అతను కాస్త తడబడి "శారద ఇంట్లో లేదు. బోర్ కొడుతోంది, ఆఫీసుపని అయ్యాక అలా ఏదైనా మంచి హోటల్ కెళ్ళి భోంచేద్దాం... జస్ట్ ఫరె ఛేంజ్..."
    "ష్యూర్" అంది.
    ఇద్దరూ ఎవరి పనిలో వారు పడ్డారు. ఆ రోజంతా ప్రకాష్ అవకాశం వచ్చినప్పుడల్లా సుప్రియని సునిశితంగా గమనిస్తూనే వున్నాడు. సుప్రియ అది కనిపెట్టింది, నవ్వుకుంది.
    రాత్రి తొమ్మిదిగంటలకి ఇద్దరూ వైస్రాయ్ హోటల్లో ఓ కార్నర్ ఎంచుకుని కూర్చున్నారు. మొదటిసారిగా పరాయిస్త్రీతో అలా డిన్నరుకి వెళ్ళిన ప్రకాష్ కి, చాలా ఎగ్జయిటింగ్ గా వుంది. దానికి తోడు మనసులో చిన్న భయం.. ఎవరన్నా తెలిసినవారు కనిపిస్తే... ఏమనుకుంటారోనని... సుప్రియ మాత్రం అదేం లేకుండా ప్రతిక్షణం ఎంజాయ్ చేస్తోంది. మెనూ చూసి ఆర్డర్ సుప్రియనే ఇమ్మన్నాడు. ఆమెకు ఏది ఇష్టమైతే తనకీ అదే ఇష్టం అన్నాడు... సూప్ తాగుతూ.
    భోంచేస్తూ "సుప్రియా, నీ గురించి చెప్పు... నీ గురించి నాకసలు ఏం తెలీదు. ఉద్యోగం ఇమ్మంటూ శారద ఏదో ఆ రోజు కొంచెం చెప్పింది గాని నేనసలు పట్టించుకోలేదు. ఇప్పుడు నిన్ను చూస్తుంటే నీ గురించి తెలుసుకోవాలని వుంది."
    సుప్రియ కళ్ళు వాల్చుకుని "నాది చెప్పుకోవాల్సినంత గొప్పకథేం కాదు సార్... చిన్నప్పుడు తల్లిపోవడం, తండ్రి రెండోపెళ్ళితో తల్లి తండ్రి ఇద్దరూ నన్ను పట్టించుకోకపోవడం... ప్రేమానురాగాలకి అలమటించేదాన్ని. ఇంత తిండి పెట్టి చదివించడం తప్ప ఏనాడూ నాన్న ఆప్యాయత చూపలేదు... పిన్ని చీటికీమాటికీ సాధిస్తూ, టెన్త్ అయ్యాక నెమ్మదిగా హాస్టల్ లో జాయిన్ చేయించింది.
    ఏదో డిగ్రీ పూర్తి చేశాను. చిన్న ఉద్యోగం చేస్తుండగా ప్రేమలో పడడం, ఆవేశంలో తప్పటడుగు వేసి ప్రేమని నమ్మి పెళ్ళాడడం... డబ్బులేని ఆ ప్రేమ నిలువకపోవడం... ఆ తరువాత పొట్ట పోషించుకోవడానికి, ఉద్యోగాలు దొరక్క ఎన్నో పాట్లు పడడం... ఎంతోమంది తోటి ఉద్యోగుల రకరకాల లైంగిక వేధింపుల మధ్య బతికీడుస్తూ ఆఖరికి హైదరాబాద్ వచ్చి సునీతని కలవడం... చెప్పి... "నాకెవరూ లేరు ప్రకాష్ గారూ, ఈ జీవితంలో నేను ఒంటరిదాన్ని..." కాళ్ళనీరు తిరుగుతూండగా తలదించుకుంది.
    ప్రకాష్ ఆమె చేతిమీద చెయ్యివేసి నొక్కి... "నేనున్నాను సుప్రియా, ఎవరూ లేరని ఎప్పుడూ అనుకోవద్దు... నీకు నీ స్నేహితురాళ్ళున్నారు, నేనున్నాను..." అన్నాడుచాలా ఎమోషనల్ గా.
    "నన్ను అన్నివిధాలా సపోర్టు చేస్తూ, అనురాగం, ఆప్యాయత పంచేవారు కావాలనిపిస్తోంది ఈ మధ్య. అందరి మధ్య వున్నా చాలా ఒంటరిగా ఫీలవుతున్నారు. నా ఆలోచనలు పంచుకునే వ్యక్తి కావాలి. నన్ను అర్థం చేసుకోవాలి. నీవు ఆ వ్యాక్యూమ్ భర్తీ చెయ్యాలి. నీవు నా ఆఫీసులోనే కాదు, నా జీవితంలోను అసిస్టెంట్ గా సాయపడాలి... సుప్రియా."
    చాలా ఎమోషనల్ గా అంటుంటే సుప్రియ వింతగా చూసింది అతని మొహాన్ని. వెంటనే అతని భుజంమీద చెయ్యివేసి చిలిపిగా "ఉత్తి అసిస్టెంట్ నేనా!"అంది నవ్వేస్తూ.
    ప్రకాష్ మొహంలో రంగు మారింది... ఏదో అనబోయి విరమించుకున్నాడు.
    అదే సమయంలో రవీంద్ర, రంజని హోటల్ లో ప్రవేశించారు. రవీంద్ర ప్రకాష్ ని చూసి కాస్త తొట్రుపడ్డాడు. పక్కన సుప్రియని చూసి మరింత ఆశ్చర్యపడ్డాడు. ప్రకాష్ రవీంద్రని చూడలేదు. ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని కూర్చోవడం చూసి నవ్వుకుంటూ దూరంగా మరో టేబిల్ దగ్గిరకి వెళ్ళిపోయాడు.
    రంజని రవీంద్రని చూసి "అతడు శారద హజ్బెండేనా" అంది అనుమానంగా.
    తల వూపాడు.
    "ఆ అమ్మాయి ఎవరు?"
    "సుప్రియ అని సునీత ఫ్రెండ్. శారదకి కూడా ఫ్రెండే. ప్రకాష్ సెక్రటరీగా పని చేస్తోంది. ఈ సంగతి తెలిస్తే సునీత మొహం ఎలా వుంటుందో చూడాలి... లోకంలో నేనొక్కడినే మగాడిని కాదు ప్రేమలో పడి భార్యనించి విడాకులు తీసుకుంటున్నది అని అర్థం చేసుకుంటుందేమో" అన్నాడు.
    ఇంటి కెళుతూనే వుండబట్టలేనట్టు వెంటనే "ప్రకాష్ ని హోటల్ లో చూశానీవేళ" అన్నాడు ఫ్రిజ్ లోంచి నీళ్ళబాటిల్ తీసుకుంటూ యధాలాపంగా అన్నట్టు.
    "ఆహా!...అంది మామూలుగా సునీత.
    "సుప్రియతో చూశాను. ఇద్దరూ డిన్నరుకొచ్చారు" ఒకరకంగా అన్నాడు.
    సునీత అతని మొహంవంక చూసి "అలాగా" అంది.
    కానీ ఆమె మొహంలో రంగుమారడం కనిపెట్టాడు రవీంద్ర.
    "ఇద్దరూ చేతిమీద చెయ్యివేసుకుని చాలా ఫ్రెండ్లీగా, హ్యాపీగా డిన్నరు చేస్తుంటే చూశాను. నన్ను వాళ్ళు చూడలేదనుకో..." అన్నాడు సునీత మొహంలో భావాలు కనిపెట్టాలని తాపత్రయపడుతూ.
    "లోకంలో ఏదో నేనొక్క మాగాడినే కానిపనులు చేశానని అనుకోకు ఇకపైన" అని అంటించాడు.
    "అలా ఎందుకనుకుంటాను? మగాళ్ళ బుద్ధి తెలియనిదాన్ని కాదు" అంది నవ్వి.
    "మీ ఫ్రెండుకి చెప్పు పాపం మేల్కొనమని..." అనికూడా చేర్చాడు.
    "మేల్కొనివుండి అన్నీ చూస్తూ నేనేం చెయ్యగలగాను..." సునీత నవ్వుతూ అంది.
    ఈసారి రవీంద్ర మొహం మాడిపోయింది.
    సునీత ఎప్పుడూ వెంటనే రియాక్ట్ అయి మాటకి మాట అందిస్తుంది.
    మాడిన మొహంతో రూములోకి వెళుతుంటే "డాడీ..." నీరసంగా పిలిచాడు గౌతమ్. "చెయ్యి నొప్పిగా వుంది డాడీ... ఎప్పుడు తగ్గుతుంది డాడీ" అన్నాడు.
    రవీంద్ర కొడుకు మంచంమీద కూర్చుని "తగ్గిపోతుంది నాన్నా, ఎముక విరిగింది కదా అతుక్కోవాలి గదా, ఇంకో నాలుగురోజులలో కాస్త నొప్పి తగ్గుతుంది. ఎడంచేయి కదా ఫరవాలేదు... ఇంకో వారంలో స్కూలుకెళుదువు గాని" కొడుకు తల నిమిరి బుజ్జగింపుగా అన్నాడు. సునీతకి, తనకి మధ్య ఎంత దూరం వున్నా పిల్లలతో బంధం ఎప్పటికీ పోదుగదా... ఏమిటో ఈ రక్తసంబంధం మహిమ అనిపించింది.
                                          * * *