ఎక్కువ చదువుకాకపోయినా ఆమెలోని వివేకం గొప్పది. బ్రతకాలంటే కొన్నిసార్లు మనసుని చంపెయ్యాలేమో!
    
    అనసూయ భుజం మీద చెయ్యేసి "రిలాక్స్.... ఆయన బుద్ది సరైనది కానప్పుడు నువ్వుకాకపోతే ఇంకొకళ్ళు నీ స్థానంలో వుండేవారు..." ఓదార్పుగా అన్నాను.
    
    "కానీ నేనెప్పుడూ ఆయన కుటుంబ జీవితానికి అడ్డుగా వెళ్ళలేదు. సుమతీ!" ఆమె కన్ ఫెషన్ గా ఏడుస్తోంది.
    
    అక్కడ ఆవిడ ఎంతగా బాధపడుతుందో పాపం! ఎవరు మాత్రం ఈ లోకంలో ఆనందంగా వుండగలుగుతున్నారు?
    
    బయట షాపింగ్ కాంప్లెక్స్ లలో నుండి పెద్ద పెద్ద పాకెట్లు పట్టుకుని నవ్వుతూ చీకూ, చింతా లేనట్లు కబుర్లు చెప్పుకుంటూ పోతున్నారు జనం. ఆపి అడిగితే ఒక్కొక్కళ్ళూ ఒక్కొక్క కథ చెప్తారు.
    
    అనసూయ నా స్నేహితురాలు కాబట్టి ఆమె చేసిన పని న్యాయం అయిపోతుందా!
    
    ఎందుకు ఒక పురుషుడు ఒక స్త్రీతో, ఒక స్త్రీ ఒక పురుషుడితో సంతృప్తిపడి కట్టుబడి బ్రతకలేకపోతున్నారు? ఈ మాంగల్యం మంత్రాలూ, మనుధర్మాలు.....సమాజం పెట్టే ఆంక్షలూ ఎందుకు వీళ్ళని ఆపలేకపోతున్నాయి? ప్రకృతి శాపమా లేక చెరిగిపోతున్న హద్దులా?
    
    నా దృష్టి అప్పుడే డోర్ తీసుకుని లోపలికొస్తున్న ఒక జంట మీద పడింది. ఆశ్చర్యంగా చూస్తుండిపోయాను.
    
    అనసూయ ఏడుస్తూనే ఇంకా ఏదో చెపుతోంది. కాసేపటికి నేను వినడంలేదని గ్రహించి కళ్ళు తుడుచుకుని "ఏమిటీ! అలా చూస్తున్నావు?" అంది.
    
    "ఆ మూల టేబుల్ దగ్గర కూర్చుంటున్న వాళ్ళెవరో తెలుసా?" అడిగాను.
    
    "ఎవరూ? జంట భలేగా వుంది" అంది.
    
    "అతను మా ఆడబిడ్డ భర్త.... డాక్టర్ వినోద్."
    
    "ఆవిడ మీ ఆడబిడ్డా?"
    
    "అయితే నాకీ ఆశ్చర్యం ఎందుకూ?" అన్నాను.
    
    "అనసూయ కుతూహలంగా చూసి ఒకళ్ళని ఒకళ్ళు చూపులతోనే తాగేస్తున్నారే! ఈ విషయం జయంతికి తెలుసా?" అంది.
    
    "తెలియకూడదు!" అన్నాను.
    
    "ఏం?"
    
    "బాధపడుతుంది."
    
    అనసూయ విచిత్రంగా నాకేసి చూసింది.
    
    "జయంతికి బుద్ది రావాలని అనుకున్నాగానీ, ఈ విధమైన బాధ ఆమెకి కలగాలని నేనెన్నడూ అనుకోలేదు. అసలు ఏ స్త్రీకీ ఇలాంటి విషయాలు భర్త గురించి తెలియకూడదు. అదెంత నరకంగా వుంటుందో నాకు తెలుసు."
    
    "మరి అలాంటి పెంకి పెళ్ళాలతో ఎవరు మాత్రం వేగుతారు? అప్పటికీ అతను చాలా ఓర్పు పట్టే వుంటాడు" అంది అనసూయ.
    
    "ఆ ఎక్స్ యూజ్ నేనొప్పుకోను. అతని వ్యక్తిత్వం దృఢంగా వుండివుంటే జయంతి ఇలా తయారయ్యేదికాదు. ఎవరో ఒకళ్ళు డామినేట్ చెయ్యగానే అవతలి వాళ్ళు మన కర్మ ఇంతే అని సరిపెట్టేసుకుని, లొంగిపోయి కొంతకాలం అయ్యాక తమ హక్కులకోసం తిరుగుబాటుగా ఇలాంటి పనులు చెయ్యడం తప్పు. అనసూయా... నీకు కొడుకు కాకుండా ఒక కూతురుండి వుంటే రేపు ఆ వచ్చే అల్లుడు ఎలాంటివాడు అవుతాడో అని నువ్వు ఎంత మధనపడేదానివో ఆలోచించు" అన్నాను.
    
    "కొడుకున్నా బాధే! వాడు నా మొగుడులాంటివాడు అవుతాడేమోనని" అంది విరక్తిగా.
    
    ఎప్పుడూ అంతే! తాడుకి ఆ చివరా ఈ చివరా ముడులే! మధ్యలోనే పువ్వులు గుచ్చుకుంటాం. ఆ సువాసనలు వాడిపోనంతసేపూ ఆహ్లాదంగా వుంటాం. పెళ్ళయితే ఒక బాధ... పెళ్ళికాకపోతే ఒక బాధ! పిల్లలు పుఇద్తే ఒక బాధ.... పుట్టకపోతే మరీ బాధ. ఎన్నో బాధల సంగమం ఈ జీవితం. ఆ హార్టికల్స్ అన్నీ దాటి పందెంలో విజయం సాధిస్తే లభించేదే సంతోషం.
    
    "ఈ ఆశ్రమాలు కట్టుకుని సంసారాల్ని త్యజించిన బోధ గురువులు కూడా ఇలామ్టి బాధలు కలవారే తెలుసా? సామాజిక కట్టడుల నుండి తప్పించుకోడానికి ఇలాంటి మార్గాలు ఎన్నుకుంటారు" అంది అనసూయ.
    
    "అని నువ్వెలా చెప్పగలుగుతున్నావు?"
    
    "మా చిన్నప్పటి మాష్టారొకాయన ఇల్లు పట్టించుకోకుండా పెళ్ళాన్ని పట్టించుకోకుండా మరో పంతులమ్మ వ్యామోహంలో వుండేవాడు. ఆ పంతులమ్మకీ మొగుడూ, పిల్లలూ వున్నారు. ఇటు ఈయన ఆలిపోరు భరించలేకపోయాడు. లేచిపోదామంటే సమాజానికి బయపడాల్సొస్తోంది. చివరికి ఒక రోజు ఆయన సన్యసించానంటూ ఆత్మానందస్వామి అనే పేరుతో ఒక ఆశ్రమం స్థాపించాడు. పంతులమ్మ కూడా సన్యసించానంటూ వెళ్ళి ఆయన దగ్గర 'మాతాజీ'గా స్థిరపడింది. ఆయనకి భార్యాపిల్లల జంజాటం, ఆవిడకి భర్తపిల్లల గొడవా అన్నీ తప్పాయి. సమాజం తప్పు పట్టలేదు. ఇప్పుడు మూడు వందల ఎకరాలు స్వాధీనం చేసుకుని, బోలెడుమంది శిష్యులతో ఆధ్యాత్మిక బోధనలతో, కలర్ టీవీ, వీ.సీ.ఆర్ లతో, మారుతీ కార్లతో రంజుగా వున్నారు. ఇండియా....ది లాండ్ ఆఫ్ సైంట్స్" అంది.
    
    నాకు నవ్వూ, బాధా ఒకేసారి కలిగాయి. ఇటువంటి వాళ్ళవల్ల నిజమైన స్వాముల్నీ, యోగుల్నీ కూడా నమంలేకపోతున్నాం. మానవుడి తెలివివల్ల విపరీతాలూ.... వినాశానాలే ఎక్కువగా జరుగుతున్నట్లున్నాయి. హర్షద్ మొహతాలూ.... వీరప్పన్ లూ..... లోకాన్ని 'ఉల్లూ' లని చేసే రామన్ పిళ్ళైలూ.....తీవ్రవాద నాయకులూ తమ తెలివితేటల్ని లోకకళ్యాణంక్సోం వినియోగిస్తే....ఎంత బావుండ్నూ? వందమంది మదర్ థెరిస్సాలవల్ల జరిగే లోకోపకారాలకన్న ఒక స్వార్ధపరుడివల్ల జరిగే నష్టం ఎక్కువ!
    
    "నేను పచ్చి బాలింతగా వున్నప్పుడు నా బాబుకి ఒక పాలడబ్బా కొనడానికి నాకు స్తోమతలున్నా నేనీదరి తొక్కేదాన్ని కాను..." అంది గిల్టీగా అనసూయ.
    
    "పాలడబ్బా వచ్చాకా చీరలూ, ఆ తర్వాత నగలూ, వుండడానికో ఇల్లూ....ఇలా అవసరాలూ, మన సిద్దాంతాలూ పెరుగుతూనే వుంటాయిలే అనసూయా....మనం ఆఫ్ట్రాల్ మానవులం. రూల్స్ నిర్మించేదీ మనమే, కూలగొట్టేది మనమే." అన్నాను.
    
    అనసూయ రెండు చేతుల్లో మొహం దాచుకుంది.
    
    "ఏం చేసినా ఏడుస్తూ చెయ్యకు. నీవల్ల కనీసం నువ్వయినా సుఖపడాలిగా" అన్నాను.
    
    "ఔను!" ఒప్పుకుంది.
    
    మేం బయటికి వస్తూండగా వినోద్ వైపు చూశాను. అతనూ నన్ను చూశాడు. తల తిప్పుకుని వచ్చేశాను.
    
    భార్యకు భయపడేవాడూ, భార్యని లెక్కచెయ్యనివాడూ కూడా సందు దొరికితే ఇదే పని చేస్తున్నారు. స్త్రీని ప్రేమిస్తారు. కానీ ఆమె పర స్త్రీ అయివుండాలి.
    
                                                              * * *
    
    ఆ రోజు శుక్రవారం తలంటు పోసుకుని తులసికోటలో నీళ్ళుపోశాను. మన పెద్దలు చేశారు కాబట్టి అదో ఆచారంగా చేస్తారు చాలామంది కానీ నాకు తులసి అంటే ఇష్టం. తప్పుచేసిన భర్తని క్షమించకుండా దండించిన ఒకే ఒక్క పురాణ స్త్రీ తులసి. అందుకే నాకు ఆరాధన! భక్తిగా నమస్కరించి చెంపలేసుకుని లోపలికొచ్చాను.