"సారీ డియర్..." చుబుకాన్ని పట్టుకుని అన్నాడు.

 

    "శనివారం ఈవెనింగ్ మీ ఇంటికొస్తాను... అంతకు ముందు... నీకు ఫోన్ చేస్తాన్లే...అలాగేనా..."

 

    దారిలో ఓ హోటల్ ముందు అవినాష్ డ్రాప్ చేసి రోష్ణీ వెళ్ళిపోయింది.

 

    "ఓ.కే... అవినాష్ నువ్వు అదృష్టవంతుడివిరా... నీ తెలివితేటల ముందు ప్రపంచమే బలాదూర్ రా..." తనలో తను అనుకున్నాడు.

 

    తన, తెలివి తేటలకు తనే మురిసిపోతూ భోజనం కానిచ్చేసి రూం కొచ్చాడు.

 

    కాసేపు తనను తాను మరిచిపోయి, ఆలోచనల్ని కట్టిపెట్టేసి పడుకుని ఓ గంట తర్వాత లేచి స్నానం చేసి, సూట్ కేస్ లో బట్టల్ని, తనకు అవసరమైన వస్తువుల్ని సర్దుకుని రూంకి తాళం వేసి బయటికొచ్చి ఆటో ఎక్కాడు.

 

    తను చేయాల్సింది ఇంకో పనుంది. తన పధకానికంతా అదే మూలకారణం.

 

    "డాబా గార్డెన్స్ కి పోనీయ్..."

 

    ఆటో ఎల్.ఐ.సీ బిల్డింగ్ రోడ్డు దగ్గర మలుపు తిరిగి, డాబా గార్డెన్స్ దారివేపు వెళ్తోంది.

 

    డాబాగార్డెన్స్ పోస్టాఫీసు దగ్గర ఆటో ఆపించాడు అవినాష్.

 

    "ఐదు నిమిషాల్లో వస్తాను..." చెప్పేసి, సూట్ కేసు తీసుకుని ముందుకి నడిచాడు.

 

    ఓ ఇరవై గజాలు నడిచాక, ఓ పాతబడ్డ మేడదగ్గర ఆగాడు అవినాష్.

 

    అటూ ఇటూ చూశాడు.

 

    ఆ మేడ ముందున్న ఇనపగేటుమీద చిన్న నేమ్ ప్లేటుంది.

 

    ఆ ప్లేటు మీద-

 

    "ఎం.శ్రీధర్ ఎం.ఎస్.సి.పి.హెచ్.డి."

 

    "డ్రగ్గిస్ట్ అండ్ కెమిస్ట్" అని రాసుంది.

 

    ఒక్కక్షణం పాటు, ఆ బోర్డుమీద కన్పిస్తున్న అక్షరాల్ని చూసి నెమ్మదిగా లోపలికి నడిచాడు అవినాష్.

 

    యాభై ఏళ్ళ శ్రీధర్ హోమియోపతి మందుల్ని తయారు చెయ్యడంలో పెద్ద ఎక్స్ పర్ట్. ఆ మందుల గురించి నిరంతరం రిసెర్చిలో మునిగి తేలుతుంటాడు. తనకే మాత్రం ఒంట్లో బాగులేకపోయినా శ్రీధర్ దగ్గరికే వస్తుంటాడు అవినాష్.

 

    ప్రస్తుతం తనకు అతి ముఖ్యమైన, అత్యంత అవసరమైన 'డ్రగ్' శ్రీధర్ దగ్గర దొరుకుతుందని తెల్సు అవినాష్ కి.

 

    అవినాష్ కి కావాల్సిన ఆ 'డ్రగ్'

 

    "ఆంటీమనీ"

 

    పెను ప్రమాదకరమైన డ్రగ్ అది. కొన్ని సెకన్లలో మనుషుల ప్రాణాల్ని గాల్లో కలిపేసే విషపుమందు అది.

 

    రంగు, రుచీ, వాసనలేని ఆంటీమనీని 'హోమియోపతి'లో కొన్ని మందుల తయారీకి ఉపయోగిస్తుంటారు. ఒక్క ఆటమే ఆంటీమనీ కొన్ని వేల టాబ్లెట్లు తయారు చెయ్యడానికి సరిపోతుంది. అదే ఆంటీమనీ కొద్దిగా మోతాదు మించితే మనిషి ప్రాణాన్ని నిలువునా క్షణాలమీద తీసేస్తుంది.

 

    తిరుపతిలో గౌతమిని చంపడానికి రెండు పధకాలు ఆలోచించాడు అవినాష్.

 

    ఆ పధకాల్లో రెండవది, చివరిది 'ఆంటీమనీ' మొదటి పధకంలో ఏ మాత్రం తెలివిగా, జాగ్రత్తగా గౌతమి ప్రవర్తించినా, రెండో పధకంలో భయంకరమైన 'ఆంటీమనీ' విషంతో గౌతమి అడ్డుని తొలగించు కోవాలనుకున్నాడు అవినాష్.

 

    "హల్లో... చాల్రోజులు తర్వాత కనబడ్డావ్... రా... రా" వరండాలో కూర్చున్న శ్రీధర్ అవినాష్ ని చూసి, లేచి నిలబడి ఆహ్వానించాడు. 'కూర్చో' పక్కనే ఉన్న ఓ కుర్చీని చూబెట్టాడు.

 

    "ఏదో బిజినెస్ లో పడ్డాను... చాలా బిజీగా ఉన్నాను... అయినా ఆరోగ్యం కూడా బాగుంది..." నవ్వుతూ అన్నాడు అవినాష్.

 

    కాసేపు ఇద్దరూ కబుర్లాడుకున్నారు.

 

    "కాఫీ తాగవా మరి..." శ్రీధర్ లేస్తూ అన్నాడు.

 

    "తాగుతాను కానీ... మీకెందుకు శ్రమ..." అని అవినాష్ కూడా లేచాడు.

 

    "నేనేమాత బ్రహ్మచారినైనా, నీ కాఫీ నీచేత చేయిస్తానేమిటోయ్..." నవ్వాడు శ్రీధర్.

 

    "గదిలో కూర్చో... రా..." అంటూ శ్రీధర్ లోన వంటగది వేపు నడిచాడు.

 

    వరండా దాటాక చిన్నగది. ఆ గదిలో గోడకి ఒకపక్క చిన్న కేబిన్ ఉంది. ఆ కేబిన్ లో చిన్న చిన్న అరలున్నాయి. ఆ అరల్లో పరుసగా ఉన్న సీసాల్లో తనకు కావాల్సిన 'డ్రగ్' ఉంటుందని అవినాష్ కి తెల్సు.

 

    వంటగదిలో శ్రీధర్ స్టవ్ వెలిగించిన చప్పుడు, గిన్నెలో నీళ్ళు పోస్తున్న చప్పుడు విన్పిస్తోంది.

 

    వంటగదివేపు ఒకసారి చూసి అవినాష్ చటుక్కున ఆ కేబిన్ దగ్గరగా వెళ్ళాడు.

 

    గబాగబా అతని చూపులు సీసాల మీదున్న 'లేబిల్స్' మీద పరుగెడుతున్నాయి.

 

    మెరుపులా కదుల్తున్న అవినాష్ చూపులు ఒకచోట ఆగిపోయాయి.

 

    అదృష్టం అతన్ని చూసి నవ్వి నట్లయింది. ఆ చిన్న కేబిన్ లో ఎడం పక్క రెండోవార చిన్న సీసా కన్పించింది. ఆ సీసాను గబుక్కున తీసుకుని దానిమీదున్న లేబిల్ ను స్పష్టంగా చూశాడు.

 

    'ఆంటీమనీ'

 

    వెంటనే అవినాష్ ఆ సీసాను తన ఫేంటు జేబులో పెట్టేసాడు.

 

    మరుక్షణం గబాగబా వెనక్కొచ్చి, యధాస్థానంలో కూర్చున్నాడు.

 

    అంతా సక్రమంగా జరుగుతున్నందుకు అవినాష్ కి చాలా ఆనందంగా ఉంది. ఆ ఆనందం నిండిన అతని ముఖం ప్రసన్నంగా ఉంది.

 

    అదే క్షణంలో కాఫీ కప్పుల్తో వంటగదిలోంచి బయటకు వచ్చాడు శ్రీధర్.

 

    ఒక్క క్షణం పాటు అవినాష్ గుండె ఝల్లుమంది.

 

    శ్రీధర్ తనని చూసాడేమోనన్న భయం అతన్ని ఆవహించింది.