"తెలుసు" రాయ్ గొంతు అసహనంగా పలికింది- "మిమ్మల్ని రాజీనామా చేయమంటాడు."
    
    "అంటే మీకిది ముందుగానే తెలుసా?"
    
    "తెలుసు."
    
    "మరి ప్రధానమంత్రితో మాట్లాడానన్నారుగా?"
    
    "మాట్లాడానూ అన్నావే తప్ప మీ పదవికి ఢోకా లేదనలేదుగా!"
    
    "ఢోకా ఉండకూడదనే మిమ్మల్ని మాట్లాడమన్నది."
    
    "ప్రయత్నించాను వాసుదేవరావ్! కాని సంతకాల ఉద్యమానికి సంబంధించిన పేపర్లు చూపించారు. అది మాత్రమే కాదు.... ఆ ఉద్యమంతో పాటు మీ అవినీతికి సంబంధించిన వివరాలు, వాటిని బయట పెట్టిన పేపర్ కటింగ్స్, రాష్ట్రాన్ని ఎడాపెడా భోంచేయాలనుకున్న మీ దూకుడు వ్యవహారాలూ అన్నీ చూపించి నా నోరు మూయించాడు. హద్దులులేని ఆ అవినీతి గురించి అప్పటికి అర్ధమయింది."
    
    చురుక్కుమన్నా నిభాయించుకున్నాడు వాసుదేవరావు- "నేను అవినీతి పరుడ్ని కాకపోతే మీరు కోరినంత లేండ్ ని అంత చవకగా మీకు ఎలా యివ్వగలనంటారు?"
    
    "ఇలా యింతకుముందూ చేశారే? వాళ్ళంతా మీకు కాబోయే వియ్యంకులేనా?"
    
    ఉలిక్కిపడ్డాడు ముఖ్యమంత్రి రోషంతో అతడి పిడికిలి రిసీవర్ చుట్టూ బిగుసుకుంది.
    
    "రాయ్ సాబ్!" ఇది నాకు ఓటమి కాదు. ఈ పదవి పోయినంత మాత్రాన నా రాజకీయ చరిత్ర ముగిసిపోదు. మళ్ళీ మంత్రినౌతాను. కేంద్రములో స్థానం సంపాదించి యింకా ఎదిగిపోతాను."
    
    "కాదనలేను వాసుదేవరావ్! మీ రంతటి సమర్దులే కానీ..."
    
    "చెప్పండి."
    
    "ఇంట గెలవలేని మీరు...." వ్యంగ్యంగా నవ్వు వినిపించింది- "రచ్చ గెలవాలనుకుంటున్నారు."
    
    "నేను ఇంటినీ రచ్చనీ గెలవగల సవ్యసాచిని."
    
    "నేను మాటలాడుతున్నది మీ రాజకీయ జీవితం గురించికాదు"
    
    "మరి..."
    
    "అచ్చంగా మీ ఇంటి సంగతి."
    
    వాసుదేవరావు నొసలు చిట్లించాడు- "మీరు మాటలాడేది నాకు అర్ధంకావటం లేదు."
    
    "దురదృష్టం వాసుదేవరావ్! మీరు ముఖ్యమంత్రిగా భాగ్యనగరంలో సెటిలై మీ పిల్లల్ని వైజాగ్ లో వుంచి ఏం భాగ్యాన్ని మూటగట్టుకున్నారో నాకు తెలీదు కాని, మీ అమ్మాయి ప్రబంధ విచ్చలవిడిగా తిరుగుతూ ఓ అబ్బాయితో..."    
    
    "రాయ్ సాబ్!" అరిచాడు వాసుదేవరావ్ అసహనంగా- "నా కూతురు నా మాట జవదాటదు."
    
    "ఇది మీరు నిరూపించుకోవాల్సిన సమయం ఆసన్నమైపోయింది."
    
    "ఆ వాక్యం ఓ శతృఘ్నిలా వాసుదేవరావ్ గుండెల్లోకి దూసుకుపోయింది.
    
    "మీరు పొరపాటు పడుతున్నారు."
    
    "మిస్టర్ వాసుదేవరావ్!" ప్రశాంతంగానే అన్నాడు ప్రముఖ పారిశ్రామిక వేత్తయిన కె.పి. రాయ్- "నేను వ్యాపారస్తుడ్ని సరుకు నాణ్యత పరీక్షించి గాని లావాదేవీల్లో అడుగుపెట్టను. మీరు మా అబ్బాయితో సంబంధం ఖాయం చేసుకున్నాక నా దారిలో నేను ముడిసరుకు గురించి ఎంక్వయిరీ ప్రారంభించాను ఈరోజే తెలుసుకున్నాను."
    
    "ఏ....వి....టి?"
    
    "మీ ప్రబంధ- అంటే నాకు కాబోయే కోడలు కోరి ఓ ప్రేమకథకి శ్రీకారం చుట్టిందనీ, చాలా లోతుగా వెళ్ళిపోయిందనీ."
    
    "నాన్సెన్స్!"
    
    "కాదని నిరూపించుకోండి."
    
    "నిరూపిస్తే."
    
    "మనం ఇప్పటికీ వియ్యంకులమౌతాం."
    
    "మీ ఛాలెంజ్ ని నేను స్వీకరిస్తున్నాను."
    
    "స్వీకరించడం కాదు, మీకు సాధ్యమయితే వారం పదిరోజులలో మీ అమ్మాయిని పెళ్ళి పీటలపైకి రప్పించండి."
    
    ఫోన్ క్రెడిల్ చేశాడు కె.పి. రాయ్!
    
    చేష్టలుడిగిపోయినట్లు నిలబడిపోయాడు ముఖ్యమంత్రి వాసుదేవరావు.
    
    ఇక్కడ కె.సి. రాయ్ ప్రదర్శించిన రాజకీయదక్షత రాజకీయాల్లో అపారమయిన అనుభవం గల వాసుదేవరావునీ తప్పుదోవ పట్టించింది.
    
    అసలు తన పదవి గురించి పోరాడాల్సిన వాసుదేవరావుని ఆ ప్రయత్నం నుంచి మళ్ళింపచేసింది ఇదే.
    
    ఇలాంటి గెలుపు సాధించింది రేపు ముఖ్యమంత్రి కాబోతున్న పద్మనాభం.
    
    ఏ స్కేండల్ తో వాసుదేవరావు పదవీభ్రష్టుడౌతున్నాడో సరిగ్గా ఆ సహాయాన్ని తను అందించి సహకరిస్తానని రాయ్ కి హామీ ఇచ్చిన పద్మనాభం, ప్రబంధ ప్రేమ కథ గురించి తెలియచెప్పి వాసుదేవరావు పోరాట మార్గాన్ని మళ్ళించాడు.
    
    అణువంత ఓ సమస్య విస్ఫోటంగా దావానలం కావటానికి ఇది తొలి క్షణమైంది.
    
                                                              * * *
    
    "నేను..."స్థిరంగా పలికింది సౌదామిని. "సౌదామినిని మాట్లాడుతున్నాను."
    
    వాసుదేవరావ్ ఫోన్ చేయటాన్ని ఆమె ఊహించింది కాని, ఇంత అపరాత్రివేళ ఫోన్ వస్తుందనుకోలేదు."
    
    "ప్రబంధ ఏమంటుంది?"
    
    అతఃదలా సూటిగా ప్రశ్నించడంతో జవాబు చెప్పలేకపోయింది.
    
    "మాటాడు సౌదీ! నీ అసమర్ధతే నా ఓటమికి కారణమైందని బోధపడిపోయింది. చెప్పు, ప్రబంధ వ్యవహారం ఎంతవరకూ వచ్చింది?" మండిపడిపోతున్నాడు వాసుదేవరావు.