నేను చెయ్యి లాక్కుని "మీరు చెప్పినవి చెప్పడానికి ప్రామిస్ట్రీ తెలిసుండక్కర్లేదు" అన్నాను.

 

    "కావాలంటే ఇంకా చెప్తాను. శాస్త్రాన్ని అంత తేలిగ్గా తీసి పారేయకు" కాస్త కోపంగా అన్నాడు.

 

    "భవిష్యత్తు గురించి తెలుసుకోవాలన్న ఆశలేదు...వస్తా!" అన్నాను.

 

    మాధవ్ లేచి నిలబడి "ఒక్కమాట!" అన్నాడు.

 

    తల ఊపాను. సిద్ధార్థ విషయమో తన ఇంటికి వచ్చిన విషయమో అర్థంకాలేదు!

 

    "జస్ట్ ఫర్ గెట్ ఎబౌట్ ఇట్...ఏదీ ఒకసారి ముందటి ఆముక్తలా నవ్వు...నవ్వాలి మరి..." అన్నాడు.

 

    నేను బలవంతంగా నవ్వాను.

 

    "దట్స్ లైక్ ఏ గుడ్ గర్ల్!"

 

    అని నా బుగ్గ పిండాడు.

 

    "నేను వచ్చి డ్రాప్ చెయ్యనా?" అడిగాడు.

 

    "వద్దు" అని బయలుదేరాను.

 

    "ప్రొద్దుట నీవెలా వున్నదీ ఆఫీసుకి ఫోన్ చెయ్యమ్మా" వెనకనుండి అరిచాడు.


                                   *  *  *


    చిన్నక్క ఊరుకెళ్తోంది. ప్రతిసారీ మాకు బెంగగానే ఉంటుంది. అమ్మా, పెద్దక్కా దానికోసం ఏవో పచ్చళ్ళూ, పిండి వంటలూ ప్యాక్ చేస్తున్నారు.

 

    చిన్నక్క నా గదిలోకి వచ్చింది.

 

    నేను మంచం మీద బోర్లాపడుకుని ఉన్నాను.

 

    "ముక్తా..." అని నా తలమీద చెయ్యి వేసింది.

 

    నేను గబుక్కున లేచి కూర్చున్నాను.

 

    "ఎనీ ప్రాబ్లమ్?" అడిగింది.

 

    తల అడ్డంగా ఉపాను.

 

    చిన్నక్క కళ్ళద్దాలు సవరించుకుంది. అంటే ఏదో లెక్చెర్ మొదలుపెడ్తుందన్నమాట అనుకున్నాను.

 

    "వచ్చే సంవత్సరం తర్వాత నిన్ను నాతో తీసుకెళ్ళిపోతాను. అమ్మా, నాన్నా నీకు చాలా స్వేచ్చనిచ్చి పాడుచేస్తున్నారు!" అంది. నేనేం మాట్లాడలేదు.

 

    "ఈ వయసులో ఎవడ్ని చూసినా వీడ్ని ప్రేమిస్తే ఎలా ఉంటుంది? అనిపిస్తుంది. చాలా చెడ్డ వయసు! జాగ్రత్తగా అడుగు వెయ్యకపోతే జారిపడ్తావు. ప్రేమ అంటే తెలియడానికి...నీ వయసు సరిపోదు!

 

    కలిసి సినిమా చూడటాలూ, ఒకళ్ళ భుజాలమీద ఒకళ్ళు తలలు వాల్చి సానుభూతులు చూపించుకోవడాలూ కాదు ప్రేమంటే.

 

    ప్రేమంటే...ఒక మనిషి ఇచ్చే స్ఫూర్తివల్ల మన విధుల్ని సక్రమంగా నిర్వర్తించడం!

 

    అతని తలపులు మన దోసిలిలో వర్షంలా కురుస్తూ ఉంటే...ఎన్ని రోజులైనా ఈ దోసిళ్ళలో ఇంకా ఇంకా స్థలం మిగులుతూనే ఉండటం! అంది.

 

    "ఆ క్షణంలో ఆమె ముఖం చూస్తే, ఆమెకి 'ప్రేమ' అనే అనుభవం చాలా పాతదని చెప్పెయ్యచ్చు!"

 

    "అవన్నీ అర్థం అవ్వాలంటే మెచ్యూరిటీ రావాలి. అప్పటిదాకా వాటి జోలికి పోకు. ఏ ఆకర్షణలోనూ పడి శలభంలా మసైపోకు!" అంది.

 

    నేను కన్నీళ్ళని దాచుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.

 

    చిన్నక్క వెళ్తూ నాన్నగారితో "చెప్పినవన్నీ జ్ఞాపకం ఉన్నాయిగా...కోటు తొడుక్కుని మార్నింగ్ వాక్ కి రోజూ వెళ్ళాలి...సరేనా!" అంది.

 

    ఆయన బుద్ధిగా తలవూపారు.

 

    చిన్నక్క పిల్లలతో బాటుగా నాకు కూడా చెక్కిలిమీద వెచ్చని ముద్దుపెట్టి, సూట్ కేస్ అందుకుంది.

 

    "మాధవ్ ఆటో తీసుకొచ్చాను. రండి...టైం అవుతోంది" అన్నాడు.

 

    అక్క ఇబ్బందిగా చూస్తుంటే నాన్న "ఫర్లేదు...వెళ్ళమ్మా" అన్నారు.

 

    అక్క అందరికి చెయ్యివూపి ఆటోలో కూర్చుంది.

 

    అమ్మ లోపల్నుండి "ఇది మరిచిపోయింది..." అని ఎర్ర డైరీ పట్టుకుని వస్తూ ఉండగానే ఆటో కదిలిపోయింది.

 

    "మళ్ళీ వచ్చినప్పుడు ఇవ్వచ్చులే...అబ్బాయితో వెళ్తోంది...వెనక్కి పిలవకు!" అన్నారు నాన్న.

 

    నా కళ్ళన్నీ అక్క డైరీ మీదే ఉన్నాయి.

 

    అమ్మ దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి నాన్నగారి పెట్టెలో అడుగున పెట్టింది.


                                   *  *  *


    కాలేజి తెరిచారు.

 

    మొదటిరోజు సందీప్ నన్ను "హాయ్" అని పలకరించగానే ఆశ్చర్యపోయాను. వెంట రూబీ కూడా ఉంది.

 

    సందీప్ ఒక రకంగా సిద్ధార్థ కన్నా బెటర్! మోసం చెయ్యాలనుకోలేదు.

 

    ఆడపిల్ల శీలానికి విలువ ఇస్తుందని అతనికి తెలీదు. అతని వెంట ఉండే ఆ అమ్మాయిలే తెలుసుకోనివ్వరు!

 

    నాలాంటిది అలాంటి మాటలన్నా అతనికి జోక్స్ లా ఉంటాయి.

 

    లంచ్ టైంలో అతను ఎదురుపడ్డా నన్ను పట్టించుకోలేదు. అంతలోనే మరిచిపోయినట్లున్నాడు!

 

    నాకు విరక్తిలాంటిది కలిగింది.

 

    మనింట్లో నాలుగు రోజులున్న చిన్న పిల్లి పిల్లమీద కూడా ప్రేమ పెంచుకుంటాం అలాంటిది...ఈ మగాళ్ళు తమ అవసరానికి పనికిరాకపోతే ఎంత త్వరగా వదిలించుకుంటారూ!

 

    చిత్ర రాలేదు.