చెరువుకు కొంచెం దూరంలో కొబ్బరిచెట్టుకింద పచ్చికలో కూర్చున్నారు ఊహ, సూర్యవంశీ.
    
    "అయితే మారుపేరుతో ఆ ఉత్తరాలు రాసింది కూడా నువ్వేనా..." అడిగాడు సూర్యవంశీ.
    
    అవునన్నట్టుగా కనురెప్పలు టప,టప లాడించింది ఊహ.
    
    ఇంత సీక్రెసీ ఎందుకు మెంటైన్ చేసావ్..." మళ్ళీ అడిగాడతను.
    
    "నిజం చెప్పనా... అబద్దం చెప్పనా..." అడిగిందామె.
    
    "ఇంత దూరం వచ్చాక నిజం చెప్పడమే బాగుంటుంది. ఎందుకో తెలుసా... ఇప్పుడు తెలియాల్సినవి నిజాలే కనుక..." సీరియస్ గా అన్నాడు వంశీ.
    
    ఒక్కక్షణం తర్వాత ఊహ చెప్పడం ప్రారంభించింది.
    
    "మా డాడీ నాకు రాసిన ఉత్తరాల్లో అప్పుడప్పుడు మీ గురించి రాసేవారు... ఈసారి నువ్వు హైద్రాబాద్ వచ్చినపుడు, నీకు సూర్యవంశీని పరిచయం చేస్తానని, ఆయన దగ్గర్నించి నాకొచ్చిన చివరి లెటర్లో ఉంది.....కానీ... డాడీ మర్డర్ న్యూస్ నాకు తెలియడంతో షాకయ్యాను.... నాకు తెల్సి....ఆయనకు శతృవులు లేరు....
    
    డాడీ నాతో ఎప్పుడూ ఒకమాట అంటుండేవారు..... నాకు మిత్రులు లేరు... అందుకనే నాకు శతృవులు కూడా లేరని...
    
    కానీ అంత క్రూయల్ గా డాడీని చంపాల్సిన అవసరం ఏమిటి?
    
    డాడీ శవదహనం రోజున నువ్వు నాకు కన్పించలేదు- నువ్వు పనిచేసే పేపర్ ఆఫీస్ కి, మీ రూమ్ కి వెళ్ళాను... ఈ విషయంలో నీ సలహా కోసం.... ఆ సమయంలో.... నువ్వు ఊళ్ళోలేవు....
    
    ఆ తర్వాత నీ కేరక్టర్ గురించి ఒక్కొక్క విషయం తెల్సింది... నువ్వు తాగుబోతువని... కానీ అదే సమయంలో వర్క్ లో నీ సిన్సియార్టీ... నీ తెగువ, నీ ధైర్యం కూడా నాకు తెలిసాయి...
    
    అందుకే నీ కేరక్టర్ గురించి, స్వయంగా అబ్జర్వ్ చెయ్యడం ప్రారంభించాను.... నీ వీక్ నెస్ ఒక్క తాగుడుమీద మాత్రమేనని తెలుసుకున్నాను..... మీ హౌస్ ఓనర్ పరబ్రహ్మం కూతురు మీనాతో స్నేహం చేసి, ఆడపిల్లల వ్యవహారంలో నువ్వెలా ఉంటావో తెల్సుకొన్నాను....
    
    నీ ఫ్యామిలీ బేక్ గ్రౌండ్, వంటరితనం... వాటి వెనక విషాదం... కానీ తాగుడు మత్తులో పడి నువ్వు, నాన్న కేసుని వదిలేస్తావేమోనని భయపడి నీకు కొన్ని డిటైల్స్ అందచేయాలని నిర్ణయించుకున్నాను.
    
    అదే సమయంలో యాదగిరి మర్డర్ జరగడం, ఆ ఫోటోగ్రాఫర్ని నేను చూడటం అతని ద్వారా ఫోటోలు సంపాదించి, నీకు పంపడం జరిగింది....
    
    నీ కేరక్టర్ తెలిసాక మాస్క్ అవసరంలేదని నిర్ణయించుకొన్నాను. అంతవరకు చెప్పి, ఊపిరి భారంగా వదిలింది ఊహ.
    
    "ఇప్పుడు అనుమానం పోయినట్టేనా...." నవ్వుతూ అడిగాడు సూర్యవంశీ.
    
    "ఇంకా కొంచెం ఉంది...."
    
    "ఏంటది...."
    
    "తర్వాతెప్పుడైనా చెప్తాను.... కానీ ముందు నా డౌట్ క్లియర్ చెయ్యి....మా డాడీని ఎవరు చంపారు? ఎందుకు చంపారు?" ప్రశ్నించిందామె.
    
    "ఈ ప్రశ్న నువ్వువేస్తావని నేననుకోలేదు ఊహ.... ఎందుకంటే మీ డాడీ అంటే పడని వ్యక్తులగురించి... నీకు కనీసం తెలుస్తుందనుకున్నాను..." అన్నాడు వంశీ ఒకింత నిరుత్సాహంగా.
    
    "నో... నాకు తెలీదు... కానీ... సరీగ్గా మూడు నెలల క్రితం డాడీ ఏదో పనిమీద బెంగుళూరు వచ్చారు. రిటైర్ అయ్యేముందు, ఒక సెన్సేషనల్ న్యూస్ ని పేపర్లో వేస్తానని.... తన కెరీర్ కి, అది తను చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కి పద్మశ్రీ అవార్డు లాంటిదని అన్నారు... అంతే..." నెమ్మదిగా అంది.
    
    "ఏంటా న్యూస్..." ఆతృతగా అడిగాడు వంశీ.
    
    "తెలీదు..."
    
    "దేనికి సంబంధించి..."
    
    ఆ ప్రశ్నకు కూడా ఆమె దగ్గర జవాబులేదు.
    
    సెన్సేషనల్ న్యూస్... సెన్సేషనల్ న్యూస్...
    
    జగన్నాయకులు మర్డర్ తర్వాత, వరసగా జరిగిన చైన్ మర్డర్స్ గుర్తుకు వచ్చాయి సూర్యవంశీకి.
    
    "మిస్టర్ వంశీ... ఈ పోలీసులు... ఈ పొలిటీషియన్స్....ఈ ఎంక్వయిరీలు వీటిమీద నాకు నమ్మకంలేదు.... డాడీని మర్డర్ చేసిన మర్డరర్ ని నువ్వు పట్టుకోగలవని నాకు నమ్మకం ఉంది.... నీతోపాటు నేనూ ఉంటాను. ఆ మర్డరర్ ని నాచేత్తో నేను షూట్ చెయ్యందే నా పగ చల్లారదు.... ఎందుకంటే.... డాడీ నన్నెప్పుడూ కూతురిలా పెంచలేదు.... ఇప్పుడు నేనొక అనాధని...." తండ్రి జ్ఞాపకాలు ఒక్కసారి వెల్లువగా రావడంతో, దుఃఖాన్ని కంట్రోల్ చేసుకోలేక పోయింది ఊహ.
    
    వెక్కి వెక్కి ఏడుస్తోందామె.
    
    "ప్లీజ్... ఊహ... కంట్రోల్ యువర్ సెల్ఫ్..."
    
    అయిదు నిమిషాల తర్వాత-
    
    "సీ... మిస్టర్ వంశీ... ప్రపంచంలో చాలానేరాలు జరగడానికి చాలా చాలా కారణాలుంటాయి. కానీ మర్డర్ జరగడానికి క్రైమ్ సైన్స్ థీరీ ప్రకారం ఒకటే మోటివ్ ఉంటుంది.
    
    ఒక మనిషిని వేరొక మనిషి మర్డర్ చెయ్యడానికి పూనుకున్నాడంటే, ఆ వ్యక్తిని చంపడానికి నిర్ణయించుకున్న వ్యక్తికి బలమైన శత్రువు అయ్యుండాలి.
    
    ఆ బలమైన శత్రుత్వం ఏర్పడడానికి ప్రధానమైన కారణాలు ప్రపంచవ్యాప్తంగా రెండే రెండు ఒకటి డబ్బు... రెండు పవర్.
    
    వీటికోసమే హత్యలు జరుగుతాయి....
    
    ఇక్కడ డాడీ మర్డర్ వెనక కారణాలను మనం విశ్లేషించుకోవాలి...."
    
    ఊహ అంత డిటైల్డ్ గా సబ్జెక్టుని ఎనలైజ్ చేస్తుందని ఊహించని సూర్యవంశీ తెల్లబోయాడు.
    
    "టెల్ మీ... డోంట్ స్టాప్..."
    
    మళ్ళీ చెప్పడం ప్రారంభించిందామె.
    
    "ఇక్కడ జగన్నాయకులు అంటే మా డాడీ... మర్డర్ వెనక కీలకమైన అంశంగా డబ్బు ఉంటుందని నేననుకోను... ఎందుకంటే, డబ్బుకోసం ఆశపడే వ్యక్తి కాదు మా డాడీ... రెండోది పవర్...
    
    పొలిటికల్ పవర్ కి వ్యతిరేకంగా మా డాడీ... ఏదైనా న్యూస్ ఐటెమ్ ని ఫ్లాష్ చెయ్యడానికి చూసాడేమోనని నా అనుమానం...
    
    ఎందుకంటే, ఆయన నోటివెంట వచ్చిన సెన్షేషనల్ న్యూస్ అన్నమాటే నేనిలా ఆలోచించడానికి కారణం... ఏవంటావ్..." ఆగి, సూర్యవంశీ కళ్ళల్లోకి చూసింది ఊహ.
    
    "యు ఆర్ కరెక్ట్ ఊహ.... కానీ.... ఆయనతో కల్సి పనిచేసిన వాళ్ళని, ఆయనతోపాటు మార్నింగ్ వాక్ కి వెళ్ళినవాళ్ళని.... ఆయనతో సన్నిహితంగా ఉండేవాళ్ళని అందర్నీ కలిసాను ఊహ.... ఆఫీసులో ఆయన డ్రాయర్ ని నేనే వెతికాను... మీ ఇంట్లోకూడా వెతికాను.... సెన్సేషనల్ న్యూస్ కి సంబంధించి ఎలాంటి క్లూ దొరకలేదు..." చెప్పాడు సూర్యవంశీ.