"నాకే తెలీదు... నీకేం చెప్తాను..."

 

    "మీక్కూడా తెలీదా?" ఆశ్చర్యపోతూ అడిగింది నిశాంత. కానీ మరో గంటకే తనేం చేయాల్సింది నిశాంతకు అచ్యుతముని చెప్పేశాడు.


                                                 *    *    *    *


    హోటల్ కి చేరిన-

 

    దేశ్ ముఖ్ కు, ఎదురొచ్చాడు పి.ఎ. సుభాష్ చంద్ర.

 

    "వాటీజ్ టుడే ఎంగేజ్ మెంట్స్.." దేశ్ ముఖ్ అడిగాడు.

 

    డైరీని తెరిచి చెప్పడం ప్రారంభించాడు సుభాష్ చంద్ర.

 

    "టెన్ థర్టీకి మహారాష్ట్ర గవర్నర్ తో మీటింగ్."

 

    "కేన్సిల్ ఇట్..." ఏమాత్రం గేప్ యివ్వకుండా చెప్పాడు ఆయన.

 

    "లెవెన్ ఫార్టీకి... స్టాక్ బ్రోకర్  హర్షద్ మెహతాతో మీటింగ్."

 

    "కేన్సిల్ ఇట్... నెక్ట్స్..."

 

    "త్రీ థర్టీకి... జి.టి.వి పీపుల్... మిమ్మల్ని యింటర్వ్యూ చేస్తారు సర్."

 

    "కేన్సిల్ ఇట్..."

 

    "ఫైవో క్లాక్ కి..." చెప్పబోయాడు సుభాష్ చంద్ర.

 

    "కేన్సిల్ ఆల్ టుడే సే ఎంగేజ్ మెంట్స్... ఐవాంట్ టు టేక్ రెస్ట్ టుడే... ఆఫీస్ కి, నాకేవైనా పర్సనల్ ఫోన్స్ వస్తే, హోటల్ కి డైవర్ట్ చెయ్యండి. ఓ..కే..." చెప్పేసి ముందుకెళ్ళిపోయాడు ఆయన.

 

    మరబొమ్మలా నిలబడిపోయాడు సుభాష్ చంద్ర.


                                                      *    *    *    *


    హోటల్ సూట్లోకూర్చున్న కృపానంద దేశ్ ముఖ్ సముద్రపు ఒడ్డున కన్పించిన అమ్మాయి, ఆ అమ్మాయి చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి.

 

    పదహారు, ఇరవై ఏళ్ళ మధ్యనున్న ఆ అమ్మాయి ఐక్యూ గురించి ఆలోచిస్తున్నాడు ఆయన.

 

    ఎలా కనుక్కుంటుందో చూద్దాం....

 

    అదే సమయంలో ఆ అమ్మాయి వేసిన ప్రశ్న జ్ఞాపకానికొచ్చింది.

 

    ఇఫ్ ఉయ్ కాల్ ఆరెంజస్, ఆరెంజస్, వై డోంట్ ఉయ్ కాల్ బనానస్ ఎల్లోస్, ఆర్ ఏపిల్స్ రెడ్?

 

    అవును... నిజమే... ఎందుకు పిలవకూడదు?

 

    ఆయన రకరకాలుగా ఆలోచిస్తున్నాడు. ఎక్కడా జవాబు దొరకడం లేదు.

 

    సెకెండ్లు, నిమిషాలుగా, నిమిషాలు గంటలుగా మారుతున్నాయి.


                               *    *    *    *


    తన బెడ్ రూమ్ లో కూర్చున్న నిశాంత పరిస్థితి కూడా అలాగే వుంది.

 

    ఎవరాయన? ఆయన గురించి తెలుసుకోవడం ఎలా? క్లూ కోసం వెతుకుతోంది.

 

    ముప్పై నిమిషాలు... నలభై నిమిషాలు గడిచాయి.

 

    ఆయన అడ్రస్ సంపాదించడానికి ఆధారాలు... నెంబర్ వన్... మారుతీ జిప్సీ వ్యాన్... నెంబర్ చూడలేదు కాబట్టి పనికిరాదు.

 

    నెంబర్ టూ... స్పోర్ట్స్ షూస్... జాగింగ్ డ్రెస్... నో... హైలీ ఇంపాజిబుల్...

 

    నెంబర్ త్రీ... సెక్యూరిటీ గార్డ్స్... వాళ్ళలో ఎవర్నీ తను గుర్తుపట్టలేదు...

 

    నెంబర్ ఫోర్... రేబాన్ గ్లాసెస్...

 

    ఆ ఐడియా రాగానే నిశాంత... టెలిఫోన్ డైరెక్టరీని అందుకుంది. పుష్ బటన్ టెలిఫోన్ ని వడిలో పెట్టుకుంది.

 

    స్పెషల్ ఆర్మ్ డ్, సెక్యూరిటీ వుందంటే, ఆ వ్యక్తి వి.వి.ఐ.పీ అయ్యుండాలి. అలాంటి వ్యక్తి ధరించే గ్లాసెస్... కాస్ట్ లీగానే వుంటాయి.

 

    సో... హుషారుగా పేజీలు తిప్పుతోంది నిశాంత.

 

    టెలిఫోన్ డైరక్టరీలో, ఆప్టికల్ సెక్షన్లో చూడడం ప్రారంభించింది.

 

    రేబాన్ గ్లాసెస్...

 

    పేరుకనబడగానే కళ్ళు మెరిశాయి నిశాంతకు. దాదాపు పది షోరూమ్స్ వున్నాయి.

 

    ఒక్కొక్క నెంబర్ కూ డయల్ చేయడం ప్రారంభించింది.

 

    "మీ రేబాన్ గ్లాసెస్ వాడే వి.వి.ఐ.పీ కస్టమర్స్ గురించి చెప్పగలరా?"

 

    "ఎవరు మీరు...."

 

    "ప్రెస్... ఓ స్పెషల్ ఆర్టికల్ కోసం ఆర్టికల్ లో మిమ్మల్ని కూడా కోట్ చేస్తాం" మొదట కరకుగా అడిగిన వ్యక్తి ఆ మాటకు మెత్తబడ్డాడు.

 

    "సినిమా స్టార్స్... చాలామంది వాడతారు. క్రికెట్ స్టార్స్... ఎవరని చెప్పమంటారు? మీరు అందరి పేర్లూ రాసేసుకోండి" సలహా యిచ్చి ఫోన్ పెట్టేశాడు ఆ వ్యక్తి.

 

    ఇంకో నెంబర్ కి డయల్ చేసింది.

 

    వింత వింత ప్రశ్నలు, వింత వింత జవాబులు.

 

    ఇంకా రెండు షోరూమ్ లే వున్నాయి. నిశాంత మనసులో కంగారుగా వుంది.

 

    నో... నో...ఐకెన్ ట్రీస్ హిమ్. ఐ షుడ్ ట్రీస్ హిమ్... అనుకుంది నిశాంత.

 

    ఈసారి ఫోన్ రిసీవ్ చేసుకున్న వ్యక్తి లేడీ.

 

    ఎందుకో చెప్పి, తనకేం కావాలో అడిగింది నిశాంత.

 

    "వి.వి.ఐ.పీ... కస్టమర్లా? ఒన్ మినిట్..."

 

    టెన్షన్ గా వుంది నిశాంతకు. ఆ ఒక్క నిమిషం గడిచింది.

 

    "షాపుకొచ్చి తీసుకున్న వి.వి.ఐ.పీల పేర్లయితే చెప్పగలను."

 

    "ప్లీజ్! చెప్పండి..."

 

    "బాల్ ధాకర్, అనిల్ అంబానీ, సన్నీడయోల్, డింపుల్ కపాడియా, షబనా ఆజ్మీ, కృపానంద దేశ్ ముఖ్... ఇంతే..."

 

    "కృపానంద దేశ్ ముఖ్! ఎవరాయన?" వెంటనే అడిగింది నిశాంత.

 

    ఫోన్లోని లేడీ నవ్వింది.

 

    "ఆయన పేరే వినలేదా మీరు? ది గ్రేట్ ఇండస్ట్రయలిస్ట్... కింగ్ మేకర్."

 

    "ఆయన వయసెంతుంటుంది? ఎన్నాళ్ళక్రితం గ్లాసెస్ కొన్నారు?"

 

    అడిగింది నిశాంత.

 

    "అరవై దాటి వుంటుంది... రెండు నెలలై వుంటుంది... ఆయనే స్వయంగా మా షోరూంకి వచ్చారు."

 

    "ఆయన కార్లో వచ్చారా?"

 

    "కాదు. మారుతీ జిప్సీజీప్... స్వయంగా ఆయనే నడుపుకుంటూ వచ్చారు."