"మీరలా పచ్చజెండా చూపితే ఇక ఆగను. మీ పేరు రూపాయి రాయుడు గదా! చాలా విచిత్రమైన పేరు. ఈ పేరు మీరే పెట్టుకున్నారా? లేక మీ తల్లిదండ్రులు పెట్టారా?"

 

    ఆ ప్రశ్న విని రూపాయి రాయుడు అచ్చు రూపాయిబిళ్ళ గచ్చుమీద దొర్లినట్టు నవ్వాడు. ఆయన కళ్ళు గతంలో తెరుచుకున్నాయి.

 

    "నేనే"

 

    "మీరే పెట్టుకున్నారా? ఈ పేరే పెట్టుకోవడం వెనక ఏమయినా చరిత్ర వుందా? చెప్పండి"

 

    "వుంది"

 

    "మరి చెప్పండయ్య"

 

    తమ గతాన్ని చెప్పడానికి ఎవరయినా ఇష్టపడతారు. ఒకప్పుడు కష్టాలుపడి పైకొచ్చిన వాళ్ళు మరింత ఉత్సాహం చూపిస్తారు. ఆ ఉత్సాహంతోనే రాయుడు చెప్పడానికి గొంతు సవరించుకున్నాడు.

 

    "నాకు అప్పుడు పన్నెండేళ్ళు. ఈ వూరికి దూరంగా వుండే చిన్న పల్లెటూరులో వుండేవాళ్ళం. పూటకూడా గడవటం కష్టంగా వుండేది. మా అమ్మా, నాన్నా కూలిపనికి వెళ్ళి కంచంలోకి అంత తెచ్చుకునేవాళ్ళు. నాలుగు తాటాకులు కప్పి ఇల్లు అనిపించుకుంటూ అందులో వుండేవాళ్లం.

 

    నేను అప్పుడు అయిదో తరగతి పాసయ్యాను. ఆరో తరగతిలో చేరాలి. పక్కనున్న ఓ చిన్న టౌన్ కెళ్ళి చదువుకోడం సాధ్యంకాదని తెలిసినా స్కూలుకి వెళతానని పేచీ పెట్టాను. కానీ లాభం లేకపోయింది ఫీజులు కట్టలేనని, పుస్తకాలు కొనలేనని నాన్న ఖచ్చితంగా చెప్పేశాడు. దాంతో నా ఆశలన్నీ అడియాసలయ్యాయి.

 

    నాతో చదువుకున్న పిల్లలంతా మొదటిరోజు హైస్కూల్ కి బయలుదేరారు. యూనిఫారమ్ వేసుకుని, కొత్త పుస్తకాలు సంచిలో వేసుకుని వాళ్ళు వెళుతుంటే రచ్చబండమీద కూర్చుని అలా చూస్తుండిపోయాను. కళ్ళలోంచి నీళ్ళు నాకు తెలియకుండానే కారిపోతున్నాయి.

 

    అలా ఎంతసేపున్నానో నాకు తెలియదు. ఎవరిదో చేయి భుజం మీద పడితే తల పైకెత్తి చూశాను. ఎదురుగా అమ్మ. చాలాసేపు ఓదార్చాక నన్ను లాలించడానికి చేతిలో రూపాయి నాణెం పెట్టింది. అమ్మే నన్ను ఇంటి వరకు తీసుకొచ్చింది.

 

    ఆ రాత్రి అమ్మావాళ్ళు నిద్రపోయినా నాకు కునుకురాలేదు. పచ్చ నిక్కర్, తెల్లచొక్కా వేసుకుని, భుజానికి సంచిని వేలాడదీసుకుని స్కూల్ కి వెళుతున్న మిత్రులే కనిపిస్తున్నారు.

 

    పడకమీద నుంచి లేచాను. పడకంటే ఏమీలేదు - అమ్మ పాత చీరే. ఓ మూల కిరసనాయిలు దీపం దరిద్రదేవత మెల్లకన్నులా వుంది.

 

    నా పిడికెట్లో రూపాయి నాణెం. దాన్ని అటూ ఇటూ కదుపుతూ కూర్చున్నాను. ఏది లేకపోవటం వలన నా చదువాగిపోయిందో ఆ డబ్బు నాచేతిలో. కసి పుట్టుకొచ్చింది. దాన్ని బయటికి విసిరికొట్టబోయాను. అప్పుడు పడింది నా దృష్టి దానిమీదున్న బొమ్మమీద. తిప్పి చూశాను -బొరుసు. దాన్ని అటూ ఇటూ తిప్పుతుంటే అది నాకు గొప్ప సత్యాన్ని బోధిస్తున్నట్టే వుంది.

 

    "ఆ సత్యం ఏమిటయ్యా?" శివరామయ్య యాంగ్జంటీతో అడ్డు తగిలాడు.

 

    "మనిషి కూడా రూపాయి నాణెంలోనే రెండు రకాలుగా వుండాలని"

 

    "అర్థమయ్యేట్టు చెప్పండయ్యా"

 

    "బొమ్మా బొరుసూ ఒకే నాణానికి వున్నట్టే మనిషి కూడా రెండు రకాలుగా వుండాలి. బయటికి నువ్వో విధంగా ఎక్స్ పోజ్ కావాలి. పరాయి వాడి పెళ్ళాం తల్లితో సమానమని ప్రవర్తించు.

 

    పరాయిసొత్తు పాములాంటిదని భయభక్తులు నటించు. ఇతరులకు యిబ్బంది కలిగించకపోవడమే పెద్ద సుగుణమని నలుగురికీ చెప్పు. నమ్మినవాడ్ని యెప్పుడూ మోసం చేయకూడదని బోధించు - యిది నీ బొమ్మ. ఇక నీ బొరుసు. ఇది ప్రపంచానికి తెలియకూడదు. నీలో నువ్వే దాచుకోవాలి. నీలోని సైతాన్ ని సంతృప్తి పరిచేందుకు తెర వెనుక నువు ఎన్ని ఘోరాలయినా చెయ్. అవసరమైతే పీకలు తెగ్గొయ్. స్నేహితుల్ని నట్టేట ముంచు, నీ ఆనందం కోసం రేప్ లు చేయ్. బలవంతంగా లొంగదీసుకో. బలహీనతల్ని కనిపెట్టి నీకు ఇష్టమయిన పిల్లని పక్కలోకి లాక్కో - ఫరవాలేదు. ఇదీ రూపాయి నాణెం, మహాతత్వవేత్తలా నాకు చెప్పిన సత్యం."

 

    రాయుడు చెప్పడం ఆపినా ఉద్వేగం వల్ల ఆయన ఛాతీ ఎగిరెగిరిపడుతోంది.

 

    "అహో అయ్యగారూ! నీకు జోహార్లు. పదేళ్ళ వయసులోనే రూపాయి నాణానికి వున్న బొమ్మా బొరుసు నుంచి యింత ఫిలాసఫీ లాగారంటే మీరు సామాన్యులు కాదు సార్. అందుకే మీరు ఈ ప్రాంతానికి చక్రవర్తులయిపోయారు"శివరామయ్య భగవంతుడ్ని చూస్తున్నట్టు పారవశ్యంతో రెండు చేతులూ ఎత్తి జోడించాడు.

 

    రాయుడు ఓ సిప్ చేసి గ్లాసు కింద పెట్టాడు.

 

    "అయ్యా! మీ పేరు వెనుక యింత కథ వున్నట్టే జంతువుల అవయవాలను స్మగ్లింగ్ నే ప్రధానవృత్తిగా చేసుకోవడం వెనక కూడా యింత కథ వుందా" మళ్ళీ అడిగాడు శివరామయ్య.

 

    "ఉంది" రాయుడు గంభీరంగా ప్రారంభించాడు.

 

    "అలా కొన్నిరోజులపాటు రూపాయి నాణాన్ని చేతుల్లోనే వుంచుకుని గడిపాను. ఓరోజు దాంతో ఓ కోడిపిల్లను కొన్నాను. దేనిమీదయితే మనసు కసి వుంటుందో దాంతో ఆడుకోవాలన్న సరదా కూడా వుంటుంది. డబ్బు మీద నాకు అలాంటి సరదానే కలిగింది. చాలీచాలని అన్నం నా కంచంలో వున్నా ఆ కోడిపిల్లకు కొన్ని మెతుకులు వేశాను. చారెడు బియ్యం దొంగిలించి వేశాను. అది పెద్దదయింది. గుడ్లు పెట్టింది వాటిని పొదగేశాను. మొత్తం పదమూడు పిల్లలయ్యాయి. వాటిని మేపి అమ్మాను. డెబ్భయి రెండు రూపాయలొచ్చాయి. దాంతో ఓ గొర్రెపిల్లను కొన్నాను. ఇక నా వ్యాపారం ఆగలేదు."

 

    రాయుడు ఆగి గుండెల్నిండా ఊపిరి పీల్చుకున్నాడు.

 

    గతం తాలూకు చిత్రాలు ఆయన కళ్ళముందు కదులుతున్నాయి. తిరిగి చెప్పడం ప్రారంభించాడు.

 

    "రూపాయి నాణెం చెప్పిన సత్యాన్ని అమల్లో పెట్టాను. పైకి సాధువుగా కనబడ్డాను. జంతువులమీద ప్రేమ వున్నట్టు నటించాను. ఇది నా బొమ్మ. కానీ అదే సమయంలో వాటితో వ్యాపారం ప్రారంభించాను. ఈరోజు కువైట్ రాజప్రసాదంతో వేలాడే పులిచర్మాలు నేను స్మగుల్ చేసినవే. సౌత్ కొరియాలో జనం తినే కప్ప కాళ్ళు నేను ఎగుమతి చేసినవే. కెనడాలో సగంమంది ఆడపిల్లల చేతుల్లో వుండే హ్యాండ్ బేగ్ లు నేను పంపిన మొసళ్ళ చర్మాలతో చేసినవే. చాలామంది డబ్బున్న కుటుంబాల యిళ్ళల్లో వేలాడే ఏనుగుదంతాలు నేను సప్లయ్ చేసినవే. ఇది నా బొరుసు.  

 

    ఇక నా బలహీనత ఏమిటో నీకు తెలుసు - అది స్త్రీ. ఆడదాని పొందు లేకుండా పొద్దు పొడవడానికి వీలులేదు. అందుకే ఆడపిల్లల కోసం ఏ రిస్కయినా తీసుకున్నాను. కొందర్ని మోసంతో లొంగదీసుకుంటే, కొందర్ని భయపెట్టి అనుభవించాను. మరికొందర్ని రేప్ చేశాను. కానీ బయటికి మాత్రం నేను ఏకపత్నీవ్రతుడ్ని."