"త్వరగా సామాను నా ఫ్లాట్ కి మార్చేయటం చాలా మంచిది" హడావిడి పడిపోతూ అంది నిర్మల.

 

    "ఏం... ఏమయింది?" విస్మయంగా చూస్తూ అడిగింది పూజ.

 

    "మదర్ మాథ్యూస్, యోగి పరిసరాల్ని శ్రద్ధగా గమనిస్తూ కారిడార్స్ లో తిరుగుతున్నారు. శ్రీధర్ ఏమయ్యాడో అర్థంకాలేదు. కరెంటు వచ్చేలోపు మనం ఈ ఫ్లాట్ ని ఖాళీ చేసెయ్యాలి. కమాన్... హరిహప్..." అందినిర్మల టెన్షన్ ఫీలవుతూ.

 

    వెంటనే పూజ రెండు చేతులతో రెండు బాక్స్ ల్ని పట్టుకుంది.


                                                       *    *    *    *


    శ్రీధర్ వచ్చేసరికి మదర్ మాథ్యూస్ గాని, యోగి గానీ ఆమె ఫ్లాట్ లో లేరు. ఫ్లాట్ తలుపు మాత్రం దగ్గరకేసుంది. నిఘా వేయటం కోసం వెళ్ళి వుంటారనుకుని, సోఫాలో కూర్చుని, ఫ్యాన్ వేసుకుని కొద్ది క్షణాలు సేదతీరాడు.

 

    ఆ తరువాత లేచాడు. బాత్ రూమ్ కెళ్ళి చేతులు, కాళ్ళు, మొహం కడుక్కున్నాడు. షర్ట్ మొత్తం మాసిపోయింది. అది తీసి, ఉతికి ఆరేశాడు. దేని కోసమో జేబులో చూసుకునేసరికి, జేబులో ఒక ఫ్యూజ్ వుంది. అ ఫీజుని రీప్లేస్ చేయటం మరచిపోయాడు. దాన్ని అక్కడే వున్న డస్ట్ బిన్ లో వేశాడు. ఆకలిగా అనిపించి కిచెన్ లో వెదికాడు.

 

    కోకో సీసా దొరికింది. దాన్ని తాగుతూ వాచీ చూసుకున్నాడు.

 

    సరీగ్గా రాత్రి పదయింది.

 

    అయినా మదర్ మాథ్యూస్, యోగి జాడలేదు.


                                                     *    *    *    *


    పదింపావు అయ్యేసరికి చాలా లగేజ్ ని నిర్మల ఫ్లాట్ కి చేర్చేశారిద్దరు.

 

    పూజ, నిర్మల నిజంగా ఆ టైమ్ లో జెట్ స్పీడ్ లో పరుగులు తీస్తున్నారు సామానుతో.

 

    "మీ ఫ్లాట్ ఓనర్ కి జాగ్రత్తలు చెప్పావా? లేదంటే ఇంతకాలం నువ్వున్న ఫ్లాట్ ఎవరిదో కనుక్కుని, ఆ ఓనరు దగ్గరికెళ్ళి పూజ ఎలా వుంటుందని శ్రీధర్ అడిగితే కొంపలు మునిగిపోతాయి" అంది నిర్మల బరువైన సామనుని సయితం వేగంగా తీసుకెళుతూ.

 

    "నిన్ననే చెప్పేశాను. అయినా అతను ఆ సాయంత్రమే ఢిల్లీ వెళ్ళి పోయాడు. మరో నెలదాకా రాడు. ఈలోపు నా పెళ్ళి అయిపోతుంది కనుక నో ఫియర్" అంది పూజ కూడా వేగంగా నడుస్తూ.


                                                       *    *    *    *


    మరో పది నిమిషాలకి మాథ్యూస్, యోగి ఫ్లాట్ కొచ్చారు.

 

    "ఏమిటది? ఇంతసేపు ఏం చేస్తున్నారు?" ఆతృతతో కూడిన అసహనంతో అన్నాడు శ్రీధర్.

 

    "నువ్వు అనవసరంగా కరెంట్ తీసేసి పెద్ద తప్పుచేశావు" యోగి విసుక్కున్నాడు.

 

    "అదేం...అలా?" శ్రీధర్ అర్థంకాక అడిగాడు.

 

    "ఫ్లాట్ నెంబరు 79 లోంచి ఇద్దరు వ్యక్తులు బయటకు, లోపలకు హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్ళెవరయినదీ చీకట్లో తెలీటంలేదు. ఆమె కంఠం గుర్తుపట్టగలవు కనుక- నువ్వు త్వరగా ఫ్లాట్ నెంబరు 79కి వెళ్ళటం బెటర్" అంది మదర్ మాథ్యూస్.

 

    "ఒక ఆడ, మగ తిరుగుతున్నారు. దీన్ని బట్టి అపరిచితురాలికి ఆల్ రెడీ పెళ్ళయిపోయి వుండవచ్చని నా అనుమానం. పెళ్ళికాకపోతే, అతను ఆమె బాయ్ ఫ్రెండయినా అయివుండాలి..." సాలోచనగా అన్నాడు యోగి.

 

    శ్రీధర్ దిగ్భ్రాంతిగా యోగికేసి చూశాడు.

 

    "నాకూ అదే అనిపిస్తోంది శ్రీధర్! లేదంటే ఇంత చీకటిలో వాళ్ళు యిద్దరూ ఎలా కలుసుకున్నారు...? ఎందుకు కలుసుకున్నారు...? అదలా వుంచితే, వాళ్ళెందుకలా బయటకు, లోపలకు హడావిడిగా తిరుగుతున్నారు?" మదర్ మాథ్యూస్ కి కూడా ఏం అర్థం కావటంలేదు.

 

    ఫ్లాట్ లో వున్నప్పుడు పూజకి జీన్ పాంట్ పైన చీజ్ కాటన్ షర్ట్ వేసుకునే అలవాటుందని యోగికి, మాథ్యూస్ కి తెలీదుకనుక, చీకట్లో తిరుగాడుతున్న ఆకారాన్ని చూసి అలా వాళ్ళు భ్రమించడం శ్రీధర్ కి ఒక షాక్ లా తగిలింది.

 

    కొద్ది నిమిషాలు అతనికేం చేయాలో అర్థంకాలేదు.

 

    "తనేదో పాపం సరదాగా నీతో ఆడుకుంది. అదామె భర్తకి తెలిసుండదు. ఇప్పుడు నువ్వెళితే ఆమెకంటే నువ్వే పెద్దతప్పుచేసిన వాడివవుతావేమో...బాగా ఆలోచించుకో..." మదర్ మాథ్యూస్ ఎంతో ఆలోచించి అన్నది.


                                 *    *    *    *


    రాత్రి పన్నెండు గంటలయ్యేసరికి పూజ ఫ్లాట్ పూర్తిగా ఖాళీ అయిపోయింది.

 

    "మొత్తానికి ఒడ్డున పడ్డాం" అంది పూజ. కేండిల్ లైట్ లో ఖాళీ అయిన ఫ్లాట్ ని తృప్తిగా చూసుకుంటూ.

 

    నిర్మల కూడా ఎంతో రిలాక్స్ గా ఫీలయింది.

 

    "ఫ్లాట్ కి లాక్ చేసేయ్... నా ఫ్లాట్ కెళ్ళి పడుకుందాం. బాగా అలసిపోయాం కూడా" అంది నిర్మల.

 

    మరొక్కసారి కేండిల్ లైట్ లో ఫ్లాటంతా వెతికి, అక్కడ తనకి చెందిన ఏ వస్తువు లేదని నిర్ధారణ చేసుకుని, అక్కడే కొద్దిక్షణాలాగింది. ఆ ఫ్లాట్ తో తనకు ఏదో అనుబంధం... తన జీవిత భాగస్వామిని తన స్వంతం చేసిన స్థలమిది... తన బంగారు భవిష్యత్తుకి పునాదులు వేసిన ఫ్లాటది...ఎంతో ప్రేమగా దాన్ని నలుమూలలా తనివితీరా చూసుకుంది.

 

    ఆనందంతో ఆమె కళ్ళు చెమర్చాయి.

 

    ఆమె ఫీలింగ్స్ ని అర్థం చేసుకున్న నిర్మల మౌనంగా వుండిపోయింది.

 

    సరీగ్గా అదే సమయంలో-

 

    శ్రీధర్ మాథ్యూస్ ఫ్లాట్ నుంచి పూజ ఫ్లాట్ కి బయలుదేరాడు. బయలుదేరే ముందు అతన్ని మాథ్యూస్ ఆపి, తన పలుకుబడితో ఫ్లాట్స్ మేనేజర్ నుంచి తీసుకున్న పూజ ఫ్లాట్ సెకండ్ కీని అతనికి యిచ్చింది.


                               *    *    *    *


    మెయిన్ ఎలక్ట్రీషియన్, నలుగురు హెల్పర్స్ తో బేస్ మెంట్ లో వున్న ఎలక్ట్రిక్ సర్క్యూట్ దగ్గరకు హడావిడిగా చేరుకున్నాడు.

 

    చేరుకున్న మరుక్షణమే అతను పనిలోకి దిగిపోయాడు.