బెంగుళూరు... ఎమ్.ఎస్.రామయ్య మెడికల్ కాలేజీ....
    
    ఎగ్జామినేషన్స్ జరుగుతుండడంవల్ల, ఆ కాలేజీ ప్రస్తుతానికి నిశ్శబ్దంగా ఉంది.....
    
    ఉదయం సరిగ్గా పదకొండు గంటలు....
    
    ఆ కాలేజీ మెయిన్ గేటుకి కొంచెం దూరంలో ఐస్ క్రీమ్ పార్లర్ ముందు ఓ మారుతికారు ఆగింది. అందులోంచి దిగాడు బబ్లూ.
    
    బబ్లూని చూసిన వారెవరైనా సినిమా హీరో అనుకుంటారు..... ఐస్ క్రీమ్ పార్లర్ లోకి నడిచాడు బబ్లూ.... టేబిల్ ముందు కూర్చుని ఓ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాడు... రెండు నిముషాల తర్వాత..... బేరరు ఐస్ క్రీమ్ తెచ్చి అతని ముందుంచాడు.
    
    "కాలేజీ స్టూడెంట్స్... ఐస్ క్రీం కోసం.... ఇక్కడికే వస్తారు కదూ...." తలూపాడు బేరర్....
    
    "ఎగ్జామినేషన్ ఎన్ని గంటలకు అయిపోతుంది....."
    
    "పన్నెండు గంటలకు సార్...." చెప్పి వెళ్ళిపోయాడు బేరర్ పదకొండున్నర దాటింది.
    
    నెమ్మదిగా కాలేజీలోంచి స్టూడెంట్స్ బయటకు రావటం మొదలైంది.....బబ్లూ కళ్ళు, వచ్చే అమ్మాయిల్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.... అతనికి కావల్సింది ఊహ...
    
    అదే సమయంలో పార్లర్ లోకి ఓ ఎనిమిదేళ్ళ కుర్రాడొచ్చాడు వాడి భుజానికి బ్రౌన్ కలర్ హ్యేండ్ బ్యాగ్ వేలాడుతోంది. ఆ బాబు నేరుగా వచ్చి, బబ్లూ పక్కన కూర్చున్నాడు.
    
    "ఐస్ క్రీమ్ కోసమా....?" అడిగాడు బబ్లూ.....ఆ బాబుని.
    
    "ఎస్ అంకుల్.....ఐ లైక్ ఐస్ క్రీమ్..." అందంగా చెప్పాడు ఆ బాబు. "ఐ లైక్ మర్డర్స్..." అన్నట్టుగా విన్పించింది ఆ మాట.
    
    "నీకు ఐస్ క్రీమ్ ని నేను ఇప్పిస్తాను....నాకో పని చేసి పెడతావా...." ఆశ్చర్యంగా చూసాడు ఆ కుర్రాడు. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసాడు బబ్లూ.
    
    "నాకో కాగితం కావాలి..." ఆ కుర్రాడు వెంటనే హేండ్ బేగ్ తెరిచి, నోట్ బుక్ తీసి ఒక పేజీని కట్ చేసి, బబ్లూకి యివ్వబోయాడు.
    
    "నా కొద్దు నువ్వేరాయి" బబ్లూ జేబులోంచి పెన్నుతీసి ఆ కుర్రాడికిచ్చాడు.
    
    "తెలుగొచ్చా..."
    
    "వచ్చు..."
    
    అదే సమయంలో కాలేజీ మెయిన్ డోరు వేపు చూసాడు బబ్లూ....ఫ్రెండ్స్ తోపాటు ఊహ... నేరుగా పార్లర్ వేపు రావటం, అతనికి సంతోషాన్ని కలుగచేసింది. చెప్పటం ప్రారంభించాడు బబ్లూ... ఆ కుర్రాడు హేపీగా స్టార్ట్ చేసి, ఆ మేటర్ లో ఉన్న భావానికి సీరియస్ గా మొహం పెట్టాడు. నాలుగు నిమిషాలు గడిచాయి.
    
    తనొకసారి ఆ కాగితాన్ని చదివి సంతృప్తి చెందాడు. అదే సమయంలో రోడ్ క్రాస్ చేసి, పార్లర్ మెట్లమీద కొచ్చింది ఊహ పక్కన ఇద్దరు ఫ్రెండ్స్...
    
    ఊహ, పసుపురంగు కుర్తా, పైజామా వేసుకునుంది ఆ టైములో "ఆ ఎల్లో కలర్ కుర్తా, పైజామా అమ్మాయికి ఈ లెటరు ఇచ్చెయ్యాలి....నీకు వందరూపాయలిస్తాను...." జేబులోంచి వందరూపాయలు తీసి ఆ కుర్రాడి జేబులో పెట్టాడు బబ్లూ... ఆ పిల్లవాడు ఆనంద్వేగంతో చూసాడు బబ్లూవేపు ఆ లెటర్ ని ఆ కుర్రాడి చేతిలోపెట్టి ముందుకు కదిలాడు బబ్లూ, తన పక్కనుంచే హుందాగా వెళ్ళిపోతున్న ఊహవేపు నిశితంగా చూస్తూ రోడ్డుమీద కొచ్చాడు బబ్లూ.
    
    మారుతీకారు డోర్ తీసుకుని, ఎక్కి వెంటనే స్టార్ట్ చేసాడు....లోనికొచ్చి సీట్లో కూర్చుని, హుషారుగా కబుర్లు చెప్తున్న ఊహ దగ్గరకు ఆ అబ్బాయి రావడం, కార్లో వెళ్ళిపోయిన అంకుల్ మీ కిమ్మన్నాడు అని ఆ లెటర్ ని ఊహకివ్వడం, ఊహ గబుక్కున ఆ లెటర్ని విప్పడం, అంతా వెంట వెంటనే జరిగిపోయాయి.....
    
    క్షణకాలంలోనే ఊహ ముఖం మీద చెమటలు పట్టేసాయి.... నరాలు ఆగ్రహంతో పొంగాయి... కోపంతో ఆమె మొహం ఎరుపెక్కింది.
    
    మరోసారి ఆ లెటర్ని చదివింది ఊహ.
    
    "మిస్... ఊహ... నేను నిన్నూ సూర్యవంశీని వెంటాడుతున్న శత్రువును....డేంజరస్ ఎనిమీని... ఐలైక్ మర్డర్స్... నన్ను ఇంకోరెండు మర్డర్స్ చెయ్యడానికి నువ్వు, వంశీ ఇన్ స్పయిర్ చెయ్యడం బాగోదు... అందుచేత బేబీ.... నేను చెప్పినమాట వింటావు కదూ.... నువ్వు బెంగుళూరు నుంచి హైదరాబాద్ రాగూడదు.... ది సీజ్ మై ఆర్డర్... హైద్రాబాద్ లో నిన్ను నేను చూసిన మరుక్షణం వంశీ నీ శవాన్ని చూస్తాడు.... ఓ.కే...." గబుక్కున తలెత్తి అటూ, ఇటూ చూసింది ఊహ.
    
    ఎక్కడా తనకి లెటర్ ఇచ్చిన కుర్రాడు కనబడలేదు..... లేచి పరుగు పరుగున రోడ్డుమీద కొచ్చింది.... రోడ్ చివర హేండ్ బ్యాగ్ తో నడుస్తున్న కుర్రాడు....పరుగెత్తింది....శక్తినంతా కూడదీసుకుని గాలిలా పరుగెత్తి, ఆ కుర్రాడ్ని చేరుకుంది.
    
    భుజంమీద చెయ్యి వేసింది..... ఆ కుర్రాడు భయంగా తలతిప్పి చూసాడు. ఆ కుర్రాడు, ఆమెకు లెటర్ ఇచ్చిన కుర్రాడు కాదు!
    
    అలసటతోనూ, ఉద్వేగంతోనూ నిరుత్తరాలైపోయింది ఊహ ఎగ్జామ్స్ ఇంకా రెండ్రోజుల్లో పూర్తికానున్నాయి...
    
    అర్జంటుగా హైదరాబాద్ లో వాలడానికి ఫ్లయిట్ టికెట్ కూడా రిజర్వు చేయించుకుంది... అంతలో ఈ హెచ్చరిక.
    
    ఈ విషయం వంశీకి చెప్పాలి ఎలా? వెంటనే ఊహ హైద్రాబాద్ లోని వార్త ప్రెస్ ఆఫీసుకి ఫోన్ చేసింది వంశీ ఆన్ లీవ్...
    
    ఎక్కడ కెళ్ళుంటాడు వంశీ.
    
    అవుటాఫ్ స్టేషన్ వెళ్తే ఫోన్ చేస్తానన్నాడు...
    
    వంశీ హవుస్ ఓనర్ ఇంటికి ఫోన్ చేసింది "తెలీదమ్మా..... సడన్ గా మాయమైపోవడం వంశీకి అలవాటేగదమ్మా.... ఏం చెయ్యాలి?"
    
    ఆ రాత్రి ఎగ్జామి నేషన్స్ కి మనస్ఫూర్తిగా ప్రిపేర్ కాలేకపోయింది ఊహ.
    
                                                *    *    *    *    *
    
    నిరంజనరావు ఒక బ్లయిండ్ మాన్ హంటింగ్ ఫర్ బబ్లూ బట్ బబ్లూ...నిన్నటి బబ్లూకాదు....స్టీల్ రాడ్ తో సహా మొత్తం రూపురేఖల్ని మార్చుకున్నవాడు. గుడ్డివాడైన నిరంజనరావు, బబ్లూని ఎలా గుర్తు పట్టగలడు? ఎలా చంపగలడు? దిసీజ్ ఎ ఒన్ క్రోర్ డాలర్సు క్వశ్చన్!
    
                                                *    *    *    *    *
    
    నిరంజనరావు హైలీ ఇంటిలిజెంట్ పోలీస్ ఆఫీసర్.... బబ్లూ... ఉరఫ్ షఫియుద్దీన్ హైలీ ఇంటిలి జెంట్ క్రిమినల్.... వార్ బిటివీన్ పోలీస్ ఆఫీసర్ అండ్ ఎ క్రిమినల్.
    
                                                 *    *    *    *    *
    
    నిరంజనరావు ముషీరాబాద్ గెస్టు హౌస్ కి వెళ్ళాక, ఒక చార్టు ప్రిపేర్ చేసుకున్నాడు బ్రెయిలీ లిపిలో,
    
    మానవ శాస్త్రంలో ప్రధానమైన ఒక భాగం కర్త, కర్మ, క్రియ.
    
    ఒక పనిని ఒక మనిషి ఎందుకు చేసాడు? ప్రోద్బలంవల్లా స్వీయ ఆలోచన వల్లా? దాని వల్ల అతని కొచ్చే లాభం ఏమిటి? తెలివైన ప్రతివాడూ ఆలోచించే విధానం ఇదే!