"ఇదొక డెడ్ లీ డేంజరస్ గేమ్. నీకు చెప్పినా అర్ధంకాదు. నిశాంతను దేశ్ ముఖ్ దగ్గరకు పంపించు... ఇకనుంచీ ఆ అమ్మాయికీ, మనకూ ఏ విధమైన సంబంధం లేదు" ఉయ్యాలలోంచి లేచాడు అచ్యుతముని.

 

    జనమేజయరావు మౌనంగా ఫోన్ వైపు నడిచాడు.


                               *    *    *    *


    టాక్సీలోంచి దిగిన దేశ్ ముఖ్ ని చూసి వూపిరి పీల్చుకున్నారు సెక్యూరిటీ స్టాఫ్.

 

    పి.ఎ. సుభాష్ చంద్ర పరిస్థితి నిప్పు కణికల మీద నుంచున్నట్లుగా వుంది.

 

    తన ప్రాణాల్ని లెక్కచేయకుండా ఆయన ఎందుకలా ఒంటరిగా తిరుగుతున్నాడు?

 

    స్పెయిన్ నుంచి వచ్చిన దగ్గర్నించి ఆయనలో వచ్చిన మార్పుని స్పష్టంగా గమనిస్తున్నాడు సుభాష్ చంద్ర.

 

    మరీ ముఖ్యంగా నిశాంత కల్పిందగ్గర్నించి.

 

    "ఎవ్వెరిథింగ్ ఓ.కె." విష్ చేస్తూ ముందుకు అడుగేశాడాయన.

 

    "ఓ.కె. సార్... నైట్ రెండు గంటలకు టోక్యో టూర్" జ్ఞాపకం చేశాడు సుభాష్ చంద్ర.

 

    ఆ విషయం పట్టించుకోలేదు ఆయన.

 

    "ఈజ్ దేర్ ఎనీబడీ ఫర్ మీ..."

 

    "యూ మీన్ గెస్ట్స్ సర్... నో సర్" సుభాష్ చంద్ర అన్నాడు వినయంగా.

 

    ముందుకు అడుగేస్తున్న ఆయన రిసెప్షన్ కెదురుగా లాంజ్ లో సోఫాలో కూర్చున్న వ్యక్తివైపు చూశాడు.

 

    నిశాంత...!

 

    నల్లటి లంగా, వోణీలో నిశాంత ఆడనాగులా కూర్చుని వుంది.

 

    ఠీవిగా లేచి, హుందాగా నడుస్తూ ఆయనకి ఎదురుగా వచ్చింది నిశాంత.

 

    "హౌ ఆర్యూ... జెంటిల్ మేన్" నిశాంత కాటుక దిద్దిన కళ్ళవైపు చూశాడాయన.

 

    "నా సామ్రాజ్యంలోకి ప్రవేశిస్తున్న నీకు స్వాగతం పలుకుతున్నాను."

 

    ఆయన కళ్ళల్లోకి సాలోచనగా చూసింది నిశాంత.

 

    అంత త్వరగా అచ్యుతముని నిశాంతను తన దగ్గరకు పంపించటాన్ని నమ్మలేకపోయాడు ఆయన.


                                                   *    *    *    *


    ముస్సోరి... ది క్వీన్ ఆఫ్ ది హిమాలయాస్.

 

    పల్చగా కురుస్తున్న మంచు... ఆ మంచును చీల్చుకుంటూ పట్టణాన్ని ఆక్రమించుకుంటున్న సన్నటి సూర్యరశ్మి...

 

    న్యూఢిల్లీకి 290 కిలోమీటర్ల దూరంలో వున్న అందాల పట్టణం ముస్సోరి. మంచులో తడుస్తున్న తెల్ల గులాబీలా వుంది.

 

    హేపీ వేలీ టిబెటన్ల టౌన్ షిప్. ఆ పట్టణానికి అలంకారం టిబెటన్ల ప్రార్ధనా స్థూపం. ఎటు చూస్తే అటు కాషాయాంబర ధారులైన బౌద్ధ భిక్షువులు.

 

    ఆ హేపీ వేలీ వెనుక గన్ హిల్. బ్రిటీష్ కాలంలో రోజూ మధ్యాహ్నము సరిగ్గా పన్నెండు గంటల సమయంలో తుపాకీ పేలేది. పట్టణ వాసుల మధ్యాహ్నం కార్యక్రమాలు అప్పట్నించీ ప్రారంభమయ్యేవి.

 

    ఆ సమీపంలో వున్న కొండలే ఝాలాఘర్ కొండలు. గన్ హిల్ కు ఝాలాఘర్ కు మధ్య 400 మీటర్ల రోప్ వే ప్రత్యేక ఆకర్షణ. ఆ రోప్ వేలో తిరిగే ట్రాలీ బస్సుల్లో తిరగడం యాత్రికులకు అద్భుత అనుభవం.

 

    కొంచెం దూరంలో ఒక మెయిలు పొడవున విస్తరించిన ఇండియన్ బజార్ అచ్చమైన భారతీయ సౌందర్యానికి ప్రతీక. ఆ బజార్లో అర్ధరాత్రి తర్వాత జరిగే భారతీయ నృత్య ప్రదర్శనల్ని చూడడానికి విదేశీయులు వుబలాడ పడతారు.

 

    నగరం నాలుగువైపులా వున్న మోసీ ఫాల్స్, భట్టా ఫాల్స్, హార్టీ ఫాల్స్, కెమ్ట ఫాల్స్ మధ్య నగరం నిత్యమూ అభిషేకం పొందుతున్న శివలింగంలా వుంటుంది.

 

    ఆ హేపీ వ్యాలీకి రెండు కిలీమీటర్ల దూరంలో పదెకరాల విశాలమైన ప్రదేశంలో రక్తచందనంతో తయారుచేసినట్టుగా వుందొక బిల్డింగ్. ఆ బిల్డింగ్ కి రెండు వందల సంవత్సరాల చరిత్ర వుంది. ముస్సోరీలో మిలటరీ స్టేషన్ ని నిర్మించడానికి వచ్చిన బ్రిటీష్ ఆఫీసర్ కెప్టెన్ యంగ్ తన నివాసం కోసం నిర్మించుకున్న బిల్డింగ్ ఆ యంగ్ ప్యాలెస్. ఆ ప్రాంతమంతా ప్రస్తుతం ప్రొటెక్ట్ డ్  ఏరియా. ప్రైవేట్ ప్రోపర్టీ. ఆ బిల్డింగ్ కి రెండు కిలోమీటర్ల దూరంలో స్పెషల్ చెక్ పోస్టు. స్పెషల్ ఆర్మ్ డ్ సెక్యూరిటీ ఫోర్స్ నిఘా.

 

    యంగ్ ప్యాలెస్ దూరం నుంచి చూస్తే జైలులా వుంటుంది చుట్టూ ఎత్తయిన గోడలు. ఐరన్ ఫెన్సింగ్. ఆ ఫెన్సింగ్ లో నిరంతరం ప్రవహించే విద్యుత్ ప్రవాహం.

 

    మైన్ గేట్ కి పక్కన సెక్యూరిటీ ఆఫీస్. ఆ పక్కన స్పెషల్ కంట్రోల్ రూమ్.ఆ పదెకరాల భవనంలో ఎక్కడ ఏం జరిగినా వెంటనే అలారమ్ చేసే కంప్యూటర్ ఎక్విప్ మెంట్. శాటిలైట్ ద్వారా పనిచేసే కమ్యూనికేషన్ సిస్టమ్స్.

 

    ఆ సెక్యూరిటీ చీఫ్ ప్రభాకరదేవ్. ఎక్స్ మిలటరీ ఆఫీసర్.

 

    సెక్యూరిటీ ఆఫీస్ దాటాక అందమైన గార్డెన్. గార్డెన్ మధ్యలో సిమెంటు బాట. అక్కడక్కడ నీటి కొలనులు. నీళ్ళను విరజిమ్మే ఫౌంటెన్స్. అక్కడక్కడ అందంగా అమర్చిన పాలరాతి శిల్పాలు. గ్రీక్ యుద్ధవీరుల శిల్పాలవి.

 

    ఆ శిల్పాలు దాటి లోనికెళితే...

 

    మెయిన్ బిల్డింగ్. విశాలమైన వరండా. ఆ వరండా చివర విశాలమైన రూమ్. అది ఆ బిల్డింగ్ మేనేజర్ అనంతమూర్తిది. అనంతమూర్తికి అరవై ఏళ్ళుంటాయి.

 

    ఆ బిల్డింగ్ లో పనిచేసే సిబ్బందికి అనంతమూర్తి చీఫ్.

 

    ప్రస్తుతం అనంతమూర్తి తన చేతిలో వున్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్ ని పక్కన పడేసి గబగబా ఆ గదిలోంచి లోనికి నడిచాడు.

 

    లోనికి నడుస్తూనే చేతి వాచీ చూసుకున్నాడు.

 

    ఎనిమిది పది నిమిషాలు. గబగబా హాల్లోకొచ్చి మేడ మెట్లెక్కడము ప్రారంభించాడు.

 

    మూడు నిమిషాలు గడిచాయి. మెట్లెక్కగానే ఆ వరండాకి ఆనుకుని విశాలమైన హాలు.

 

    ఆ హాలుకి ఎడం పక్కనున్న పాతకాలపు ద్వారబంధం ముందు ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ నుంచున్నారు.

 

    వాళ్ళు లైట్ బ్లూ కలర్ సూట్స్ లో వున్నారు. అనంతమూర్తిని చూడగానే వాళ్ళిద్దరూ సెల్యూట్ చేశారు.

 

    ఒక సెక్యూరిటీ గార్డ్ తలుపు రెక్కను తెరిచాడు వినయంగా.