అంతలో సిద్దేశ్వర్ ఓబరాయ్ కి వైర్లెస్ లో షాకింగ్ న్యూస్ వచ్చింది. హాన్ బ్రదర్సు హోటల్ సూట్ లో హత్యగావించబడ్డారనేదే ఆ న్యూస్.

    హాన్ బ్రదర్స్ మాస్టర్ కి పార్టనర్స్.

    హాన్ బ్రదర్స్ మాస్టర్ ఇన్విటేషన్ మీద బొంబాయి వచ్చారు. ప్రోగ్రామ్ ప్రకారం హాన్ బ్రదర్స్ షరీఫ్ పార్టీకి అటెండ్ కావాలి. కానీలోపే హోటల్ గదిలో హత్యగావింపబడ్డారు.    
    
    హాన్ బద్రర్స్ చనిపోతే ఐనాందార్ కి హాంకాంగ్ నుంచి వచ్చిన ఇన్ ఫర్మేషన్ ప్రకారం మాస్టర్ లాభపడతాడు.
    
    అంటే.... హాన్ బ్రదర్స్ ని చంపింది మాస్టరేనా!        
    
    మాస్టర్ ప్రస్తుతం ఇక్కడున్నాడు.
    
    మరి హాన్ బ్రదర్స్ ని చంపిందెవరు?
    
    సిద్దేశ్వర్ బ్రెయిన్ ఆలోచనలతో, అనుమానాలతో వేడెక్కిపోయింది.
    
    అక్కడి నుంచి వడివడిగా వెళ్ళి ఐనాందార్ ని కలిసి జరిగింది చెప్పాడు.
    
    ఓ ప్రక్క పార్టీ క్రమంగా ఊపందుకుంటోంది. నవ్వులు, కేరింతలు, కేకలతో ఆ ప్రాంతమంతా సంచలనంగా కనిపిస్తోంది.
    
    "మాస్టర్ ఇక్కడున్నంత మాత్రాన హాన్ బ్రదర్స్ చంపింది మాస్టర్ కాదని ఖచ్చితంగా చెప్పలేం చంపాకే ఇక్కడికి రావచ్చు. ముందుగా మనం తేల్చుకోవాల్సింది హాన్ బ్రదర్స్ ఎన్ని గంటలకు చనిపోయిందనే విషయం...." అని అంటూనే ఐనాందార్ వైర్ లెస్ సెట్ ఆఫ్ చేసి హాన్ బ్రదర్స్ హత్య జైర్గిన ఏరియా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి వెంటనే పెథాలజిస్ట్ ని హత్యా ప్రదేశానికి తీసుకెళ్ళమని ఆ పైన శవ పరీక్ష జరిపించమని ఆదేశాలిచ్చేసాడు.
    
    "చనిపోయింది హాంకాంగ్ వాసులు కనుక హాంకాంగ్ పోలీస్ అధికారులకు ఏ విషయం తెలపాలి. ఆ ఏర్పాట్లు కూడా చూడండి. ఎవరు చంపినా, చంపినా మూలంగా ఎవరికి మేలు చేకూరినా, మనం పోస్ట్ మార్టం రిపోట్లు, పెథాలజిస్ట్ ల అనాలసిస్, ప్రత్యక్ష, పరోక్ష సాక్షుల కథనాలను సేకరించకుండా ఏ చర్యా తీసుకోలేం జెని నియమించింది హాన్ బ్రదర్స్ అనే అనుమానం ఇప్పుడు బలపడుతోంది. షర్టు జేబుల్ని ఫాంట్ జేబుల్ని వెతక్కుండా ఏ అతిధిని లోపలకు రానివ్వలేదు.
    
    మనవాళ్ళు ఏ రూపంలో వచ్చినా జెని కూడా మనవాళ్ళు సోదా చేసే ఉంటారు. జె ఇప్పుడీ పార్టీలో ఉన్నడన్నది నిజం. మరి ఆయుధం అదే ఫైర్ ఆర్మ్ లేకుండా వచ్చి మాత్రం ఏం చేయగలడు? పైగా ఈ ప్రాంతాన్ని మనవాళ్ళు ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచి పూర్తిగా తమ అధీనంలోకి తీసుకొని, అంగుళం అంగుళం క్షుణ్ణంగా గాలించేసారు. ఒకవేళ నిన్నా, మొన్నట్లో వచ్చి ఫైర్ ఆర్మ్ ని ఇక్కడే ఎక్కడో దాచేసి వెళ్ళి వుండవచ్చు. ఆ 'జె'ని అనుకోటానికి కూడా ఛాన్సెస్ లేవు.... మిస్టీరియస్ డ్రామా..." అని తల విదిలిస్తూ తిరిగి టీవీ సెట్స్ ఉన్న గదికేసి కదిలిపోయాడు సిద్దేశ్వర్ ఓబరాయ్.
    
                                                 *    *    *    *    *
    
    సరిగ్గా  రాత్రి పదిగంటలయింది...
    
    పైథాలజిస్ట్ తన కిట్ తో హోటల్ రూమ్ కి వెళ్ళి బ్లడ్ శాంపుల్స్ బూట్ల ముద్రలు, నేరపరిశోధన కవసరమైన వన్ని ఏదీ వదిలిపెట్టకుండా తీసుకున్నాడు. ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీసుకున్నాడు. ఆ పైన హాన్ బ్రదర్సు శవాలు పోస్ట్ మార్టం కోసం తరలించటం, చివరిగా ఆ గదికి సీల్ వేయటం జరిగింది.
    
                                                 *    *    *    *    *
    
    "ఇంతకు ముందు మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది...." అన్నాడు ఐనాందార్ వీడియో కంట్రోలింగ్ రూంలోకి హడావిడిగా వస్తూ.
    
    అప్పటికే పార్టీలో సోనాల్ మాన్ సింగ్ ఒడిస్సీ నృత్యం తారస్థాయి నందుకుంది. ఆ హోరులో, జోరులో ఐనాందార్ మాటలు స్పష్టంగా వినిపించలేదు ఓబరాయ్ కి.
    
    అందుకే ఆయన లేచి గది బయటకు వచ్చాడు. "మనవాళ్ళు సాధారణంగా చేతులు పైకెత్తమని, చంకల క్రింద నుంచి అతిధి శరీరాన్ని తడుముతారు..."    
    
    "వూ... అయితే?"
    
    "అవసరమయితే కాళ్ళను, షూస్ ని కూడా తడిమి చెక్ చేస్తారు...."
    
    "అవునూ... మీ అనుమానం దేనిమీద?" సిద్దేశ్వర్ ఆసక్తిగా అడిగాడు.
    
    "భుజాల పైనుంచి వేళ్ళ చివర్ల వరకూ చేతుల్ని తడమరు కదా?" ఐనాందార్ లాజిక్ కి సిద్దేశ్వర్ ఓబరాయ్ ఉలిక్కిపడ్డాడు.
    
    కొద్దిక్షణాల మౌనం తరువాత తేరుకున్నాడు "ఎస్" అన్నాడు ఓబరాయ్ పాలిపోయిన మొఖంతో.
    
    "నా అనుమానం 'జె' చేతులకు ఫైర్ ఆర్మ్ ఫిక్స్ చేసుకొని ఉండవచ్చు. బొంబాయి నగర ప్రముఖులు ఈ పార్టీకి వస్తారు గనుక సోదాపేరిట మెటల్ డిక్టేటర్స్ లాంటివి పెట్టి అతిధులకు చిరాకు కలిగించమని మహా అనుమానం వస్తే అతిధుల శరీరాల్ని చెక్ చేస్తామని 'జె' ఊహించలేకపోతాడు. సో.... ఖచ్చితంగా చేతులకే ఫిక్స్ చేసుకొని ఉండవచ్చని మనం ముందుకు వెళ్ళాలి" ఐనాందార్ తనలో రేగిన అనుమానాల్ని బయటపెట్టాడు.
    
    పార్టీలో సోనాల్ మాన్ సింగ్ నృత్యం అయిపోయింది.
    
    భీంసేన్ జోషి ఓకల్ మొదలయింది.
    
    "అసలెలా లోపలకు రావచ్చు...." సిద్దేశ్వర్ విషయం మొదటికి వెళ్ళాడు.
    
    "ఎవరిదో పాస్ సంపాదించుకుని, ఆ పాస్ లో వున్న అతిధిలా మేకప్ చేసుకొని ఎంటరయి ఉండవచ్చు. గేట్ దగ్గరున్న మన ఆఫీసర్ సిన్సియర్ అండ్ స్ట్రిక్టు పైగా మొన్నీ మధ్యే ఐ.పి.ఎస్. ట్రైనింగ్ పూర్తి చేసుకొని జాబ్ లో జాయినయ్యాడు. ఉడుకు రక్తం ఇంతకు ముందే నేనతన్ని కలిసాను. చివరకు మన డిపార్టుమెంట్ ఆఫీసర్స్ ని సయితం పాస్ లేకుండా వదలలేదతను. 'జె' మేకప్ ఆర్ట్ లో సిద్దహస్తుడు. బహుశా ఆ విధంగానే లోపలికి వచ్చి ఉండవచ్చు. గార్డెన్ చుట్టూ ఎత్తయిన గోడ వుంది. ఆపైన మూడడుగుల కొకరు చొప్పున మన కానిస్టేబుల్స్ కాపలా కాస్తున్నారు. వార్ని అజమాయిషీ చేయటానికి ఇద్దరు సర్కిల్ ఇన్ స్పెక్టర్స్ ఒక డి.ఎస్.పీని నియమించాను. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట నుంచీ ఈ గార్డెన్ ని మన అధీనంలోకి తీసుకున్నాం. దీనికి రెండు గేట్లు ఉన్నా, ఒక గేటులోంచే అతిధుల్ని లోపలకు రానిచ్చాం. ఏమాత్రం సిన్సియర్ కాదని తెలిసిన పోలీసుల్ని ఆఫీసర్స్ ని ఇక్కడ నియమించలేదు. ఇప్పుడాలోచించండి" ఐనాందార్ మాటలకు సిద్దేశ్వర్ ఓబరాయ్ ఆలోచనల్లో పడ్డాడు.
    
    పార్టీలో పాల్గొన్న అతిధులు సాధారణ నియమాల్ని మర్చిపోయి మూడో రౌండ్ లోకి చేరుకున్నారు.
    
    భిస్మిల్లాఖాన్ షెహనాయ్ కన్సర్ట్స్ ఆరంభమయింది.
    
    పాలపుంతలోని నక్షత్రాలు పరుగులు పెడుతున్నట్లుగా వుంది. ఎత్తుమీద నించుని పార్టీకేసి చూస్తున్న సిద్దేశ్వర్ ఓబరాయ్ కి.
    
    ఆనందాన్ని, ఆహ్లాదాన్ని తమ సొంతం చేసుకొని అద్భుతమైన అనుభూతుల అంచులకు చేరుకుంటున్న వీళ్ళమధ్య ఫైర్ ఆర్మ్ నిప్పులు కక్కితే....? మాస్టర్ ఆర్తనాదం చేస్తూ ఒరిగిపోతే! నరాల్లో నాట్యం చేస్తున్న మధురానుభూతి ఒక్కసారి అదృశ్యమైపోదూ?