అతని కంఠంలో ఆతృత, ఆరాటం వెరసి ఉద్విగ్నత! అవతలి వ్యక్తి ఎవరో, ఎవరు ఎప్పుడు ఫోన్ చేస్తారో తెలియని సందిగ్ధ స్థితి అతనిది.

 

    రిసీవర్ని అదిమి పట్టుకున్నాడతను.

 

    "శ్రీధర్... ఏమిట్రా...ఎలా వున్నావ్... ఏంటలా కంగారుపడి పోతున్నావ్..." ప్రతిధ్వనించింది అవతలివేపు కంఠం.

 

    దెబ్బతో అతని ఆశ, ఆరాటం పటాపంచలైంది.

 

    కారణం అది తాతయ్య ఫోన్.

 

    "ఉద్యోగం బాగా చేస్తున్నావా? ఆరోగ్యం ఎలా వుంది?"

 

    అసలు విషయం ఏదీ చెప్పకుండా, ఇక్కడికి పంపించి ఇన్ని కష్టాలపాలు చేసి డొంకతిరుగుడు కుశల ప్రశ్నలు వేస్తున్న పెద్దాయన మీద కోపం ముంచు కొచ్చిందతనికి. కాస్త నిభాయించుకుని "ఆఁ చేస్తున్నాను" అన్నాడు శ్రీధర్ అసహనంగా.

 

    "ఆరోగ్యం జాగ్రత్త అని నిన్ను హెచ్చరించానంటే కేవలం శారీరక ఆరోగ్యమని కాదు - మానసికమైనది కూడాను. ఉంటాను" అని అంటుండగానే ఫోన్ కట్ అయింది.

 

    ఫోన్ పెట్టేస్తూ ఒక్క క్షణం నిట్టూర్చాడు శ్రీధర్.

 

    "ఎవరు ఫోన్ చేసింది?" అడిగింది మాథ్యూస్.

 

    "మా తాతగారు. అందరూ కలిసి నన్ను ఫూల్ ను చేస్తున్నారు. ఒకరి ఫోన్ అనుకుని ఎత్తితే మరొకరు లైన్లో కొస్తున్నారు" అంటూలేచాడు.

 

    "నువ్వేం వర్రీకాకు. ఆ అపరిచితురాలి సంగతి తేల్చేద్దాం" అని అందామె అభయమిస్తూ.

 

    గుడ్ నైట్ చెప్పి, మాథ్యూస్ ఫ్లాట్ నుంచి తిరిగి తన ఫ్లాట్ కి వచ్చాడు శ్రీధర్.

 

    ఏమీ తోచడంలేదు. అన్యమనస్కంగా వుందతనికి, సమయం ఎనిమిది గంటల నలభై అయిదు నిమిషాలు. చప్పున రింగయిన ఫోను అతని ఆలోచనల్ని భగ్నం చేసింది. ఒకింత చలనం పుట్టిందతని మనసులో. ఈ టైంలో ఫోను మోగిందంటే అది తప్పకుండా తననాడించడానికి ఆ అపరిచితురాలే చేసుంటుంది. అందులో సందేహం లేదు... అని కోపంగా వూగి పోతూ రిసీవర్ అందుకున్నాడు శ్రీధర్.

 

    "నీకేం పన్లేదా ఈ టైంలో చేశావ్? నీకేమైనా కాస్త స్క్రూ లూజా? ఎందుకు రోజూ అలా ఫోన్ చేస్తావు? రావున్నాడా? గౌడున్నాడా? గుజ్రాల్ వున్నాడా అని ఎందుకు నా మెదడు తినేస్తుంటావ్? అసలు నిద్రకుపక్రమించే సమయంలో నీకిదేం పోయే కాలం? నిద్ర రాకపోతే నీ తలకింద పిల్లోని వాటేసుకుని పడుకో" కటువుగా పలికాడు శ్రీధర్.

 

    అట్నుంచి సమాధానం లేదు.

 

    "మరిందుకే నాకు తిక్కొచ్చేది. అసలు నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావో, నీకేం కావాలో అర్థమైచావడం లేదు. తొందరగా మాట్లాడేసి ఫోన్ పెట్టేయ్ తల్లీ" అని కసురుకున్నాడు శ్రీధర్.

 

    "ఏంటి పిల్లాడా...ఏంటా మాటలు... ఏమైంది నీకు?" అంది అపర్ణ గొంతు. ఆమె కంఠం వింటూనే నిశ్చేష్టుడైపోయాడు శ్రీధర్ కొన్ని క్షణాలపాటు.

 

    నిరీక్షణ అన్నది ఒక్కోసారి అసహనంగానూ, బాధగానూ వుంటుంది. ఒక్కోసారి దుస్సహంగానూ ఉంటుంది. మరెప్పుడో, ఒకసారి ప్రేమరాహిత్యంతో బీడువారిన గుండెలపై తొలకరి వాన, తొలిచినుకు చిలకరించినట్లుగానూ ఉంటుంది.

 

    జడత్వపు మృత్యువు కోరల్లో చిక్కుకుపోయి, చలించని మనస్సుతో స్థంభించిపోయిన వ్యక్తి గుండె కుహరాల్లో సయితం ఒక్కోసారి నిరీక్షణ ప్రేమలోద్వేగపు పెనుతుఫానునే రేపగలదు. ఆ నిరీక్షణ ఓ తీపి గురుతు. ఆ నిరీక్షణ ఓ మేలుకొలుపు. ఆ నిరీక్షణ ఓ హేమంత రుతువు.

 

    తడిసిన నేలపై

 

    కురిసే వానకన్నా,

 

    బీటలు వారిన బీడు భూములపై

 

    కురిసే రుతుపవనాల పరువాల జల్లు

 

    ఎంత అనుభూతి అందిస్తుందో గదా?

 

    ఏ ప్రేమికులైనా అలాంటి నిరీక్షణనే కోరుకుంటారు గాని- విసిగించి, ఆవేదన పుట్టించే నిరీక్షణని కోరుకోరేమో!

 

    కానిప్పుడు శ్రీధర్ నిరీక్షణలో నిస్సహాయతకి గురైన స్థితిలో వున్నాడు.

 

    "అపర్ణ ... నువ్వా...!" అన్నాడతను గొంతు పెగల్చుకుని. ఎట్టకేలకు ఆ కంఠంలో గుండె లోతుల్లోంచి ఉబికివచ్చిన అనురాగం తొణికిసలాడింది.

 

    "ఏంటబ్బాయ్ నేను లేనని వెర్రిమొర్రి వేషాలేస్తున్నావా?" ప్రేమ పూర్వకమైన మందలింపు అది.

 

    ఒక్కక్షణం తికమకపడ్డాడు శ్రీధర్.

 

    "లేదు అపర్ణా... అలాంటివేం లేవు" అన్నాడు తనలో రేగిన తత్తరపాటును కప్పిపుచ్చుకుంటూ.

 

    "అలాంటివేం లేకపోతే మరెందుకలా మాట్లాడావ్? ఎవరా అమ్మాయ్?" విరుచుకుపడినట్లుందా గొంతు.

 

    'ఏమో...నాకు తెలీదు" సర్దిచెప్పడానికి అతనింకా మాట్లాడ బోతుంటే అద్దుకుని అందామె-

 

    "ఏంటి...నీకు తెలీకుండా, నువ్వేం చేయకుండానే నీతో అంతచనువుగా మాటాడేవాళ్ళున్నారంటే నేన్నమ్మను."

 

    "నువ్వెప్పుడు నన్ను నమ్మావు గనుక. నువ్వూ, ఆ అమ్మాయి, ఇంకో ఇద్దరు అందరూ నాతో ఆటలాడుకుంటున్నారు. ఐ డోంట్ లైకిట్" చిరాగ్గా అన్నాడు శ్రీధర్.

 

    దానికి ఆ వేపు నుంచి చిరునవ్వు వినిపించింది. ఆ మరుక్షణమే మాయమై-

 

    "నీ వేషాలకి అడ్డుకట్ట వెయ్యకపోయావనుకో. ఏం చేస్తానో తెలుసా?"

 

    "ఏం చేస్తావ్?" అడిగాడు శ్రీధర్.

 

    "ఫ్రెండ్ షిప్ కట్టవుద్ది" అందామె అట్నుంచి.

 

    "కేవలం ఫ్రెండ్ షిప్పేనా?" మాటలు పెంచుతూ అన్నాడు శ్రీధర్.

 

    "రెండూనూ."