"నేను ఒక వయసొచ్చిన కూతురికి తల్లిని ధీరజ్!" అన్నాను.
    
    అతను మౌనంగా పునీతకూ నాకూ మధ్యన జరిగినదంతా విన్నాడు.
    
    "మీ రుణం తీర్చుకోలేను! అయామ్ సారీ! బట్ ఐ కాంట్ ఫర్ గెట్ యూ" అన్నాను.
    
    ధీరజ్ ఎప్పటిలా నవ్వేసాడు.
    
    "అహల్యా.....సారీలొద్దు! రుణాలు తీర్చేసుకోవటంకన్నా అంతో ఇంతో వుంచుకుంటేనే మంచిది. మళ్ళీ వచ్చే జన్మలో కలుసుకోవచ్చు. వైదీశ్వరన్ కోవెల్ లో చెప్తాడు మనం పోయిన జన్మలో ఎవరెవరికి రుణపడ్డామో అది ఈ జన్మలో తీర్చాలని!"
    
    "మీరు జన్మలని కూడా నమ్ముతారా?"
    
    "ఇప్పుడు నమ్మాలనిపిస్తోంది. స్వార్ధం" అని నవ్వాడు.
    
    "అహల్యా! నేను రేపే ముంభై వెళ్ళిపోతున్నాను. అక్కడ నా ఫ్రెండ్స్ కొందర్ని కలవాలి. సో....వెళ్ళేముందు ఒకమాట అడగనా?" సీరియస్ అవుతూ అడిగాడు.
    
    "అడగండి!"
    
    "ఇన్నేళ్ళుగా పునీత ఇలా ప్రేమలో షేర్ కాదు.....మొత్తం తనకే కావాలని వాళ్ళ డాడీని ఎందుకు అడగలేకపోయింది? అమ్మా, నాన్నా ఇద్దరూ సమానం కాదా?"
    
    నా దగ్గర జవాబు లేదు.
    
    "ఇట్స్ ఓకే - బట్! పునీత రేపటి మహిళ కావాలి. ఇంకో అహల్యగా మగవాడు ఎంతయినా ఎంజాయ్ చేయచ్చు కాని ఆడది ఒక్కసారి గడప దాటినా వ్యవస్థ నాశనమైపోతుందనే ఛాందస భావాలకి వారసురాలు కాకూడదు. మరో రఘురాంలాంటి వ్యక్తి పాలపడినా ఆమె తన అస్థిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కాపాడుకోగలిగే ఆత్మస్థయిర్యం ఆమెకి నేర్పించండి. తల్లిగా అది మీ కర్తవ్యం. వుంటాను బై" అని పెట్టేసాడు.
    
    "చిన్నతనంలో తల్లీతండ్రీ.....వయసొచ్చాక భర్తా..... పెద్దతనంలో పిల్లలూ అండకావాలని ఉగ్గుపాలతో రంగరించి పోసే వ్యవస్థలో పుట్టిన నేను నా పిల్లలకీ అవే వూహలు రంగరించి పోసావా?

    "మల్లెతీగ వంటిదీ... మగువ జీవితం... చల్లని పందిరి వుంటే....అల్లుకుపోయేనూ!" అనే పాట టేప్ లో వస్తుంటే భరించలేనట్లు ఆపుచేసేసాను.
    
                                                              * * *
    
    ధీరజ్ వెళ్ళిపోయినా అతని జ్ఞాపకాలు నన్ను విడిచిపెట్టలేదు.
    
    మరిచిపోవాలని ప్రయత్నిస్తుండగా ఒకనాడు తాగిన నిషాలో రఘు మళ్ళీ గుర్తుచేసాడు.

    "నీ బోయ్ ఫ్రెండ్ ఏడి? వెళ్ళిపోయాడా? అడగడం మర్చిపోయాను వాడు నాకన్నా బావున్నాడా...అదే బెడ్ లో..." అని హేళనగా నవ్వాడు.
    
    నేనేం చేసినా ధీరజ్ కి నాకూ మధ్యన అలాంటిదేం లేదని ఆ స్థితిలో అతన్ని నమ్మించలేనని తెలిసి మౌనంగా వూరుకున్నాను.
    
    అతను ఇది ఎడ్వాంటేజ్ గా తీసుకుని తరచూ నన్నూ నా శీలాన్ని అవమానపరిచి మాట్లాడటం ప్రారంభించాడు.
    
    పునీతకి పెళ్ళి కుదిరింది అనటంకన్నా తనే కుదుర్చుకుంది అనడం సబబు.
    
    అన్నివిధాలు ఆస్తిలో రఘుకి తలతూగే సంబంధం కాబట్టి వెంటనే ఒప్పుకున్నాడు.
    
    దీపూ వచ్చాడు. పునీత పెళ్ళి బాధ్యతంతా నెత్తినేసుకుని పన్లుచేస్తున్నాడు.
    
    ఆ రోజు నాకు ఒంట్లో నలతగా వుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చి మందులేసుకుని పడుకున్నాను.
        
    సాయంత్రం యింటికి వెళ్ళబోయే ముందు దీపూ నా గదిలోకి వచ్చాడు.
    
    "ఎలా వుందీ?" అడిగాడు.
        
    "కాస్త జ్వరం తగిలినట్లుంది" అన్నాను.
    
    అతను నా నుదుటిమీద చెయ్యేసి చూసాడు.
    
    "బాగా జ్వరంగా వుంది" అన్నాడు.
    
    ఇంతలో అతని సెల్ ఫోన్ మ్రోగింది.
    
    అతను నెంబర్ చూసి డిస్కనెక్టు చేసాడు.
    
    "గర్ల్  ఫ్రెండా?" నవ్వుతూ అడిగాను.
    
    "ఔను!" సిన్సియర్ గా చెప్పాడు.
    
    "మాట్లాడాల్సింది" అన్నాను.
    
    "అర్జెంట్ కాదు" నాకు బ్లాంకెట్ కప్పుతూ అన్నాడు.
    
    "దీపూ...పునీత పెళ్ళయిపోతోందన్న ఆనందంతోపాటు ఒంటరినైపోతానన్న బాధ కూడా వెంటాడుతోంది" అన్నాను.
    
    "నేను లేనా?" అతను నా మీద చెయ్యి వేసాడు.
    
    ఆ ఆప్యాయతకి నాకు కన్నీళ్ళొచ్చాయి.
    
    పెద్దగా క్లాప్స్ వినిపించి డోర్ వేపు చూసాము.
    
    రఘు హేళనగా నవ్వుతూ అన్నాడు "శభాష్! ఇంట్లోనే మీ కామలీలలు యధేచ్చగా సాగించుకుంటున్నారన్నమాట! ఎవరూ ఏమీ అనుకోడానికి కూడా వీలులేని వదినా మరుదుల సంబంధం కదా!"
    
    "రఘూ! షటప్" గట్టిగా అరిచాను.
    
    "ఏం పట్టుబడ్డానని బాధగా వుందా?" అడిగాడు.
    
    దీపూ ఏం మాట్లాడకుండా నిలబడి చూస్తున్నాడు.
    
    "పోరా... నా ఇంట్లోంచి పో... ఇంకెప్పుడూ రాకు" దీపూ మెడ మీద చెయ్యేసి తోస్తూ అన్నాడు రఘు.
    
    దీపూ అతని చెయ్యి తీసేస్తూ అన్నాడు "నీ తప్పులు నిన్ను భయపెడుతున్నాయని ఇంత పిరికిగా ఎదుటివాళ్ళ మీద బురద జల్లుతావా? ఛీ! మనిషి పుట్టుక పుట్టావు. ఎందుకూ?"
    
    "నన్నే ఎదిరించి మాట్లాడ్తావా? ఇదేమైనా పతివ్రతా? అప్పట్లో సినీ ఫీల్డ్ లో తిరిగి డబ్బు సంపాదించింది. ఆ తర్వాత ఆ అమెరికావాడితో, ఇప్పుడు నీతో" అని ఉన్మాదంగా అరిచాడు రఘు.
    
    నాకెంత అసహ్యం వేసిందంటే లేచి పక్కనున్న కూజా తీసి అతని మొహంమీదకి విసిరేశాను.
    
    రఘు మొహాన కారుతున్న నీళ్ళు తుడుచుకుంటూ "గెటవుట్....ఇంకొక్క క్షణం నా ఇంట్లో వుండద్దు. ఇద్దరూ పోండి" అనరుస్తూ మేడ మీదకి వెళ్ళిపోయాడు.
    
    "ఏవైంది నాన్నా?" పునీత అడుగుతోంది.
    
    రఘు వున్నవీ లేనివీ కల్పించి చెపుతున్నాడు.
    
    అతని ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ ఇంతపని చేయిస్తుందని నేను ఎన్నడూ అనుకోలేదు.
    
    దీపూ నెమ్మదిగా నా వైపు చూసి....పదండి....వెళ్ళిపోదాం...." అన్నాడు.
    
    "ఇంకా పెళ్ళి వారంరోజులు కూడా లేదు. శుభలేఖలు కూడా పంచేశారు" ఏడుస్తూనే అన్నాను.
    
    "త్యాగానికి, సహనానికీ కూడా హద్దులున్నాయి. దీపూ అంత కోపంగా మాట్లాడటం చూడడం నాకదే ప్రధమం.
    
                                                               * * *
    
    మర్నాడు రఘు మామూలుగా వచ్చి నాతో మాట్లాడడం నాకెంతో ఆశ్చర్యం కలిగించింది. కాని కారణం వెంటనే తెలిసింది. మగ పెళ్ళివారు నగలు కొనడానికని పునీతనీ, నన్నూ తీసుకెళ్ళడానికి వచ్చారు.