ఏ మలిన పడిన శరీరాన్ని నానీని కాపాడుకోడానికి అడ్డంగావుంచి తన బ్రతుక్కి ఓ అర్ధాన్ని కల్పించుకుందో ఇప్పుడా దేహాన్ని కాల్చే ఓ కట్టె తవిటయ్య చేతికందించి కాలిపోతున్న తన కళేబరానికి ఓ పరమార్ధాన్ని దక్కించుకుంది.

 

    తవిటయ్యకి తెలుసు జవసత్వాలుడిగిన తను హరి అనుచరులైన వాళ్లను ఆపలేనని. కాని నానీకి కొంతవ్యవధినిచ్చే ప్రయత్నంగా ఆ సాహసం చేశాడు.

 

    అది ఎంత ప్రమాదమో తెలుసు. కాని ఈ మరుభూమికి తను అధిపతి. ఇక్కడ తనను అభయాన్ని కోరే ఏ ప్రాణికైనా తను రక్షణ యివ్వాలి. అందులో తన ప్రాణాలు పోయినా అదృష్టవంతుడే.

 

    ఎక్కడో పుట్టి ఏ దుర్విధి వెంటాడగానో అక్కడ చేరిన ఆ చిట్టికొండ ఎంతటి జ్ఞానోదయాన్ని కలిగించాడని... తను అస్తమించినా మరొకొన్ని క్షణాలలో ఉదయించే చంద్రుడు తన కదలని కళేబరంపై వెన్నెల కురిపించి మంచుకన్నీళ్ళతో తనను తడిపి పునీతుడ్ని చేస్తాడు.  

 

    ఆ మసకచీకటి వేళ మలిగిపోతున్న ఆ అసురసంధ్యా సమయంలో తవిటయ్య అలా ఆలోచిస్తున్న సమయంలోనే హఠాత్తుగా గాలివీచిన చప్పుడు.

 

    మరుక్షణం పొత్తికడుపులో గుచ్చుకుందేదో.

 

    ఏం జరిగిందీ అతడూహించేలోగా చేతిలో కట్టె జారింది. తలపై మరేదో తాకింది బలంగా.

 

    ఓ సన్నని మూలుగుతో నేలజారాడు.

 

    దూరంగా అడవిలాంటి ప్రదేశందాకా పరుగెత్తిన నానీ ఇక కదిలే శక్తి లేనట్లు ఓ పొదమాటున నక్కి స్మశానంకేసి చూస్తున్నాడు.

 

    అక్కడ మరో తరువు నేలకూలిందని బోధపడింది.

 

    దూసుకొచ్చే చీకటి తెరల్లా కళ్ళల్లో నీటిపొరలు.

 

    వద్దన్నా ఒరిపిడితో బాధపెట్టే వెక్కిళ్ళు...

 

    ఆ స్థితిలోనూ ఆలోచిస్తున్నాడు నానీ.

 

    తనంటే ప్రాణమైన అమ్మ చచ్చిపోయింది. తన నెత్తుకుని ముద్దాడే తాతయ్య మంచంపట్టాడు. తనను కాపాడాలనుకున్న యింకో మోటార్ సైకిల్ అంకుల్ చచ్చిపోయాడు . అమ్మంత ప్రేమగా అన్నం పెట్టిన అనసూయమ్మ చచ్చిపోయింది. ఇప్పుడు విశ్శు తాతలాంటి ఇంకో తాతయ్య...   

 

    చచ్చిపోయాడు.

 

    మాసినచొక్కాతో కళ్ళొత్తుకుంటూండగా సమీపంలో యేదో చప్పుడైంది.

 

    ఉలిక్కిపడుతూ చూశాడు పామేదో అనుకుని...

 

    కాదు... మనుషులు వాళ్ళు.. తానను పట్టుకోడానికి వచ్చి తాతయ్యని కొట్టిన మనుషుల గొంతులు వినిపిస్తున్నాయి.   

 

    "గుంట నా కొడుకు... ఈ చుట్టుపక్కలెక్కడో నక్కే వుంటాడు" అంటున్నారెవరో..

 

    భయంతో మరింత ఒదిగిపోయాడు నానీ.

 

    ఆ నిశ్శబ్ద నీరవ వాతావరణంలో ఆ చిన్నిగుండె చప్పుడు తనకే స్పష్టంగా వినిపిస్తూంది.

 

    "అమ్మా" మనసులోనే అమ్మను తలచుకుని ఏడుస్తున్నాడు. "నన్ను చంపుతారంటే... అంతంత పెద్దోళ్ళు నన్ను చంపడానికొచ్చేరే... నేనేం తప్పు చేశానే?"

 

    "ముసలితొత్తుకొడుకు అడ్డమొచ్చాడుగాని లేకపోతే యీ పాటికి ఆడిశవాన్ని ఎత్తుకుని హరిబాబు దగ్గరకి తీసుకెళ్ళేవాళ్ళం. ధక్" విసుగ్గా చేతిలోని పేపర్ నేలపైకి విసిరాడు. "ఆ గుంటడ్ని చూశాక యీ ఫోటోతో పనేట్రా" నేలపై పడ్డ దినపత్రికలో మసకగా కనిపించిన తన ఫోటోని కళ్ళు చిట్లించి చూశాడు నానీ.  

 

    అదెందుకలా పడిందో అర్థంకాలేదు. కాని అదే అంతా తనను గుర్తించే అవకాశమిస్తూందని మాత్రం బోధపడిపోయింది.

 

    చుట్టూ గాలిస్తున్నారు.

 

    ముగ్గురూ పొదలన్నిటిమధ్య నడుస్తుంటే ఒకడు సిగరెట్ వెలిగించి అగ్గిపుల్ల నిర్లక్ష్యంగా విసిరాడు.

 

    అది సరిగ్గా నానీ మెడపైపడి చురుక్కుమనిపించింది.

 

    'అమ్మా' అన్నపదం బాధగా గొంతు దాటబోయింది కాని చాలా బలవంతంగా నిగ్రహించుకున్నాడు. అలా నిగ్రహించుకోవడమూ కష్టం కావడంతో కొద్దిగా వెక్కిపడ్డాడు.

 

    అదిగో అప్పుడే చూశాడు దూరంనుంచీ ఓ వ్యక్తి...

 

    ముందు అర్థంకాలేదు పొదమాటున ఒదిగివున్న ఆకారమేదో. అనుమానంగా అరవబోతూ ఆగాడు.

 

    అదే నానీ ఆ క్షణాన చేసుకున్న అదృష్టం.

 

    అవతలివ్యక్తి తేరుకుని తన సహచరుల్ని పిలిచే లోగానే నానీ పరుగెత్తాడు.

 

    ఆకలి, నిస్త్రాణ, అలసట అన్నీ మరిచిన నానీ కేవలం చచ్చిపోతానేమో అన్న భయంతో ఇంకా చావని బ్రతుకుమీది తీపితో ఎంతబలాన్ని కూగగట్టుకున్నాడూ అంటే మరో అయిదునిముషాలలో రోడ్డును చేరుకున్నాడు.

 

    చుట్టూ వున్న ఇళ్ళమధ్య అలా పరుగెత్తుతూనే ఎవరు శత్రువో ఎవరు కాపాడే దేవుడో తెలీని స్థితిలో రోడ్డువారగా వున్న ఓ షాపులో దూరాడు.

 

    ఏదో పుస్తకం చదువుతున్న షాపుయజమాని ఉలికిపాటుగా తలెత్తి ముందు కంపించిపోతున్న నానీని చూశాడు.

 

    ఎందుకొచ్చాడో అర్థంకాలేదు.

 

    కాని ఎందుకొస్తున్నాయో తెలీని కన్నీళ్ళు కనిపించాయి. వెను వెంటనే ఆ కన్నీటికి కారణమైన యమకింకరుల్లా పరుగెత్తుకొస్తున్న నలుగురు వ్యక్తులు కనిపించారు.

 

    నానీ ఎవరో ఆ వ్యక్తికి తెలీదు.

 

    కాని అప్పటికే షాపుని సమీపించిన వ్యక్తులెంతటి రాక్షసులో మాత్రం బాగా తెలుసు.

 

    క్షణాలు గడుస్తున్నాయి.

 

    నానీ గొంతునించి వెక్కిళ్ళు ఉధృతం కాసాగాయి.

 

                                    *    *    *

 

    "తిరిగొచ్చాడుగా... కనీసం చావుకబురైనా తీసుకొచ్చాడా" అంపశయ్యపై విశ్రమించిన భీష్ముడిలాంటి వేదబ్రహ్మ విశ్వేశ్వరశాస్త్రి నెమ్మదిగా మంచంపై నుంచి పైకి లేచాడు భార్య కాంతమ్మని చూస్తూ.

 

    కొన్ని రోజుల క్రితం కాలూ చేయీ ఆడక మంచంపట్టిన ఆయన ఈమధ్య మందులతోనో మానసికమైన ధ్యానంతోనో కొద్దిగా కూర్చోగలుగుతున్నాడు.

 

    కాంతమ్మ నిశ్శబ్దంగా తలవంచుకునే వుందింకా. "మీరు భోంచేయండి."