అప్పుడు కలిగింది అతనికి సందేహం. "ఇది ఆసుపత్రి కాదుగా!" అన్నాడు.
    
    ఆ అమ్మాయి మరోసారి బుగ్గలు సొట్టలు పడేసుకుని "విజిటర్స్ చాలామంది ఉన్నారుగా! అందుకని...." అంది.
    
    గణపతి స్థిమితపది వెళ్ళి కూర్చున్నాడు.  ఎదురుగుండా కుర్చీల్లో ఉన్నవాళ్ళని అదోలాంటి అసూయతో గమనించసాగాడు.
    
    ఒక నలభై ఏళ్ల ఆవిడ బాగ్ తెరిచి అందులోని అద్దంలో చూసుకుంటోంది. పక్కనే ఉన్న పదహారేళ్ళ పిల్ల చెవుల్లో వాక్ మన్ పెట్టుకుని తెగ ఊగిపోతోంది. ఆ అమ్మాయి ఎందుకు ఊగుతుందో ఆమెకి తెలుసు. కానీ చూసేవాళ్ళకి మాత్రం పిచ్చి చేష్టల్లా ఉన్నాయి.
    
    ఆ పక్కనే చిక్లెట్ నములుతున్న కుర్రాడు మాటిమాటికి జుట్టు మొహంమీదకి పడేసుకుంటూ మళ్ళీ సర్దుకుంటూ ఆ అమ్మాయి దృష్టిని ఆకర్షించడానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. అతని పక్కన ఓ అరవైయ్యేళ్ళ పెద్దాయన కూర్చునే తల ముందుకు వంచి పాముబుసలాంటి గుర్రుపెడుతూ నిద్రపోతున్నాడు.
    
    "ఈ ముసలాయనకి ఇక్కడ ఏం పనబ్బా?" అనుకున్నాడు గణపతి.
    
    "ఇది గోవిందా ప్రొడక్షన్ ఆఫీసేనా?" అంటూ ఓ వణుకుతున్న గొంతు వినిపించి తల తిప్పి చూశాడు.
    
    వడవడా వణుకుతూ ఓ అవ్వ కర్ర పట్టుకుని నిలబడి ఉంది. నుదుట పెద్దబొట్టూ, తాంబూలాలతో ఎర్రబడిన పెదవులూ, ఒంగిన నడుమూ, ఉప్పు కలిపిన మిరియపు పొడిలా నలుపూ తెలుపూ మిశ్రమంలో తలకట్టుతో నిలబడలేనట్లు కనిపించింది.
    
    "ఔనమ్మా..... మీకేం కావాలి?" అడిగింది రిసెప్షనిస్టు.
    
    "వేసహం కావాలే పిల్లా..... వేషం!" అంది అవ్వ.
    
    ఆ మాటలకి అక్కడున్న వాళ్ళంతా తలలు తిప్పి ఆశ్చర్యంగా చూశారు.
    
    "మీకా?" అంది సొట్టబుగ్గలమ్మాయి.
    
    "ఓసి నీ ఆశ్చర్యం దొంగలెత్తుకుపోనూ! ఒకప్పుడు ఆంద్రదేశాన్ని బాలనాగమ్మ వేషంవేసి ఉర్రూతలూగించిన తిలకాన్ని నేనేనే! అయినా అప్పుడు మీ నాన్నే పొట్టి లాగూల్లో ఉండుంటాడు. నీకేం తెలుస్తుందిలే!"
    
    ఆ అమ్మాయి తెప్పరిల్లి, "వెళ్ళి కూర్చోండి వరుసలో పిలుస్తారు!" అంది.
    
    "చూడమ్మా! పెద్దదాన్ని..... ముందుగా నన్నే పిలిచేలా చూడు! ఎక్కువసేపు కూర్చోలేను!" అంటూ వెళ్ళి గణపతి ఒళ్ళో కూర్చోబోయింది.
    
    "అయ్యో..... అవ్వా.... చూసి.....!" అన్నాడు కంగారుగా గణపతి.
    
    "ఎవర్రా నీకు అవ్వ? మీ తాతకి నేను పెళ్ళాన్నా, లేక నీ అబ్బ నాకు పుట్టాడా? అవ్వట అవ్వ....! నా పేరు తిలక కోయిరాలా!" అంది.
    
    "ఆఁ!" అన్నాడు నోరు తెరిచి గణపతి.
    
    "అది..... మా ఇంటిపేరు కోయిరాల వారు!" నవ్వి పక్కసీట్లో సెటిలయింది.
    
    "వయసులో ఉన్నప్పుడు ఓ ఆట ఆడించేసే ఉంటుంది. మంచి అందగత్తె అయి ఉండేదనుకుంటా!" నౌకుమ్తోఒ గుటకలు మింగుతూ కూర్చున్నాడు గణపతి.
    
    పాన్ నాన్ తెరిచి ఆకులకి సున్నం రాసుకుంటూ, "అంతే నాకు చాలూ..... తమలపాకు తొడిమే పదివేలూ..." అని పాడుతున్నదల్లా తిలకా కోయిరాలా, గణపతి తనని చూడటం చూసి చటుక్కున కన్ను గీటింది.
    
    గణపతి ఆ చర్యకి మ్రాన్పడిపోయాడు.
    
    "ఏంట్రా అబ్బీ, ఆ చూపు? అంది నవ్వుతూ తిలకా కొయిరాలా.
    
    గణపతి ఠక్కున నోరు మూసేసి, తల తిప్పుకున్నాడు. ఈలోగా పదహారేళ్ళ అమ్మాయీ, వాళ్ళ అమ్మా లోపలికి వెళ్ళి వచ్చి విసవిసా నడుచుకుంటూ వెళ్ళిపోయారు.
    
    మొహంమీద జుట్టు అబ్బాయి లేచి లోపలికి వెళ్ళాడు.
    
    "వెధవ విలన్ వేషాలకి తప్ప పనికిరాడు. అందులోనూ చిల్లర దొంగ వేషాలకి" అనుకున్నాడు ప్రొఫెషనల్ జెలసీతో గణపతి.
    
    "సినిమాల్లో వేషం కోసం వచ్చావా బాబూ?" అడిగింది తిలక.
    
    గణపతి తల ఊపి, "మీకెందుకీ వయసులో వేషం?" అన్నాడు.
    
    ఆమె కోపంగా "నాకు పదహారేళ్ళ కుర్ర హీరోయిన్ వేషం ఇవ్వమన్నా ఇవ్వరు కదా! ముప్పై ఏళ్లదానికి అరవై ఏళ్ల ముసలమ్మ వేషాలు ఇవ్వడం అన్యాయం కదూ! ఆ వేషాలు వెయ్యడానికి నాలాంటి అనుభవజ్ఞురాలు ఉంటే మంచిది కదా!" అంది.
    
    "మీరు ఓపిగ్గా ఇప్పటికీ నటించగలరా?" గణపతి ఆశ్చర్యపోయాడు.
    
    "ఇంకా అన్నం తింటున్నాను. ఊపిరి పీలుస్తున్నాను. నటించడానికేం? ఊపిరున్నంతవరకూ నటించగలను!" అంది. అంతలో దగ్గుతో ఆమెకి పొలమారింది.
    
    గణపతికి వెళ్లి ఆమె పాదాల దగ్గర కూర్చోవాలనిపించింది. ఒక కళాకారిణి తపన వేరొక కళాకారుడే తెలుసుకోగలడు.
    
    "మీరు చాలా గొప్పవారు. కళాకారుల్ని ప్రోత్సహించాలి" అన్నాడు ఆవేశంగా.
    
    లోపల్నుండి గణపతికి పిలుపొచ్చింది.
    
    జులపాల పిల్లాడు గణపతిని ఓసారి ఎగాదిగా చూసి వెళ్ళిపోయాడు.
    
    తిలక గబుక్కున లేచి గణపతి చెయ్యిపట్టుకుని "ఉండు బాబూ..... నేను వెళ్ళిరానీ పెద్దముండాదాన్ని!" అంది.
    
    గణపతికి ఆమె చెయ్యితగలగానే అదోలా అనిపించింది. అత్తయ్యా, అమ్మా ముట్టుకున్నప్పటిలా లేదు! అనుకున్నాడు.
    
    ఆమె కర్ర తాటించుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది.
    
    గణపతి ఆమె పట్టుకున్న తన ముంజేతివైపు చూసుకున్నాడు అంతలోనే 'ఛీ! పెద్దావిడ.... తప్పు' అలా అనిపించాకూడదు అని తనకి తనే బుద్ది చెప్పుకున్నాడు. ఎదురుగా ఉన్న నామాల వెంకటేశ్వరస్వామి పటం చూస్తూ చెంపలు కూడా వేసుకున్నాడు. పుట్టి పెరిగిన వాతావరణం, జన్మ సంస్కారం అనేవి ఇటువంటి చర్యల వల్లే తేలుస్తుంటాయి.
    
    లోపల కాస్త గట్టిగా మాటలు వినిపించడంతో దృష్టి అటు మళ్ళించాడు.
    
    "ప్లీజ్ సర్ .... నా టాలెంట్ ప్రత్యక్షంగా చూశారు కదా!" ఓ కోకిల కంఠం వినిపించింది.
    
    బోయ్ వచ్చి గణపతిని లోపలికి రమ్మనగానే లేచి లోపలికి వెళ్ళాడు.
    
    తిలకా కొయిరాలా గణపతిని చూడగానే "అతన్ని కూడా అరవై ఏళ్ల ముసలిదాన్నని నమ్మించాను, సార్! కావాలంటే అడగండి!" అంది.
    
    "సారీ అమ్మా.... మాకు హీరోయిన్స్ అవసరం లేదు. ఆల్రెడీ ఓ ప్రముఖ హీరోయిన్ ని అనుకున్నాము!" అన్నాడు అక్కడ కూర్చున్న ఓ బట్టతలాయన.
    
    తిలక నీరసంగా నెత్తిమీదనుంచి ముసలి విగ్గునుతీసి టేబిల్ మీద పడేసింది. అందంగా షేవ్ చేసిన బాబ్డ్ హెయిర్ తో హిందీ హీరోయిన్ లా కనిపించింది.