బిర్లా మనవళ్ళు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ గా పనిచేసి, అక్కడ నుంచి ఒక్కొక్క మెట్టూ ఎక్కి, ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేసి ఉన్నత పదవుల్లోకి వచ్చారు. ఇది తెలుసా మీకు? ఆలాంటి బిర్లాల డిసిప్లిన్ మనిషికి అవసరం. అమెరికాలో ఎంత పదవుల్లో వున్న ఉద్యోగస్తులైనా, తమ కొడుకులు ఖాళీగా గడపడాన్ని ఇష్టపడరు. ఏదో ఒక పార్టు టైం జాబ్ ని చెయ్యమని ఎంకరేజ్ చేస్తారు. అలాకాని పక్షంలో గార్డెనింగ్, డ్రైక్లీనింగ్, వాషింగ్, మార్కెటింగ్, హౌస్ కీపింగ్ లాంటి ఇంటి పనులను అప్పగించి, వాళ్ళు చేసే పనిగంటలకి విలువకట్టి పాకెట్ మనీగా ఇస్తారు. ఒరేయ్ తీసుకోరా బాబూ... అని ఇవ్వరు. జపాన్ అతి తక్కువ సమయంలో ప్రపంచ దేశాల్ని సాంకేతికంగా శాసిస్తున్న దశకు చేరిందంటే, దానిక్కారణం వింటే మనం ఆశ్చర్యపోతాం.

 

    జపనీస్ ఏకైక స్లోగన్ ఒకటే!

 

    'కొత్త వస్తువును సృష్టించు- కొత్త ప్రయోగాన్ని చెయ్' చిన్నప్పటి నుంచి వాళ్ళ పిల్లలకిచ్చే ట్రైనింగ్ కూడా అదే. నీ మెదడుకి, నీ దేహానికి ఎన్ని గంటలు రెస్టు కావాలో అన్ని గంటలు రెస్ట్ తీసుకో. కానీ అంతకు రెట్టింపు గంటలు పనిచెయ్యి.

 

    ఆ పని ఫలితాన్నివ్వాలి.

 

    ఏదీ? మన భారతదేశంలో ఆ కాన్సెప్ట్ ఏదీ?

 

    పనిచేసేవాడిని వెక్కిరించడం, వ్యక్తిత్వమున్నవాడిని అగౌరవపరచటం.

 

    రేపటి ప్రపంచం బాగుపడాలంటే ఇవాళ మనిషి కష్టపడాలని చెప్పడం కోసం ఎంతమంది తమ ప్రాణాల్ని ధారపోసారో గుర్తుకు తెచ్చుకుంటే, వాళ్ళ జీవితాల్లోని సంఘటనలు చదివితే చాలు ఇవాల్టి యువతరంలో సగం నిరాశపోతుంది."

 

    ఆమె చెప్తున్న దానిని నిశ్శబ్దంగా వింటున్నారు వాళ్ళిద్దరూ. మహతిలోని రేర్ క్వాలిటీస్ కి, ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలే సాక్ష్యం అనుకున్నాడు మేనమామ.

 

    మహతితో, మధుకర్ ని బేరీజు వేసుకుంటున్నాడాయన.

 

    "మధుకర్ ని నువ్వు రిపేర్ చెయ్యగలవు. ఆ పని నువ్వు చేస్తావా?" నెమ్మదిగా అడిగాడాయన.

 

    "నేనేం మెకానిక్ కాను, మధుకర్ పాడైపోయిన మిషనూకాదు. అయినా ది గ్రేట్ బిజినెస్ మాగ్నెట్ రాఘవేంద్రనాయుడుగారే వుండగా మధుకర్ ని నేను రిపేర్ చెయ్యడం ఏమిటి? ఆయనకు చాతకాదా? ఒక మనిషి బాగుపడటం అన్నది అనుభవాల మధ్యపడి నలిగిపోవటం ద్వారానే సాధ్యమవుతుంది. ప్రక్క మనిషయినా, రచయితయినా ప్రేరణ మాత్రమే ఇవ్వగలరు. లేదంటే చేతకాదని ఆయన్నే నాతో స్వయంగా చెప్పమనండి."  

 

    మేనమామ రవికిరణ్ వేపు చూసాడు.

 

    "ఆయనే నిన్ను స్వయంగా అడిగితే, మధుకర్ ని పెళ్ళి చేసుకుంటావా?"

 

    చివరి ప్రయత్నంగా అడిగాడాయన.

 

    "మధుకర్ మేనమామగారూ! మరోసారి మీకు స్పష్టంగా చెపుతున్నాను. నాక్కావలసింది డబ్బున్న ఫాదరిన్లా కాదు- డబ్బు సంపాదించగల భర్త" దృఢంగా, నిశ్చయంగా అన్న ఆ మాటతో మరేం మాట్లాడలేకపోయాడు.

 

    "నేను అనుభవజ్ఞురాలినని చెప్పడంలేదు. కానీ మధుకర్ లో నిజంగా మార్పు రావాలని రాఘవేంద్రనాయుడుగారు కోరుకుంటున్న పక్షంలో మధుకర్ ని ఇంట్లోంచి పంపెయ్యమని చెప్పండి. తన కాళ్ళమీద తను నిలబడాలని చెప్పమనండి.

 

    చేతిలో పైసా లేకుండా, స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదుగుతూ, ఒక్క తరంలో కోట్లాది సంపదను సంపాదించుకోగలిగిన సెల్ఫ్ మేడ్ మేన్ అని జనం అంటుంటే- ఆ విధంగా పైకొచ్చిన వ్యక్తి ఎంతటి గొప్ప ఆనందాన్ని, తృప్తిని, గర్వాన్ని అనుభూతినిస్తాడో... అలాగే రాఘవేంద్రనాయుడుగారు కూడా... నేను చూడకపోయినా, ఆయన్ని ప్రత్యక్షంగా కలిసి పరిశీలించకపోయినా, ఎవరయినా అలా ప్రెయిజ్ చేస్తే ఆయనా అలాగే అనుభూతిస్తారు. హీ డిజర్వ్స్ ఇట్! ఆయనకా అర్హత వుంది. కాని అయన కొడుకును మాత్రం కష్టమంటే తెలీకుండా, కందిపోతాడేమో అన్నట్లు పెంచటం పెద్ద తప్పు. రాఘవేంద్రనాయుడుగారిలాగే జెమ్ షెడ్జీ తాతా, జి.డి. బిర్లా అనుకుంటే మనదేశం పారిశ్రామికంగా ఇంత ముందంజ వేసేదా? వాళ్ళ తరువాత తరాలు కూడా కష్టపడబట్టే కదా ఈనాడు ఆ సంస్థలు అంతగా ఎదిగాయి! తను కష్టపడాలి. తను సంపాదించాలి. తను ఎదగాలి- తనను చూసి అందరూ సెల్ఫ్ మేడ్ మేన్  అని ,మెచ్చుకోవాలి. దాన్ని తలచుకొని తాను ఆనందించాలి. బాగానే వుంది. మరిదే ఆనందం, తృప్తి వారి కొడుకైన మధుకర్ కి దక్కనక్కర్లేదా? అదాన్యాయం. ఈరోజు రాఘవేంద్రనాయుడుగారు స్థాపించిన సంస్థల్లో వేలాదిమంది బ్రతుకుతున్నారు.

 

    ఆయన జవసత్వాలు వున్నంతవరకు ఆ వేలాదిమంది కుటుంబాలకు చీకూ చింతా లేదు. ఆ తరువాత తన కొడుక్కేగదా ఆ సంస్థల్ని అప్పగిస్తారు? తను సంపాదించింది గనుక ప్రేమతో తన కొడుక్కి వాటిని ధారాదత్తం చేస్తారు. వాటిని పెంచి పోషించే ఆత్మబలం లేని తన కొడుక్కి వాటిని అప్పగిస్తారు. బాగానే వుంది. మరా వేలమంది- వారి కుటుంబాల గతేమవుతుంది? ఆస్థితోబాటు ఆత్మ విశ్వాసాన్ని, క్రమశిక్షణ, శ్రమించగల శక్తిని కూడా ఆయన తన కొడుక్కి అందించకపోతే ఆ సంస్థ గతి, వాటిల్లో పనిచేసే సిబ్బంది గతేమిటి?

 

    Power in the hands of one who did't acquire it. Gradually is often fatal to success. Quik riches are move dangerous than poverty.

 

    కష్టపడి తండ్రులూ, తాతలూ సంపాదించిన డబ్బును నీళ్ళలా ఖర్చుపెట్టే యువతీ, యువకులకు జీవితం, జీవితంలో విజయాలూ దూరంలో వుంటాయి ఇది తెల్సుకోమనండి చాలు.

 

    తండ్రి ఆస్థిలోంచి, తండ్రి పలుకుబడిలోంచి, తండ్రి గీసిన వలయాల లోంచి బయటికొచ్చిన మరుక్షణం మధుకర్ లైఫ్ బాగుపడుతుందని నా నమ్మకం.

 

    ఇంతకంటే చెప్పలేనట్టుగా ఆగిపోయింది మహతి.

 

    మేనమామ, రవికిరణ్ వేపు చూశాడు వెళ్దాం అన్నట్టుగా.

 

    "ఓ.కే అమ్మా! నీ టైంని వేస్టు చెయ్యలేదు కదూ" అంటూ ఇద్దరూ లేచి గుమ్మం వరకూ వచ్చారు. వాళ్ళిద్దరిలో మేనమామవైపు చూసి నవ్వుకుంది మహతి.

 

    ఒక్కసారి ఆమె దృష్టి టీపాయ్ మీద వున్న ఉంగరం మీద పడింది.

 

    "రాఘవేంద్రనాయుడుగారూ!" ఆ పిలుపుకి నాయుడుగారు ఉలిక్కిపడ్డారు. ముందుగా ప్లాన్ ప్రకారం మధుకర్ మేనమామగా పరిచయం చెయ్యమని ఆయనే రవికిరణ్ తో చెప్పాడు.

 

    కాని మహతికెలా తెల్సింది? రాఘవేంద్రనాయుడుగారు విస్మయంగా చూసాడామెవేపు.

 

    "మీ ఉంగరం" అంది మహతి చిర్నవ్వుతో.

 

    రాఘవేంద్రనాయుడుగారికో అలవాటుంది. తను మాట్లాడుతున్నప్పుడు, తన వేలికున్న ఉంగరాన్ని బయటకు తీసుకోవటం, పెట్టుకోవటం ఆయన కలవాటు- అప్పుడప్పుడు అలా మరిచిపోవటం కూడా జరుగుతుంటుంది.

 

    "ది గ్రేట్ బిజినెస్ మేగ్నేట్ ని ఇలా చూడగలనని ఊహించనైనా లేదు. మిమ్మల్ని చూసాక నా అభిప్రాయాలు మరింత సాంద్రతను సంతరించుకుంటాయి. థాంక్యూ వెరీమచ్ సర్" అంది మహతి. అంత పెద్ద వ్యక్తిని ప్రత్యక్షంగా, అతి సమీపంగా చూడగలిగినందుకు ఎక్సైట్ మెంట్ కి గురవుతూ.   

 

                             *    *    *    *    *