"చూడు తరణీ... ఆఫీసులో మీ ఆయన ఆఫీసమ్మాయిల్తో ఆడుతున్న పరాచికాలు చూశావా? అవ్వన్నీ నీకిప్పుడు సరదాగానే ఉండొచ్చు. ముదిరితే మొదటింటికే మోసం వస్తుంది... అంచేత ఇవాళ్టినుంచీ నువ్వు మధ్యాహ్నం వేళ మీ ఆయనకు భోజనం పట్టుకెళ్ళు... సాయంత్రం వేళ... అలా షికార్లు వెళుతుండు" అని హితబోధ చేసింది.

 

    "అలాగే పిన్నిగారూ..." హుషారుగా అనేసి అవుట్ హౌస్ కొచ్చేసింది తరణి.

 

    ఆరోజు మధ్యాహ్నం భోజనాల సమయంలో కేరేజీతో ఆఫీసుకొచ్చిన తరణిని చూడగానే నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు ఆంజనేయులికి.

 

    ఆంజనేయుల కోసం ఒకమ్మాయి కేరేజీ పట్టుకు రావడాన్ని 'స్టాఫంతా' వింతగా చూశారు.

 

    ఫంక్షన్ దగ్గర్నించి మేరీ కూడా కన్పించడం లేదు. అందరికీ అదొక చర్చనీయాంశం అయిపోయింది.

 

    "నువ్వెందుకొచ్చావ్... ఇక్కడికి?" కోప్పడుతూనే భోంచేశాడు.

 

    "ఏం ఎందుకు రాకూడదు? మీరిక్కడా, అక్కడా భోంచేస్తుంటే, ఆరోగ్యం పాడైపోతుంది కదా? అందుకు" అనేసి వెళ్లిపోతూ...

 

    "సాయంత్రం సినిమాకెళ్దాం... రెడీగా వుండండి... అయిదు గంటలకల్లా వస్తా" అని వెళ్లిపోయింది తరణి.

 

    అవాక్కయిపోయి, అలా చూస్తుండిపోయాడు. సొంత భార్యలా దబాయించి వెళ్ళిపోతున్న తరణిని చూస్తూ.


                                                *    *    *    *


    మర్నాడు ఉదయం....

 

    తొమ్మిది గంటల సమయంలో....

 

    ఆంజనేయులు ఆఫీసుకెళ్తున్నపుడు....

 

    "సాయంత్రం వేగిరం వస్తారా? సరదాగా పార్కు కెళదాం" అంది తరణి.

 

    "అలాగే!" నవ్వుతూ అనేసి వెళ్లిపోతూ, పిన్నిగారిని ఒకసారి పలకరించాలని హాల్లోకి నడిచాడు ఆంజనేయులు.

 

    అక్కడ....

 

    తదేక దీక్షగా....

 

    భుజంగరావు గోడకు వేలాడుతున్న ఆంజనేయులు, తరణి ఫోటో వేపు చూస్తూ కనిపించాడు.

 

    పలకరిస్తే ప్రమాదమని తలచి, వెనక్కి నెమ్మదిగా జారుకున్నాడు ఆంజనేయులు.

 

    ఆంజనేయులు వెళ్ళిపోగానే అలా పక్క గదిలోంచి వచ్చిన భువనేశ్వరి భర్త దృష్టి తరణి, ఆంజనేయులు గుడిలో దిగిన ఫోటో మీద ఉండటం చూసి...

 

    "ఏంటలా చూస్తున్నారు?" అని అడిగింది.

 

    "ఏం లేదు... ఏం లేదు..." భార్యవేపు చూడకుండానే అని ముందు గదిలోకి వెళ్లిపోబోయాడు.

 

    "ఆ ఫోటో చూడగానే మీకేం జ్ఞాపకం వచ్చిందో నాకు తెలుసు... మీకు జ్ఞాపకం రావాలనే నేనా ఫోటో అక్కడ పెట్టాను" అనేసి తోటలోకి వెళ్ళిపోయింది భువనేశ్వరి.

 

    ఆమెవేపు చూస్తూ కుర్చీలో కూలబడ్డాడు భుజంగరావు. ఎంతో బాధలోనూ ఆనందంగా కనిపించే భుజంగరావు, ఆ ఫోటోను చూడగానే కలిగిన ఆనందం వల్ల బాధలోకి వెళ్లిపోయాడు.


                             *    *    *    *


    కాశీబాబు ఉచ్చులోంచి ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తోంది మేరీ.

 

    మొదటి రోజంతా ముగ్గురూ కాపలా కాశారు. రెండో రోజు మాత్రం కాశీబాబు లేడు.

 

    మూసివున్న కిటికీ సందులోంచి బయట వరండాలోకి చూసింది.

 

    "తలుపులూ... టీ కెళ్ళొస్తాను... జాగ్రత్త" అనేసి అమ్రేష్ పురి వెళ్ళడం కనిపించింది.

 

    ఇదే మంచి సమయం అనుకుని గదికి పెరడు వేపుకున్న వెంటి లేటర్ వేపు చూసింది.

 

    కొంచెం దూరంలో వున్న టేబుల్ని తెచ్చి గోడ దగ్గరగా వేసి, కిటికీ చువ్వల మీద కాలువేసి, వెంటిలేటర్ని అందుకోడానికి విశ్వప్రయత్నం చేస్తోంది మేరీ.

 

    ఎలాగైనా తప్పించుకోవాలి....

 

    ఎలాగైనా తప్పించుకోవాలి....

 

    అప్పటికే మేరీకి కొంతలో కొంత విషయం అర్ధమైంది.

 

    దాంతో మరింత సంకల్పం పెరిగింది.

 

    ఎలాగైనా తప్పించుకోవాలి....

 

    ఆఖరికి వెంటిలేటర్ కున్న చిన్న చపటాను అందుకోగలిగింది మేరీ.

 

    వెంటిలేటర్ లోంచి దూరి....

 

    పెరటివేపు ఎవరూ లేరని నిర్ధారించుకొని....

 

    వరండాలో దూకి, పిట్టగోడ నెక్కి రోడ్డు మీద కొచ్చింది.

 

    అప్పుడే కాశీబాబు ఎక్కడ నుంచో వస్తూ, అలవోకగా కుడి సందు వేపు చూసి నిశ్చేష్టుడయ్యాడు.

 

    "ఒరేయ్... తలుపులూ" గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి మేరీ తల తిప్పి చూసింది.

 

    కొంచెం దూరంలో కాశీబాబు కనిపించడంతో ఆమె గుండెలు గుబగుబ లాడాయి.

 

    ఎడమ వేపు రోడ్డు వేపుకి పరుగెత్తడం ప్రారంభించింది.

 

    "ఏయ్... ఆగు... ఆగు..." అరుస్తూ పరుగెడుతున్నాడు కాశీబాబు.

 

    అందినట్టు అంది తప్పించుకుంటూ, మలుపుల్లోకి వెళ్ళిపోతోంది మేరీ.

 

    అంతలో ఖాళీగా వస్తున్న ఆటో కనబడ్డంతో మేరీకి ప్రాణం లేచి వచ్చినట్టయింది. చేత్తోనే గాభరాగా సంజ్ఞ చేసింది.

 

    ఆటో ఆగడం, గబుక్కున ఆటో ఎక్కడం, ఆటో ముందుకు పరుగెత్తడం ఒక్క నిమిషంలో జరిగిపోయింది.

 

    అదే సమయంలో కాశీబాబు....

 

    "ఏయ్... తరణీ... ఒక్కమాట..."

 

    తరణీ అన్న మాట గాల్లోంచి వచ్చి, మేరీ చెవినబడింది.

 

    అప్పుడామెకు విషయమంతా అర్ధమైంది.

 

    అప్పుడు సమయం సరిగ్గా, సాయంత్రం అయిదు గంటలైంది.


                              *    *    *    *