గోరాశాస్త్రిగారు 'దేహదాసు ఉత్తరాలు' పుస్తకంగా రావాలనీ - వారు ముందుమాట వ్రాయాలనీ అనుకున్నారు. వారి జీవితకాలంలో వాటి ప్రచురణ జరుగలేదు. 1988లో నా షష్టిపూర్తి సందర్భంగా "దేహదాసు ఉత్తరాలు" ఆవిష్కరణ జరిగింది.
    
    వట్టికోట ఆళ్వార్ స్వామి తెలంగాణంలోని గ్రంథాలయోద్యమం నుంచి అన్ని ఉద్యమాలలో పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీ సభ్యులయి ఆంద్రమహాసభలో ప్రముఖపాత్ర వహించారు. సికిందరాబాదు ప్రజా ఉద్యమానికి ప్రముఖులు. కొంతకాలం 'పీపుల్స్ బుక్ డిపో' నిర్వహించి కమ్యూనిస్టు సాహిత్య ప్రచారం చేశారు. సికిందరాబాదులో స్నేహితుల సంఘం - గుమాస్తాల సంఘం స్థాపించి నిర్వహించారు. సికిందరాబాదులో వారు పాల్గొనని ఉద్యమం లేదంటే సహజోక్తి మాత్రం అగును.
    
    వట్టికోట ఆళ్వార్స్వామి పార్టీకి చెందిన వారయినా వారికి అతి సనాతనులయిన దీపాల పిచ్చయ్య శాస్త్రిగారితో సోదర సంబంధం ఉండేది. ఆళ్వార్ స్వామి అభ్యుదయ రచయిత అయినా సన్నిదానం సూర్యనారాయణ శాస్త్రి - ఖండవల్లి లక్ష్మీరంజనం - చలమచర్ల రంగాచార్యుల వంటి సంప్రదాయ వాదులతో సన్నిహిత స్నేహసంబంధాలుండేవి. ఆ కాలమే అలాంటిది. సిద్దాంతాలు, నమ్మకాలు, విశ్వాసాలు వేరు వ్యక్తిగత సంబంధాలకు అవి అడ్డువచ్చేవి కావు. రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి విప్లవ ప్రతీకలు కొండా వేంకట రంగారెడ్డి, బూర్గుల రామకృష్ణరావు మితవాదులు అయినా, వారు బంధువుల్లా కలిసి ఉండేవారు. చాయ్ లు తాగేవారు. భోజన భాజనాలు జరిగేవి. ఈ విషయంలో మఖ్దూంది విశిష్ట వ్యక్తిత్వం. వారు రిక్షా కార్మికులతో ఎంత కులాసాగా గడిపేవారో, నవాబులతో సహితం అంత సరదాగా గడిపేవారు. వారి కవిత్వం కూడా 'సుర్జ్ సవేరా' అరుణోదయం నుంచి 'రఖ్స్' కళలదాకా అసమాన శిల్పంతో సాగుతుంది. ఈ విషయంలో దాశరథికి, మఖ్దూమ్ కు పోలికలు కనిపిస్తాయి. "అనాదిగా సాగుతోంది - అనంత సంగ్రామం - అనాథుడికీ ఆగర్భ శ్రీమంతుడికీ మధ్య" అన్న కలంగళంతోనే "ప్రతి వికారశిలయు ప్రతిమయై వెలుగొందు - పడతివోలె కులికి వలపు రేపు అని" శిల్పిని కీర్తించారు అగ్రజులు దాశరథి.
    
    ఆళ్వార్ స్వామి తమ ప్రజా జీవితపు అనుభవాలు రంగరించి 'ప్రజలమనిషి' అనే ఉత్తమ నవల వ్రాశారు. అప్పుడే అది ప్రచురితం అయింది. వారే దానిని దేశోద్దారక గ్రంథమండలి తరపున ప్రచురించారు. "చాల భయంతో ఈ నవలను బయటికి తెస్తున్నాను" అన్నారు. ఎంచాతంటే - వారు స్వయంగా రచయిత"కారు. రచనా కళతో వారికి పరిచయం లేదు. అయితే రచనకు 'ప్రత్యేక విద్య 'అంటూ ఏదీలేదు. తొలి ఆంగ్ల నవలా రచయిత 'డెఫో' వృత్తిరీత్యా ప్రభుత్వోద్యోగి. రచయిత పండితుడుగాని - పండితుడు రచయితగాని కానవసరం లేదు. రచనకు - ముఖ్యంగా నవలా రచనకు - పరిజ్ఞానం - వ్రాయాలానే తపన కావాలి!
    
    రచన ప్రసవ వేదనలాంటిది. వేదన ఉంటే ఉద్భవిస్తుంది. అందుకే 'విద్యానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమా - నవంధ్యా జానాతి ప్రసవవేదనా' అన్నారు. విద్వాంసునికే విద్వాంసుని శ్రమ తెలుస్తుంది అని చెప్పడానికి ఉపమానంగా గొడ్రాలికి ఏం తెలుస్తాయి పురిటి నొప్పులు అన్నారు! ఎంత అందంగా చెప్పారు!!
    
    ఆళ్వార్ స్వామికి పరిజ్ఞానం ఉంది. తెలంగాణ జనజీవితం తెలియపరచాలనే తపన ఉంది. అందుకే "ప్రజల మనిషి" - ఆళ్వార్ స్వామి తొలి ప్రయత్నం అయినా - ఉత్తమ నవలగా ప్రశంసలందుకుంది.
    
    'ప్రజల మనిషి' తెలంగాణమును గురించి తెలంగాణావాడు వ్రాసిన తొలి నవల. భాస్కరభట్ల కృష్ణారావుగారు 'యుగసంధి' వ్రాసిన మాట నిజం. అందులో ప్రజాపోరాటాల చిత్రణ కనిపించదు. అది సాంఘిక నవల. తెలంగాణ ప్రజా పోరాటానికి ప్రభావితులై బొల్లిముంత శివరామకృష్ణ "మృత్యుంజయులు"; మహీధర రామమోహనరావుగారి "ఓనమాలు", "మృత్యువునీడల్లో"; లక్ష్మీకాంతమోహన్ "సింహగర్జన"లు వచ్చాయి. అయితే వాటిలో "తెలంగాణదనం" కొరవడింది. అందువల్ల "తెలంగాణదనం" తో ప్రజాజీవితాన్ని చిత్రించిన తొలి నవల "ప్రజలమనిషి" అవుతుంది.
    
    "ప్రజల మనిషి" నామీద ఎంతో ప్రభావం వేసింది. ఆ కథలో నేను కదలాడుతున్నట్లు అనిపించింది. న నవలను గురించి ఒక సుదీర్ఘం అయిన వ్యాసం వ్రాశాను. 'ఇలాంటి నవలలు రాకుంటే ముసలి నక్క నిజాం రానున్న కాలంలో ధర్మప్రభువు అయ్యే అవకాశం ఉంది; అని వ్రాశాను. ఆ వ్యాసం "అభ్యుదయ" మాసపత్రికలో వచ్చింది. అది మామయ్య - ఆళ్వార్ స్వామికి తెలియకుండా పంపించాను. మామయ్య ఆ వ్యాసం చూచి ఎంతో సంతోషించారు. "రంగన్నా నేను నిజంగా ఇంత మంచిగ రాసిన్నంటవ?" అని పొంగిపోయారు. వారిది పిల్లల మనస్తత్వం అది పట్టుకుని గంతు లేసినట్లు గుర్తు!
    
    ఒకనాడు "అమ్మడూ! కూరలు వండు కొచ్చిన, అన్నంతే - అందరం తిందాం" అని కమలతో అన్న మామయ్య మారుమాట్లాడనివ్వకుండా పళ్ళాలు - మంచినీళ్ళు పెట్టి వడ్డించారు. ఎన్నో కబుర్లతో భోజనాలు చేస్తున్నాం. ప్రసంగ సందర్భంగా సంస్కృతంలోనూ అభ్యుదయ సాహిత్యం ఉందని నేను సోదాహరణంగా వివరించాను. మామయ్య పులకించారు. "మాకంటే రాదాయె. వచ్చినోనివి ఊరుకుంటే ఎట్లా? వ్యాసం రాయి 'అభ్యుదయ'కు పంపించాం" అన్నారు. నేను వ్యాసం వ్రాసేదాకా వదల్లేదు. వలసిన పుస్తకమల్లా తెచ్చి ఇచ్చారు. "అభ్యుదయోద్యమ సాహిత్య చరిత్ర" అనే వ్యాసం 'అభ్యుదయ'లో వచ్చినపుడు మామయ్య దాన్ని అనేక మందికి చూపించారు. 'మా రంగన్నకు సంస్కృతం వచ్చు. తెలుగు వచ్చు. హిందీ వచ్చు. ఉర్దూ వచ్చు. అంగ్రేజీ వచ్చు. అన్నిట్లో రాయగలడు. మీరెవరన్న రాస్తరా?" అని, నేను సిగ్గుపడేంత బహుళ ప్రచారం చేశారు. ఆళ్వార్ అనేకమందిని రచయితలను చేశారు.
    
    మరొకనాడు 'తెలుగు రాజ్యం వచ్చిందయా! తెలుగు రచయితలున్న పట్టించుకుంటున్నడా ఎవడన్న?' అని ఆవేదన వ్యక్తం చేశారు. అంతరిస్తున్న తరాన్ని సత్కరించాల్సి ఉందని నేను సూచించాను వారికి. అది నచ్చింది. సికిందరాబాదులో మాలపల్లి రచించిన మహారచయిత ఉన్నవ లక్ష్మీనారాయణగారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంతో వావిలాల గోపాలకృష్ణయ్యగారికి కూడా ప్రమేయం ఉన్నట్లు గుర్తు.
    
    మేము సికిందరాబాదునుంచి ఉన్నవ వారిని సన్మానం ఆమోదించాల్సిందిగా వ్రాసిన లేఖ గుంటూరుకు సరిగ్గా ఉన్నవవారు పరమపదించిననాడు అందింది. ఉన్నవవారి శవం అక్కడ ఉండగానే వారి అబ్బాయి ఆ ఉత్తరం చదివారు!
    
    తెలుగు సర్కారు ఉన్నవను గుర్తించలేదు!
    
    ఎందుకండీ - తెలుగువారికి ఒక రాష్ట్రం!!
    
    ఉన్నవ సన్మానసభ సంతాపసభగా మహబూబ్ కాలేజీలో నిర్వహించాం. అయ్యదేవర కాళేశ్వరరావుగారు - ఆంధ్రోద్యమ నాయకులూ - అప్పటి శాసనసభ స్పీకర్ - అధ్యక్షత వహించారు. 'మాలపల్లెల మల్లెతోటలు మొలిపించినాడు' అనే గేయం నేను రచించి చదివాను.
    
    "మాలపల్లి" భారతదేశపు ఉత్తమ నవలల్లో ఒకటి. హిందీలో మహా నవలాకారుడు ప్రేమ్ చంద్ 'కర్మభూమి' నవలతో సాటియైంది. విచిత్రం ఏమంటే - కాశి దగ్గర ప్రేమ్ చంద్' గుంటూరులో ఉన్నవ ఒకే సంవత్సరం పుట్టారు - ఒకే రకంగా ఆలోచించారు - ఒకే రకం రచన చేశారు!
    
    ఇంగ్లండులో షేక్పియర్ 'కామిడీ ఆఫ్ ఎరర్స్' వలెనె ఆంద్రప్రాంతంలో పింగళి సూరన కళాపూర్ణోదయం రచించారు.
    
    ఆలోచనలకు దూరతీరాలు ఉండవు.
    
    ఏడవ దశకంలో ఉన్నావా వారి "మాలపల్లి"ని హైదరాబాదు ఆకాశవాణి నుండి సీరియల్ గా ప్రసారం చేయించడానికి అభ్యుదయ రచయితలం ఉద్యమం నిర్వహించాల్సి వచ్చింది!
    
    మిత్రులు - నాటక కళానిధి - అవసానదశలో పద్మభూషణ అందుకున్న A.R కృష్ణ జీవ నాటకంగా మాలపల్లికి బహుళ ప్రచారం చేసి, ప్రభుత్వాలను తలదన్నిన సేవ చేశారు.
    
    ఆళ్వార్ స్వామి నన్ను సభలకు, సమావేశాలకు తీసికెళ్ళారు. ఉపన్యాసాలు ఇప్పించారు. పెద్దల పరిచయం చేశారు. నన్ను రచనలకు ప్రోత్సహించారు. నాకు ఒక మార్గం చూపారు. 'ఆళ్వార్ లేని రంగన్న లేడు' అని అనుకునేంత సన్నిహితులం అయినాం.
    
    ఆళ్వార్ స్వామి కమ్యూనిస్టు అందువల్ల అతడు నాస్తికుడని కాదు. నాస్తికులందరూ కమ్యూనిస్టులుకారు. అలాగే కమ్యూనిస్టులంతా విధిగా నాస్తికులు కానక్కరలేదు. అతడు ఆస్తికుడనీ చెప్పలేం. అంటే నిత్యసంధ్యలు, వ్రతాలు, పూజలు, భక్తి ప్రకటన చేసేవాడు కాదు. ఆ తరం, సుమారు మాత్రం ఒక రకం అయిన హేతుబద్ద ఆలోచనా విధానంలో పెరిగింది. ఈ నాటివలె ప్రకటన భక్తి - విపరీతంగా దేవాలయాలకు వెళ్ళడం - భజనలు - స్వాములు వారి భక్తుల తండోపతండ బృందాలు అప్పుడు లేవు. ఇప్పుడు పెరిగింది కామ్య భక్తి సమాజంలోని కల్లోలాన్నీ అశాంతతను భరించలేక - కోరికలు తీరక ఆశ్రయించిన భక్తి.