కాంక్రీట్ వాల్ కి కారును గుద్దించే ముందు ఆ కారులో డ్రైవింగ్ సీట్ ముందు ఒక డమ్మీని ఉంచుతారు. కారు స్పీడ్ ని పెంచేవరకు ఉన్న డ్రైవర్ ఆఖరి నిమిషంలో స్టీరింగ్ ని స్ట్రెయిట్ చేసి, స్పీడ్ తగ్గకుండా అరేంజ్ చేసి కారులోంచి పక్కనే అరేంజ్ చేసిన స్పాంజ్ ట్రాక్ మీదకు దూకేస్తాడు.

 

    కారు అదే వేగంలో వెళ్ళి గోడను గుద్దగానే క్వాలిటీ కంట్రోల్ విభాగం వాళ్ళు దాని దగ్గరకు వెళ్ళి ఫ్యూయల్ టేంక్ లీక్ అయిందా? డోర్స్, ఇంజన్ ఏమైనా డేమేజ్ అయిందా? డ్రైవర్ సీట్ లో ఉన్న డమ్మీకి ఏమైనా దెబ్బలు తగిలాయా? తగిలితే ఏ స్పేర్ పార్ట్ మూలంగా తగిలింది? మిగతా సీట్లలో కూర్చునే ప్రయాణీకుల కేమన్నా దెబ్బలు తగిలే అవకాశముందా? ఉంటే ఏవిధంగా? ఏ స్పేర్ పార్టు మూలంగా? ఏ స్థాయి దెబ్బలు తగలవచ్చు. లాంటి అంశాల్ని కూలంకషంగా శోధించి మెర్సిడస్ యాక్సిడెంట్ కి గురయినా ప్రమాదం లేని విధంగా, మరీ పెద్ద యాక్సిడెంట్ అయితే అతి తక్కువ దెబ్బలతో బయటపడే విధంగా కారులో మార్పులు చేయటం జరుగుతుంది.

 

    సౌత్ వెస్ట్ జర్మనీలోని ఏ ప్రాంతంలో మెర్సిడస్ కారు యాక్సిడెంట్ కి గురయినా సేఫ్టీ డిపార్టుమెంట్ కి వెంటనే మెసేజ్ అందగల ఏర్పాట్లు ఆ కంపెనీలకున్నాయి. ఆ మెసేజ్ అందగానే స్పెషల్ ఫైర్ మెన్ ఫ్లయింగ్ స్క్వాడ్ మెరుపు వేగంతో ప్రమాద స్థలానికి చేరుకొని ప్రయాణీకులకు దెబ్బలేమైనా తగిలాయా? తగిలితే ఏ విధంగా, ఏ స్థాయిలో తగిలినదీ తెల్సుకుని, అవి కూడా తగలకుండా వుండడానికి భవిష్యత్ లో తమ కారు డిజైన్ లో ఎలాంటి మార్పులు చేయవల్సింది, అందుకు ఏ మెటీరియల్ వాడవల్సింది శోధించి పరిశోధనా విభాగానికి సూచనలు ఇవ్వటం జరుగుతుంది.

 

    ఒకసారి ఓ ప్రమాదాన్ని చూసిన డైమలర్ కంపెనీ ఫ్లయింగ్ స్క్వాడ్ సూచనల మేరకు తమ కంపెనీ ఉత్పత్తి చేసే అన్ని మోడల్ కార్లలో బ్రేక్ లివర్ ని రీ డిజైన్ చేయటం జరిగింది.

 

    అంటర్ టర్ కెయిన్ లో డైమలర్ బెంజి కంపెనీకి సొంత మ్యూజియమ్ వుంది. అందులో ఇప్పటివరకు ఆ కంపెనీ తయారుచేసిన ప్రతి మోడల్ కారు వుంది. బెంజి 1886 పేటెంట్ మోటార్ కారు ఆ మ్యూజియమ్ కి ప్రత్యేక ఆకర్షణ. వరల్డ్ ఫస్ట్ ట్రూ కారు అదే.

 

    కంపెనీ ఆవరణలోనే కొన్ని వందల ఎకరాల వైశాల్యంలో నిర్మించిన టెస్ట్ ట్రాక్ కూడా వుంటుంది. ప్రపంచ దేశాలలోని అన్ని రకాల రోడ్లు అక్కడ సరీగ్గా అలాగే నిర్మించి వుంటాయి.

 

    మట్టిరోడ్లు, గతుకుల రోడ్లు, బురద రోడ్లు, కొండ ప్రాంతాల ఘాట్ రోడ్లు, ఇసుక రహదారులు, అడవిదారులు, తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు, ఎత్తుపల్లాలు బాగా వుండే రోడ్లు అన్నీ అక్కడ కృత్రిమంగా నిర్మించి కొత్తగా తయారయిన కార్లను ఆ రోడ్లమీద, రహదారుల మీద రఫ్ అండ్ టఫ్ గా డ్రైవ్ చేసి దాని దారుఢ్యాన్ని, నాణ్యతను, భద్రతను పరిశీలించటం జరుగుతుంది.

 

    ఒక రోడ్దయితే 90 డిగ్రీల కోణంలో లోయలోకి వేసుంటుంది. అక్కడ కారు వెళ్తుంటే డ్రైవర్ కి దాదాపు గాల్లో వేలాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడు అక్కడ ఆ రోడ్డుకి యిరువేపుల అరెంజ్ చేసి వుండే పెడస్టల్ ఫేన్స్ పంప్ చేసే గాలి 120 కిలోమీటర్ల వేగంతో వీస్తుంటుంది. అప్పుడు కారు వేగం కూడా గంటకు 180 కిలోమీటర్లు వుంటుంది. అప్పుడు డ్రైవ్ చేసే వ్యక్తి తన శరీరం బరువు రెండింతలు పెరిగిన అనుభూతికి లోనవుతాడు.

 

    దాదాపు నిట్టనిలువుగా వున్న పాతాళంలోకి కారును దింపి దాన్ని అదెలా బ్యాలెన్స్ చేసుకొని ప్యాసింజర్స్ ని రక్షిస్తుందో చూడడానికే అంత క్లిష్టమైన పరీక్షను కూడా నిర్వహిస్తారు.

 

    అలాగే మరో రోడ్డు ఎత్తయిన కొండమీదకు నిట్టనిలువుగా వెళుతున్నట్టుగా వుంటుంది. ఆ రోడ్ మీద కారుని డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రయివర్ చూపులకు ఆకాశం అభిముఖంగా వుంటుంది. ఏటవాలుగా లేకుండా నిట్టనిలువుగా నిర్మించిన ఆ రోడ్ మీద డ్రైవ్ చేసేప్పుడు వెనక్కి వెల్లకిలా పడిపోయి కారుని డ్రైవ్ చేస్తున్న అనుభూతికి లోనవుతాడు డ్రైవర్. మరికొద్ది ఎత్తు వుంటే కారు వెల్లకిలా వెనక్కి పడిపోతుందేమో నన్న భయాన్ని కూడా కలిగిస్తుంది.

 

    మరో రోడ్డు మీద అక్కడక్కడా పెద్ద పెద్ద గోతులు తీసి వాటి నిండా బురద నీరు నింపి కారుని డ్రైవ్ చేసి చూస్తారు.

 

    మరో రోడ్డు మీద మంటలు రేపి వాటి మధ్యనుంచి కారుని పోనిస్తారు.

 

    గంటకు రెండువందల యాభై కిలోమీటర్ల వేగంతో వీచే పెనుగాలిని సృష్టించి దాని మధ్య నుంచి కారుని నడిపిచూస్తారు.

 

    నీళ్ళగుంటలు, చిన్న చిన్న చెరువులు, వాగులు సృష్టించి వాటి మధ్య నుంచి కూడా డ్రైవ్ చేసి చూస్తారు. దాదాపు ప్రపంచంలోని అన్ని రకాల వాతావరణాలను, రహదారుల్ని కృత్రిమంగా సృష్టించి వాటిమధ్య నుంచి మెర్సిడస్ ని నడిపి అప్పుడు దాని సర్టిఫై చేస్తారు.

 

    ఇదంతా ఆశ్చర్యంగానూ, మన మతుల్ని పోగొట్టే విధంగానూ వుంది కదా? కానిది డైమలర్ బెంజ్ కంపెనీ ఆవరణలో జరుగుతున్న చరిత్ర.

 

    అందుకే ఆ కారంటే ప్రజలకంత ఇష్టం, మోజు. అందుకే అది స్టేటస్ సింబల్ గా మారింది.

 

    అందుకే అది ఏ ఆర్ధిక సంక్షోభానికి, మాంద్యానికి భయపడడం లేదు. అందుకే అది ప్రతి సంవత్సరం తన డిమాండును ప్రపంచ వ్యాప్తంగా పెంచుకుంటూ వెళ్ళగలుగుతోంది.

 

    అందుకే ఆ కారంటే అమెరికన్ ప్రెసిడెంటయినా, బ్రిటీష్ ప్రధానయినా బిర్లాలయినా మోజుపడేది..." సామంత్ చెప్పటం ఆపి అందరికేసి ఓసారి చేసి, ఆఖరిగా తన చూపుల్ని అర్జున్ రావు మీద నిలిపి, ఎవరూ చూడకుండా కన్నుగీటాడు కవ్విస్తున్నట్లుగా.

 

    చేష్టలు దక్కి చూస్తుండిపోయాడు అర్జున్ రావు.

 

    "ఈ వివరాలు చాలా? ఇప్పుడర్ధమయిందా మెర్సిడస్ బెంజ్ బ్యాగ్రౌండ్? అర్థం కాలేదంటే చెప్పు" అంటూ పీటర్ కేసి చూస్తూ ప్రశ్నించాడు సామంత్.

 

    ఏం అడగగలడు? తనకేం తెలుసని యింకా వివరాల్లోకి వెళ్ళగలడు? పీటర్ పిచ్చెక్కిపోయి ఇంకేం అక్కర్లేదన్నట్లు తలను అడ్డంగా ఆడించాడు.

 

    "నా అల్లుడిపట్ల, వారి తెలివితేటల పట్ల నాకు చాలా ఆనందంగా వుంది. నీ మనిషి మెర్సిడస్ గురించి మా అల్లుడిగారిని అడిగినప్పుడు ఒకింత చిరాకే కలిగింది అర్జున్ రావు. కానిప్పుడు అతనికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అతనా ప్రశ్న వేయబట్టేగదా ఎంతో ప్రయోజనకరమైన వివరాల్ని తెలుసుకొనే అవకాశం వచ్చింది. అతనా ప్రశ్న వేయబట్టే గదా మా అల్లుడుగారికెంత పరిజ్ఞానం వుందో తెలుసుకోగలిగింది? థాంక్యూ" అంది నాగమ్మ ఆనందోద్వేగంతో అర్జున్ రావు, పీటర్ కేసి చూస్తూ.

 

    తను వేసిన ఎత్తు తనకే ఎదురుతిరగటంతో ఖిన్నుడయి పోయాడు అర్జున్ రావు.

 

    "మీరు చాలా గొప్ప ఇన్ ఫర్మేషన్ ని, అథెన్ టిక్ గా చెప్పారు. థాంక్యూ" అన్నాడు రాబర్టు సామంత్ ని అభినందిస్తూ.