"కనెక్షన్ ఊడిపోయిన కారు సయిరన్ లా ఎందుకలా మీద బడతావు వస్తావా, లేదా!"

 

    "కారు సయిరన్ ఎక్కడన్నా అరుస్తుందా, మీద పడుతుందా పావు బ్రెయిన్ కాణా...?"

 

    "ఓరి నాయనో... ఇక నావల్ల కాదు... మా అమ్మకు నేనొక్కడ్నే కొడుకుని నువ్విలాగే మాట్లాడితే నాకు పిచ్చెక్కటం ఖాయం. నన్ను ఒదిలెయ్యి గురుదేవా" అన్నాడు డ్రయివర్ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ.

 

    "నువ్వు నాదగ్గరెప్పుడు చదువుకున్నావు...?"

 

    "నేనా... మీ దగ్గరా...? నేనెప్పుడన్నాను...?"

 

    "ఇప్పుడేగా గురుదేవా అన్నావు"

 

    "ఇంకేం అననయ్యా... అన్నీ సైగలే చేస్తాను" అంటూ ఆ డ్రైవర్ వచ్చి కారులో కూర్చుంటారా అన్నట్టు సైగలు చేశాడు.

 

    "ఆ సైగలేమిట్రా... ఆదివారం మధ్యాహ్నం టీవీలో వార్తలు చదివినట్టు...?"

 

    "మరింకెలా చావను..." అంటూ డ్రైవర్ తన తలను టేక్సీ కేసి కొట్టుకున్నాడు.

 

    ద్వారబంధంలో వున్న వ్యక్తి ఏదో అనేలోపు లోపల నుంచి ఓ యువతి వచ్చి "ఇక వదిలేయండి నాన్న- లేదంటే ఇటు నుంచి ఇటే ఎర్రగడ్డ కెళ్ళేలా వున్నాడు." అనడంతో ఆయన తలపంకించి లోపలకు నడిచాడు.

 

    మరో రెండు నిమిషాలకు ఆ ఇంట్లో వున్న నలుగురూ వచ్చి టేక్సీ ఎక్కారు.

 

    డ్రైవర్ భయం భయంగా వచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చుని ఇంజన్ స్టార్ట్ చేశాడు.  

 

    "ఓరేయ్ పిచ్చికాణా..." అంటూ కారు బేక్ సీటులో కూర్చున్న ఆ వ్యక్తి ఏదో అనబోయేసరికి డ్రైవర్ ఇంజన్ ఆఫ్ చేసి కారు దిగి వెళ్ళి పక్కనే వున్న ఇంటి అరుగు మీద కూర్చున్నాడు.

 

    "ఇక మీరు నోరు తెరిస్తే నేనీ టేక్సీ అయినా వదిలేసి పారిపోతాను గాని మిమ్మల్ని తీసుకెళ్ళను. అంతే..." అన్నాడు మొండిగా ఆ డ్రైవర్.

 

    మొత్తానికి మరో రెండు నిమిషాలకు టేక్సీ బయలుదేరింది.


                                                         *    *    *    *


    "కంపెనీ పరిస్థితిని వివరించేందుకు నాగమ్మగారు సామంత్ ని ఎస్టేట్ కి రమ్మని కబురెట్టింది. బహుశా ఈపాటికి బయలుదేరి వుండవచ్చు. మీరు మీరనుకున్న వ్యక్తులు సిద్ధమేనా...?" అన్నాడు సెక్రటరీ వాచీ కేసి చూసుకుంటూ.

 

    "ఆ... సిద్ధమే... వీళ్ళు వస్తున్నట్లు వచ్చే ముందు ఫోన్ చేయమని కనకారావు చెప్పే వుంటాడు. వీళ్ళింకా ఫోన్ చేయలేదేమిటి...?" అన్నాడు పీటర్ ఫోన్ కేసి చూస్తూ.

 

    సరీగ్గా అదే టైమ్ లో ఫోన్ రింగయింది.

 

    "సామంత్ తండ్రి దగ్గర్నుంచే ఫోననుకుంటా- వెళ్ళి లిఫ్ట్ చేయి కనకారావు" అన్నాడు పీటర్.

 

    ఆ మాటలు వింటూనే ప్రక్కలో బాంబు పడ్డవాడిలా ఎగిరిపడ్డాడు కనకారావు.

 

    లాభం లేదనుకొని పీటర్ ఫోన్ ఎత్తాడు. "హలో... ఎవరు మాట్లాడేది... సామంత్ ఫాదరేనా...?" పీటర్ ప్రశ్నించాడు ఫోన్ లో.

 

    "అవును... నువ్వెవడివిరా కొంకిరి కాణా...?" ఫోన్ కి ఆవేపు నుంచి వినిపించడంతో పీటర్ ఉలిక్కిపడ్డాడు. ఫోన్ మౌత్ పీస్ మీద చేయి అడ్డం పెట్టి-

 

    "ఆయనేమిటి... కొంకిరికాణా అంటాడు. అదేం భాషా...? అలా అంటే ఏమిటర్థం." అన్నాడు పీటర్ కనకారావుకేసి అర్థం కానట్టు చూస్తూ.

 

    ఒక్కసారి పెద్దగా పిచ్చి నవ్వు నవ్వాడు కనకారావు. అలాగే కొద్దిసేపు నవ్వి చటుక్కున ఆగిపోయి "కొంకిరికాణా అంటే మంగోలియన్ గోబీ భాషలో బుద్ధి తక్కువ వెధవా అని అర్థం" అన్నాడు ఇక నవ్వే ఓపిక లేక ఆయాసపడుతూ.

 

    "వీడెవడు నన్ను అలా అనడానికి...? కాలో, చెయ్యో తీయించేస్తాను" అన్నాడు పీటర్ కోపంగా.

 

    "నువ్వే కాదు... వాడినోరు ముందు బి.బి.సి. అయినా, ఆల్ ఇండియా రేడియో అయినా, లక్ష మైకులైనా సద్దుమణగాల్సిందే. నేనూరికనే భయపడ్డాననుకున్నారా? అమ్మో వాడి ముందుకు నేను రాను. వాడు బయలుదేరే వుంటాడు. అందుకే ఫోన్ చేసుంటాడు. మీరు మీరు చూసుకోండి" అంటూ కనకారావు భయం భయంగా వెనక్కి వెళ్ళి గోడను కరుచుకుపోయాడు బల్లిలా.

 

    "ఏరా పిక్కిరి బాలిగా... మాట్లాడవేం...? మేం బయలుదేరాం. ఇంకాసేపట్లో మీ ఎస్టేట్ లో వుంటాం. వస్తున్నామని మా అబ్బాయికి చెప్పు. అర్థమయిందా అరకాలు వెధవా...? వినపడిందా పావు బ్రెయిన్..." పీటర్ ఇక ఆపైన వినలేక ఫోన్ కట్ చేసేశాడు.

 

    "వాడెవడయ్యా బాబు... వాక్యానికో పిచ్చి తిట్టు తిడుతున్నాడు...?" పీటర్ తలపట్టుకుంటూ అన్నాడు.

 

    "ఇప్పుడర్ధమయిందా... ఈ మధ్య నేను పగలే ఎందుకు మందు కొట్టేది...?" అంటూ తనను తాను సమర్ధించుకున్నాడు కనకారావు.


                                *    *    *    *


    సరిగ్గా 11-45 నిముషాలకు టేక్సీ ఎస్టేట్ లోకి ఎంటరయింది. అప్పటికే సామంత్ బంగ్లాలోకి వెళ్ళిపోయాడు.

 

    టేక్సీ వచ్చి అర్జునరావు రెసిడెన్స్ ముందాగింది.

 

    పీటర్ టేక్సీ దగ్గరకు వెళ్ళి ఆ నలుగురిని కారు దిగి లోపలకు రమ్మని చెప్పి ముందుకు నడిచాడు.

 

    మరో నిమిషానికి నాగమ్మగారి దగ్గరకు వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేయాల్సింది, ఎవర్ని గుర్తించాల్సింది, సామంత్ ని తమతో ఎలా తీసుకువెళ్ళ వలసింది - అన్నీ వివరంగా చెప్పాడు.

 

    "మావాడు ఇక్కడేం చేస్తున్నాడు-?" సామంత్ తండ్రి ఆ చుట్టుపక్కల పరిసరాల్ని ఆశ్చర్యంతో గమనిస్తూ అడిగాడు.

 

    "చాలా ప్రమాదకరమైన పనులే చేస్తున్నాడు. మీరు వెంటనే మీ కొడుకుని మీతో తీసుకువెళ్ళకపోతే అతని ప్రాణానికే హాని జరగవచ్చు" భయపెడుతున్నట్టుగా అన్నాడు.

 

    కనకారావు పక్క గదిలోనే వుండి తెరచాటు నుంచి భయం భయంగా సామంత్ తండ్రికేసి చూస్తున్నాడు.

 

    ఈరోజుతో సామంత్ ఆట కట్టయిపోతుంది.

 

    బహుశా ఇదంతా సామంత్ ఊహించలేక పోవచ్చు. ప్రమాదం తన తల్లిదండ్రుల రూపంలో, తమ్ముడు, చెల్లి రూపంలో ముంచుకు రానున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోను పసిగట్టలేడు- అర్జునరావు తన పథకం పారబోతుందనే ఆనందంలో వున్నాడు.

 

    తమ రెండవ పథకమన్నా బాంబులా పేలితే బావుండన్న ఆశతో ముందు అర్జునరావు మెయిన్ హౌస్ కేసి వెళ్ళిపోయాడు.

 

    "చెప్పినవన్నీ గుర్తున్నాయిగా...?" పీటర్ ప్రశ్నించాడు.

 

    "మా బిడ్డ మాకు గుర్తుండడా..." మధ్య వయస్కుడు చిరాకు పడ్డాడు.