ప్రస్తుతం గౌతమి ఫోటోగ్రాఫర్ కోసం ఎదురు చూస్తోంది.

 

    హోటల్లో ఏం జరిగిందో ఫోటోగ్రాఫర్ ద్వారా తెల్సుకోవాలి...

 

    అయిదు నిమిషాల తర్వాత ఫోటోగ్రాఫర్ మధు హోటల్లోంచి బయటికొచ్చాడు. అతన్ని చూసి బస్టాపు దగ్గర్నించి నడిచి ముందుకొచ్చింది గౌతమి.

 

    మధు ఆటో ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు.

 

    ఆ సమయంలో వెనకనుంచి పిలుపు విని.

 

    తనవేపే వస్తున్న ఆ అమ్మాయిని చూశాడు. వెంటనే గుర్తుపట్టాడు.

 

    "నేనెవరో మీకు తెలీదు... అలాగే మీరెవరో నాకు తెలీదు... కానీ ఇంతకుముందే అవినాష్ అనే వ్యక్తి మీతో హోటల్లో మాట్లాడ్డం చూశాను. అంచేత మీరు నాకు హెల్ప్ చేస్తారని వచ్చాను..." గౌతమి చెప్పింది.

 

    "మీ పేరు నాకు తెలీకపోయినా... మీరెవరో నాకు తెల్సు... మిమ్మల్ని నేను తిరుపతిలో చూశాను."

 

    ఆ మాటకు గౌతమి ఆశ్చర్యపోయింది.

 

    అంటే...

 

    ఆలోచించడానికి ప్రయత్నించింది. కానీ ఆమె ఆలోచనకు ఏమీ అందలేదు.

 

    "రండి... ఆటో ఎక్కండి... నా స్టూడియోకెళ్ళి మాట్లాడుకుందాం" నవ్వుతూ ఆహ్వానించాడు మధు.

 

    గౌతమి అతన్నేవీ అనుమానించకుండా ఆటో ఎక్కింది.


                             *    *    *    *


    గౌతమి చెప్పిన కధనంతా నిశ్శబ్దంగా విన్నాడు మధు.

 

    ఆమెకు జరిగిన పరాభవం విన్న మధుగుండె బరువెక్కిపోయింది.

 

    "ఇలాంటి సమయంలో మీరు కనిపించారు..." తన కంటి రెప్పలకు అంటిన తడి మరకల్ని తుడుచుకుంటూ అంది గౌతమి.

 

    మధు లేచి, ఫ్రిజ్ లోని నీళ్ళను గ్లాసులో పోసి ఇచ్చాడు గౌతమికి.

 

    "నువ్వు నాకు తెల్సని ఎలా అన్నానో తెల్సా..."

 

    తెలీదన్నట్టుగా తలూపింది గౌతమి.

 

    మధు డార్క్ రూంలో కెళ్ళి కొన్ని ఫోటోలు తెచ్చి ఆమె ముందు పెట్టాడు.

 

    "నిన్ను కొండమీదకు తీసికెళ్ళి, అక్కడనుంచి కిందకు తోసెయ్యడానికి ప్రయత్నిస్తున్న సమయంలో తీసిన ఫోటోలివి..." ఆ ఫోటోల్ని పరీక్షగా చూస్తోంది.

 

    తను లోయలోకి చూస్తున్నప్పుడు, వెనకనుంచి లేచిన అవినాష్ చెయ్యి- కొంచెం ముందుకి లేవడం- ఆ తర్వాత పైకి లేవడం- తన మెడ వెనక్కి రావడం- ఆగిపోవడం- కిందకు నెమ్మదిగా దిగిపోవడం. తర్వాత హోటల్లోంచి కాటేజ్ కి వస్తున్న సమయంలో తీసిన ఫోటో చూపించాడు మధు.

 

    "తర్వాత మళ్ళీ అవినాష్ భీమిల్లో కన్పించాడు. అప్పుడు ఇంకో అమ్మాయితో- అప్పుడు నేను అతన్ని స్పష్టంగా గుర్తుపట్టాను. అవినాష్ మీద అనుమానం కలిగింది. అందుకే వాడికి ఆ ఫోటోలు పంపి, బ్లాక్ మెయిల్ చేశాను, వాడు నా దగ్గరకు కాళ్ళ బేరానికొచ్చాడు" చెప్పాడు మధు.

 

    "అమ్మా గౌతమి నా దగ్గర్నించి నీకే సహాయం కావాలో అడుగు... నిరభ్యంతరంగా చేస్తాను. నేను నిజానికి బ్లాక్ మెయిలర్ని కాను... వాడికి బుద్ధి చెప్పడానికి వాడి అసలు స్వరూపం తెల్సిన వ్యక్తి ఒకడున్నాడని చెప్పడానికీ నేనీ పని చేశాను..." చెప్పడం ఆపాడు మధు.

 

    "నేను వంటరిగా బతుకుతున్నాను. నా అనేవారు ఎవరూ లేరమ్మా. నన్ను అమితంగా ప్రేమించే నా వాళ్ళు నాకు దూరమయ్యారు."

 

    తన నేపధ్యంలోకి వెళ్ళిపోయాడు. పది నిమిషాల తర్వాత "సారీ! గౌతమి... నువ్వు బాధపడకు. ఇవాల్టి నుంచి నువ్వు ఒంటరిదానివి కావు... నువ్వు నా చెల్లివమ్మా... నిన్ను తల్లిని చేసి వెళ్ళిపోయినా వాడి అంతు నేను చూస్తాను. ఆడపిల్లలు నిరాశతో బతక్కూడదమ్మా. నీకు పుట్టే బిడ్డకు ఈ మామయ్య ఉన్నాడు. కంగారు పడకు..."

 

    మధు గుండె లోతుల్లోంచి వస్తున్న ఆ మాటలు గౌతమి కళ్ళంట కన్నీళ్లు తెప్పించాయి.

 

    "అవినాష్ రోష్ణీ ఫోటోలు నాక్కొన్ని కావాలి..." గౌతమి అడిగింది.

 

    "నీకెన్ని ఫోటోలు కావాలన్నా ఇస్తాను... నా చెల్లికి ద్రోహం చేసిన వాడు క్షణకాలం భూమ్మీద ఉండకూడదు..." అంటూ లోనకెళ్ళి ఒక కవరు తెచ్చి గౌతమికి ఇచ్చాడు.

 

    ఆటోలో హాస్టల్ వరకూ వచ్చి గౌతమిని దిగబెట్టి వెళ్ళిపోయాడు మధు.

 

    "వస్తానమ్మా..." అని వెళ్ళిపోతున్న మధు దేవుడికి నమస్కారం పెట్టినట్టుగా ఆమె నమస్కరించడం మధుకి తెలీదు.

 

    గౌతమిని చూడగానే చనిపోయిన తన చెల్లె కళ్ళెదురుగా వచ్చి నిలబడినట్టయిందని చెప్పడానికి మధు సంకోచించాడని గౌతమికి తెలీదు.


                                       16


    గౌతమిని ఎలాగైనా చంపాలి. నలభై ఎనిమిది గంటల్లో ఆమె శవాన్ని తను చూడాలి.

 

    కానీ తన చేతికి నెత్తురు అంటదు. తన ప్రమేయం ఉండకూడదు...

 

    అందుకు తను ఎవర్ని లోబరుచుకోవాలో, వాళ్ళద్వారా ఆ పనికి ఎలా చేయించాలో పథకం సిద్ధం చేసుకుని బయల్దేరాడు అవినాష్.

 

    అవినాష్ ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల్ని కలవడానికి బయల్దేరాడు. మొదటి వ్యక్తి సిస్టర్ దయ. రెండో వ్యక్త ఇఉమేన్స్ హాస్టల్లోని హెడ్ కుక్ వీరయ్య... మూడోవ్యక్తి - ఉమెన్స్ హాస్టల్లోని పనిమనిషి సీతమ్మ.

 

    అప్పటికి సమయం సాయంత్రం ఆరుగంటలైంది. డాబా గార్డెన్స్ లోని గర్ల్స్ హైస్కూలు కెదురుగా ఉన్న వీధిలోకి నడిచాడు అవినాష్.

 

    రెండో మలుపులో ఆరో ఇంటి ముందు ఆగాడు. అదో నాలుగిళ్ళ చావడి. రెండో పోర్షన్లో ఉంటోంది సిస్టర్ దయ. ఆమెకో నలభై ఏళ్ళుంటాయి. పిల్లలు లేరు. కాలింగ్ బెల్ నొక్కాడు. రెండు క్షణాల్లో తలుపు తెరచుకుంది.

 

    "మీరా" సిస్టర్ దయ అవినాష్ ని పోల్చుకుంది, రెండుమూడుసార్లు గౌతమితోపాటు అవినాష్ ని చూసిందావిడ.