హఠాత్తుగా ఆడిటోరియంలో నిశ్శబ్దం ఆవరించింది.
    
    అందరికన్నా ఎక్కువ టెన్షన్ లోకి జారింది శౌరి, సూరి.
    
    స్టాప్ వాచ్ ని ఆన్ చేసి ప్రొఫెసరు రాధాకృష్ణ ప్రబంధ జంటకేసి చూస్తూ అడగటం ప్రారంభించాడు.
    
    "లాలోఫోబియా అంటే..."
    
    ప్రబంధ చెప్పింది "మాట్లాడేటప్పుడు కలిగే భయం."
    
    "నెదర్లాండ్స్ భాష?"
    
    "డచ్."
    
    "ఆలీవర్ ట్విస్ట్ రచయిత పేరు?"
    
    "చార్లెస్ డికెన్స్"
    
    "ఒలింపిక్స్ లో వాలీబాల్ ని ప్రవేశపెట్టిన సంవత్సరం?"
    
    "1964"
    
    "ప్రముఖ రన్నర్ కార్ల్ లూయూస్ కోచ్ పేరు?"
    
    "టామ్ టాల్లెజ్!"
    
    "ఒలింపిక్స్ నూట పదిమీటర్ల హర్డిల్స్ పందెంలో ఎన్ని హర్డిల్స్ ఉపయోగిస్తారు?"
    
    "పది."
    
    "ప్రపంచంలోని అతి పెద్ద కోట ఎక్కడుంది?"
    
    "రోమ్ వాటికన్ సిటీలో వుంది"
    
    "ఆస్ట్రియా కరెన్సీ పేరు?"
    
    "షిల్లింగ్"
    
    "స్పెండ్లిడ్ ప్రబంధా! ఎనిమిది ప్రశ్నలకీ కరెక్టు జవాబులు చెప్పి మొత్తం ముఫ్ఫై రెండు మార్కులూ స్కోర్ చేశారు"
    
    శౌరి బృందం ఉత్సాహంగా చప్పట్లు కొట్టింది.
    
    సాలోచనగా చూస్తుంది ప్రణయ. క్విజ్ మాస్టరుగా నిలబడ్డ 'బాబాయ్' చాలా మామూలు ప్రశ్నల్ని అడిగాడు.
    
    ఇక్కడ కావాలని ప్రొఫెసరు రాధాకృష్ణ ఎలాంటి తెలివిని ప్రదర్శిస్తున్నదీ ఆమె వూహించలేకపోయింది.
    
    "నౌ.....టీం వై...." జేబులోనుంచి ఓ స్లిప్ తీసిన క్విజ్ మాస్టర్ ప్రణయ ఆదిత్యలకేసి చూస్తూ అడిగాడు. "మై ఫెయిర్ లేడీ సినిమాకి ఆధారమైన నాటకం పేరు?"
    
    "పిగ్మాలియస్!" టక్కున చెప్పింది ప్రణయ.
    
    "రాట్ ఐ లవ్ అనే వాక్యంలో ఓ ప్రముఖ రచయిత పేరుంది. అక్షరాలని క్రమంలో ఎరేంజ్ చేసి ఆ రచయిత పేరు చెప్పాలి."
    
    ఉలిక్కిపడింది ప్రణయ. పది సెకండ్ల వ్యవధిలో చెప్పగలిగే బిట్ క్వశ్చను కాక ఎక్కువ వ్యవధి అవసరమయ్యే ప్రశ్న అడిగాడు.
    
    "వాల్టెయిర్!' ఆదిత్య చెప్పాడు నెమ్మదిగా.
    
    ఇరకాటంలో చూశాడు క్విజ్ మాస్టర్. ఇప్పటికే రెండు ప్రశ్నలు పూర్తయ్యాయి. కనీసం రెండు జవాబులు చెప్పలేనప్పుడు తప్ప ప్రబంధ గెలిచే అవకాశంలేదు. ప్రణయ, ఆదిత్య తెలివైనవాళ్ళు కావచ్చేమో కాని, ఎంతో తెలీని ప్రపంచాన్ని మొత్తం చెప్పగలిగే మేధావులు కారు. అది నిరూపించాలి.
    
    "ఎనవర్ ఎనాగ్రామ్.... షిప్ ఎ లాట్ ఓ బిల్డింగ్ పేరు ఈ అక్షరాల్ని క్రమంలో పేర్చి అదేమిటో చెప్పగలగాలి."
    
    "హాస్పిటల్..." ప్రణయ చెప్పింది.
    
    క్విజ్ మాస్టర్ లో ఉద్విగ్నత పెరిగిపోతూంది.
    
    "సి టి డి అంటే...."
    
    విభ్రమంగా మొహమొహాలు చూసుకున్నారు ఆదిత్య, ప్రణయ.
    
    "క్యుమిలేటివ్ టైమ్ డిపాజిట్."
    
    "రాంగ్..." ఉక్రోషంగా అరిచాడు ప్రొఫెసరు రాధాకృష్ణ "సి టి డి స్టాండ్స్ ఫర్ కంబైన్డ్ ట్రాన్స్ పోర్టు డాక్యుమెంట్. ఇది షిప్పింగ్ కి సంబంధించిన టెక్నికల్ టెర్మ్"
    
    "సర్! ఆవేశంగా లేచింది ప్రణయ "సి టి డి అనే ఓ షిప్పింగ్ టెర్మ్ అంటూ ముందు మాకు తెలియచెప్పాల్సింది."
    
    "సారీ.... తుది నిర్ణయం క్విజ్ మాస్టర్ ది" ఖండితంగా అన్నాడు రాధాకృష్ణ "నాలుగు మార్కులు కోల్పోయారు మీరు."
    
    "కాని..." ఆదిత్య మరేదో చెప్పబోతుంటే అర్ధోక్తిగా అన్నాడు ప్రొఫెసరు రాధాకృష్ణ "మధ్యలో ఇలా ప్రశ్నిస్తే నేను సహించను. ప్లీజ్ బీ సీటెడ్."
    
    ప్రణయ ఆదిత్యని వారించింది.
    
    బాబాయ్ ప్రవర్తనలో చాలా ప్రశ్నలకి జవాబులు కనిపిస్తుంటే నిర్లిప్తంగా చూస్తూ వుండిపోయింది "ప్లీజ్ ప్రొసీడ్ సర్..."
    
    "పంతొమ్మిదివందల ఏభై తొమ్మిదవ సంవత్సరపు వింబుల్డన్ ఛాంపియన్ పేరు?"
    
    "పెరూకి చెందిన అలెక్స్ ఓల్మిడో..."
    
    అమెరికా దేశానికీ చెందిన పదమూడవ రాజ్యాంగ సవరణ ఏది?
    
    చాలా ప్రశాంతంగా ఆలోచించగల ప్రణయ నిగ్రహం కోల్పోతున్న క్షణాలివి. తమ ఓటమికోసం బాబాయ్ చాలా గట్టిగా కృషిచేస్తున్నట్టు అర్ధమైపోయింది.
    
    అప్పటికే తొమ్మిది సెకండ్లు గడిచాయి.
    
    "అబాలిషన్ ఆఫ్ స్లేవరీ..." ఆదిత్య జవాబు చెప్పాడు. అదోలా చూశాడు రాధాకృష్ణ. అతడి స్వేదం పేరుకోవటం చాలా స్పష్టంగా కనిపిస్తూంది.
    
    "భయంకరంగా శబ్దం చేస్తూ గుర్రుపెట్టి నిద్రపోయేవాడని పేరు పొందిన అమెరికన్ ప్రెసిడెంటు పేరు?"
    
    "థియోడర్ రూజ్ వెల్ట్."
    
    ఇక మిగిలింది చివరి ప్రశ్న.
    
    ఆడిటోరియంలో చాలా ఏకాగ్రంగా చూస్తున్నారు అంతా.