"అదికాదండి... ఆఁ" గుర్తుకొచ్చింది "మేడమ్" అన్నాడు.

 

    "దట్స్ గుడ్... ఫర్వాలేదు. ఆలస్యంగానైనా నీ బుర్ర పనిచేసింది."

 

    "ఏంటి మేడమ్... తమరికొచ్చిన కష్టమేటి" మారుతీ కారులో వచ్చినవాళ్ళ కష్టాలు తీర్చకపోతే తమ ఉనిక్కి అర్థంలేనట్టు చాలా భక్తితో అడిగాడు.

 

    "మరేంలేదు... ఓ అబ్బాయి కనిపించటంలేదు."

 

    "హన్నన్నాన్న.. తమరి..." అబ్బాయేనా అనబోయి తర్వాత అది మరే ఉపద్రవానికి దారితీస్తుందో అన్న బెంగతో "అదేనండి తమరికేమవుతాడండి... అబ్బాయిగోరు" అన్నాడు.

 

    "చెప్పను. అసలు నీకు చెప్పాల్సిన అగత్యం నాకులేదు. ఎందుకో తెలుసా?"

 

    "తెలీదండీ."

 

    "పోనీ బెర్నార్డ్ షా నీకు తెలుసా?"

 

    కొద్దిగా ఆలోచనలో పడ్డాడు హెచ్.సి. ఈమధ్య కాలంలో అలాంటి పేరుగల క్రిమినలెవరైనా స్టేషనుకొచ్చారా అని గుర్తుచేసుకుంటూ "చూసినట్టు గుర్తులేదండి" అనేశాడు.

 

    "అందుకే అన్నాడు."

 

    "ఎవరండి."

 

    "బెర్నార్డ్ షా."

 

    "ఏమన్నాడండి."

 

    "కామన్ సెన్స్ యీజ్ వెరీ అన్ కామన్."

 

    "ఎందుకన్నాడండి."

 

    "మీలాంటి పోలీసుల్ని చూసి."

 

    "అయితే" స్పురించేసింది హెచ్ సికి. "ఆ పెద్దమనిషా అమ్మ యిప్పుడు తప్పిపోయింది?"

 

    "మరేం"

 

    "అయితే కంప్లెయింటిచ్చేయండి."

 

    "పట్రా కాగితం" సాధికారంగా అడిగేసరికి ఇలా ఆదేశాలు జారీచేయడం నచ్చకపోయినా బహుశా ఆ బెర్నార్డ్ షా ఏ ఎస్పీగారికి బంధువో అయితే అనక బోలెడన్ని చిక్కులొచ్చేఅవకాశముందని కాగితం పెన్ను అందించేశాడు.

 

    రెండునిముషాలలో చకచకా రాసేసి కాగితాన్ని టేబుల్ పై వుంచి "మీ ఎస్సై పేరేంటన్నావు" అంది.

 

    "ఇంకా నేనేమీ అనలేదుగాని ఇప్పుడంటానండి. యశస్విగారని... మా చెడ్డమనిషండి. యిప్పుడు తప్పిపోయిన అబ్బాయిని మరో గంటకల్లా పట్టిస్తారండి. ఆయనేమో మరో గంటకల్లా వస్తారండి. మరింకేమన్నా చెప్పమంటారాండి..."

 

    "చెప్పండి" అంటూ లేచింది" ఈ కంప్లయింటుని ఆయనకీ అందచెయ్యి."

 

    "అలాగేనండి"

 

    "అండీ అంటే కుదరదు. కంప్లయింట్ చదివి వెంటనే రంగంలోకి దిగెయ్యమను. లేకపోతే..." ఆగి "పాడేరెప్పుడైనాచూశావా" అంది.

 

    "హమ్మో... తెలీకపోవడమేంటండి ... అడవి ప్రాంతమండి. పైగా అక్కడ పులులూ, ఎలుగ్గొడ్లు ఎక్కువండి " అన్నాడు.

 

    "అదిగో... అక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించేస్తానని చెప్పు."

 

    హరిత చకచకా వెళ్ళి మరో రెండు నిముషాలలో కోపంగా మారుతిలో కూర్చున్నాక గుర్నాధం అనుకున్నాడు. "పెద్దింటి బిడ్డలాగుంది కాబట్టి పోయిన అబ్బాయిని పట్టుకోగలిగితేతప్ప పాడేరు తప్పద"ని.

 

    మరో అయిదు నిముషాలలో బుల్లెట్ పై స్టేషన్ కొచ్చిన యశస్వి తన సీటులో కూర్చుని రేక్ లోని పావని మరణానికి సంబంధించిన ఫైల్ అందుకుని ఎఫ్.ఐ.ఆర్.ని చూస్తున్నాడు.

 

    తన ఇన్వెస్టిగేషన్ ఎక్కడనుంచి ప్రారంభించాలో అప్పటికే నిర్ణయానికి వచ్చేశాడు.

 

    మరో పదినిముషాలలో తుంపాల గ్రామానికి వెళ్ళాలి.

 

    దోషులుండే వ్యక్తుల్ని కలియకుండా నానీని కలిసి మరికొన్ని వివరాల్ని సేకరించాలి.

 

    "అయ్యా" హెచ్.సి. పిలిచేసరికి ఫైల్లోనుంచి తలెత్తకుండానే "ఊ" అన్నాడు.

 

    యశస్వి అలా ఊ కొట్టడంలోని సీరియస్ నెస్ కి గుర్నాధం ఎంత కంగారు పడ్డాడూ అంటే అసలుసంగతి మరచిపోయి "పా... పాడేరండి... మరీ బేడ్ ప్లేస్ బాబూ" అన్నాడు తొట్రుపాటుగా.

 

    "ఏం... ట్రాన్స్ ఫరార్డర్స్ వచ్చాయా?" అడిగాడు ఫైలులోకి చూస్తూనే.

 

    "అయ్యా... వచ్చేట్టున్నాయండి."

 

    "ఎవరికి?"

 

    "తమరికే."

 

    కోపంగా తలెత్తాడు. ఇలాంటి సమయంలో డిపార్టుమెంటులో పేరుకు పోయిన వేలాదిమంది వెర్రివెంగళాయిల్లో ఒకడైన గుర్నాధం తన సహనాన్ని పరీక్షించడం అతనికి నచ్చలేదు.

 

    "వాట్ డు యు మీన్."

 

    "అయ్యా... కోపమొద్దండీ. ఒక అమ్మాయిగోరండీ... కారులో వచ్చారండీ. అయినా అది మనకెందుకండీ. వచ్చేక తమరిని అడిగారండి. మనకెందుకులే అని వూరుకోంగదండీ. వస్తారని చెప్పానండి. వెంటనే ఓ అబ్బాయి తప్పిపోయాడూ అనేసి రిపోర్టు రాసినారండి. అమ్మాయైతే గొప్పింటిబిడ్డలా బాగున్నారండీ. అయితేమాత్రం అవన్నీ మనకెందుకండీ. అందుకే కాగితం, పెన్నూ చెతికందించానండీ. రాసేశాక వెంటనే అబ్బాయి ఆచూకీ తెలియపరచకపోతే పాడేరులాటి ట్రాన్స్ ఫర్ల గొడవలు జరిగిపోతాయని చెప్పారండి" యశస్వి ఉగ్రరూపాన్ని భరించలేనట్టు వణికిపోతూనే "అయినా మనకెందుకులే అని వూరుకోలేం కదండీ. నేను మీకు చెప్పానండి" అన్నాడు రిపోర్టుని అందిస్తూ.

 

    సాలోచనగా పేపర్ లోకి చూశాడు యశస్వి. "ఎత్తు ఆరడుగులుంటాడు. స్ఫురద్రూపి తెలుగునవల్లోలా. చెప్పాచేయకుండా కలలోకివచ్చి అదీ నా పర్మిషన్ లేకుండా నానారకాలుగా నన్ను బాధపెట్టి ఇంకా ముద్దులవీ పెట్టి చట్టానికి అప్పచెబుదామనుకుంటుండగా తప్పించుకుపోయాడు. నాకు గుర్తున్నంతవరకూ నా శీలం కాపాడుకున్నాననే అనుకుంటున్నాను. ఎలాగైనా అతన్ని, అదే ఇరవైనాలుగు గంటలుగా కలలోకి రాకుండా తప్పించుకు తిరుగుతున్న ఆ పెద్దమనిషిని పట్టుకోమని ఆదేశిస్తున్నాను" ఇంగ్లీష్ లో రాయబడిన ఆ వాక్యాలు చూస్తూ క్రమంగా మొహం వివర్ణం కాగా ఉక్రోషంగా కాగితాన్ని చింపేయబోతూ టక్కున ఆగాడు చివరివాక్యాన్ని చూసి.

 

    "ఇంతకీ ఆ కనిపించని పెద్దమనిషి పేరు చెప్పనేలేదు కదూ. ఎప్పుడూ డ్యూటీ అంటూ ఇలాంటి బ్యూటీకి దూరమయ్యే యశస్వి అనే పోలీస్ ఆఫీసర్."