తనకు సెక్స్ కొత్తకాదు.
    
    తనకు నచ్చిన వారితో స్వర్గాల అంచుల్ని సృజించింది.
    
    తనను మెచ్చి, తనూ మెచ్చిన వారికి షాంగ్రిలాకి అర్ధం తెలియజెప్పింది.
    
    తన ఎక్స్ పోజర్ కి ఎక్స్ పోజ్ అయిన వార్ని, తన పేరు ప్రఖ్యాతుల్ని చూసి మనస్సు పారేసుకున్న వారిని, తన ఆస్థుల్ని చూసి అమితంగా ప్రేమించిన వారిని ఎందరినో చూసింది. అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్ళినప్పుడు తన హోటల్ సూట్ ముందు తారట్లాడిన దర్శకుల్ని, నిర్మాతల్ని, నటుల్ని, ఫైనాన్షియర్స్  ని ఎంతమందినో చూసింది.
    
    కాని... తను మనస్సు పడి, మోజుపడి కోరుకున్న వ్యక్తి మాస్టర్...అతను తననిప్పుడు కలవబోతున్నాడు ఎలా...? తన చుట్టూ పెట్రోలింగ్ చేసే తన కమెండోస్ ని, తనను కంటికి రెప్పలా చూసుకొనే మిల్లర్ ని ఏమార్చి ఎలా కలువగలడు....? అది సాధ్యమా?
    
    ఆమెలా ఆలోచిస్తున్నంతలో తిరిగి మాటలు వినిపించాయి. "మాస్టర్ బయలుదేరాడు. మీ బాడీగార్డ్ ని వెనక్కి పంపించి తిరిగి గుడి వెనక్కి వచ్చి ఇక్కడే కూర్చోండి. మాటలు వినిపించిన వైపుకు చూడకండి. అది అనవసరంగా ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది."
    
    తల వెనక్కి తిప్పి చూడాలన్న తన ఉత్కంఠను నిగ్రహించుకొని వడివడిగా గుడిముందుకు వెళ్ళింది మృదుల.
    
                                                    *    *    *    *    *
    
    "మనకు ఆప్తుడు- మన శ్రేయోభిలాషి- మాస్టర్ మనమిలా చేస్తే అతనికేదన్నా ప్రమాదం జరిగితే....?" మాస్టర్ డ్రస్ లో కమెండోస్ కి కనిపించేలా విండో దగ్గర కూర్చున్న యువకుడు ఒకింత భయాన్ని వ్యక్తం చేస్తూ అన్నాడు.
    
    "మాస్టరేం చిన్నపిల్లవాడు కాదు. తనకిష్టమైన వ్యక్తిని కలుసుకొనేందుకు అతను చాలా ఆతృత చెందుతున్నాడు. తన భద్రతా ఏర్పాట్లేవో తను చేసుకున్నాడు. జస్ట్ త్రీ అవర్స్ లో వస్తానన్నాడు గదా....? అయినా మాస్టర్ ఎలా ఉంటాడో చాలా ఎక్కువ మందికే తెలుసు. నువ్వేం వర్రీ కాకుండా అలాగే కూర్చో..." ఆ గదిలో ఉన్న మరో వ్యక్తి అన్నాడు.
    
    బెడ్ మీద అనారోగ్యంగా ఉన్న వృద్దురాలు ఆందోళనగా తన కొడుకులవేపు చూసింది.
    
                                                 *    *    *    *    *
    
    అడుగడుగునా మృత్యువు పొంచి ఉండగా...
    
    అనుక్షణం ప్రమాదం నీడలా వెంటాడుతుండగా...
    
    మాస్టర్ ఒంటరిగా, ఒక సాధారణమయిన పౌరుడిలా, బొంబాయి సిటీబస్ లో మహాలక్ష్మి టెంపుల్ కేసి సాగిపోతున్నాడు.
    
                                                  *    *    *    *    *
    
    తన బాడీగార్డ్ ని ఇంటికెళ్ళి పొమ్మని చెప్పి కారు కీ తీసుకొని తిరిగి గుడి వెనక్కి వచ్చింది మృదుల.
    
    భక్తులు పల్చగా వున్నారు.
    
    మృదుల చీర ముసుగును బిగించి పట్టుకుంటూ సముద్రంకేసి చూస్తుండగా ఒక విచిత్రం జరిగింది.
    
    సముద్రంలో దూరంగా ఒక స్టీమర్ ఆగింది.
    
    అందులోని లైఫ్ బోట్ రోప్స్ సాయంతో నీళ్ళమీదకు దిగింది.
    
    ఇద్దరు వ్యక్తులు అవే రోప్స్ సాయంతో లైఫ్ బోట్ లోకి దిగి తెడ్లు అందుకొని బోట్ ని గుడివేపుకు తీసుకురాసాగారు.
    
    వాళ్ళెవరు....? స్టీమర్ అక్కడెందుకు ఆపారు? ఒకవేళ దాన్ని మాస్టర్ పంపారా? ఆలోచిస్తున్నంతలో బోడ్ ఒడ్డుకు వచ్చింది. చిన్న చిన్న బండలు గుడి ప్రహరీ గోడకు సముద్రానికి మధ్య కనిపిస్తున్నాయి. బోట్ ని అక్కడే ఆపేసి ఒక వ్యక్తి బోట్ లోంచి దిగి తానున్న వేపుకు రాసాగాడు.
    
    మృదుల ఆశ్చర్యపోయి చూస్తున్నంతలో గుడి ముందుభాగం నుంచి పెద్దగా ఆర్తనాదం వినిపించింది. అప్పటివరకు గుడి వెనుక ఉన్న భక్తులు బిత్తరపోయి ముందువైపుకి పరుగెత్తారు.
    
    అదేదో ప్లాన్ గా జరిగినట్లు మృదుల సస్పెక్ట్ చేస్తుండగా "మాస్టర్ మిమ్మల్ని తీసుకురమ్మన్నాడు. భక్తులు వచ్చేలోపు మీరు బోట్ ఎక్కాలి." అన్నాడు బోట్ లోంచి దిగి వచ్చిన వ్యక్తి తొందరచేస్తూ.
    
    ఆమెకు ఆలోచించుకొనే టైమ్ కూడా లేదు. గుడి ముందుకు వెళ్ళిన భక్తులు గుడి వెనక్కి వచ్చేలోపు ఎవరికీ అనుమానం రాకుండా అదృశ్యమైపోవాలి. కాని అతను మాస్టర్ మనిషే అని ఎలా నమ్మటం? ఆమె అలా ఆలోచిస్తుండగానే అ ఆగంతకుడు చటుక్కున చిన్నపిల్లలా మృదులను భుజంమీదకు ఎత్తుకొని వేగంగా బోట్ కేసి కదిలాడు.
    
    మృదుల షాక్ తిన్నది.
    
    జరిగిందేమిటో అర్ధమయ్యేలోపు అతను మృదులను బోట్ లోకి చేర్చటం, బోట్ స్టీమర్ కేసి కదలడం- అంతా క్షణాల్లో కలలాగా జరిగిపోయింది.
    
                                                       *    *    *    *    *
    
    "ఘట్ కోపర్ వెస్ట్ లో త్యాగరాజన్.... కొలాబా బస్ స్టాండ్ వెనుక కరీముల్లా, కస్తూరీబా గాంధీచౌక్ లో అరుణ్ మిత్రా, దాదర్ రైల్వేస్టేషన్ దగ్గర వీరాదేశాయ్ ఈ నలుగురే చట్ట వ్యతిరేకంగా అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో ఫైర్ ఆర్మ్స్ తయారుచేసేది. బొంబాయి అండర్ వరల్డ్ డాన్స్ కి, ప్రొఫెషనల్ కిల్లర్స్ కి ఆయుధాలు తయారుచేసి అమ్మేది ప్రధానంగా వీరే. మిగతావాళ్ళు కేవలం నైఫ్స్, పాయిజన్స్ తయారుచేసేవాళ్ళే- మరో ఆరుగుర్ని కూడా ట్రేస్ చేసాను. వాళ్ళు విషసర్పాల్ని సప్లయి చేస్తుంటారు. మరికొందరు డెడ్లీ డ్రగ్స్, గేస్, మార్ఫిన్, పాయిజెన్స్ ఇన్స్ లిన్స్ తయారు చేస్తుంటారు. వీళ్ళలో ఎవర్ని మీరు పాయింట్ అవుట్ చేస్తే వార్ని మరింతగా ఫాలో అయి డిటెయిల్డ్ రిపోర్ట్ అందిస్తాను సార్..." అన్నాడు సి.ఐ.డి. ఇన్ స్పెక్టర్ వినయంగా.
    
    కేవలం నాలుగురోజుల్లో అతను సేకరించిన వివరాలకు ఓబరాయ్ సంతోషించాడు.
    
    ఇన్ స్పెక్టర్ వారి అడ్రస్సులున్న ఫైల్ ని ఓబరాయ్ కి అందించి ఫర్ దర్ ఆర్డర్స్ కోసం ఎదురుచూస్తుండగా ఐనాందార్ కూడా లోపలకు వచ్చాడు.