మహిళల మనసు దెబ్బతింటోంది
ఒక పక్క ఇంటి బాధ్యతలు, మరో పక్క ఉద్యోగం. రెండింటిలోనూ మహిళలు నెగ్గుకువస్తున్నా, ఆ పోరాటంలో వారి మీద ఒత్తిడి అంతకంతకూ పెరిగిపోతోంది. అది వారి ఆరోగ్యం మీద ప్రభావం చూపుతోంది, మానసిక సమస్యలను సృష్టిస్తోంది. ఈ విషయాన్నే ప్రతిబింబిస్తోంది ఓ పరిశోధన. ఇదేదో ఆషామాషీ వ్యక్తులు సాగించిన పరిశోధన కాదు. ఇంగ్లండు వైద్య శాఖ ఆధ్వర్యంలో నడిచే National Health Service (NHS) అనే సంస్థ రూపొందించిన నివేదిక.
పరిస్థితులు విషమిస్తున్నాయి..
NHS ప్రతి ఏడేళ్లకి ఓసారి దేశంలోని పౌరుల మానసిక స్థితిగతుల మీద ఓ నివేదికను రూపొందిస్తూ వస్తోంది. అలా తాజాగా రూపొందిన నివేదికలో పురుషులతో పోలిస్తే మహిళల మానసిక ఆరోగ్యం చాలా ఆటుపోట్లలో ఉన్నట్లు తేలింది. ఉదాహరణకు 16-24 వయసు మధ్యగల పురుషులలో 9 శాతంమంది మానసిక సమస్యలతో బాధపడుతుంటే, స్త్రీలలో మాత్రం ఇది 26 శాతంగా నమోదైంది. గత నివేదికలతో పోల్చుకుంటే ఇది చాలా ఎక్కవేనట! పురుషుల మానసిక ఆరోగ్యంలో మాత్రం గతానికి ఇప్పటికీ పెద్దగా మార్పు లేదని తేలింది. ఇంకా ఈ నివేదికలో ఏమని తేలిందంటే...
- 14 శాతం మహిళలు ఒత్తిడి నుంచి నిదానంగా డిప్రెషన్లోకి జారుకుంటున్నారని తేలింది.
- 4 శాతం మహిళలు తీవ్రమైన బైపోలార్ డిజార్డర్ అనే మానసిక సమస్యను ఎదుర్కొంటున్నారట.
- 10 శాతం మహిళలు తమ మానసిక సమస్యకి చికిత్సను తీసుకుంటున్నారు.
- డిప్రెషన్లో తమకు తాము హాని కలిగించుకుంటున్నవారి సంఖ్య 19 శాతానికి చేరుకుంది.
కారణాలు లేకపోలేదు:
మునుపటితో పోలిస్తే మహిళలు మరిన్ని మానసిక సమస్యలను ఎదుర్కోవడానికి ఖచ్చితమైన కారణాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. పనిచేసే పరిస్థితులలో ఒత్తిడి పెరిగిపోవడం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు వంటి కారణాలకు తోడు లైంగిక వేధింపులు కూడా మహిళలను క్రుంగుబాటుకి లోను చేస్తున్నాయని చెబుతున్నారు. ఇక సమాజం నుంచి నానాటికీ పెరిగిపోతున్న ఒత్తిడి ఎలాగూ ఉంది. టీవీ, సినిమా, సోషల్ మీడియాలతో ఒంటరితనం తగ్గుతున్నట్లు అనిపించినా... వాటిలో చూస్తున్న దృశ్యాలు, ఎదుర్కొంటున్న కామెంట్లు మనలో ఉన్న కాస్త మనశ్శాంతినీ దూరం చేస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా విషాదకరమైన గతం ఉన్నవారిలో అవి పాతగాయాలని రేపుతున్నాయని హెచ్చరిస్తున్నారు.
మార్గాలూ లేకపోలేదు:
ఒత్తిడికి లోను చేసే పరిస్థితుల నుంచి దూరంగా ఉండటం, సరైన ఆహారం, తగిన వ్యాయామం, తరచూ ధ్యానం చేయడం, సామాజిక బంధాలను దృఢంగా ఉంచుకోవడం వంటి చర్యలతో ప్రయోజనం ఉంటుందంటున్నారు. అన్నింటికీ మించి తమ మనసులోని అలజడి అదుపు తప్పినట్లు తోస్తే తప్పకుండా వైద్యుని సంప్రదించి కౌన్సిలింగ్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
- నిర్జర.