అయితే హైద్రాబాదులో కొన్ని ఉద్యోగుల సమస్యల కోసం పోరాడాల్సి వచ్చింది. నా జీవితమే పోరాటం నేను దౌర్జన్యాన్ని - అన్యాయాన్ని, అక్రమాన్ని సహించలేను. ఉద్యమించాలి. స్వప్రయోజనం గురించి పట్టించుకోను.
    
    కార్పొరేషను ఉద్యోగులది ఒక ప్రత్యేక స్థితి. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులకు అతి దగ్గరగా ఉంటారు. ఆ ప్రతినిధులు ఉద్యోగులు తమ అధీనులు అనుకుంటారు. కార్పొరేషను ఉద్యోగుల్లో రెండు కేడర్లు ఉన్నాయి. ఒకటి కార్పొరేషను కేడరు. వీరు - అప్పటికి - సూపర్నెంటు గ్రేడువరకు వారే. ఎంత ప్రతిభావంతుడయినా ఆపైన ప్రమోషను ఉండదు. నా అపాయంట్ మెంట్ 1957లో సూపర్నెంటు గ్రేడులో జరిగింది. వీరికి నగరంలోపలనే తప్ప బయటికి ట్రాన్సుఫర్లుండవు. రెండవది స్టేట్ కేడర్ క్రింది గెజెటెడ్ నుంచి అత్యున్నతపదవి గల అధికారులు. వీరు ప్రభుత్వం నుంచి వస్తారు. వీరు కూడా కార్పొరేషను ఉద్యోగులు తమ అధీనులు అనుకుంటారు. ఒకవైపు కౌన్సిలర్లు - ఒకవైపు అధికారుల నడుమ ఉద్యోగులు నలుగుతుంటారు.
    
    హైద్రాబాదు ఉద్యోగుల బలహీనత ఏమంటే - ఎక్కువ మంది నిజాంకాలంవారు. ఇంగ్లీషు రాదు వీరిమీద పెత్తనం మరీ ఎక్కువ. ఒక గుర్తింపబడిన ట్రేడ్ యూనియన్ సహితంగా ఆరు యూనియన్లున్నాయి. ఎవరూ వీరికి సాయపడరు. పైగా పెత్తనం చలాయిస్తారు.
    
    కార్పొరేషను ఉద్యోగులది దయనీయస్థితి. వారిని ఏకం చేయడానికి - ఒక సంఘం స్థాపించడానికి నిరంతరం ప్రయత్నించాను. ఉద్యోగులు భయస్తులు, యూనియన్ అంటే జంకుతారు. నలుగురు ధైర్యంగల మిత్రులు లభించారు. 'మున్సిపల్ కార్పొరేషను సర్విసెస్ అసోసియేషన్' అని ఒక యూనియన్ రిజిస్టరు చేశాం. యాడాదికి మూడు రూపాయలు చందాగా నిర్ణయించాం అది 1963-64.
    
    యూనియన్ ఏర్పడడంతో ఉద్యోగులలో కొంత ధైర్యం వచ్చింది. చాలామంది సభ్యత్వం తీసుకున్నారు. కాని మిగతా వారికి కంటగింపు అయింది. బెదిరింపులు ప్రారంభం అయినాయి. ముఖ్యమైన బెదిరింపు గుర్తింపు పొందిన యూనియన్ పెత్తందారు గోవిందసింగ్ నుంచి వచ్చింది. "అష్వత్ ఖోరోఁకా అంజుమన్ కైసా చలేగా దేఖూఁగా" అని బెదిరించాడు. వాస్తవం ఏమంటే - కార్మికుల మీద పెత్తనం చలాయించి లక్షలు ఆర్జించాడు. బెదిరించి ఉద్యోగులతోనూ - అధికారులతోనూ పనులు తీసుకుంటాడు. ఆ పెత్తనానికి గండిపడుతుందని అతని భయం. గోవిందసింగ్ కౌన్సిలర్ - స్టాండింగ్ కమిటీ మెంబర్ అయినాడు. మరింత బెదిరింపు సాగించాడు.
    
    1964 అనుకుంటా - ప్రభుత్వం ఉద్యోగులకు కరువు బత్తెం పెంచింది. కార్పొరేషను కూడా తమ ఉద్యోగులకు ఇవ్వాలి. ఎప్పటివలెనే జాగుచేశారు. ఉద్యోగులు కుక్కిన పేలు. ఇచ్చినపుడే తీసుకునేవారు. కాని ఈ తడవ Protest day ఏర్పాటు చేశాం. అది సరిగ్గా కార్పొరేషను మీటింగునాడు ఏర్పరచాం. ఉద్యోగులందరూ Protest badges  ధరించారు. అంతే, ఆ ధరింపచేయటమే కష్టం అయింది!
    
    కార్పొరేషను మీటింగుకు వచ్చే ఫ్యూను నుంచి అంతా బాడ్జీలు ధరించారు. దాంతో చర్చ జరిగింది. గోవిందసింగ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. కౌన్సిలర్లతో మా మిత్రులూ ఉన్నారు. వారు బలపరచారు. ఈ చర్చవల్ల మా యూనియనుకు నగరంలో ప్రచారం వచ్చింది. డి.ఏ. తీర్మానం ఆమోదం పొందింది.
    
    ఉద్యోగులు ఇది తమ విజయంగా భావించారు. ఆ సాయంత్రం కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభకు అనూహ్యంగా తరలివచ్చారు. 'మనది స్వతంత్ర దేశం - మనం స్వతంత్ర పౌరులం' మనమీద ఎవరూ పెత్తనం చలాయించలేరు. అని ఉర్దూ - ఇంగ్లీషులలో ఆవేశపూరిత ఉపన్యాసం ఇచ్చాను. ఉద్యోగులు జయజయధ్వానాలు చేశారు. ఎత్తుకొని ఎగిరారు.
    
    యూనియన్ విజయం కౌన్సిలర్లలో - అధికారులలో - గోవిందసింగ్ లో కొంత ఆలోచన రేకెత్తించింది. వారు కొంత తగ్గారు. అంతా నాకు కొంత గౌరవం ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలను చర్చించడానికి సిద్దం అయినారు.
    
    యూనియనుకు కార్యాలయం ఏర్పరచాం. ప్రతి ఇరవయి అయిదుగురు సభ్యులు ఒక ప్రతినిధిని ఎన్నుకుంటారు. ఆ ప్రతినిధులు కార్యవర్గాన్ని ఎన్నుకునే ఏర్పాటు చేశాం. సభ్యుల పేర్ల పట్టికలు ప్రచురించాం. బహిరంగంగా సభ్యుల పేర్లు - సంఖ్య ప్రచురించడం ఇదే మొదలని లేబరు ఆఫీసువారు ఆశ్చర్యం ప్రకటించారు.
    
    యూనియన్ కార్యాలయంలో ఒక కార్యవర్గసభ్యుడు అందుబాటులో ఉంటాడు. ఉద్యోగులు తమ సమస్యలను రికార్డు చేయిస్తారు. వాటిని సాధ్యమైనంతవరకు పరిష్కరించే ప్రయత్నం చేశాం. యూనియన్ కార్యకలాపాల్లో నాకు ఎంతో తోడ్పడినవాడు M.L. ఆచార్య, అతడు పాత సోషలిస్టు. నన్ను మించిన ఆవేశపరుడు. నిజాయితీగల కార్యకర్త. అతను కార్యదర్శి - నేను అధ్యక్షుణ్ణి ఇంకా అనేకులు పని చేశారు. అందరినీ పేర్కొనడం అసాధ్యం.
    
    ఒకనాడు ముత్తమయ్య గౌడ్ అనే కౌన్సిలరు వెంకోజీ అనే ఉద్యోగిని కొట్టాడు. యూనియన్ లేకముందు ఇది సాధారణమే! ఇప్పుడు ఉద్యోగులు మేల్కొన్నారు. వెంటనే నాకు వార్త అందింది. వీళ్ళు సమ్మె చేయలేరని నాకు తెలుసు. Pen down అన్నాను. మాట విద్యుత్తులా పాకింది. కార్పొరేషను స్తంభించింది. టెలిఫోను ఆపరేటర్లు పెన్ డౌను సమ్మెలో ఉన్నాం అని పెట్టేశారు. ఇది సమ్మె అగునా కాదా? అని అధికారులు మీమాంసలో పడినారు.
    
    ఆసాయంకాలం జరిగిన ఉద్యోగుల సభలో ఆవేశం పొంగింది. కౌన్సిలరు క్షమార్పణ చెప్పేదాకా సమ్మె చేస్తాం అనేదాకా పోయింది. నేను శాంతపరచాల్సి వచ్చింది. తెల్లవారి పెన్-టూల్ డౌన్ సమ్మె కొనసాగుతుందనీ, తరువాత కార్యవర్గం నిర్ణయిస్తుందనీ చెప్పి వప్పించాల్సి వచ్చింది.
    
    తెల్లవారి కౌన్సిలర్ల దౌర్జన్యం గురించీ - మా సమ్మెను గురించీ పత్రికల్లో ప్రచారం వచ్చింది. పత్రికల వారు నన్ను అనేక విషయాలు అడిగి వ్రాశారు. తెల్లవారి కార్పొరేషను పనులు పూర్తిగా నిలిచిపోయాయి. పెట్రోలు ఇవ్వవలసినవాడు - పనివాళ్ళ హాజరు తీసుకోవలసినవాడు ఉద్యోగియే కమీష్నర్ - మేయరు డ్రైవర్లు పనికి వచ్చారు. కాని బండ్లు నడపలేదు. చప్రాసీలు నీళ్ళు అందించలేదు.
    
    అందరూ తమ విధుల్లో ఉన్నారు. ఎవరూ పని చేయరు!
    
    ఇది సమ్మె అగునా కాదా? అని ఆలోచనలో పడిన అధికారులు దీన్ని నివారించడం కోసం ప్రయత్నాలు సాగించారు. మమ్ములను కమీషనర్ పిలిచాడు. మేయర్ పిలిచాడు - స్టాండింగ్ కమిటీ చైర్మన్ పిలిచాడు.
    
    మాది గుర్తింపు పొందిన యూనియను కాదు కాబట్టి చర్చలు జరుపరాదు అని గోవిందసింగ్ అడ్డు తగిలాడు. పరిస్థితి విషమంగా ఉంది. ఎవరూ అతని మాట వినలేదు. నిరంతర చర్చలు జరిగాయి. అంతిమ సమావేశం మేయర్ దగ్గర జరిగింది. మేము అతి చిన్న ఉద్యోగిని కూడా ప్రతినిదిగా తీసికెళ్ళాం. వారు మేయర్ కమీషన్నరులముందు సమాన స్థాయిలో కూర్చొని చర్చించారు. అది ఉద్యోగుల్లో ఎంతో ఆత్మగౌరవం కలిగించింది.

    ఆ సమావేశంలో కౌన్సిలరును క్షమార్పణ చెప్పించడానికి సిద్దం చేశారు. మా వాళ్ళు కౌన్సిలరు బహిరంగ క్షమార్పణ చెప్పాలని పట్టుపట్టారు. వారు మేయరు ముందు క్షమార్పణ చెపుతామన్నారు. అనిశ్చిత స్థితినుంచి బయటపడడానికి నేను కార్యవర్గాన్ని ఆలోచించి చెపుతానన్నాను.
    
    కార్యవర్గ సమావేశంలో ఆవేశకావేషాలు మిన్నంటాయి. అక్కడ నేను మితవాధిని అయినాను. అందరూ నా మీద విరుచుకుపడ్డారు! అది నాకెంతో సంతోషం కలిగించింది!! నిజమైన ఉద్యమం 'మూకం కరోతివాచాలం!!!' అతి కష్టంమీద మేయర్ ముందు క్షమార్పణకు వప్పించాను.
    
    మేయర్ ముందు కౌన్సిలరు - ఉద్యోగికి క్షమాపణ చెప్పాడు. అయితే వార్తమాత్రం సమాధానం కుదిరినట్లు ఇవ్వాలన్నారు. వార్త అలాగే వచ్చింది.
    
    ఈ ఉదంతం - ఉద్యమంతో-  యూనియన్ ఉద్యోగుల హృదయాల్లో పీఠం వేసుకుంది. అధికారులు - కౌన్సిలర్లు కూడా జాగ్రత్తగా మసలుకున్నారు.
    
    తరువాత అనేక పోరాటాలూ - డిమాండ్ల సాధనా జరిగాయి. అయితే అతిముఖ్యం అయినవి పేర్కొంటాను.
    
    ఈ బ్యూరోక్రసీ అతి విచిత్రం అయింది. ఒక్క కలంపోటుతో కల్లోలాలు సృష్టించగలదు. సచివాలయం నుంచి దిగుమతి అయిన ఒక మహానుభావుడు - మతం పిచ్చిలో - ఉద్యోగుల్లో ఒక మతం వారిని ఊడ్చిపెట్టడానికి సిద్దం అయినాడు. అన్ని ప్రమోషన్లకు ఇంగ్లీషులో పరీక్షలు జరపాలనీ - సీనియారిటీ కాక - పరీక్షలో పాసయినవారికే ప్రమోషన్లు ఇవ్వాలని రూల్సు సిద్దం చేశాడు. ప్రభుత్వం గుడ్డిది కదా! గుమాస్తా చెప్పింది ఆమోదించింది!!
    
    ఆ రూల్సుకు వ్యతిరేకంగా జరుపతలపెట్టిన ఉద్యమం విషయంలో చీలిక వచ్చింది. అయితే వారు స్వప్రయోజనపరులు. అల్పసంఖ్యాకులు కొందరిని వప్పించాం. కొందరు స్వచ్చందంగా లొంగారు. ఆ రూల్సుకు వ్యతిరేకంగా అపూర్వం అయిన ఉద్యమం నిర్వహించాం. ఉద్యోగులు బజారున పడ్డారు. అన్ని సర్కిల్ కార్యాలయాలనుంచీ- సికిందరాబాదునుంచీ ఊరేగింపులుగా వచ్చి అబిడ్స్ లో కలిశాం. ఒక్క గోవిందసింగ్ యూనియన్ తప్ప మిగతా యూనియన్లన్నీ కలిసి వచ్చాయి. అది అనంతమైన ఊరేగింపు ఆంద్ర సారస్వత పరిషత్తు హాలులో వేలమంది శ్రామికులు ఉద్యోగులు సమావేశం అయినారు.