నా టైమ్ బాగోలేదు. అందుకే నేనిక్కడున్నది వాడికి తెలిసిపోయింది..." అంది తరణి చెప్పటం ముగిస్తూ. ఆమె మాటల్లో నిస్పృహ కన్పిస్తోంది స్పష్టంగా.

 

    కళ్ళ ముందు అలుముకున్న మబ్బులు విడిపోయినట్లయింది ఆంజనేయులికి.

 

    "నేనెలాగు వాడ్ని పెళ్లి చేసుకోనని తెలిసిపోయింది గదా... అందుకే ఈలోపు నాకు కాకుండా చేయాలనే తిరుగుతున్నాడు... ఇంతవరకు జరిగింది మంచో చెడో... ఏదైనా నా మీ నీడలో క్షేమంగా ఉన్నాను. దయచేసి ఇంకొన్నాళ్ళు నన్ను కాపాడితే ఆపదలో వున్న ఒక ఆడపిల్లను కాపాడిన వారవుతారు.

 

    కాశీబాంబు మూలంగా మీకు ప్రమాదం లేదని అనటంలేదు. కానీ మీరు మగవాళ్లు. ఎలాగోలా వాడ్ని మీరు ఎదుర్కోగలరు. నేను ఒంటరిదాన్ని ఒక్కసారి పెద్దమనస్సుతో ఆలోచించి నాకు న్యాయమే చేస్తారని, నన్ను కాపాడతారనే ఆశతో ఉన్నాను..." అంది తరణి బరువెక్కిన గుండెతో.

 

    ఆంజనేయులికి తరణి మోము చూసి గుండె చిక్కబట్టినట్లయింది.

 

    "మీరూ ఒక సమస్యలో ఇరుక్కున్నారని అనిపిస్తోంది. మీరేమీ అనుకోకపోతే నా గాజులు తీసుకెళ్లి అమ్మేసి, మీ సమస్యనుంచి మీరు బయటపడితే, నాకూ ఉడతా భక్తిగా మీకేదో చేశానన్న సంతృప్తి మిగులుతుంది. నాకీ నగలు ముఖ్యం కాదు. నాకు నా జీవితం. నాకై నేను కోరుకునే జీవితం. నాకై నేను ఎన్నుకునే వ్యక్తితో పంచుకొనే జీవితం ముఖ్యం. ఒక్కసారి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని..." మిగతా మాటల్ని మింగేస్తూ అంది తరణి.

 

    తన సమస్య తరణికెలా తెలిసింది....?

 

    అదీ ఆర్ధిక సమస్యని...?!

 

    గాజులు తీసుకెళ్లి అమ్మి తన సమస్యను తీర్చుకోమంటోంది...?! ఇదంతా నిజమా? కలా...?! చాలా సేపటి వరకు ఆలోచిస్తూ, దెబ్బల్ని కూడా మర్చిపోయాడు. తనెంతగా ఈసడించుకున్నాడు? కసురుకున్నాడు?

 

    చూస్తుంటే బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినట్లుగా వుంది.

 

    అందుకేనేమో సుకుమారంగా, ముట్టుకుంటే కందిపోయేలా వుంది.

 

    పట్టు పరుపుల మీద పడుకున్న దాన్ని అని తరణి అన్న మాటలు గుర్తుకొచ్చాయి.

 

    ఒక్కక్షణం తన ప్రవర్తనకు తానే సిగ్గుపడ్డాడు.

 

    అంతలో తరణి కాఫీ తెచ్చిస్తే, ఉలికిపాటుగా తేరుకొని ఆమె ముఖంలోకి సూటిగా చూశాడు.

 

    అందమైన మోములో అభ్యర్థన... ఆవేదన... అభద్రతాభావం స్పష్టంగా కనిపించాయి.

 

    అంతే... అప్పటికప్పుడే ఎలాగయినా ఆమెను కాపాడాలనే మొండి నిర్ణయానికొచ్చేశాడు.

 

    "మరి నువ్వు త్వరగా పెళ్ళి చేసుకోకపోతే మీ తాతయ్య ఆస్తి మొత్తం వాడికే పోతుందిగా?" కాఫీ తీసుకుంటూ అన్నాడు ఆంజనేయులు.

 

    "అవును" అంది తరణి తల వంచుకొని దిగులుగా.

 

    "నీకు నచ్చినవాడ్నే చేసుకొని ఆ ఆస్తిని దక్కించుకో. ఎందుకనవసరంగా అంత ఆస్తిని పోగొట్టుకోవటం?"

 

    "యాభై లక్షల ఆస్తిని వాడికి వదలటానికి సిద్ధంగా లేను. నాకు 20 నిండేలోపు-ఒక్క గంట ముందు పెళ్ళి చేసుకున్నా చాలు. ప్రస్తుతం అదే ఆలోచనలో వున్నాను" అంది నర్మగర్భంగా ఓరగా ఆంజనేయులికేసే చూస్తూ.

 

    "ఎంత కష్టమైనా, నీకు పెళ్ళయ్యేదాకా నిన్ను కాపాడతాం. నువ్వు ధైర్యంగా వుండు. ఒంటరిగా బంగ్లా ఆవరణ దాటి బయటకు వెళ్ళకు. ఈ లోపు మంచి మొగుడ్ని చూసుకో! ఆలస్యం చేయకు..." అన్నాడు ఆంజనేయులు కాఫీ కప్పును క్రింద పెడుతూ.

 

    అతని మంచితనానికి అబ్బురపడింది.

 

    అమాయకత్వానికి పెదాలమాటునే నవ్వుకుంది. అన్నీ వివరంగా చెప్పినా, యాభై లక్షల ఆస్తి వుందని తెలిసినా, గాజులమ్ముకొని అప్పు తీర్చుకొమ్మని చెప్పినా, వాటి గురించి కనీసంగానయినా ఆలోచించని ఆంజనేయులిపై మొట్టమొదటిసారి మరింత సదభిప్రాయం ఏర్పడింది. చేసుకుంటే అతనినే చేసుకోవాలనుకుంది ఆ క్షణానే. అదే విషయాన్ని గుండె లోతుల్లోనే దాచుకుంది తప్ప బయటకు చెప్పలేదు.


                                                  *    *    *    *


    ఆరోజే ఆంజనేయులు తరణి వెనుక ఉన్న గతాన్ని ఆనందం ముందుంచాడు.

 

    ఆనందం కూడా తరణిని కాపాడాలనే ఆంజనేయులి నిర్ణయాన్ని బలపరిచాడు.

 

    ఎలా అన్నదే ఇద్దరికీ తట్టలేదు.


                                                  *    *    *    *


    సిటీబస్సులో ముగ్గురే ముగ్గురు ప్రయాణికులున్నారు. ఆ చివర కండక్టర్ డ్రైవర్ వెనుక సీట్లో కూర్చున్నాడు. మధ్యలో ఒక లేడీ కూర్చుంది. ఈ చివర కూర్చున్నవాడు ఆంజనేయులు.

 

    అరగంటయింది....

 

    టిక్కెట్ అడగడానికి కండక్టర్ రాకపోతే, తనే టిక్కెట్ తీసుకుందామని ముందుకు నడిచాడు.

 

    అదే సమయంలో బస్సు మలుపు తిరగడంతో ఆంజనేయులు పట్టు తప్పి ఆ స్త్రీ ఒడిలో పడ్డాడు.

 

    ఆ దెబ్బకు ఆవిడ-

 

    "కళ్ళు కనబడ్డంలేదూ?" అంటూ చీర దులుపుకుంటూ లేచి మంగళ సూత్రాల్ని కళ్ళకద్దుకుని "నన్ను క్షమించండి..." అనుకున్న దశలో లేచి-

 

    "అయ్యబాబోయ్" అని ముందుకు పరిగెత్తి, కండక్టర్ ని భుజమ్మీద తట్టి, టిక్కెట్టు డబ్బులు యివ్వబోయిన ఆంజనేయులు ముఖం వేపు తల తిప్పి చూడగానే ఆ కండక్టర్ స్పృహతప్పి పడిపోవడంతో-

 

    ఆంజనేయులు గబుక్కున బస్సులోంచి క్రిందకు దూకేశాడు. ఆ పాత కండక్టర్ లేచి తననేమి చేస్తాడోననే భయం వల్ల.

 

    అలా అతను బస్సు దూకిన ప్రదేశం దగ్గరే బస్సు దిగి ఆఫీసువేపు వెళుతున్న మేరీ నడుస్తోంది.

 

    ఆంజనేయులు తూలి మేరీ మీద పడ్డాడు.

 

    ఇద్దరూ ఒకటి మీద ఒకరు పడటంతో ముందు మేరీ బిత్తరపోయి, తర్వాత ఆ వ్యక్తి ఆంజనేయులని తెలుసుకొని-

 

    లేవడానికి ప్రయత్నించకుండా-

 

    "ఏవిటీ! రోజూ మీరు బస్సులో ఆఫీసుకొస్తారా?" కుశల ప్రశ్నలు వేసింది.