అసలు భార్యభర్తలలో కలతలు ఎందుకు చెలరేగుతవో అర్థంకాని దశలో సుందరం వున్నాడు. తన వదిన అన్నని విడిచి వెళ్ళిపోయింది. ఇద్దరి మనః ప్రవృత్తులూ సరిపడేవికావు. అసలు భర్తకుగాని భార్యకుగాని రెండోవారు నచ్చక, ఆ జీవితంతో తృప్తిపడక వికృత మనస్తత్వాలు పెంపొందించుకొనే అవసరం ఏముంది? భార్యని ప్రేమించటం చేతకానివాళ్లు అతనికి పందులుగా, పశువులుగా కనిపించారు. అట్లాగే భర్తలతో జీవితం అమృత తుల్యం చేసుకోలేనివాళ్ళు తనకు అసహ్యంగా కనిపించారు. వీళ్ళంతా దుష్ట నినాదాలతో ప్రపంచాన్ని విషపూరితం చేస్తున్నట్లు తోచింది. చివరకు బావుకునేదేమన్నా వుందా? సున్న. అశాంతి.

 

    అతనికి హాయిగా వుంది. అతనికి నిండుగా వుంది జీవితం.


                                                                    *  *  *


    కాని క్రమంగా ఇంట్లో అందరూ తననిగురించి అనుకుంటూన్న మాటలు చెవినపడ్డాయి.

 

    "సుందరం మారిపోయాడు. మారిపోయాడు. మునపటి మనిషి కాదు" అంటున్నారంతా.

 

    అతనికి ఆశ్చర్యం కలిగింది. తను ఏమి మారాడు? తన తల్లి జ్యోతిని కూడా విసుక్కోవడం విన్నాడు. ఏమి అపరాధం చేసింది జ్యోతి?

 

    "పెళ్లి కాకముందు అందర్నీ ఆక్షేపించాడు. ఇప్పుడు వాడు భార్యాలోలుడు అయిపోయాడు" అంది తల్లి.

 

    జ్యోతి రోజూ ఆరుగంటలకే నిద్రలేచి యింట్లోకి వెళ్ళిపోతుంది. అయినా "ఏడయినా నిద్రలేవదు. ఎప్పుడూ ఇద్దరూ గది తలుపులు బిడాయించుకుని కూర్చుంటారు" అంది తల్లి.

 

    అతను నివ్వెరపోయాడు.

 

    "అయినా ఆ రోజుల్లో దాంపత్యాలే బాగుండేవి. రాత్రి అయితేనేగాని భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం పడేదికాదు. ఆ భయమూ భక్తీ నశించాయి ఈ రోజుల్లో" అందిట.

 

    సుందరానికి తల తిరిగినంత పనయింది.

 

    ఒకసారి వియ్యపురాలు తమ యింటికి వస్తే "మీ అమ్మాయి ఇంట్లో ఏమీ చెయ్యటంలేదు. ఎప్పుడూ పెనిమిటితోనే సరిపోతోంది" అన్నదిట.

 

    "వాడు కాపురానికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే యిక్కడికి ట్రాన్స్ ఫర్ చేయించుకున్నాడు. విడిచివుంటే చదువు సాగదుట. పెళ్ళి వద్దో అని గోలపెట్టిన మా సుందరమేనా యిలా మారిపోయింది" అని ఆశ్చర్యం వెలిబుచ్చిందట.

 

    సుందరం విస్మయానికి అవధులు లేవు. తన అమ్మేనా ఇలా అంటున్నది? తను ఎంతగానో ప్రేమించిన అమ్మ!

 

    ఇంతవరకూ ఆమెను గురించి గర్వపడడమే అతని అలవాటు.

 

    ఇదేమిటి ఇలా జరుగుతోంది? అమ్మనేమయినా దెయ్యం ఆవహించిందా? లేక తను నిజంగా అపరాధం చేస్తున్నాడా?

 

    తను విశాఖపట్నంలో ఎన్ని యిడుములు పడ్డాడో, ఎలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడో ఆమెకు తెలియదు. ఒక్కో నిముషం, ఒక్కో యుగంలా గడిచిన ఆ రోజులు, తన తపన, ఆరాటం ఓదార్చే దిక్కులేక మనశ్శాంతికోసం అల్లాడుతూ, మనశ్శాంతికోసం తహతాహలాడుతూ... ఆ నరకయాతన.

 

    అంత అనుభవించి ఇప్పుడు కాస్త ఊరట పొందుతూంటే... ఈ అపార్థాలు.

 

    అతనికి కళ్ళలో నీళ్లు తిరిగాయి.

 

    ఆమె దగ్గరకు పోయి "నేనేం చేశాను?" అని ఎలుగెత్తి అడుగుదామనుకున్నాడు.

 

    కాని ఆత్మాభిమానం అంగీకరించలేదు.

 

    అది క్రమంగా కసిగా పరిణమించింది. అతను ఇంట్లో మరీ గంభీరంగా, ముభావంగా వుండటం మొదలుపెట్టాడు. ఎంతో అవసరం వుంటేనేగాని గదిలోంచి యివతలకు వచ్చేవాడుకాదు.

 

    జ్యోతి అతన్ని ప్రాధేయపడింది మామూలుగా వుండమని. అతను అవిధేయుడని ఇంకా నిందిస్తానరని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.

 

    "వీడికి పెద్దవాళ్ళంటే గౌరవం నశించింది" అని విశ్వనాథరావు మండిపడసాగాడు.

 

    అతని ఫైనలియర్ పరీక్షలు ముగిశాక సెలవుల్లో ఇంట్లో ఏమీ తోచక ఎక్కడికయినా పోదామని ఆలోచన చేశాడు. అతనికి కాశ్మీర్ ఎన్నాళ్ళనుంచో చూడాలని వుంది. ఒకరోజు ధైర్యంచేసి తండ్రిని అడిగాడు.

 

    "నన్నడగడం దేనికీ? ప్రతిదీ నా యిష్టమైతేనే చేస్తున్నావు గనుకనా? నీ యిష్టం. నీ భార్య యిష్టం" అనేశారు విశ్వనాథరావుగారు.

 

    సుందరానికి ఈ సమాధానంతో పిచ్చెక్కినంత పనయింది. తండ్రి చటాలు మని ఇలా అనేస్తాడని కలలో కూడా అనుకోలేదు.

 

    "నేను అంత కానిపని ఏంచేశాను నాన్నగారూ?" అన్నాడు తల ఎత్తి జీవితంలో మొట్టమొదటిసారిగా తండ్రిని ప్రశ్నిస్తూ.

 

    "నన్నే ఎదిరిస్తున్నావా? అవునులే. ఇంజనీరువి అయినావుగా ఇహ నీకు భయమూ, భక్తీ చూపవలసిన అవసరం ఏమిటి?" అని అరిచాడాయన ఆగ్రహంతో.

 

    తండ్రి ముక్కోపి అయితే కావచ్చు. కాని తను నిష్కల్మషంగా అడిగిన మాటకు ఆయన పెడర్థం తీసేసరికి అతని అభిమానం దెబ్బతింది. ఒక్క నిముషంలో కలలో కూడా తలపోయని విధంగా పరిస్థితి ఈ మాదిరి విషమించేసరికి అతనిలోనూ ఆవేశం పరవళ్లు త్రొక్కింది.

 

    "అయితే ఇంతకాలమూ, నానుండి గ్రహించింది ఇదేనా నాన్నగారూ?" అనడిగాడు సూటిగా.

 

    ఆయన తారాపథానికి లేస్తూ "మాటకుమాట అనే మొనగాడివయినావా? ఇంకా నువ్వు నన్ను ఉద్ధరిస్తావనుకున్నాను. రామం నీకన్నా వెయ్యిరెట్లు నయం. నీకు నీతి నియమం నశించాయి" అన్నాడు.

 

    సుందరం వళ్లు మండిపోయి 'ఏమిటి నాలో నశించిన నీతీ, నియమం. మీకు నేను చేసిన అన్యాయం ఏమిటి? మీరందరే అకారణంగా నామీద కత్తిగట్టారు. నామీద నిందలు వేశారు" అన్నాడు అరుస్తూ.