"పిచ్చి తల్లివని."

    "అందుకనే మీరు నన్ను అపార్ధం చేసుకుంటున్నారనేది. ఇప్పుడు సమయం వచ్చిందికనుక చెబుతున్నాను. రహస్యం అనేదాన్ని నేనెందుకు అవలంబించాలో అర్ధంకాదు" అని ఓ దీర్ఘనిశ్వాసం విడిచి "నాది చాలా క్షుద్రజీవితం. చూశారా? నన్నుగురించి నేను చెప్పుకోవచ్చినప్పుడు వణికిపోతున్నాను. అందుకనే ఈ ప్రజలకి దూరంగా ఉందామనుకుంటూంటే ఈయనగారు కొనసాగానియ్యటం లేదు" అని తలవంచుకుని "కానీ చిన్నక్కా! ఒక విషయంమాత్రం మీరు నమ్మాలి. నాకు మీకంటే ఆప్తులు లేరు."

    "నమ్మదగనిది ఇందులో ఏముందమ్మా? కానీ మనమిద్దరం కలుసుకున్న సందర్భం ఈ విధంగా వుండటమే హృదయ విదారకంగావుంది."

    "ఏం?" అంది రాగిణి కంపిత స్వరంతో.

    "చిన్నక్క ముందు నడుస్తూంటే కన్నీళ్ళు నీడలా వెన్నాడుతున్నాయి. ఏదో సుఖమయమైన అనుభవం ఇక్కడకూడా లేదా? నేను వస్తూనే కుశల ప్రశ్నలతో కాక గండిపడ్డ జీవితంయొక్క మధురవిచారంతో సత్కరించబడ్డాను. ఇదే హాయి, ఇదే సౌఖ్యం. ఇదే మన ఇద్దర్నీ ఎవరూ వేరుచేయనంత దగ్గరకు చేర్చింది. ఈవేళ ఎంత సుదినమో! నీగురించి నాకు చెప్పకుండా రవి ఇన్నాళ్లూ ఎందుకు ఉపేక్షించాడో నాకు పాలుపోవటంలేదు. కానీ తల్లీ! నీగురించి నాకు ఏమీ చెప్పకు."  

    రవి ఈ సంభాషణంతా శ్రద్ధగా తిలకిస్తున్నాడు. హఠాత్తుగా తలెత్తి అన్నాడు 'ఏ మహాద్భుతశక్తి ఇతరులచేత నిన్ను ఇంతగా ప్రేమించబడేటట్లు చేస్తుందో ఊహించతరమా?' ఇది అనన్యసామాన్యమైన అలౌకిక శక్తి. దానిముందు ఎంత కఠినమైన గుండె అయినా జావలా కరిగిపోవలసిందే. నా దృష్టిలో మానవులు చాలా విచిత్రమైన జీవులు. ఏ ఒక్కరి జీవితమూ సాఫీగా గడవదు. కొందరు అయస్కాంతంవలే ఆకర్షిస్తారు. అది ఆనందమూ కావచ్చు. అంతులేని ఆరాటమూ కావచ్చు. ఇటువంటి వ్యక్తులు తటస్థపడినప్పుడు తారసపడే ఆ ముద్ర చిరకాలం నిలిచిపోతోంది. కానీ అన్నిటికన్నా మించినది నీలో ఏదో దృగ్గోచరమవుతుంది నాకు.

    చిన్నక్కా! కన్నీళ్ళే కల్మషాన్ని కడిగివేస్తవి. ఆనందమనీ, సంతోషదాయక మనీ వాపోయిన తొడుగుని విసర్జించి ఓ నూతన భావతరంగాల మధ్య తేలియాడుతూ, ఈ బ్రతుకు తుచ్ఛం, కల్మషం, మిధ్య అని అనుకుంటాడు. పాపాలని కడిగివేసుకుంటాడు. ఈ అనుభూతి, ఆంతర్యంలో కలిగే ఈ నిష్కల్మషమైన విశ్రాంతి ఎన్నాళ్ళు తపస్సుచేస్తే లభిస్తవి? పూర్వజన్మ సుకృతంవల్ల కాబోలు! నేను రవికై జన్మించాను."

    అప్పటికప్పుడు చాపమీదనుంచి లేచి నిలబడి "ఎంత దుర్భలుడినో నేను! నిన్ను పొగిడి ఆ లజ్జాభారంతో ఉన్నాను. ఇంత విశ్రాంతి అన్నా భయంగానూ వుంది. అంతేకాక నీముందు భయం భక్తి ఎంత నశించిపోతే ఇలా సంచరిస్తోంది? అందుకే కృత్రిమమైన తృప్తి నాకు నేను కలిగించుకున్నాక చీకటిపడే లోపునే ఇక్కడ కానవస్తాను" అని జవాబుకోసం కూడా ఎదురు చూడకుండా గబగబ నడిచి వెళ్ళిపోయాడు.

    స్త్రీలిద్దరూ రెప్పవాల్చకుండా స్తబ్దులై మిగిలిపోయారు. అప్పుడు రాగిణి తెలివితెచ్చుకుని అంది "చిన్నక్కా! చూడు వారుచేసిన పని."

    శారద కన్నులపండుగగా రాగిణివంక సుదీర్ఘంగా చూసింది. తర్వాత అంది "ఇంత గ్రహించినవాడు ఒక్కవిషయం మరిచిపోయినందుకు చికాకుగా వుంది. ఈనాటి ఈ వింత వాతావరణానికి కారణభూతురాలు ఎవరో కనుక్కోలేకపోయాడు. ఈ సన్నివేశంలో నేను వుండటం నిజమై, నీవు ఉండటం అబద్ధమైతే ఇందుకు ఎంత విరుద్ధంగా వుండేదో గుర్తించలేకపోయాడు."

    రాగిణి ఈ మాటలు "మీ మాటలుకూడా అర్ధంకావు. కానీ నాగురించి మీరు చెప్పనిచ్చారు కాదేం?"

    "ఎందుకంటే నీగురించి నువ్వు ఎప్పుడు చెప్పుకుంటావో అప్పుడు నీలోతెలుసుకోవాల్సింది. ఏమీ లేదని గ్రహించాక పరిచయాలు పరిచయాలుగానే వుండిపోతాయి. అదీగాక నీ గురించి చెప్పటం పూర్తయాక నువ్వు అంటూ ఏమీలేదన్నమాట. అంతేగాక నువ్వు నాకు కొంతతెలుసు. రవి చెప్పాడు."

    "కొంతసేపటి క్రిందట ఏమీ చెప్పలేదన్నారు?"

    "అదే చెప్పడం, వాడు అలా చెయ్యక వల్లెవేసిన పాఠంలా లొడలొడా వాగివుంటే కారు మధ్యదారిలోనే వెనక్కి త్రిప్పించి వుండేదాన్ని. నువ్వు గర్వం అనయినా అనుకో, ఇంకేమయినా అనుకో"

    "అబ్బ! మీరు చాలా తెలిసినవారు. మీగురించి వారు ఎప్పుడూ చెబుతూ వుండేవారు."

    కొంతసేపు మౌనంగా గడిచిపోయాక "అయ్యో! నేను తెలివి మాలినదాన్ని. మా ఇంటికి మీరుగా మీరు వచ్చాకకూడా మీగురించి ఏమీ అడగలేదు. ఎప్పుడు వచ్చారు?" అని ప్రశ్నించింది.

    శారద తను ఈ ఊరు వచ్చినపని చెప్పింది. అంతా విన్నాక రాగిణి సేద తీరినట్లు "హమ్మయ్య!" అనుకుని "మీరు ఎంత అదృష్టవంతులు!" అని అస్పష్టంగా పలికింది.

    "వారిని నాకు చూపించరా?"

    "ఇప్పుడు కాదులే, తర్వాత."

    "కాఫీ తెస్తానుండండి" అంటూ ఆమె వారిస్తున్నా రాగిణి లక్షించకుండా  గబగబా లోపలకు పోయింది. ఆమె లోపలికి పోవడానికి కారణం కాఫీ ఒక్కటే కాదన్న సంశయం ఆమెకు స్ఫురించి, లేచి నిలబడి అటూఇటూ తిరగసాగింది. వీధి తలుపులు తెరిచేవున్నాయి. రవి తీసుకుపోయినట్లున్నాడు. వాకిట్లో కారులేదు. అక్కడ తిరుగుతూనే సాధ్యమైనంత వరకూ పరిశీలించి చూసింది. నాలుగే గదులు వున్నాయి. కానీ అతి సుందరంగా వుంది.

    లోపల రాగిణి ఏమిచేస్తుందో చూద్దామని కుతూహలం కలిగినా ఆపుకుని మంచంవద్దకు వచ్చి అక్కడున్న పుస్తకం మీదకు వంగి చూసింది.

    ఇంతలో "చిన్నక్కా! మీకు విసుగ్గా వుందా?" అని రాగిణి కంఠస్వరం వినబడింది సన్నగా.

    "ఉహు లేదు" అని లోపలకు వెడదామని ఆమె మెల్లగా అడుగులు వేస్తూ ఒకసారి తల ప్రక్కకు త్రిప్పి చూసి ఉలిక్కిపడి నిల్చుండిపోయింది. అది గోడకు తగిలించివున్న నిలువుటద్దం మినహా ఏమీకాదు. కానీ అందులో కనిపించినది చిన్నప్పటి తన ముఖంకాదు. ఆమె దద్దరిల్లింది. ఎవరీ వ్యక్తి? ఆ కన్నీటి చారికలతో, రేగిపోయిన జుట్టుతో, మాసిపోయిన దుస్తులతో ఇక్కడికి సిగ్గువిడచి ఇలా ఎందుకు వచ్చింది? కదులుతున్న నీటిలో డోలాయమానములైన రెండు డోలాబ్జములవలె ఆడుతున్న రెప్పలతో రెండు కనుపాపలు అదురుతో ఊగిసలాడుతున్నాయి. వాటిల్లో ఏవో ఆలోచనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. నిరవధికమూ, నిరర్గళమూ అయిన మరుపు తలపుల మరులు విరజిమ్ముతూ విరులు వెదజల్లుతున్నాయి. నయనాంచలాల వరకూ అశ్రువులు అందమైన ఆ రూపాన్ని చెరుపుతున్నాయి. అది తన్మయతో, అసహ్యమో ఏదీ ఇంకా తనలోనే నిర్థారణ కాకముందే లోపలినుంచి మరో పిలుపువచ్చింది. "చిన్నక్కా! ఏం చేస్తున్నారు?"