ఏ చివరిపోరాటంతో సుదర్శనరావులాంటి ఓ రాక్షసుడ్ని సంహరించాలనుకుంటున్నానో ఆ పోరాటం యికనుంచీ మీరు కొనసాగించకండి. బహుశా యిదే నేను మీకు అందించకూడని చివరి సందేశం.

                                                                                              - షా

 

    అజ్ఞాతంలో వున్న శ్రీహర్ష సందేశాన్ని అందంగా పత్రికలో పొందుపరిచిన రాణా ఈ రెండు ప్రకటనలతో ఎంత కదలికని సాధించగలిగాడూ అంటే.

 

    ముందు యూనివర్సిటీ విద్యార్థులు రంగంలోకి దిగారు.

 

    ఇంతకాలమూ జరుగుతున్న అనర్థాలకి అసలు అర్థం ఇప్పుడు తెలిసినందుకు ఉప్పెనలా కదిలారు. రాష్ట్రస్థాయి ఉద్యమానికి నడుంకట్టి 'సుదర్శనరావు రాజీనామా చేయాలి' అంటూ బేనర్స్ కట్టి వూరేగింపులు ప్రారంభించారు.

 

    చాలాకాలంపాటు అదృశ్యమైన యూనివర్సిటీ అమ్మాయిల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. ఆత్మహత్యలతో కడతేరిన యువతుల అన్నలూ, తమ్ముళ్ళూ, సానుభూతితో ఆలోచించగల స్త్రీలూ దోషుల్ని శిక్షించండి అంటూ నినాదాల హోరుతో ఆందోళనకి దిగారు. సుదర్శనరావు దిష్టిబొమ్మల్ని తగలబెట్టారు.

 

    కాలేజీలు మూతపడ్డాయి.

 

    హర్తాళ్ళతో రాష్ట్రం అట్టుడికిపోయింది.

 

    జవాబు చెప్పలేని ప్రభుత్వం మొదటి మూడురోజులూ ఏంచేయాలో పాలుపోక పోయినా నాలుగోరోజునుంచి విద్యార్థినాయకుల్ని నిర్భంధంలోకి తీసుకోవడం ప్రారంభించారు.

 

    దానిక్కారణం మరో రెండురోజుల్లో ఉపప్రధాని సుదర్శనరావు రాష్ట్ర పర్యటనకి వస్తున్నాడు. అతడి రక్షణకి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని సుదర్శనరావు ముఖ్యంగా పర్యటించే విశాఖ నగరంలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు బలగాన్ని, స్పెషల్ పోలీసుని దించి అప్రమత్తం చేసారు.

 

    సరిగ్గా ఇదే సమయంలో.

 

    ఢిల్లీలోని తన నివాసంలో కూర్చున్న ఉపప్రధాని సుదర్శనరావు అతడికి అభిముఖంగావున్న వ్యక్తిని రెప్పలార్పకుండా చూస్తూ అన్నాడు.

 

    "ఈ దేశం మీది. ఇక్కడ ఏ ప్రాంతానికయినా మీరు నిశ్చింతగా వెళ్ళొచ్చు. ఏదన్నా చేయొచ్చు. చట్టపరమైన ఏ అడ్డంకులూ లేకుండా చూసే పూచీనాది"

 

    సుమారు ఆరున్నర అడుగుల పొడవుతో సందిట బంధించి ఏనుగునయినా నుగ్గుచేయగల దేహదారుఢ్యంతో కనిపిస్తున్న ఆ వ్యక్తి ఈ ఉపదేశాన్ని ఉత్సుకతగా వినలేదు.

 

    "వైజాగ్ లో షా సంచరించే ప్రదేశాల వివరాల్ని, అతడికి ఆత్మీయులుగా అనిపించిన వ్యక్తుల అడ్రసుల్నీ మీకు అందచేసాను. అంతేకాదు నా ముఖ్య అనుచరుడు అక్కడ మీకు సహకరిస్తాడు. షా సామాన్యుడు కాడని గుర్తుంచుకుని..."

 

    "బుల్ షిట్" ఆవేశంగా పైకిలేచాడావ్యక్తి "అతడి శక్తియుక్తుల గురించి మీరు చెప్పాల్సిన పనిలేదు. అది మీకు అనవసరంకూడా. మిమ్మల్ని కలిసింది ఓ ఫార్మాలిటీస్ గానే తప్ప మీనుంచి ఆదేశాలు వినటానిక్కాదు. సీయూ..."

 

    నిప్పులు కక్కుతున్న నేత్రాలతో షాని కలుసుకునేదాకా విశ్రమించని ఉన్మాదంతో బయటికి నడిచాడు ఉదయమే సిసియానుంచి వచ్చిన ఆ వ్యక్తి.

 

    షాని కడతేర్చమని కోట్లడాలర్ల ఒప్పందంతో ప్రపంచ మాఫియా సిండికేట్స్ రెండేళ్ళక్రితమే నియమించిన నోటోరియస్ కిల్లర్ పుజో...

 

    అదేరోజు వైజాగ్ చేరుకున్నాడు పుజో.

 

    అంటే సుదర్శనరావు పర్యటనకి రెండురోజులముందు.


                                                             *  *  *


    బ్రతుకు విశ్వాసంపై జొరబడిన సందేహపు క్రిముల్లా వెలుగురేఖలు పూర్తిగా సమసి నగరంలో చీకటి ఆవరిస్తున్న వేళ.

 

    రేవతిని కలుసుకున్నాడు శ్రీహర్ష.

 

    ఆమె కళ్ళనుంచి నీళ్ళు రాలుతున్నాయి.

 

    మరణించిన భర్త గుర్తుకొస్తున్నాడో లేక పోరాటంలో పూర్తిగా అడుగుపెట్టి ఇక ఎన్నటికీ కనిపించకుండా పోతాడనిపించే శ్రీహర్ష విపత్కర పరిస్థితులే ఆమెను కలవరపరుస్తున్నాయో ఆమె కుంచించుకుపోతూంది భీతిగా.

 

    "రేవతీ" ఓ అన్నలా పిలిచాడు "జీవితం జీవించటానికేతప్ప ఎప్పుడో రాబోయే మరణంగురించి ఆలోచిస్తూ కలతచెందటానిక్కాదు. నిజమే... నీ స్థితి ఏ ఆడదీ కోరనిదీ... కూడనిదీకూడా. అలా అని ఇలా స్తబ్ధంగానే బ్రతకడం నీకుమాత్రమే కాదు నీకున్న ఒక్కగానొక్క పసికందు భవిష్యత్తుకీ మంచిదికాదు."

 

    జీవితపు చరమాంకంలా ఈ అప్పగింతల సందేశమేమిటో ఆమెకు తోచడం లేదు.

 

    నిజమే...

 

    అసలు శ్రీహర్ష ఈ సమయంలో ఆమెను కలుసుకోవాల్సిన అగత్యంలేదు.

 

    కాని కలుసుకోవాలనుకున్నాడు. అది తిరిగి రాలేనన్న అణువంత సందేహంతో. ఓ యుద్ధానికి వెళ్ళే సైనికుడి అంతరంగంలో ఏర్పడే భావసంచలనం కావచ్చు. లేదూ తను ఎక్కడివాడయినా ఏ భవబంధాలకు అతీతంగా బ్రతికినాగాని యీదేశంలో అడుగుపెట్టిన తర్వాత ఆ కుటుంబంతో మానసికంగా పెంచుకున్న అనుబంధం కావచ్చు. తను వెళ్ళిపోయేముందు చాలాచాలా చెప్పాలనిపిస్తూంది. అయినా చెప్పాలనుకున్న అసలు విషయాన్ని చెప్పలేకపోతున్నాడు.

 

    "పాప జాగ్రత్తని మాత్రమే చెప్పడంలేదు రేవతీ. ఈ దుఃఖంనుంచి తేరుకుని నువ్వూ మరో జీవితంలో అడుగుపెట్టాలి."

 

    రేవతి కళ్ళనుంచి ఓ నీటిబొట్టురాలిపడింది "ఎవరున్నారన్నయ్యా! నాకెవరు మిగిలారని."

 

    "కాలంతప్ప మిగిలేది మనుష్యులు కాదమ్మా. నా జీవితంలో నేను తెలుసుకున్న సత్యమిది" అతడి గొంతులో చిత్రమైన నిర్వేదం ధ్వనించింది. "ఎప్పుడో ఈనేలపైనే పుట్టిననేను కోరుకుండానే కన్నతల్లికి, పుట్టిన నేలకీ దూరమయ్యాను. ప్రపంచంమీద కసి పెంచుకుని పగతో చాలాచాలా చేసాను. ఆ సమయంలోనే నాకు పరిచయమైంది లూసీ. సహృదయంతో నన్ను స్వీకరించిందేతప్ప నా మార్గానికి వారధి వేయలేకపోయింది. కారణం నేను మారేస్థితిలో లేనుకాబట్టి. మారేవాడ్నేమోకూడా. కాని కాలంవిలువ తెలీదప్పటికి. అది తెలిసేసరికి లూసీ నాకు దూరమైంది. శమంత్ లాంటి స్నేహితుడూ చేజారిపోయాడు. అయితేనేం? ఈ ప్రాపికలో నేను నా ఆలోచనలకి భిన్నంగా కొంత మారేను. నా మరణానికి వెలకట్టగలిగే కొన్ని కన్నీటి బిందువులను సంపాదించుకోగలిగాను. కాలం ఎంత అమూల్యమైనదమ్మా! మనిషిని కిరాతకుడ్నీ చేస్తుంది, పునీతుడిగానూ కడతేరే అవకాశమిస్తుంది" క్షణం ఆగాడు "ఇదంతా ఎందుకు చెబుతున్నానూ అంటే పోయింది వెలకట్టలేనిదని, ఉన్న బ్రతుకును వెలలేనిదిగా మార్చుకోవద్దని."