కాని చాలా ప్రముఖుడయిన ఓ వ్యక్తిని సున్నితంగా శాసించిన శ్రీహర్ష సవ్యసాచి అనుచరుడి నుంచి కారు కీస్ అందుకున్నాడు.

 

    ఫ్రంట్ సీట్ లో కూచుంటూ విష్పరింగ్ గా అన్నాడు దృశ్యతో "మరోసారి నామీద ఇలాంటి ప్రయత్నం చేయొద్దని మీ డాడీకి చెప్పు. ఎందుకంటే ముద్దుకే భరించలేకపోయిన నువ్వు ఆడపిల్లకి అపురూపమైన శీలం పోతే అసలు తట్టుకోలేవు కాబట్టి."

 

    దృశ్య అప్రతిభురాలయి చూస్తుండగానే శ్రీహర్ష కారుని ముందుకు పోనిచ్చాడు.

 

    ఉన్నట్టుండి అక్కడ కలకలం మొదలయింది.

 

    సవ్యసాచి అనుచరులు శ్రీహర్షని వెంటాడాలని సిద్ధమవుతుండగా మరో కారు అడ్డంగా వచ్చింది.

 

    అది మహేంద్రది.

 

    మహేంద్ర దేశ ఉపప్రధాని కొడుకు మాత్రమేకాదు. దృశ్యకి కాబోయే భర్తకూడా.


                                   *  *  *


    అర్థరాత్రి పదకొండు గంటలు కావస్తూంది.

 

    పెచ్చులూడిన పెంకుటింటిలోని హరికేన్ లాంతరు కాంతి కాలి ఆరిన కొరకంచులా చీకటిని చీల్చే ప్రయత్నం చేస్తూంది.

 

    అప్పటికి అరగంట క్రితమే ఇంటికి వచ్చిన రాజ్యలక్ష్మి ఎప్పటిలా ఉల్లాసంగా వుందికాని అందులో జీవంలేదు.

 

    "ఆలస్యమైందేం తల్లి?" అని కళ్ళలో ఒత్తులు పెట్టుకుని ఎదురుచూస్తున్న తండ్రి ఓ అందమైన అబద్ధం చెప్పి తాత్కాలికంగా ఉపశమనాన్ని అందించింది. అంతేకాదు ఇంకా అన్నం తినని తండ్రికి బలవంతంగా తానే తినిపించి జోకొట్టి నిద్రపుచ్చింది కూడా.

 

    కమిలిన నెత్తుటి చారికలాంటి యవ్వనాన్ని మోయటం యిబ్బందిగా అనిపించిందేమో నిద్రపట్టడంలేదు.

 

    అదికాదు రాజ్యలక్ష్మిని యిప్పటికీ కలవరపెడుతున్నది.

 

    కొన్నిగంటల క్రితం బ్రతుకు గాడి తప్పింది. పూర్వం కలలేమన్నా కనడం అలవాటై వుంటే అవి చాలా దారుణంగా కనురెప్పల్ని ఉరితీసి కళ్ళలో రక్తాశ్రువుల్ని చిమ్మాయి.

 

    నీకు నేనున్నాను నాన్నా అని మాట యిచ్చినందుకు అలాగన్నా కాలిన బ్రతుకు జీవనయానాన్ని నెడుతూ బ్రతికేదేకాని తను ఎంత రాక్షసంగా కలిసిందీ దృశ్యంలా చూపించాడు మహేంద్ర.

 

    వీడియోలో అంతా చూపిస్తూ అవసరమైనప్పుడు అలా నటించకపోతే ఆ దృశ్యాన్ని ఫోటోలా తండ్రికి అందజేస్తాననీ బెదిరించాడు.

 

    అప్పుడు తెలిసింది బ్లూ ఫిలిం అంటే ఏమిటో.

 

    ఒకసారి మోసపోయినందుకు కాదు ఆ క్షణంనుంచి కలత చెందుతున్నది. జీవితమంతా తనవాళ్ళని మోసగిస్తూ బ్రతికితీరాలని అతడు శాసించినందుకు.

 

    కళ్ళలో నీరు చిప్పిల్లలేదు.

 

    చేతులు జోడించి ప్రార్థించింది తనను శాశ్వతంగా విడిచిపెట్టమని. అందరి ఆడపిల్లల్లా బెదిరించనూ లేదు. బ్రతకాలి కాబట్టి బ్రతకనివ్వమని వేడుకుంది.

 

    బదులుగా డబ్బు విసిరాడు.

 

    ప్రతిసారీ అంత డబ్బూ యిస్తానన్నాడు.

 

    కన్నె కలల్ని సమాధి చేసుకుని తనవాళ్ళకోసం పెళ్ళి చేసుకోనన్న రాజ్యం కళ్ళలో అప్పుడు నీళ్ళు నిలిచాయి.

 

    వచ్చేసింది యింటికి.

 

    ఈ రాత్రిని చూసికాదు రేపు వెలుగంటే భయమనిపిస్తూంది.

 

    "అక్కా!" పెద్ద చెల్లి దీప్తి పిలిచింది.

 

    ఉలిక్కిపడింది రాజ్యం "నువ్వింకా నిద్రపోలేదూ?"

 

    "ఏమిటదోలా వున్నావు?"

 

    "ఏం చెప్పినా నమ్మే పిచ్చి చెల్లి."

 

    "ఏమయిందే?"

 

    దీప్తి వదిలేలా లేదు.

 

    మొహానికి నవ్వుని పులుముకుంది. నిద్రపోతున్న తండ్రివైపు చూసింది కాదు, తన కళ్ళలో నీళ్ళు కనిపించకుండా అలా జాగ్రత్త పడింది.

 

    "మాటాడక్కా!" రెట్టించింది దీప్తి.

 

    "ఎన్ని బాధ్యతలమ్మా నాకు. పెళ్ళికావాల్సిన వయసులో ఎన్ని బంధాలో చూడు" చికాగ్గా కళ్ళు తుడుచుకుంది రాజ్యం.

 

    విస్మయంగా చూసింది దీప్తి. పదహారేళ్ళ ప్రాయంలో వున్న దీప్తి ఇప్పుడు అక్కలో మరో కొత్తమనిషిని దర్శిస్తూంది.

 

    "లేకపోతే మరేమిటి... అందరూ ఆడపిల్లలే పుట్టేటప్పుడు నాన్న ఓ మగపిల్లాడ్ని దత్తత తీసుకోవచ్చుగా!

 

    "అక్కా!" దీప్తి సన్నగా కంపిస్తూంది. "నేను నీ పెద్దకొడుకుని నాన్నా అంటూ బుజ్జగించేదానివిగా!"

 

    "అన్నానే కాని నేనూ ఆడపిల్లను కదే. అయినా ఇదేం జంజాటం? ఎల్లకాలం మీ అందరికోసం నేనిలా తగలబడిపోవాలా?"

 

    "అక్కా!"

 

    చాలా ప్రయత్మంతో దుఃఖాన్ని నిభాయించుకుంటుంది రాజ్యం. "అవునే... నాకేతప్ప మీరెవ్వరికీ బాధ్యత లేదా?'

 

    "మేం నీకన్నా చిన్నవాళ్ళం కదే!

 

    "కాని నువ్వూ వయసులో వున్నావుగా. మరి నువ్వూ బాధ్యత తీసుకోవాలిగా?"

 

    "ఇలా మాటాడుతున్నావేం?"

 

    ఉన్మాదిలా నవ్వింది రాజ్యం. చెల్లెళ్ళ చిటికెన వ్రేళ్ళు పట్టుకొని భూగోళమంతా తిప్పుతానని నిన్న మొన్నటిదాకా కబుర్లు చెప్పిన రాజ్యం దుఃఖంపై గెలవాలని భ్రాంతితో అలా నవ్వింది.

 

    "బెదిరిపోయావా దివ్యా? పాపం అదిరిపడ్డావు కదూ!" ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది. అమ్మలా కళ్ళు తుడిచింది. "ఎవరు శాశ్వతం పిచ్చి చెల్లీ! ఈ పాడు లోకంలో వున్నవాళ్ళంతా పోయేవాళ్లేనే. జాగ్రత్తగా బ్రతకాలే. నాలాగా మీరంతా నిబ్బరంగా ఉండాలి. అయినా ఈ మాత్రందానికే అలజడెందుకే? మళ్ళీ నేనిలా మాట్లాడితే నీదారి నువ్వు చూచుకో అక్కా అంటూ నన్ను కడిగేయాలి. నువ్వు లేని నాడు మేం బ్రతకలేమా అని ధైర్యంగా మాటాడగలగాలి. పడుకో తల్లీ! నా వరాల చెల్లీ!"

 

    "అక్కా!"