లేవబోతున్న సుబ్బారాయుడు మళ్ళీ కూర్చుని "నీ చేతుల్తో ఆ తల్లిని పెళ్ళికూతుర్ని చెయ్యనివ్వకుండా అడ్డుపడ్డ నామీద కోపంగా వుందా పార్వతి?" అన్నాడు.
    
    పార్వతమ్మ మాటాడకుండా లేచి వెళ్ళిపోయింది.
    
    ఊళ్ళో జనానికీ గుళ్ళో దేవుడికీ క్షణం తీరుబడి లేకుండా ఉంది. దేవుడి పెళ్ళికి అందరూ పెద్దలే! బుజ్జిగాడి దగ్గర్నుండి వాతలతాతయ్య వరకూ అందరికీ ఏదో ఒకపనే! వంచిన హరివిల్లులా ఉన్నారు ముగ్గులు పెట్టి కోవెలని అలంకరిస్తున్న కన్నెపిల్లలు, తోరణాలు కడుతున్న కుర్రకారు. రామయ్యకి తోడు పెళ్లికొడుకుల్లా మురిసిపోతున్నారు. ప్రతి ఇల్లాలూ సీతమ్మకి తల్లయి పెళ్ళిపనులు చేస్తుంటే, ప్రతి గృహస్తూ పట్టాభిషేకం చేసుకోబోతున్న కొడుకుని చూసి సంబరపడుతున్నట్టు రామయ్యని చూసి పొంగిపోతున్నారు.
    
    మాధవ్ సిటీనుండి పిలిపించిన మ్యూజిక్ పార్టీ దిగింది. పున్నయ్య గారి తోటబంగళాలో బస ఏర్పాటు చేశారు.
    
    ప్రకాశానికి బోలెడు హడావుడి. హార్మోనియానికి అరక్షణం ఖాళీలేదు. మైకేల్ జాక్సన్, బాలమురళి కలసి కచ్చేరీ చేస్తున్నట్లూ, ఉషా ఊతఫ్ ఊగాకుండా కూర్చుని రంబీంద్ర సంగీతం పాడుతున్నట్లూ అంతా తమాషాగా ఉంది.
    
    ప్రతి గడపనుండీ బిందెడు పానకం వచ్చి ఊరంతటినీ తీపి చేసింది. పెరళ్ళన్నీ అరటి గెలలూ, కొబ్బరి బోండాలూ పంపి గుండెలు తేలిక పడ్డట్టు ఊపిరి పీల్చుకున్నాయి.
    
    రాధ చెవులనిండా మాధవుడి ఊసులే ఊరిస్తున్నాయి. గుండెనిండా అతని ఊహలే గుసగుసలాడుతున్నాయి. ఎటుచూసినా మాధవుడే... పందిళ్ళు వేయిస్తూ, ప్రసాదాలు పంచుతూ అందరి నోళ్ళల్లో అతని పేరే నానుతూ... పెద్దరికాన్ని కండువాగా భుజాన వేసుకు తిరుగుతున్నాడు. కాసేపటికే పిల్లలతో చేరి గంతులు వేస్తూ గోటీబిళ్ళా ఆడుతున్నాడు. మరి కాసేపటికి హరిదాసుగారికి పాలూ, మిరియాలూ అందిస్తూ పురాణ కాలక్షేపం చేస్తున్నాడు. ఎన్ని చేస్తున్నా పందిట్లో బాజాల కన్నా మిన్నగా కన్నెపిల్ల మదిలో సందడి చేస్తున్నాడు!
    
    పీటలమీద కూర్చోవలసిన అక్కయ్యా, బావగార్లూ లేనందుకు శాంత కన్నీరు పెట్టుకుంది.
    
    ప్రకాశం అన్నగారు లేనిలోటు తెలియకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు.
    
                                                           * * *
    
    తలంటుపోసుకున్న రాధ నిడుపాటి కురులకి సాంబ్రాణి ధూపం వేస్తోంది శాంత. ఇంతలో ఇంటిముందు జట్కా బండొచ్చి ఆగింది.
    
    "ఎవరో చుట్టాలొచ్చినట్లున్నారూ?" అన్నాడు సన్యాసిరావు.
    
    శాంత ఆశ్చర్యంగా వీధి వాకిలివైపు చూసింది. బండి దిగుతూ వెంకాయమ్మ "దిగావే నాగూ.... నాయనా గిరీ! జాగ్రత్త అంటోంది."
    
    తల్లిని అలా అనుకోకుండా పెట్టేబేడాతో చూసి ఆమెకి నోట మాట రాలేదు. లోపలికి రమ్మనడం కూడా మర్చిపోయి చూస్తూండిపోయింది.
    
    "అక్కా! బావున్నావా.... మన వెంకటలక్ష్మి కూతురు నాగమణిని కూడా తీసుకొచ్చాం! నాగూ....! సిగ్గు పడక్కర్లేదే..... దిగు! దిగు!" అన్నాడు గిరి.
    
    నాగు బండి దిగి నాలుగు వంకర్లు తిరుగుతూ వచ్చి "పెద్దమ్మా! బాగున్నావా?" అంది.
    
    శాంత ఇంకా ఆశ్చర్యంగా బండిలోంచి దిగుతున్న సామానే చూస్తోంది. నాలుగు కావిడి పెట్టెలూ, మూడు మూత ఉన్న ఫేముబుట్టలూ, రెండు గోనెబస్తాలూ అవి చాలవన్నట్లు మూటలూనూ!
    
    "అదేవిటే... అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావు! ఊళ్ళో అడ్డమైన వాళ్ళకీ ఇన్ని జమీందారీ మర్యాదలు చేస్తున్నావు. కన్న తల్లొస్తే కాళ్ళకి నీళ్ళు కూడా అడగవేమిటే?" అంది వెంకాయమ్మ.
    
    అప్పుడే లోపలనుండి వస్తూ ప్రకాశం "రండి.... రండి.... బండి పంపించాను, ఇంకా రాలేదేమిటా అని చూస్తున్నాను! ప్రయాణం బాగా జరిగిందా?" అన్నాడు.
    
    శాంత ఆశ్చర్యం రెట్టింపై కూర్చుంది.
    
    "బావా.... నే వచ్చేశాగా! ఇంకా నువ్వు అన్ని పనులూ నామీద వదిలి నిశ్చింతగా ఉండొచ్చు!" అన్నాడు గిరి.
    
    "అమ్మా! ఇంత సామానేమిటీ? ఉత్సవాలు చూడటానికే!" నోరు పెగిలినట్లు కష్టంమీద అంది శాంత.
    
    వెంకాయమ్మ భళ్ళున నవ్వి, "అల్లుడుగారు ఆ ఊళ్ళో ఉన్న జంఝాటాలన్నీ వదిలించుకుని పెట్టేబేడా సర్దుకు రమ్మనగానే ఉన్నపళంగా వచ్చేశాము. అలా తెల్లబోయి చూస్తావేమిటే...? జరుగు... ఈ పిల్ల మీ బావగారి కూతురు కదూ! పనంతా మానుకుని పోగేస్తూ కూర్చున్నదేమిటే?" అంది.
    
    నాగు ముందుకు వచ్చి, "అమ్మో! ఎంత పెద్ద జుట్టో?" అంది.
    
    శాంత రాధకి అడ్డుగా నిలబడుతూ, "రాధా! లోపలికి వెళ్ళు తల్లీ!" అంది. బంగారంతో నలుగుపెట్టి పాలమీగడలో స్నానం చేసినట్లున్న రాధని వాళ్ళు కళ్ళింత చేసుకుని చూస్తుంటే శాంతకి భయం వేసింది.
    
    "మేమేదో అంత దూరం నుండి మీ బావగారి కూతురికి దిష్టి కొట్టడానికొచ్చినట్లు భయపడతావేమే! ఆగమ్మా.... కాస్త నిదానంగా చూడనీ....మేమూ అయినవాళ్ళమేలే!" అంది వెంకాయమ్మ.
    
    రాధ వినయంగా నమస్కరించి, "నమస్తే...రా, అమ్మమ్మా! మావయ్యా! లోపలికి రండి!" అంది.
    
    "ఇంతదాకా వచ్చి రమ్మనకపోతే అలిగిపోతామనుకున్నావా..... అయినా నా కూతురింట్లో నీ మర్యాదలేమిటే పిల్లా?" అంది లోపలికివస్తూ వెంకాయమ్మ.
    
    తాయారమ్మ మంచంలోంచే, "ఎవరే వచ్చిందీ?" అంది.
    
    "అమ్మా...! అత్తయ్యని పలకరించు!" అంది శాంత.
    
    వెంకాయమ్మ మంచం దగ్గరకెళ్ళి, "నేనే, శాంత తల్లినిలే వదినా! అసలు మీకు మేము గుర్తుంటే కదా! రూపూ రుత్తా పూర్తిగా మారిపోయాక నా కూతురికి తల్లిమీద దయ కలిగి పిలిచింది! తనిక్కడ హాయిగా భోగాలనుభవిస్తూ మేము ఎన్ని అగచాట్లు పడుతున్నామో పట్టించుకోనైనా పట్టించుకోలేదు ఇన్నాళ్ళూ! ఇప్పుడైనా మీ పెద్దబ్బాయి మిమ్మల్ని వదిలి పెట్టిపోయాడని పనికి ఆసరాగా పడుంటామని మా అల్లుడు ఉత్తరం వ్రాస్తే వచ్చాం!" అని ముక్కులు ఎగబీల్చి కొంగుతో అద్దుకుంది.
    
    తనతో మాటమాత్రమైనా చెప్పకుండా ప్రకాశం ఇంతపని చేశాడంటే శాంతకి నమ్మకం కలగలేదు!
    
    నాగు రాధ జుట్టుపట్టుకుని లాగుతూ, "కుంకుడుకాయలతోటే తలంటుపోసుకుంటావా? ఒంటికి ఏం రాసుకుంటావు?" అని అడుగుతోంది.