మరికొంత సేపటికి శ్రీధర్ తన ఆలోచనల్నుంచి తేరుకున్నాడు.

 

    "ఇన్ని చెప్పిన దానివి నీ పేరు చెప్పలేవా?" అడిగాడు శ్రీధర్ చిన్నగా నవ్వుతూ.

 

    "అమ్మయ్య... ఎన్నాళ్ళకి నీ నోటివెంట ముత్యాలు రాలాయి? పని నేర్చుకో ముందర... పెళ్ళికెందుకు తొందర అనే గవర్నమెంటు స్లోగన్ వినలేదా? పేరు తెలుసుకోటానికెందుకు తొందర, ప్రేమించటం నేర్చుకో ముందర..." చిలిపిగా నవ్వుతూ అందామె.

 

    "I WANT TO KNOW WHO THE HELL I AM TALKING TO" తిరిగి శ్రీధర్ లో అసహనం....

 

    "అదిగో అదే వద్దన్నాను, నేను హేల్ నికాదు.... హెవెన్ ని. సరిసర్లే మగాడిలో కోపాన్ని ఎలా పోగొట్టాలో ఆడవాళ్ళకు తెలిసినట్టుగా మరొకరికి తెలీదు."

 

    "పోనీ నువ్వెలా వుంటావో చెప్పు."

 

    "నల్లగా...అని చెప్పాగా!"

 

    "రంగుకాదు స్ట్రక్చర్ అండ్ వైటల్ స్టాటిస్టిక్స్."

 

    "తనివితీరా స్నానంచేసి తడివంటి తనువుకు, బోంబేడయింగ్ టవల్ చుట్టుకుని, వయ్యారంగా వార్డ్ రోబ్ వైపు నడిచే, కెనడియన్ లిసారే ఎలా వుంటుంది...? అలా వుంటాన్నేను. ప్రస్తుతం నేను అదే స్థితిలో వున్నాను. నా తనువును సేద తీర్చేతడి, నీతో టెలిఫోన్ సంభాషణ మూలంగా ఆవిరైపోయి నాలోనూ వింత వింత ఆలోచనలు చోటు చేసుకుంటున్నాయి..." అని ఆమె ఇంకా ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తూండగా, టెలిఫోన్లో సడన్ గా కర్ణకఠోరమైన పాత హార్మోనియం పెట్టె పదనిసలు విన్పించసాగాయి.

 

    "బుల్ షిట్...వీడొకడు హార్మోనియం పెట్టొకటి వేసుకుని, అందరికీ మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు."

 

    "ఫోన్లో ఆ శబ్దం ఏమిటి? మీ ఇంట్లో సంగీత విద్వాంసులున్నారా" ప్రశ్నించాడు శ్రీధర్.

 

    "మా ఇంట్లో కాదు. పక్కింట్లోవారు-విద్వాంసుడుకాదు. విధ్వంసకుడు" అని ఆమె అంటుండగానే ఆ శబ్దం మరింత ఎక్కువైంది.

 

    "సారీ మిస్టర్ శ్రీధర్... ఈ విధ్వంసం ఆగాక తిరిగి ఫోన్ చేస్తాను" అని అంటూ ఫోన్ క్రెడిల్ చేసింది.

 

    మూసుకునే కనురెప్పల వెనుక కదలాగే ముగ్ధ మనోహరమైన మరో ప్రపంచం ఒక్కసారి అదృశ్యమైపోయినట్లయింది. డీలా పడిపోతూ కార్డ్ లెస్ ని టీపాయ్ మీదుంచి, కిచెన్ రూమ్ వైపు కదులుతుండగా అప్పుడు గుర్తుకొచ్చింది తనకి-అపరిచితురాలి పక్కింట్లో అపశృతులు పలికించే హార్మోనియం పెట్టె గురించి.

 

    మరో క్లూ దొరికినందుకు ఆనందిస్తూ ఆలోచనల్లోకెళ్ళిపోయాడు- ఆమ్లెట్ మాడి మసైపోతుందన్న విషయంకూడా మర్చిపోయి.


                              *    *    *    *


    ఉదయం ఏడుగంటలు...కాఫీ తాగుతూ బాల్కనీలోంచి బయటికి చూడసాగాడు శ్రీధర్... అనుకోకుండా కింద ప్లేగ్రౌండ్ లో ఆడుకుంటున్న పిల్లలమీద పడిందతని దృష్టి... వాళ్ళల్లో రాత్రి తన దగ్గరికి క్యాసెట్ తోవచ్చిన పిల్లవాడుండ వచ్చన్న ఐడియా తట్టిందతనికి...ఎలాగోలా వాళ్ళను మభ్యపెట్టి, మచ్చికచేసుకుని అపరిచితురాలి ఇన్ ఫర్మేషన్ తెలుసుకోవాలని ఆలోచన వచ్చింది శ్రీధర్ కి... ఆ ఆలోచన రాగానే ఆలస్యం చేయకుండా బాత్రూంలోకెళ్ళి గబాగబా స్నానం చేసేశాడు.    

 

    ఫ్లాట్ కి తాళంవేసి లిఫ్ట్ లో కిందికొచ్చాడు. వాచీవంక చూసుకున్నాడు.

 

    టైం ఏడుగంటల ముప్పై నిమిషాలు....

 

    క్రింద గ్రౌండు విశాలంగా వుంది. కొంచెం దూరంగా పచ్చిక బయలు, మరోవేపు స్విమ్మింగ్ పూల్, వాటికి మధ్యలోనున్న ప్లే గ్రౌండ్ లో కొందరు పిల్లలాడుకుంటున్నారు. కిందున్న ఫాన్సీ సెంటర్స్, సూపర్ మార్కెట్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, ఐస్ క్రీమ్ పార్లర్స్, బ్యూటీపార్లర్స్, మెన్స్ పార్లర్స్, టెలిఫోన్ బూత్ ఇంకా చిన్నా చితకా షాపులు అప్పటికే తెరచి వున్నాయ్...ఫ్లాట్ లలో వుంటున్న కాలేజ్ స్టూడెంట్స్, అమ్మాయిలూ, అబ్బాయిలూ ప్రైవేట్ ఫర్మ్స్ లో పనిచేస్తున్న మరికొంతమంది బ్యాచిలర్ ఎంప్లాయిస్ ఎదురుగావున్న బస్టాపుకేసి వెళుతున్నారు. ఓసారి ఫ్లాట్స్ కేసి చుట్టూ చూశాడు. ఎక్కడా ఏ ఫ్లాట్ విండోస్ తెరిచిలేవు. ఆలోచిస్తూ ఒక్కక్షణం తల పైకెత్తాడు. నీలిరంగు ఆకాశం నిర్మలంగా వుంది. అక్కడక్కడ దూది పింజల్లా తెల్లటి మేఘాలు మెల్లగా కదులుతున్నాయి.

 

    అతను ఆకాశాన్ని చూస్తున్నట్టు నటిస్తూనే చుట్టూవున్న ఫ్లాట్స్ ని పరికించసాగాడు. ఎందుకైనా మంచిది అప్పుడప్పుడు ఫ్లాట్స్ మీద ఓ కన్నేసి వుంచు అన్న మాథ్యూస్ మాటలు గుర్తొచ్చి.

 

    తిన్నగా పిల్లల దగ్గరికెళ్ళాడు శ్రీధర్...పిల్లలందరూ ఎవరి ఆటల్లో వాళ్ళున్నారు. వాళ్ళని చూస్తూ కాసేపు అలాగే నించుండిపోయాడు. తమనే చూస్తూ నిలబడిపోయిన శ్రీధర్ దగ్గరకి ఓ పిల్లాడొచ్చి అడిగాడు.

 

    "హలో...వై ఆర్యూ లుకింగ్ లైట్ దట్ వే...డు యు వాంట్ టు ప్లే విత్ అజ్...!!"

 

    "నో నో ఐయామ్ సెర్చింగ్ సమ్ బడి..."

 

    "టెల్ మి హూమ్ డు యు వాంట్? రేవంత్...కైలాస్, శంకర్, అభిలేష్...?" మరికొందరు పిల్లలపేర్లు చెప్పాడా కుర్రాడు...అంతలో మరో ఇద్దరు పిల్లలు అక్కడికొచ్చారు...వాళ్ళలో ఒక కుర్రాడ్ని అడిగాడు శ్రీధర్ నవ్వుతూ... "రాత్రి నువ్వేకదా నాకు క్యాసెట్ తీసుకొచ్చి ఇచ్చావ్?"

 

    కాసేపు మాట్లాడలేదు ఆ కుర్రాళ్ళిద్దరూ.

 

    "చెప్పు బాబూ... మీలో రాత్రి నా దగ్గరి కొచ్చిందెవరు?"

 

    అతను తొందరపెడుతూ అడుగుతుంటే చిన్నగా నవ్వుకున్నారు వాళ్ళు.

 

    "మాకేంటి లాభం...?" అన్నారిద్దరూ ఒకేసారి ముక్తసరిగా.

 

    ఆ వయసుకే ఆ పిల్లల్లో మాకేంటి...? అని అడిగే ఆలోచన చోటు చేసుకోవడం ఆశ్చర్యమనిపించింది శ్రీధర్ కి.

 

    "చెబితే మీ కిష్టమయినవి కొనిపెడతా..." ఆశ పెట్టాడు శ్రీధర్.

 

    "చాక్లెట్స్ కొనిపెడితేనే చెప్తాం."

 

    వీళ్ళల్లో ఎవరో ఒకరు తప్పకుండా రాత్రి తన దగ్గరి కొచ్చిన వాడుంటాడన్న నమ్మకం కలిగింది శ్రీధర్ కి.