"ఎన్నాళ్ళుంచో వస్తాను, వస్తానని... ఇన్నాళ్ళకు వచ్చినందుకు థాంక్స్. ఏం తీసుకుంటారు? "కాఫీ, టీ, 'ఆర్మి'" కళ్ళు చిత్రంగా తిప్పుతూ అంది మాథ్యూస్.

 

    "కాఫీ, టీ తాగను కానీ 'మీ' అంటే ఎప్పుడూ తాగలేదే... ఏమిటి అది?" అమాయకంగా అన్న ఆంజనేయులు మొహంవేపు చూస్తూ పడీ పడీ నవ్వింది మేరీ మాథ్యూస్.

 

    "మీకెవరండీ ఆంజనేయులు అని పేరు పెట్టింది? అసలు మీ ఏజ్ ఎంతండి..." అనుకుంటూ బెడ్ రూమ్ లోకెళ్ళి డ్రెస్ ఛేంజ్ చేసుకుని వచ్చి ప్రక్కన కూర్చుంది.

 

    "మిమ్మల్ని ఏడిపించడానికి 'ఛేజ్' నవల పేరు చెప్పాను... అంతే. నిజమనుకున్నారా?" నైటీ వేసుకున్న మాథ్యూస్ వేపు చూడాలంటే సిగ్గుగా వుంది ఆంజనేయులికి. చీరకట్టుకున్న ఆడవాళ్ళవేపు తప్ప, మరో రకం డ్రస్ వేసుకున్న వాళ్ళవేపు చూడాలన్నా, మాట్లాడాలన్నా ఇష్టముండదు ఆంజనేయులికి.

 

    "మీ ఫ్లాట్ బాగుంది... ఇంటీరియర్ డెకరేషన్ కూడా బాగుంది వెళతాను" లేచి నిలబడ్డాడు.

 

    "అప్పుడేనా...? వంట చేసేస్తాను భోంచేసి వెళుదురుగాని" అంది ఆమె.

 

    "లేదు మాథ్యూస్... వెళ్ళాలి. ఈ సారి... ఈసారెప్పుడైనా..." అడుగు ముందుకేశాడు ఆంజనేయులు.

 

    "ఇంట్లో పెళ్ళామున్నట్లు ఏమిటా హడావుడి?" అంటూ ఆంజనేయులు చెయ్యిపట్టి లాగింది మేరీ.

 

    తూలి ఆవిడమీద పడిపోబోతూ, నిలదొక్కుకుని కోపంగా ఆమె వేపు చూశాడు.

 

    "ఏం... నా చెయ్యి తగిలిందని కోపమా? ఆడపిల్ల చేయి తగిలితే కోపంగా చూసేవాళ్ళను మిమ్మల్నే చూశాను..." నిష్టూరంగా అంది మేరీ మాథ్యూస్.

 

    "చేతులు, కాళ్ళూ తగిలించుకోవటం మా ఇంటా వంటా అలవాటు లేదు" బుంగమూతి పెడుతూ అన్నాడు.  

 

    "అలవాటు లేకపోతే పోయింది కానీయండిగానీ... మిమ్మల్ని మా యింటికి ఎందుకు పిల్చానో తెల్సా... ఇది ఆఫీసు కాదు... ఇక్కడెవరూ లేరు కాబట్టి మొహమాట పడకుండా చెప్పండి... నేనంటే ఇష్టముందా లేదా?" అడిగింది.

 

    మేరీమాథ్యూస్ అలాంటి ప్రశ్న వేస్తుందని ఊహించలేదు ఆంజనేయులు.

 

    "ఇష్టం లేకపోతే నేను మీ యింటికి వచ్చేవాణ్నే కాదు" అన్నాడు ఆంజనేయులు.

 

    "ఇంటికి రావడం అంటే, పోస్టుమాన్ కూడా యింటికి వస్తాడు... అలాంటిది కాదు... నేనంటే ప్రేముందా లేదా... నాక్కావల్సింది అది... చెప్పండి"

 

    ఒక్కక్షణం సూటిగా మేరీ కళ్ళల్లోకి చూశాడు ఆంజనేయులు.

 

    "మగవాళ్ళయినా, ఆడవాళ్ళయినా సరదాగా ఉండేవాళ్ళంటే నాకు యిష్టం. అలాగే మీరూను... అంతే"

 

    "ఆ ఇష్టాన్ని ప్రేమగా మార్చుకోవచ్చేమో"

 

    "లేదు... ఇష్టం అనేది డబ్బింగ్ సినిమా కాదు... తమిళంలోంచి తెలుగు, తెలుగులోంచి హిందీలోకి మార్చుకోవడానికి... మిస్ మాథ్యూస్! మీ భావం నాకర్థమైంది. చాలాసార్లు మీరు ఇన్ డైరెక్ట్ గా అడిగారు సారీ... వస్తాను"

 

    "ఒక్క నిమిషం... ఒక్క ప్రశ్నకు జవాబు సూటిగా చెప్పండి... మీకు కావాల్సిన ఆడపిల్ల లక్షణాలు నాలో లేవా...?"

 

    చటుక్కున ఆ సమయంలో ఆంజనేయులికి తరణి జ్ఞాపకం వచ్చింది. తను ఇష్టపడేది తరణి లాంటి అమ్మాయిని. తను అభిమానించేది తరణి లాంటి అమాయకమైన అమ్మాయిని. తను ప్రేమించేది తరణి లాంటి మాయా, మర్మం తెలీని అమ్మాయిని.

 

    "ఇలాంటి ప్రశ్నకు నేను జవాబు చెప్పగలిగే స్థితిలో లేను... వస్తాను" విసురుగా నడుచుకుంటూ గుమ్మం వరకూ నడిచాడు.

 

    "ఓ.కే. ఆంజనేయులుగారూ... నా మీద మీకు ప్రేమ లేకపోయినా మీ మీద నాకు అంతులేని ప్రేముంది. మీతో కలిసి జీవితాన్ని పంచుకోవాలనే ఆశ వుంది... ఆ ఆశ నెరవేర్చుకోవడానికి మరి కొంతకాలం ఎదురు చూస్తాను. ఇప్పటికే నాకు మా అమ్మగారి అనుభవాల వల్ల మగజాతి మీద అసహ్యం పెరిగిపోయింది. మీలాంటివాళ్ళని చూస్తున్నప్పుడల్లా మగవాళ్ళందర్నీ ద్వేషించాల్సిన అవసరం లేదనిపిస్తుంటుంది... నా మీద నాకు అపారమైన నమ్మకం పెరుగుతుంటుంది. టేక్ యువర్ ఓన్ టైమ్... నా గురించి మరొక్కసారి ఆలోచించండి."

 

    గబగబా నడుచుకుంటూ బయటికొచ్చేశాడు ఆంజనేయులు. పెనం మీద నుంచి, పొయ్యిలో పడినట్టయింది ఆంజనేయులు పరిస్థితి. రోడ్డుమీద కొచ్చి బస్టాపులో నిలబడ్డాడు.

 

    అయిదు నిమిషాల తర్వాత బస్సెక్కాడు. బస్సెక్కగానే ఆంజనేయులు కండక్టర్ ఎవరో అని వెతికాడు. తనని చూడగానే 'మండిపడే' కండక్టర్ కాదు.

 

    హమ్మయ్య... ఇన్నాళ్ళకు తన మనసు హాయిగా వుంది.

 

    బస్సు ఎటో వెళ్ళిపోతోంది... ఆ విషయమే కండక్టర్ ని అడిగాడు.

 

    "డీజిల్ అయిపోయింది సార్... డిపోకెళ్ళి పోదాం"

 

    పది నిమిషాల తర్వాత డిపోలో బస్సాగింది. పెట్రోలు కార్యక్రమం తర్వాత బస్సు కదిలింది.

 

    కదిలిన బస్సులోకి ఎక్కిన మారిన కండక్టరు ఆంజనేయుల్ని చూడగానే "నేనీ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నానంతే" అంటూ క్రిందికి దిగిపోయాడు.


                               *    *    *    *


    మరుసటిరోజు ఉదయం ఆంజనేయులు ఆఫీసుకి బయలుదేరుతుండగా, భువనేశ్వరీదేవి వచ్చి దగ్గరలో వున్న చెట్టుచాటున దాగి చూడసాగింది.

 

    ఎందుకో తెలీదుగాని, ఇదివరకలా ఆంజనేయులు తరణిపై ఒంటికాలి మీద లేవటం లేదు.

 

    సరిగ్గా 9-30కి తరణి క్యారేజ్ బాక్స్ తెచ్చి ఆంజనేయులికిచ్చి "టాటా" చెప్పి లోపలకు వెళ్ళబోతుండగా... ఆంజనేయులు బయటకేసి సాగిపోబోతుండగా...

 

    "ఆగండి..." అంటూ పెద్దగా కేక వినబడింది.

 

    దాంతో ఆంజనేయులు బాంబు మీదేమన్నా కాలేశానా అని షాక్ తిని ఉన్న చోటనే శిలాప్రతిమలా బిగుసుకుపోయాడు.