పదినిమిషాల తర్వాత-

 

    అతని పరిస్థితిని గమనించిన ఆమె అతన్ని బెడ్ మీద పడుకోబెట్టింది. బెడ్ షీట్ కప్పి తనూ పక్కనే పడుకుంది.

 

    పావుగంట తర్వాత-

 

    అతడి కుడిచెయ్యి తన మీద పడగానే వులిక్కిపడింది ఆమె. ఆ చేతి స్పర్శ మృదువుగా వుంది. ఆ చెయ్యి నెమ్మదిగా ఆమె ముఖాన్నీ, భుజాన్ని స్పర్శిస్తోంది.

 

    ఎలా... ఎలా... ఎలా... ఈ పరిస్థితి నుంచి తప్పించుకోవడం ఎలా?

 

    "ఐ లవ్ యూ... నిశా... ఐ లవ్... యూ" చెవిలో గుసగుసలాడుతున్నాడు.

 

    ఆ ప్రేమ, ఆ మార్దవం, ఆ స్పర్శ ఆమెకు కొత్తగా వుంది.

 

    ఆ అనుభూతి వింతగా వుంది.

 

    ఆమె వంటినిండా సన్నని చిరుచెమటలు, తనను మీదకు లాక్కుంటున్న అతన్ని ఎలా వారించాలో అర్థం కావటం లేదు ఆమెకు.

 

    రెండే రెండు నిమిషాలు... అకస్మాత్తుగా...

 

    "నిశా... ఐ లవ్ యూ" మత్తుగా పక్కకు జారుకుంటున్న అతని వేపు అయోమయంగా చూసింది ఆమె.

 

    అప్పటికే అతను పూర్తిగా స్పృహ తప్పిపోయాడు.

 

    అంతవరకూ బెంగగా వున్న ఆ కళ్ళు అంతలోనే జాలిగా చెమ్మగిల్లాయి.

 

    బెడ్ లైట్ లేత వెలుగులో-

 

    చాలాసేపటివరకూ అతనివేపు చూస్తూ కూర్చుంది ఆమె.

 

    రెండు గంటల తర్వాత-

 

    ఆ హోటల్లోంచి బయటపడిందామె రహస్యంగా వెనుక నుంచి.


                                                 *    *    *    *


    రెండు గంటలు గడిచాయి.

 

    దేశ్ ముఖ్ నుంచి ఫోన్ లేదు. మెసేజ్ లేదు. ఆ రోజు రాత్రి తర్వాత సిద్ధార్ధ ఎలా వున్నాడో తెలీదు.

 

    ఆ గాభరాలో కాల్ గర్ల్ విషయం తను మరిచిపోయింది.

 

    ఆ రోజు రాత్రి-

 

    సిద్ధార్ధ కాల్ గర్ల్ తో గడపలేదన్న విషయం దేశ్ ముఖ్ కి తెలిస్తే?

 

    ఒకపక్క ధైర్యంగా వున్నా, మరోపక్క మనసు పీకుతోంది నిశాంతకు.

 

    సరిగ్గా అదే సమయంలో ఫోన్ మోగింది.

 

    వెంటనే రిసీవర్ అందుకుంది ఆమె.

 

    "వెల్ బేబీ... ఆ రోజు రాత్రంతా సిద్ధార్థ ఆ కాల్ గర్ల్ పొందులోనే స్వర్గం అంచులు చవి చూసాట్ట కదా?"

 

    అలా అడుగుతున్న ఆయనకి ఎలా జవాబు చెప్పాలో అర్థంకాలేదు ఆమెకు.

 

    "ఆ విషయం మీకెలా తెల్సింది సర్?"

 

    "అన్ని విషయాలూ ఎలా తెలుస్తున్నాయో ఈ విషయం కూడా అలాగే తెల్సింది. తన కోసం అవసరమైతే బొంబాయి వచ్చేస్తానన్నాడట సిద్ధార్ధ" నవ్వుతూ చెప్పాడాయన.

 

    "ఎవరికోసం?" ఆశ్చర్యంగా అడిగింది ఆమె.

 

    "ఆ కాల్ గర్ల్ కోసం... తనే నా దగ్గరికొచ్చి సిద్ధార్ధతో తను పంచుకున్న అనుభవాన్ని పూసగుచ్చినట్టు చెప్పి వెళ్ళిపోయింది. చూశావా! అతనికి కావాల్సింది ప్రేమ కాదు- కోరిక... అతనికి కావాల్సింది నువ్వు కాదు- ఓ ఆడది! అందుచేత..."

 

    నిశాంత కళ్ళ ముందు ఆ కాల్ గర్ల్ రూపం అస్పష్టంగా మెదిలింది. ఆ కాల్ గర్ల్ తనకు చేసిన ఉపకారానికి మనసులోనే కృతజ్ఞతలర్పించింది నిశాంత.

 

    మళ్ళీ దేశ్ ముఖ్ చెప్పడం కొనసాగించాడు.

 

    "మందుకూ, ఆడదానికీ బానిసైన సిద్ధార్ధ, మిగతా వ్యసనాలకు బానిస కావడం అంత కష్టమేం కాదు! కదూ... అతను నీ వెనక తిరుగుతున్నాడని ప్రపంచానికి... ముఖ్యంగా మహంతకు తెలియాలి...! మన ప్లాన్ లో నెక్ట్స్ పార్ట్ సెంటర్ ఢిల్లీ! అతడిని ఢిల్లీ తీసుకెళ్ళగలవా?"

 

    "ఎందుకు సార్?" భయంగా అడిగింది నిశాంత.

 

    "ఢిల్లీ అనగానే ఎందుకు భయపడుతున్నావ్?"

 

    చురుకుగా, వేగంగా ఆలోచించిందామె.

 

    "అక్కడ మహంత మనుషులుంటే?"

 

    "ఈ దేశ్ ముఖ్ నీ వెనక వున్నంతకాలం మహంత మనుషులు గానీ, మహంత గానీ నిన్నేం చేయలేరు. డోన్ట్ వర్రీ...! ప్లాన్ చెబుతాను విను..." చెప్పడం ప్రారంభించాడు దేశ్ ముఖ్.

 

    నిశాంత వింటోంది.

 

    "సిద్ధార్థ ఎప్పుడూ చూడని కొత్త లోకాలు చూడాలి. జూదం... గేంబ్లింగ్, రేసులు, లోఫర్స్, డాఫర్స్, పింప్స్ మధ్య అతను తిరగాలి. మహంత గ్రేట్ ఎంపైర్ కి వారసుడు డ్రగ్స్ కు బానిస కావాలి. మత్తుమందు లేని క్షణం అతని జీవితంలో వుండకూడదు. ఆ పతనాన్ని నేను స్పష్టంగా చూడాలి. అండర్ స్టాండ్?" ఆవేశంగా అన్నాడు దేశ్ ముఖ్.

 

    "సిద్ధార్ధ ఇక్కడ లేకపోతే అనంతమూర్తికి అనుమానం వస్తుందేమో?" భయంగా అడిగింది నిశాంత.

 

    "అనంతమూర్తి... వాడి గురించి నువ్వు మర్చిపో. బైదిబై... నీకో గుడ్ న్యూస్! నీ తండ్రి కోసం ఫ్లైట్ లో జైపూర్ నుంచి ఆర్టిఫిషియల్ లెగ్ తెప్పించాను."

 

    సిద్ధార్ధ విషయంలో ఏదో ప్రశ్న వేయబోయిన నిశాంత మరి మాట్లాడలేక పోయింది.

 

    "వారం రోజులలో నీ తండ్రి నడుస్తున్న వీడియో నువ్వు చూస్తావ్. సిద్ధార్ధను ఢిల్లీ ఎప్పుడు తీసుకెళ్తున్నావ్?" ఆమె మాట్లాడటానికి ఏమాత్రం అవకాశం యివ్వకుండా అడిగాడు దేశ్ ముఖ్.

 

    "రేపే..." నిశాంత స్థిరంగా అంది.

 

    ఆ తరువాత అయిదు నిమిషాల సేపు మాటలురాని మూగదానిలా వుండిపోయింది నిశాంత.

 

    ఒక్కసారి అంతులేని నిరాశ!

 

    ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుని దేశ్ ముఖ్ కి దూరంగా వెళ్ళిపోతే?

 

    ఆయన పగకు సిద్ధార్ధతోపాటు తను కూడా బలైపోతుంది ముఖ్యముగా తన తండ్రి...

 

    తన గ్రామం... పచ్చదనాన్ని నింపుకుంటున్న తన గ్రామం శాశ్వతంగా మోడువారి పోతుంది.

 

    రెస్టారెంట్ లో పిచ్చిదానిలా పచార్లు చేస్తోంది నిశాంత.

 

    తప్పదు! సిద్ధార్ధను ఢిల్లీ తీసుకెళ్ళక తప్పదు. భారంగా నిట్టూర్చి రూమ్ లోంచి బయటకు రాబోయిన నిశాంత-

 

    ఎదురుగా లోనికొస్తున్న సిద్ధార్ధను చూసి రాని నవ్వును ముఖం మీదకు తెచ్చుకుంది.