విధివైపరీత్యం ఏమంటే - స్వాతంత్ర్యం వచ్చింతరువాత వ్యక్తిని గురించి ఆలోచించాల్సి వచ్చింది! అప్పటికే కాలం నన్ను అపహసించి కదిలిపోయింది. మారిన పరిస్థితుల్లో ప్రజా జీవితం నన్ను విసిరికొట్టింది. వ్యక్తి జీవననికి ఆలంబనం లేదు. అలాంటి పరిస్థితుల్లో అనేకమంది దిక్కుతోచక - దిక్కులేక అణగారిపోయారు. నేటికీ వారి పరిస్థితి దయనీయంగా ఉంది.
    
    విధి నాకు సహకరించింది. చదువుకోగలిగాను. ఉద్యోగం లభించింది. జీవిక ఆర్జించుకోగలిగాను. నాకు ఇష్టం అయిన ఉపాధ్యాయ వృత్తిలోనే ఉంటాననుకున్నాను. అప్రయత్నంగా నా అభిరుచికి తగిన అనువాద ఉద్యోగం సికిందరాబాదులో లభించింది!
    
    జంట నగరాల్లో - తొలినుంచీ - నాకు సికిందరాబాదు అంటే ముచ్చట బాల్యంలో ఇక్కడ నా పెళ్ళి జరిగినపుడే మురిపించింది. వయసులో అది ముగ్ధరాలులా మనసిచ్చి వెంటపడిన పడతిలా - ఓరచూపులతో తలవంచుకున్న నవ వధువులా వలచింది - వలపించింది - వలపుల ముంచింది.
    
    అయిదవ దశకంలో సికిందరాబాదు ముద్దబంతి చేనులా ఉండేది. రాణీగంజు సాంతం బయలు. కర్బలా మైదానంలో సద్దుల బతకమ్మ ఒక పూల పండుగ - ఒక పూబంతుల పండుగ! అది కనుల పండుగ. ఇప్పుడు అక్కడ అంగుళం స్థలం లేదు. ఊపిరాడదు, ఉక్కిరి బిక్కిరి అవుతాం.
    
    ఇప్పటి రాష్ట్రపతి రోడ్డు - కింగ్స్ వే - ఒకపప్తి జనరల్ బజారు లాంటి ఇరుకుగల్లీ. ఆంగ్రేజులు దాన్ని విశాలం చేయ తలపెట్టారు. వీధిని ఇప్పుడున్నంతటి విశాలం చేసి, కింగ్స్ వే అని పేరు పెట్టారు. ఆనాడు వేసిన రోడ్డు ఈనాటికీ చెక్కుచెదరలేదు.
    
    అప్పటి కింగ్స్ వే ప్రశాంతంగా ఉండేది. ఒకేఒక బస్సు 7B మారేడుపల్లికి అర్ధగంటకు ఒకటి వెళ్ళేది. కార్లు అంతగా లేవు. రిక్షలకు అనుమతి లేదు. ఆటోలు లేనేలేవు. గుర్రపుబండ్లు అప్పుడప్పుడూ తిరిగేవి. కింగ్స్ వే మీది దుకాణాలు తెరవగానే ఒక బాలుడు - ఇప్పటి పత్రికల్లా - పచ్చిగుడ్డి కట్టలు వేసేవాడు. ఆవులు వచ్చి దుకాణాల ముందు నిలిచేవి. యజమానులు స్వయంగా వాటికి గడ్డి తినిపించేవారు. ఇప్పటి ఊపిరి సలపని సందడిలో పచ్చగడ్డి పారిపోయింది.
    
    మోండా మార్కెట్టు ఒక విచిత్రవిపణి. పచ్చని కూరగాయలు - పసందయిన పళ్ళేకాక కుండలనుంచి ముత్యాల వరకు సమస్త పదార్ధాలూ లభిస్తాయి. యువతుల గోవుల తోపిడిసహితంగా అక్కడ సరుకులు కొనడం ఒక సంబరం.
    
    ఆంగ్రేజులు జనరల్ బజారును విశాలం చేసి జేమ్స్ స్ట్రీట్ - మహాత్మాగాంధీ రోడ్డుతో - కలిపే ప్లాను సిద్దం చేసారు. మహంకాళి గుడి అడ్డరోడ్డుదాకా చేశారు. అదిగో, సరిగ్గా అక్కన్నే మడిపడగ బలరామాచార్యులవారి సాహిత్యవిపణి. అక్కడికి రని రచయితా - కళాకారుడూ లేడు. అదొక గోష్ఠి పుస్తకాల దుకాణాలూ అక్కడే ఉండేవి. బలరామాచార్యులవారు ప్రచురణలకు సహకరించేవారు. బలరామాచార్యులు కవి - కళాకారులు - సహృదయులు వరు అనేకమంది రచనలకు ముఖచిత్రాలు వేశారు. వారు ప్రచురణ కర్తలకు - రచయితలకు వారధి. అక్కడికి కొద్ది దూరంలో మంచి సాహిత్యం ముద్రించి ప్రచురించిన అజంతా సోదరుల అజంతా ప్రెస్సు.
    
    మహాకాళి ఈ నగరానికి అధిష్టాన దేవత. మహంకాళి జాతరను నా నవల 'మాయ జలతారు'లో వర్ణించాను.
    
    ఆనంద భవన్ - తాజమహల్ హోటళ్ళు మాత్రం కావు. అవి మిత్రులు కలుసుకునే ప్రదేశాలు.
    
    జేమ్స్ స్ట్రీట్ - అక్కడి క్లాక్ టవర్ - ఇత్తడి బొమ్మ - గాంధీ విగ్రహం ఆ ప్రాంతం నగరానికి అలంకారాలు.
    
    కింగ్స్ వేలో పాట్ని - మహబూబ్ కాలేజి దాటింతరువాత నిర్మానుష్యం! పరేడు గ్రౌండుకు అటు ఆవల రేస్ కోర్సు. గుర్రప్పందాలు సికిందరాబాదులోనే జరిగేవి. బహుశా ఆరవ దశకంలో మలక్ పేటకు మార్చారు.
    
    అటు సీతాఫల్ మందిలో తెలుగుతనం, ఉత్పల సత్యనారాయణాచార్యులువారు అక్కడ ఉండే "ఈ జంటనగరాలు హేమంత శిశిరాలు" అనే కావ్యం వ్రాసి, జంట నగరాలకు కావ్యరూపం ఇచ్చారు.
    
    మారేడుపల్లిలో రాయప్రోలు వారి సహితంగా విద్వాంసులు - సంపన్నులు ఉండేవారు. పందెం గుర్రాల కొట్టాలు - పోలీసు స్టేషను తరువాత నిర్మానుష్యం! ఇప్పుడు జనారణ్యం!!
    
    మున్సిపల్ కార్పొరేషను ఆఫీసు కొబ్బరి చెట్లున్న విశాల ఆవరణలో 150 మారేడు పల్లిలో ఉండేవి. అక్కడే నేను అనువాదకునిగా చేరాను. కౌన్సిలర్లు విద్యావంతులు కాకున్నా సభ్యత - సంస్కారం కలిగి ఉండేవారు. కౌన్సిల్ సమావేశాలు హాస్యం - చమత్కారం - చతురత కలిగి, సద్భావంగా జరిగేవి. ఒక్కొక్కసారి కవితలు వినవచ్చేవి.
    
    ఒకసారి మేయరు రాలేదు. డిప్యూటీ మేయర్ అధ్యక్షత వహిస్తున్నారు. అడావుడిగా మేయర్ వచ్చారు.

    "దూర్ సె ఆయె ధేర్ సె ఆయె
    హమ్ ఖిస్మత్ వాలె హైఁ ఫిర్ భీ ఆయె" అనే కవిత చదివారు ఒకరు. సభసాంతం "వహ్వా" అన్నది.
    
    "దూరంనుంచి వచ్చావు, ఆలస్యంగా వచ్చావు, మేము అదృష్టవంతులం, రానైతే వచ్చావు" అంటూ ప్రియురాలిని సంబోధించిన కవిత అది.
    
    "వచ్చినవాడు ఫల్గుణుడు...." అనే పద్యం అధికార పక్షపు కౌన్సిలర్ అందుకున్నారు.
    
    ఒకనాడు నన్ను వాసుదేవ ముదలియార్ గారు పిలిపించారు. వారు సికిందరాబాదుకు తొలి మేయర్. ముదలియార్లు సికిందరబాదు అభివృద్ధికి కృషి చేశారని మనవి చేశాను. మహబూబ్ కాలేజి - కీస్ బాలికల పాఠశాల - దక్కన్ క్రానికల్ - ప్రుడెన్షియల్ కో ఆపరేటివ్ బ్యాంకు మున్నగు సంస్థలు ముదలియార్లు సేవాదృష్టితో - లాభార్జనకు కాదు - స్థాపించారు. ముదలియారుల సేవానిరతికి ఫలితమే ముదలియార్ తొలి మేయర్ కావడం.
    
    నేను వాసుదేవ ముదలియార్ గారి ఇంటికి వెళ్ళాను. వారు 85 సంవత్సరాలు దాటిన కడు వృద్దులు. అంతగా కనిపించదు. వినిపించదు. ఇంజనీర్ చేసి రిటైరయినారు. సేవాసక్తి గలవారు. వారి దగ్గరికి వచ్చిన వారికి తగురీతిని సాయం చేసేవారు. వారు ఇంట్లో అరవం మాట్లాడుతారు. కాని, ఆంద్ర సాహిత్యంలో ఆసక్తి ఉంది. ప్రవేశం ఉంది.
    
    "మీవంటి విద్వాంసుడు మున్సిపల్ కార్పొరేషనుకు లభించడం అదృష్టం. మన్నించాలి, పెద్దవాన్ని, రాలేక పిలిపించాను, నా స్వార్ధంకోసం పిలిపించాను. నాకు ఎంతో కాలంగా పోతనామాత్ముని ఆంద్రశ్రీ మద్భాగవతం వినాలని ఉంది. ఈనాటికి భగవంతుడు మిమ్ములను చూపినాడు. వినిపించవలె" అని చేతులు జోడించి అడిగారు.
    
    అది విని నాకు ఒడలు జలదరించింది. ఆ వయసులో ఒక తమిళుడు ఆంద్ర మహాభాగవత శ్రవణానికి ఆసక్తి చూపుతున్నాడు! సిగ్గుకూడా అయింది. అంత పెద్దవాడు నన్ను ప్రార్దించడం! కాదనలేకపోయాను.
    
    ప్రతిరోజూ ఉదయం స్నానాదులు ముగించుకొని వెళ్ళేవాణ్ణి వాసుదేవ ముదలియార్ గారు శుచిగా - శాంతంగా నా ముందు కూర్చునేవారు. చందా నారాయణ శ్రేష్టివారు ప్రచురించిన భాగవతం వారిదగ్గరే ఉంది. "ఎవ్వనిచే జనించు" ప్రార్ధనతో ప్రారంభించి కొంత చదివేవాణ్ణి. మధ్యమధ్య ముదలియార్ గారికి సందేహాలు వచ్చేవి. నాకు తెలిసినంతలో సమాధానాలు చెప్పేవాన్ని. అని వారిని సంతృప్తిపరచేవి. నేను చదవడం ముగించివెళ్ళేపుదు ఒక పండో - కాయో చేతిలో పెట్టి, పాదాభివందనం చేసేవారు. నేను చిన్నవాణ్ణి - నాకు ఆయుక్షీణం అవుతుంది అన్నా వినిపించుకునేవారు కారు. వారించడం నాకు అసాధ్యం అయింది!
    
    అలా కొంతకాలం గడిచింది. భాగవతంలో నా ఆసక్తి పెరిగింది. ముదలియార్ గారు భాగవతం వినడం కోసమే ప్రత్యేకంగా మారేడుపల్లిలోని వారి అమ్మాయి యింటికి వచ్చారు. అందరికి వలెనే వారికీ కుటుంబ నిర్బంధాలు వచ్చాయి. పద్మారావు నగర్ లోని కొడుకు ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది.
    
    ఆరోజు మామూలుగా వారింటికి వెళ్ళాను. ముదలియార్ గారు కన్నీరు రాలుస్తున్నారు. కల్మషం ఎరుగని వారి కన్నీరు నన్ను కరిగించింది. వారిని వారించాను.
    
    "ఆచార్యులవారూ! భగవంతుడు శ్రీమద్భాగవతము పూర్తిగా వినే అదృష్టం కలిగించలేదు. ఇంతవరకే మీ రుణం నామీద ఉంది. నేను ఇవ్వాళ వెళ్ళిపోతున్నాను పుత్రుని ఇంటికి ఇక మీరు రావద్దు" అని నిత్యంలా రెండు పళ్ళు - కొత్తగా కొంత డబ్బు నా చేతిలో పెట్టారు. నేను డబ్బుతీసుకోను అన్నాను, అక్కడ పెట్టాను.
    
    "అయితే మీ రుణంలో పడమంటారా?" నిర్వేదం ప్రకటించారు.
    
    "నేనే మీకు ఋణపడి ఉన్నాను. మీవల్ల భాగవతం అర్ధం చేసుకునే అదృష్టం కలిగింది" అన్నాను.
    
    మా ఉభయులకు అందును గురించి కొంత చర్చ జరిగింది. డబ్బుమాత్రం అక్కడే వదిలి నేను వచ్చేశాను. ఆఫీసుకు వెళ్తే టేబుల్ మీద ఒక ఎన్వలప్ ఉంది. చించి చూచాను. "నన్ను మన్నించండి - ఇది స్వీకరించండి" అన్న వాసుదేవ ముదలియార్ గారి ఆర్ధ్రమైన లేఖతో కొంత డబ్బు కూడా ఉంది! గత్యంతరంలేదు. గుండె చెమర్చింది. కడువృద్దులు ముదలియార్ గారి ఆర్తి నన్ను కదిలించింది. 'శరతల్పం' వ్రాయడంలో ఈ అనుభవం తోడ్పడింది.