స్నానంచేసి, దుస్తులు మార్చుకున్నాక హాయిగా కూలబడుతూ "మద్రాసు కబుర్లేమిటి?" అన్నాడు. ఈ మాట అన్నాక అతని కంఠం వణికినట్లు తోచింది.

    "మీకే తెలియాలి. నేను ఒట్టి ఆడదాన్ని!" అని రాగిణి గుమ్మం అవతల నుంచే "ఏం కూర చేయమంటారు?" అని ప్రశ్నించింది తొంగిచూసి.

    "చేపలకూర, కోడిరోస్టు, రొయ్యల పొట్టుచారు....."

    "ఛా! నేను మీదాన్నేనండోయ్!"

    "ఆ!" అంటూ అతను అదిరిపడి చటుక్కున ఇటుతిరిగాడు. ఉత్సాహంతో "మళ్ళీ చెప్పు? మళ్ళీ చెప్పు?" అన్నాడు.

    తన తప్పు తెలుసుకుని, నాలిక కొరుక్కుని "మీరూ, మేమూ ఒకటే అంటున్నాను" అంది.

    "సరే! అయితే నీకు తోచింది చెయ్యి."

    పన్నెండు దాటాకగానీ భోజనానికి పిలుపురాలేదు. రవి లోపలకు వెళ్ళి వడ్డించివున్న ఒకే ఒక విస్తరిని చూసి "ఏమిటీ అన్యాయం?" అన్నాడు.

    "ఏమిటీ?" అందామె భయ సంకోచస్వరంతో.

    "నువ్వో?"

    "ఓహో! మీరు మరీ చిలిపివారవుతున్నారే? మీరు మొగవాళ్లు. మీ ప్రక్కన కూర్చుని ఎలా భోంచేసేది?"   

    ఫర్వాలేదు. ఆడవాళ్ళప్రక్కన కూర్చోవటానికి నాకేం అభ్యంతరంలేదు."

    "ఉహు!" అని తలత్రిప్పి "మీకు ఒకదానికి అభ్యంతరం ఉంది గనుకనా?" అని విలాసంగా అతనివైపు చూసి, ఇహ తప్పేదిలేదని తనూ ఒక విస్తరి తెచ్చి త్వర త్వరగా వడ్డించుకోసాగింది.

    "ఇన్నాళ్ళూ మీ ఊళ్ళోనే వున్నారా? బొత్తిగా పత్తాలేరు. ఒక ఉత్తరం ముక్కయినా రాయకపోతిరి?"

    "అవును సుమా! నాకా ఆలోచన తోచలేదు" అని అతను విస్తుపోయాడు. మళ్ళీ కొంచెం ఆలోచించి "అయినా తీరా ఉత్తరం రాయటానికి పూనుకుంటే ఏమి రాయాలో తోచక నానాహైరానా పడేవాడ్ని. ఏమో! మీ ఆడవాళ్ళతో ఒకే ప్రమాదం. పొరపాటున నోరుజారి అహ, కలం జారి - ఒకటి రాయబోయి ఒకటి రాస్తే మీరు విరుచుకుపడతారు" అని ఆమె ముఖంలోకి ఓరగా ఒకసారి చూసి, తిరిగి గంభీరంగా అన్నం కలుపసాగాడు.

    "మీకీ విషయం ఎలా తెలిసింది?" అని తటాలున ఒక ప్రశ్నవేసి వూరుకుంది ఆమె. అతని నిర్విణ్ణుడై ఒక క్షణం వూరుకుని "చిత్తయిపోయానని ఒప్పుకున్నాను" అన్నాడు తర్వాత.

    "ఛ ఛ! నేను తమాషాకి అన్నానంతే!"

    అతను జవాబీయలేదు. ఈమె హఠాత్తుగా ఉత్తరాల విషయం ఎత్తాక తుదీ, మొదలూలేని చీటీ వ్రాసిన వ్యక్తి గుర్తుకువచ్చి మనసంతా వింత అనుభూతితో ఊగిసలాడిపోయింది. కానీ అది సంపుల్లమానమవటం లేదు.

    "అబ్బ! మీరలా ముభావంగా ఉండకండి..."

    అతను తొట్రుపాటుతో "ముభావంగా ఉన్నానా? లేదే!" అంటుండగా మరో విషయం జ్ఞప్తికివచ్చి ముఖమంతా నల్లబడిపోయింది.

    మధ్యాహ్నం బయటకు పోయినప్పుడు ముందుగా చంద్రాన్ని కలుసుకున్నాడు. తప్పినందుకు అతనేం విచారిస్తున్నట్లు భంగిమలు ప్రదర్శించలేదు. రవి ఉత్తరాలు రాయలేదని అతనికి కూడా కోపంవచ్చింది. రవి ఏవో సాకులుచెప్పి తప్పించుకున్నాడు.

    "శశి కనిపిస్తుందా?" అని రవి అడిగాడు.

    "ఉహు! నేనామెని చూడటానికి ప్రయత్నించటంలేదు" అని చంద్రం నవ్వాడు.

    "అదేం?"

    "విరోధం కాదుగానీ అలాంటిది వచ్చింది మా మధ్య."

    "ఎందుకు?"

    "ఆ రోజు మందమలయానిలం వేస్తోంది. భీచ్ లో అదృష్టంలేని ఓ యువకుడూ, మరో యువతీ కూర్చున్నారు. యువకుడు హఠాత్తుగా నిన్ను నేను ప్రేమించానన్నాడు. యువతి నిన్ను ద్వేషించానన్నది. "అయితే సెలవు " అంటూ యువకుడు లేచాడు. ఆమె ఏమీ మాట్లాడకపోయేసరికి కదిలి వచ్చేశాడు."   

    రవి నిట్టూర్చి ఊరుకున్నాడు.

    కొంచెం ఆగి చంద్రం ఇలా అన్నాడు "నాకో సందేహంగా వుంది....."

    రవి అతనివంక నిదానించి చూసి "నీ సందేహం నీకు అర్ధమైంది. కానీ బయటకు చెప్పవద్దు."

    ఆ సాయంత్రం రవి ఒంటరిగా శశి ఇంటికి బయల్దేరాడు. కనుచీకటి పడుతోంది. గేటు తలుపులు తీసి వున్నాయి.

    శశి సోఫాలో కూర్చుని నవల చదువుకుంటోంది. అడుగుల చప్పుడయ్యే సరికి తల ఎత్తి చూసి నీరవంగా నవ్వి "నువ్వా?" అంది ఆనందాతి రేకంతో.

    "నేనే. వచ్చాను."

    అతను కూర్చున్నాడు. చాలాసేపు లోకాభిరామాయణం నడిచిపోయింది. ఇంజనీర్ గారు ఇంట్లోలేరు. చదువునుగురించీ మిగతా కొన్ని విషయాలగురించీ మాట్లాడటం పూర్తయేసరికి బాగా చీకటిపడింది. "ఇహ వస్తాను, రేపు కలుస్తాను" అంటూ రవి లేచాడు.

    "ఈ పూటకి ఇక్కడ ఉండిపోకూడదూ?"

    "నేనా?" అని నవ్వి "నీకేం నువ్వలాగే చెబుతావు. ఇబ్బంది పడేది మేము" అన్నాడు.

    "ఈ మాటలకు అర్ధం స్పష్టంగా చెబుతావా?"

    "స్పష్టంగా చెప్పకపోయినా అర్ధంచేసుకోగల స్థితికి వచ్చేశాము మనం."

    "ఆఁ" అంటూ శశి తెల్లబోయింది. మరుక్షణంలో ఆమెకు తల ఎక్కడైనా దాచుకోవాలనిపించింది. కానీ ఎదుట ఈ మనిషి.... చల్లగా నవ్వబోయింది. పెదాలవరకే వచ్చిన ఆ హాసం అంతరించాక సిగ్గుపడి "కూర్చో" అంది ఉదాసీనంగా.

    అతను తిరిగి కూలబడి "ఏమిటో చెప్పు?" అన్నాడు.

    "ఇంక దాపరికం దేనికి? దొంగని దొరికిపోయానుగా!"

    ఆమె తనలో తను కుచించుకుపోయింది. ఆ సమయంలో సోగకళ్ళు ఎత్తి అతనివైపు వీక్షించే సాహసం పూర్తిగా క్షీణించిపోయింది. నూతనానందంతో తనువు పులకరించగా - కళ్ళు మూసుకుని తల వెనక్కి వాల్చింది.

    అతనేమీ చలించలేదు. "శశీ అంత తొందరపడ్డావేం?" అన్నాడు.

    బెదిరి అధోముఖియై "తప్పటడుగు వేశానా?" అనడిగింది వణికిపోతూ.

    ఈ మాటలకు రవి కంపించాడు. అయినా అది బయటకు ప్రదర్శించకుండా నిగ్రహించుకుని "చూడు శశీ! జరగబోయే భయంకర పరిణామాలకు ఇది నాందీవచనం అనిపిస్తుంది. నేను రాక్షసుణ్ణి!"