"అవును ఎందుకు ఇచ్చినట్టు?" ఊహకీ అర్ధం కాలేదు.
    
    "జగన్నాయకులుగారి మర్డర్ కి, ఈ పెన్ స్టాండ్ కి ఏదైనా సంబంధం ఉందేమో..." సందేహాన్ని వ్యక్తం చేసాడు సూర్యవంశీ.
    
    "ఏవుంటుంది..." వింతగా చూస్తూ అంది ఊహ.
    
    "అదే నాకూ అర్ధం కావడం లేదు...." ఆ పెన్ స్టాండ్ ని దీర్ఘంగా పరిశీలిస్తున్నాడు సూర్యవంశీ.
    
    ఆ పెన్ స్టాండ్ ని, ఊహ రైటింగ్ టేబిల్ మీదపెట్టి, ఆ పక్కనే ఉన్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ వేపు యధాలాపంగా చూసాడు.
    
    ఫస్ట్ పేజీ బాక్స్ లో ఉన్న చిన్నవార్త అతడ్ని వెంటనే ఆకర్షించింది.
    
    చీకట్లో హంతకుడు... అంతా మిస్టరీ....
    
    ఆ వార్త నిరంజనరావుకు సంబంధించిన వార్త పూర్తిగా చదవకుండానే...."ఊహ కమాన్ క్విక్..... నిరంజనరావు హైద్రాబాద్ లోనే ఉన్నారు... వెళదాం పద...." అన్నాడు చటుక్కున సీట్లోంచిలేస్తూ.
    
    మరో క్షణంలో హీరో హోండా అక్కడలేదు.
    
                                                         *    *    *    *    *
    
    ఫోరెన్సిక్ లాబ్...
    
    ప్రొఫెసర్ మధుసూదన్ ఎదుట కూర్చున్నాడు నిరంజనరావు.
    
    గాఢంగా విశ్వసించి చెప్పడం మొదలు పెట్టాడాయన.
    
    "చీకట్లో.... హంతకుడి కదలికల్ని, పరుగు వేగాన్ని, ఉచ్చ్వాస నిశ్వాసల్ని, పాదాల చప్పుడిని పసికట్టకలిగే నేను..... ఒకచోట ఫెయిలయ్యాను.....నా పిస్టల్ గురి ఎందుకు తప్పిందో చెప్పగలరా.....!"
    
    అలా అడుగుతున్న నిరంజనరావు వేపు సూటిగా చూశాడు మధుసూధన్.
    
    తన ప్రాణంపోయినా మర్డరర్ ని చంపాలనే కసి ఆ ముఖంలో కన్పించిందతనికి.
    
    "సీ... మిస్టర్ నిరంజనరావు - ఐడింటిఫికేషన్ ఆఫ్ ది సస్పెక్ట్..ప్రధానంగా ఐడింటిఫికేషన్ ఆఫ్ ది క్లూస్ మీద ఆధారపడి ఉంటుంది-ఆ హంతకుడు ఎదురుగా ఉన్నా లేకపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా సదరు వ్యక్తిని గుర్తించే అవకాశం ఉంది.
    
    మీరు... మీ రూమ్ బయట అడుగుల శబ్దం, అనుమానాస్పద వాతావరణం.....వీటన్నిటినీ దృష్టిలోపెట్టుకొని వచ్చినవాడు హంతకుడని గుర్తుపట్టారు.
    
    ఆ వచ్చినవాడు హంతకుడు కాకపోతే..... అన్న పాయింట్ ని మీరు ఊహించలేదు.....ఎందువల్ల...? ఐడింటిఫికేషన్ ఆఫ్ ది సస్పెక్ట్ ని నిర్దారించగలిగే ఐడింటిఫికేషన్ ఆఫ్ ది క్లూస్..... అలాగే..... కన్పించని మనిషి కొలతల్ని నిర్ధారించడం కూడా ఫోరెన్సిక్ శాస్త్రంలో ఒక ప్రధానమైన భాగం....
    
    1879లో ఆల్ఫన్స్ బెర్టిలన్ అనే ఫ్రెంచి క్రిమినల్ పోలీస్ ఆంత్రో పోమిట్రీ అనే సిస్టమ్ ను డెవలప్ చేశాడు. సింపుల్ గా చెప్పుకోవాలంటే దీనినే మేన్ మేజర్ మెంట్ అనుకోవచ్చు.
    
    ప్రపంచంలో ఏ ఇద్దరు నేరస్తులు ఒక్కలా ఉండరు. ఒకవేళ పోలికలు ఒకలా ఉన్నా వ్యత్యాసం చాలా ఉంటుంది.
    
    కొలతలుద్వారా నేరస్తుల్ని ఎలా నిర్ధారిస్తారు? చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది.
    
    మానవ శరీరంలోని ప్రధానమైన 14 భాగాల కొలతల్ని గుర్తించ గలిగితే ఆ కొలతలు 286, 435, 456 ఈ పద్దతిలో ఉంటాయి.
    
    తల, రొమ్ము, చెవుల పొడవు, ముక్కు,  కాలిచేతి వేళ్ళు, కాళ్ళు, పాదాలు ఇలాగే అన్నీనూ...
    
    ఆయా కొలతల్ని ప్రధానంగా బోన్స్ పొడవు, వెడల్పుల ద్వారా నిర్ధారిస్తారు. మామూలు మనిషికి, నేరస్తుడికి మధ్య సాధారణంగా ఎక్కడో దగ్గర తేడా ఉంటుంది.
    
    ఆ తేడా ఈ మేన్ మేజరింగ్ పద్దతిలో సులభంగా గుర్తించడం జరుగుతుంది. ఉదాహరణకు, ఈ కొలతల్లో దొరికిన ఇంపార్టెంట్ పాయింట్ ని ఎనలైజ్ చెయ్యాడం ద్వారా అలాంటి వ్యక్తులు ఎంతఅమంది ఉండడానికి అవకాశం ఉందో నిర్ధారించడం, అందుకోసం అన్వేషించడం - దీని కోసం ఒకప్పుడు అమెరికాలో నలభై వేలమంది పోలీసు నిపుణులు పనిచేసారు.
    
    అలాగే-
    
    హంతకుడి ఫోటోని ఊహాచిత్రంగా మలచడం, శరీర భాగాల కొలతల్ని నిర్దారించడం, అలాగే నిజమైన ఫోటోని ఎన్ లార్జ్ చేసి అవయవాల కొలతల ద్వారా ప్రత్యెకతల్ని గుర్తించడం, ఇవ్వన్నీ ప్రధానంగా ఆంత్రో పోమెట్రీలో భాగాలే.
    
    శరీర భాగాల పొడవు వెడల్పులను గుర్తించడం ఒక అంశమైతే, అందులో ప్రత్యేకంగా విడిభాగాలు అంటే ఉదాహరణకు చెయ్యి, చేతి వేళ్ళు.... ఆ వేళ్ళ ముద్రలు అంటే ఫింగర్ ఫ్రింట్స్, లెగ్ ప్రింట్స్ - ఇంకో విషయం ప్రస్తుతం మీకు, హంతకుడికి మధ్య జరిగిన సంఘటనను ఎనలైజ్ చేస్తే-
    
    మీరు హంతకుడిని చూడలేదు..... ఎప్పుడూ గురి తప్పని మీరు మొట్టమొదటిసారిగా గురి తప్పారు....దానిక్కారణం హంతకుడు ఎంత పొడవు ఉన్నాడో ఎటు పరిగెత్తుతున్నాడో స్పష్టంగా నిర్ధారించుకోలేక పోవడమే."
    
    "నో మిస్టర్ మధూ... హంతకుడు ఎంత పొడవుంటాడో నాకు తెలుసు...." కాన్ఫిడెంట్ గా చెప్పాడు నిరంజనరావు.
    
    అది వింటూనే ప్రొఫెసర్ మధుసూదన్ దిగ్భ్రాంతికి గురయ్యాడు అయినా వెంటనే తేరుకున్నాడు.
    
    "అయితే మీ గురి ఎందుకు తప్పింది..." అడిగాడు మధుసూదన్.
    
    "అదే నాకు అంతుబట్టడంలేదు...."
    
    "నేను చెప్పనా..."
    
    మధుసూదన్ ఏం చెప్తాడోనని ఆసక్తిగా భ్రుకుటి చిట్లించాడు నిరంజనరావు.
    
    "నిజంగా వచ్చినవాడు మర్డరరే అయితే..... మిమ్మల్ని చంపడానికి వచ్చినవాడే అయితే....అతను ఆ సమయంలో బూట్లు వేసుకొని ఉండకపోవచ్చు-దానివల్ల అతని పొడవు కొంచెం తగ్గి ఉంటుంది. మీరు ఆ టెన్షన్ లో ఆ విషయాన్ని పట్టించుకొని ఉండకపోవచ్చు."
    
    షూస్ వేసుకున్నప్పుడు అతని ఎత్తు ఒకరకంగా ఉంటుంది -లేనప్పుడు తగ్గుతుంది.
    
    అదీ గాక అతను ఆ సమయంలో పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడు. పరిగెత్తే వ్యక్తి ఎప్పుడూ నిటారుగా నిలబడి పరుగెత్తడు.
    
    పరిగెత్తేప్పుడు ఏ వ్యక్తయినా, ఒకింత ముందుకు వంగుతాడు.
    
    ఈ విషయం కూడా మీ దృష్టికి ఆ క్షణాన వచ్చి ఉండకపోవచ్చు.
    
    అందుకే మీరతని తలకు గురి పెట్టిన బుల్లెట్ గ్లాసుతలుపుపై ఆరడుగుల ఒక్క అంగుళం ఎత్తులో హిట్ చేసింది.
    
    అతనా సమయంలో ఐదడుగుల పదకొండు అంగుళాల ఎత్తులోనే పరుగెత్తి ఉంటాడు.