"ఇంకా ఎన్నే! నే వెళ్ళి ఆడుకోవాలి!" అనే గొంతు వినిపించి అటు చూశాడు.
    
    లాగూ ఊడిపోతుండగా ఒక చేత్తో దాన్ని గట్టిగా పట్టుకుని అంటున్నాడు ఓ చిన్నపిల్లాడు.
    
    "మా బాబూ కదూ.... ఇంకో నలభై ఆరూ.... అంతే..... తిప్పరా!" అన్న స్వరం గుడిలో పరచిన నాపరాళ్ళమీద బోర్లా పడుకున్న అమ్మాయిదని గుర్తించాడు.
    
    "ఇంకా రెండే..... ఆ తర్వాత నేపోతా" వాడు ఒంగి ఆమెను పక్కకి తిప్పుతూ అన్నాడు.
    
    "అలా అనకూడదు..... మొక్కు తీరాలిగా!" ఆమె చెప్పింది.
    
    ఆమె తెల్లని పరికిణీ మీద ఆకుపచ్చ ఓణి వేసుకుని ఉంది. పచ్చని మెడమీద నుండి నడుం కిందనున్న ఒంపు వరకూ వచ్చి ఆగింది ఆమె నల్లని వాల్జెడ! ఆ జడ మొదట్లో ఒకే ఒక్క ముద్దబంతి పువ్వు స్వచ్చంగ అక్కడే పూసినట్లుగా ఉంది.
    
    కుర్రాడు త్రిప్పగానే ఆమె వెల్లకిలా కళ్ళు మూసుకునే తిరిగింది.
    
    మాధవ్ కి ఒక్కక్షణం గుండె ఎక్కడికో జారిపోయినట్లనిపించింది.
    
    నల్లని ముంగురులు పరుచుకున్న నుదురు రెప్పల మాటున విచ్చిన నందివర్ధంలా ఉంది.
    
    మూసిన కనురెప్పలు విచ్చిన కలువమొగ్గల్లా ఉన్నాయి. ఆమె కోటేరు ముక్కు చూసి సిగ్గుతో సంపెంగ ముడుచుకుంటుందేమో!
    
    ఆమె నడుము ఒంపులో నలిగినా జడని చూస్తే అలకనందా అలిగి పోతుందేమో! ఆమె ఎద పొంగులు చూస్తే....బహుశా వీటి దెబ్బకే రుష్యశృంగుడు శృంగభంగుడయ్యాడేమో అనిపిస్తోంది. పరికిణీ స్థానభ్రంశం చెందడం వలన మెరుస్తున్న నునుపైన ఆమెపిక్కలు చూసి .... గోపురం మూపునున్న బంగారు కలశాలు చిన్నబోతున్నాయేమో!
    
    మొత్తానికి ఆమె మంచి తడిపిన మల్లెపువ్వులా ఉంది.]
    
    "అబ్బా .... తిప్పరా!" అన్న మృదువైన కంఠధ్వనికి అతను ఈ లోకంలోకి వచ్చాడు.
    
    ఆమె బోర్లాపడిన ఆకు సంపెంగలా ఉంది. అంతవరకూ ఆమెను తిప్పుతున్న కుర్రాడు లేడు! ఆడుకోవడానికి వెళ్ళిపోయినట్లున్నాడు.
    
    "తిప్పరా!"ఆమె ఆయాసంతో రొప్పుతూ అంటోంది "అరవై ఆరూ ....!"
    
    మాధవ్ తన ప్రమేయం లేకుండానే ఆ సజీవ స్వర్ణ ప్రతిమవైపు అడుగులేశాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమె భుజాలు పట్టుకుని తిప్పబోయాడు.
    
    "అక్కడ కాదు.... నడుముకింద చెయ్యి వెయ్యి!" ఆమె కళ్ళు మూసుకునే అంటోంది.
    
    అతను ఆమె చెప్పినట్లే చేశాడు.
    
    "అరవై ఏడూ!" ఆమె రెండు చేతులూ చాచి వాటిని జోడించి తిరుగుతూ అంది.
    
    అతని వేళ్ళ కొనలనుండి విద్యుత్తు శరీరమంతా ప్రవహిస్తుండగా అదో రకమైన అలౌకికానందస్థితిని అనుభవించాడు.
    
    ఆమె మళ్ళీ వెనక్కి తిరిగింది.
    
    అతను ముందుకి తిప్పాడు.
    
    అనుకోకుండా కోదండరాముడికి కలిసి చాలా ప్రదక్షిణాలు చేశారు.
    
    కోటలో కొలువున్న తులసమ్మ గుంభనంగా నవ్వి ఊరుకుంది.
    
    గూట్లోని సంజెదీపం పరంజ్యోతిలా ఇద్దర్నీ కళ్ళారా చూస్తూండి పోయింది.
    
    "అమ్మయ్యా! ... నూరు! ... ఒరేయ్! నూరుపొర్లు దండాలూ అయిపోయాయిరా! నీకు జీళ్ళు కొనిపెడతాలే!" అంటూ ఆమె కళ్ళు తెరిచింది.
    
    మరుక్షణంలో భయంతో శిలాప్రతిమలా బిగుసుకుపోయింది.
    
    మాధవ్ చిరునవ్వుతో, విచ్చుకున్న ఆమె అందమైన కనులనే రెప్పవాల్చక చూస్తున్నాడు.
    
    'ఎవ్వెటెవీ పర్వతమున కే మేని గోరి వచ్చిన వన దేవతవో శారదవో రతి పతి పంచిన మాయవో తపస్సారమవో' అన్న పోతనా మాత్ముడి పద్యం అందుకో బుద్ధయింది అతనికి. అల్లరిగా ఆమెను ఆపాదమస్తకం పరిశీలిస్తున్న అతని కళ్ళు 'కరికుంభముల బోలె డీ గురు కుచములను వెదకి చూసినకాని కనబడని నీ తను మధ్యమున నిరతము ఎట్లు నిలుపుకుంటివో లతాంగీ!' అని అడుగుతున్నాయి.
    
    రాధ ఒక్కసారిగా స్పృహలోకి వచ్చినదానిలా లేచింది. ఆమె పాదాల మీదున్న వెండి పట్టీల మువ్వలు ఒక్కసారిగా కదలి అతని గుండెని జల్లుమనిపించాయి.
    
    అదురుతున్న పెదిమలను అదిమిపెట్టి బెదురుతున్న కనురెప్పలను సుతారంగా ఎత్తి అతని వైపు చూసింది రాధ.
    
    యుద్దసమయంలో ప్రతాపం చూపడానికి వేగిరపడే వీరజవానులా మన్మథుడు వీరావేశంతో విల్లు నెక్కు పెట్టి వారిపై సూటిగా సుమబాణాలు సంధించాడు.
    
    'కంఠేకాలునిచేతం, గుంఠితుడగు టెట్లు మరుడు కుసుమాస్త్రంబుల్ లుంఠించి గుణ నినాదము, ఠంఠమ్మన చాల నేసె ఠవ ఠవ గదరన్' అన్నంత ధాటిగా వచ్చి మాధవ్ ని తాకగా అతను నిలదొక్కుకోవడం చాలా కష్టమైపోయింది.
    
    అరిటాకంత సుకుమారమైన హృదయం కల రాధ పరిస్థితీ అలాగే మారింది. తల వంచుకోగానే వదులుగా ఉన్న జడపాయలు ఆమె చెంపని కారు మొయులులా కమ్మేశాయి.
    
    అనాలోచితంగా మాధవ్ చేతి వేళ్ళు వాటిని సవరించాయి. ఏదో అద్భుత దృశ్యం చూస్తుండగా అడ్డం వచ్చిన ఆకుల గుబురులను తొలగించినంత యాంత్రికంగా ఆ పని చేశాడు.
    
    తెర తొలగింది.
    
    నివేదన పూర్తయింది.
    
    పూజారి గంట మోగించాడు.
    
    రాధ మొహం రసరాగ రంజితమైంది.
    
    మాధవుడు మందహాస వదనారవిందుడయ్యాడు.
    
    ఆమె లేచి పరికిణీ కుచ్చెళ్ళు కాళ్ళకి అడ్డంపడుతుండగా తత్తరపడి వడివడిగా గర్భగుడి ముందుకి పరుగెత్తింది.
    
    ఆమె జడలోంచి జారిన ముద్దబంతిని ముద్దుచేస్తూ దర్శనం అయినంత తృప్తిగా అతను అక్కడే ఉండిపోయాడు! కోదండరాముడికి కోటిదండాలూ!
    
                                                          * * *
    
    కొబ్బరాకు నీడల్లో ఊరు ఒదిగి పడుకుంటోంది. పాకల్లోంచి పొగలు లేచి మెలికలు మెలికలుగా తిరిగి ఆకాశంలోని మేఘాలతో కలిసిపోతున్నాయి. ప్రశాంతతని భంగపరుస్తూ పక్షులు గూళ్ళు చేరుతున్నాయి. కునుకు తీస్తున్న ఇల్లాలు ఇంటికొచ్చిన చుట్టాలను చూసి హడావుడిపడుతూ లేచినట్టుంది మర్రిచెట్టు!
    
    మాధవ్ బురదలో కూరుకుపోతున్న పాదాలని ఎత్తెత్తి వేస్తూ జాగ్రత్తగా నడుస్తున్నవాడల్లా చివ్వున పైన బురద చిమ్మడంతో తల తిప్పి చూశాడు. పక్కనుండి ట్రాక్టర్ వెళ్ళింది. తెల్లని షర్టుమీద పిచికారీతో కొట్టినట్లు బురద చిమ్మింది. చూసుకోకుండా నడవడం తనదే తప్పు అనుకున్నాడు. పెద్దనాన్న ఇల్లు ఎవరినైనా అడగాలి అనుకుంటూ చుట్టూ చూశాడు. రచ్చబండ దగ్గర గుంపుగా కూర్చున్న జనం కనిపించారు. జేబులోంచి కర్చీఫ్ తీసి చెంపకి అంటిన బురద తుడుచుకుంటూ అటుకేసి నడిచాడు.