లేత గులాబీరంగు పెదవుల కోసం

 

లేత గులాబీరంగు పెదవుల కోసం

 

లేత గులాబీ రంగులో తళతళలాడే పెదవులు... మగువల ముఖారవిందానికి మరింత అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే ముఖంపై తీసుకున్న శ్రద్ధ చాలాసార్లు పెదవుల విషయంలో తీసుకోరు చాలామంది. దానివల్ల ఎండిపోవడం, చిట్లిపోవడం, నల్లబడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇక వేసవిలో అయితే ఈ సమస్య మరీ ఎక్కువ. అందుకే లిప్స్ విషయంలో కొంచెం దృష్టి పెట్టాల్సిందే. అధరాల అందాన్ని కాపాడుకోడానికి ఏం చేయాలంటే...

 

వేసవిలో బాడీ త్వరగా డీ హైడ్రేట్ అయిపోయి చర్మం వడలిపోతుంది. ఆ మార్పు పెదవుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే వీలైనంత ఎక్కువ నీటిని తాగితే చర్మంలో తేమ పెరుగుతుంది. పెదవులను అస్తమానం తాకడం, చిట్లిపోతే కనుక చర్మాన్ని పట్టి లాగడం, గరకుగా ఉండే బట్టతో తుడవడం లాంటివి చేయకూడదు. లిప్ స్టిక్ వేసుకునే అలవాటు ఉంటే... బయటి నుంచి రాగానే లిప్ స్టిక్ ను వెంటనే కడిగేసుకుని లిప్ బామ్ రాయండి. ఇంట్లో కూడా లిప్ స్టిక్ రాసుకోవడం వంటివి అస్సలు చేయకండి. చాలామంది ఒళ్లంతా రాసుకున్న క్రీమ్ నే పెదవులకూ రాసేసుకుంటూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. పెదవుల మీది చర్మం చాలా పలుచగా, సున్నితంగా ఉంటుంది. అందుకే దానికోసం తయారైన క్రీమ్ ను కానీ బామ్ ను కానీ రాసుకోవాలి. 

 


ఇదంతా పెదవులు పాడవకుండా ఉండటం కోసం. అయితే మీరు అశ్రద్ధ చేయడం వల్ల ఆల్రెడీ మీ పెదవులకు డ్యామేజ్ జరిగితే కనుక ఈ చిట్కాలు పాటించి చూడండి.


* పెదవుల్ని తరచుగా చక్కెరతో రుద్దుతూ ఉండండి. దానివల్ల మృతకణాలు తొలగిపోయి పెదవులు సాఫ్ట్ గా అవుతాయి.


* లిప్స్ కి అప్పుడప్పుడూ నిమ్మరసం రాస్తూ ఉంటే... పగుళ్లు, పొడిదనం తగ్గడంతో పాటు నలుపు కూడా పోతుంది. రోజ్ వాటర్ లో కొద్దిగా తేనె కలిపి రాసుకున్నా కూడా పెదవుల నలుపు పోయి అక్కడి చర్మం కాంతివంతమవుతుంది.

* బీట్ రూట్ ను బాగా గ్రైండ్ చేసి రసం తీయండి. దీన్ని రోజూ రాత్రిపూట పడుకునే ముందు పెదవులకు రాసుకుని, ఉదయం లేచాక కడిగేసుకోండి. ఓ వారం రోజులు ఇలా చేస్తే మీ పెదవులు ఆరోగ్యంగా కనిపించడమే కాదు, మంచి రంగులో కూడా ఉంటాయి.


* ఆలివ్ ఆయిల్ కూడా చర్మపు పొడిదనాన్ని పోగొట్టి తేమను పెంచుతుంది. అందుకే ఆలివ్ ఆయిల్ రాస్తే పెదవులు తేమగా ఉండటమే కాక ఎండ వల్ల ఏర్పడిన నలుపు తగ్గుతుంది. 

* తరచుగా దానిమ్మరసం రాసుకుంటే లిప్స్ డ్రై అవకుండా ఉంటాయి. పైగా చక్కని గులాబీరంగును పులుముకుంటాయి. ఆ తర్వాత లిప్ స్టిక్ తో పనే ఉండదు.


* పాలు, పాల క్రీమ్, మీగడ వంటివి కూడా పెదవులకు మేలు చేస్తాయి. వీటిని కూడా రాత్రిళ్లు రాసుకుంటూ ఉంటే మంచిది.

 

మీ పెదవులను కాపాడుకోవడానికి ఈ చిట్కాలు ఎంతో ఉపయోగపడతాయి. మీ వీలును బట్టి మీకు నచ్చిన చిట్కాలు ఫాలో అవ్వండి. మీ అధరాల అందాలను మరింత పెంచుకోండి. 

 

- Sameera