోప్.. చూద్దాం.... ఫోన్ కాల్ వచ్చిందో మన పరిశోధన ఊపందుకుంటుంది. లేదా....వేరే మార్గాల్లో అన్వేషిద్దాం..." అన్నాడు సిద్దేశ్వర్.
    
    "ఫైర్ ఆర్మ్స్ తయారుచేసే త్యాగరాజన్, కరీముల్లా, అరుణ్ మిత్రా, వీరాదేశాయ్ సంగతి మీరు నియమించిన సి.ఐ.డి. ఇన్ స్పెక్టర్ చూసుకుంటున్నాడు గనుక- మిగతావారి మీద చార్జ్ షీట్ ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది....?" ఐనాందార్ ప్రశ్నించాడు.
    
    "నో... నో.... ఇప్పుడే వద్దు మనవేపు నుంచి చర్యలు తీసుకోవటం మొదలెడితే అది అలా అలా పాకి ఖలీల్ కి చేరిపోతుంది. ఆ వెంటనే 'జె'కి తెలిసిపోతుంది. దాంతో వాళ్ళు మరింత జాగ్రత్త పడతారు. షరీఫ్ పార్టీ పూర్తయ్యాక-పిట్టలు మన చేతికి సాక్ష్యాధారాలతో చిక్కాక ఏక్షన్ తీసుకుందాం. అయితే అప్పటివరకు ఆగక్కర్లేదు. ఈలోపు నైఫ్స్, పాయిజన్స్, విషసర్పాల్ని, డెండ్లీడ్రగ్స్, గేస్, మార్ఫిన్, పాయిజ్ నెస్ ఇన్సులిన్ ని తయారుచేసే వాళ్ళ లిస్ట్, సాక్ష్యాలతో ఫైల్ తయారుచేసి సీక్రెట్ గా భద్రపరచండి. ఆపరేషన్ పూర్తవుతూనే, ఓవర్ నైట్ మెరుపు దాడి చేసి కస్టడీలోకి తీసుకొని, అప్పుడు ఛార్జ్ షీట్ ఫైల్ చేద్దాం. ఇకిప్పుడు మనం చేయవలసింది షరీఫ్ పార్టీ వ్యవహారాలు..." అంటూ సిద్దేశ్వర్ ఒక ఫైల్ ని బయటకు తీసాడు.
    
                                                       *    *    *    *    *
    
    మాస్టర్ వెయిట్ కి సమానంగా తను ఉండేందుకు క్రమం తప్పకుండా అరటిపండ్లు తీసుకుంటూ ఏ రోజుకారోజు వెయిట్ చూసుకోవటం మొదలెట్టాడు ప్రణవ.
    
    మాస్టర్ కుడిచెవి చివర భాగంలో చిన్న పుట్టుమచ్చ ఉంది. అది ప్రణవకు లేదు. అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవటానికి సిద్దపడ్డాడు. ఆ ఏర్పాట్లు ఒక ప్రక్క జరిగిపోతున్నాయి. అంతకు ముందు రోజే హెయిర్ స్టయిల్ ని మార్పించుకొని వచ్చాడు. చేతి వేళ్ళగోళ్ళు మాస్టర్ వాటిలా పెరగటం కోసం కాల్షియమ్ ఇంజెక్షన్ తీసుకుంటున్నాడు.
    
    మాస్టర్ మీసాలు గుబురుగా ఉంటాయి.
    
    ప్రణవ మీసాలు పల్చగా వున్నాయి.
    
    అందుకే హెయిర్ ని ట్రాన్స్ ప్లాంట్ చేయించుకొనేందుకు ప్రిపేర్ అయ్యాడు ప్రణవ. ఆ ఏర్పాట్లు మరో ప్రక్క చురుకుగా జరిగిపోతున్నాయి....
    
    ప్రణవని మాస్టర్ స్థానంలోకి పంపే టైమ్ దగ్గర పడుతున్న కొద్ది త్రిమూర్తులు, ప్రణవ తమ పూర్తి కాలాన్ని అందుకే వినియోగించసాగారు.
    
                                                      *    *    *    *    *
    
    త్యాగరాజన్ నిద్రాహారాలు మానేసి జోహ్రా ఆర్డర్ చేసిన ఫైర్ ఆర్మ్స్ మీదే తన దృష్టిని కేంద్రీకరించటంతో అది దాదాపు పూర్తి కావచ్చింది.
    
                                                     *    *    *    *    *
    
    సమయం సరిగ్గా 4.30 అయింది. జుహు ఎస్.ఐ., వాయిస్ ప్రింట్ టెక్నీషియన్ ఊపిరి పీల్చటం కూడా మానేసినట్లుగా ఫోన్ కేసు చూస్తు చూస్తున్నారు. క్షణాలు.... నిమిషాలు.... బహ్రంగా దొర్లిపోతున్నాయి.
    
    "మూడవసారి ఫోన్ కాల్ అదే ఆగంతకుడి నుంచి వస్తే పరిశోధనలో మరింత ముందుకు వెళ్ళవచ్చు..... అంతేకాక నేరస్థుల స్ట్రాటజీ తేలిగ్గా అర్ధమయి పోతుంది" అని. అన్న సిద్దేశ్వర్ ఓబరాయ్ మాటలు ఆ ఇద్దరి మనస్సుల్లో మెదులుతున్నాయి.
    
    టైమ్ 4.35 అయింది.
    
    సరీగ్గా ఇదే టైమ్ లో బొంబాయి పోలీస్ కమీషనర్ ఆఫీసులో సిద్దేశ్వర్ ఓబరాయ్, ఐనాందార్ లు ఉత్కంఠనే ఊపిరిగా చేసుకొని జుహు పోలీస్ స్టేషన్ నుంచి రానున్న ఫోన్ కాల్ కోసం ఎదురు చూస్తున్నారు.
    
    టైమ్ 4.39 అయింది....
    
    సెకండ్ల ముల్లు మూమెంట్స్ నే చూస్తూ అలర్ట్ గా ఉన్నారు జుహు ఎస్.ఐ, ఎక్స్ పర్టు.
    
    4.39:30
    4.39.40
    
    అప్పటికే స్టేషన్ లో ఉండే కానిస్టేబుల్స్ ని కావాలని మరోచోటికి ఏదో డ్యూటీ వేసి పంపించేసాడు ఎస్.ఐ. ఇప్పుడా స్టేషన్ లో ఆ ఇద్దరూ ఎస్.ఐ. గదిలో ఉంటే, ఇద్దరు కానిస్టేబుల్స్ స్టేషన్ ముందు సెంట్రీ డ్యూటీలో ఉన్నారు.
    
    సరీగ్గా 4.40 అయింది.
    
    ఫోన్ మ్రోగింది.
    
    ఇద్దరూ ఉలిక్కిపడి ఒకరికొకరు కళ్ళ ద్వారానే సంజ్ఞ చేసుకొన్నారు.
    
    ఎస్.ఐ. ఫోన్ ఎత్తగానే, వాయిస్ ప్రింట్ ఎక్స్ పర్టు తన పనిని పూర్తి చేసుకున్నాడు.
    
    "హలో.... జుహు ఎస్.ఐ స్పీకింగ్.... ఎవరు మాట్లాడేది....?" జుహు ఎస్.ఐ. ఎక్సయిట్ మెంట్ కి గురవుతూ అడిగాడు.
    
    "నేనెవరయితే మీకెందుకు...? నేను చెప్పేదే మీకు కావాలి అవునా...?"ఫోన్ కి ఆ వేపు నుంచి వినిపించింది.
    
    ఎస్.ఐ. కళ్ళలో మెరుపు కనిపించిందో క్షణం ఆ మెరుపును చూస్తూనే ఎక్స్ పర్టు వాయిస్ ప్రింట్ ని ఆన్ చేశాడు.
    
    "అఫ్ కోర్స్.... విషయమేమిటి?" ఎస్.ఐ. తిరిగి అన్నాడు.
    
    "షరీఫ్ ఇచ్చే పార్టీకి ది గ్రేట్ గేంబ్లర్ మాస్టర్ రాబోతున్నారు. ఆ పార్టీలో అతనికేదన్నా ప్రమాదం జరుగుతుందని మా అనుమానం. అదే జరిగితే మీ శాఖను మేం క్షమించం. మేం మాస్టర్ విరాళాలు అందుకున్న వాళ్ళం. మాస్టర్ అంటే మాకు ప్రాణం. ఆ పార్టీకి మాస్టర్ రాకుండానన్నా చూడండి. అది సాధ్యం కాకపోతే అతన్ని కంటికి రెప్పలా చూడండి..." మాటలు పూర్తయ్యాయి.