"సరిగ్గానే మాట్లాడానా?" ఆమె తనకెదురుగా వున్న సామంత్ ని ప్రశ్నించింది.

 

    సామంత్ చిర్నవ్వుతో తలూపాడు.


                                 *    *    *    *


    "అపజయాల నిచ్చెన ఆఖరిమెట్టు విజయాల నిచ్చెన తొలిమెట్టవుతుంది.

 

    అపజయాల నిచ్చెన తొలిమెట్టుపై ఎదురయ్యే అపజయం నీ ప్రణాళికలోని లోపం వలన సంభవిస్తుంది.

 

    రెండో మెట్టుపై ఎదురయ్యే అపజయం నీలోని ఆత్మ విశ్వాసరాహిత్యం మూలంగా సంభవిస్తుంది.

 

    మూడోమెట్టుపై ఎదురయ్యే అపజయం నీ సోమరితనం మూలంగా సంభవిస్తుంది.

 

    నాల్గవ మెట్టుపై ఎదురయ్యే అపజయం నీలోని క్రమశిక్షణారాహిత్యం మూలంగా సంభవిస్తుంది.

 

    ఐదవ మెట్టుపై ఎదురయ్యే అపజయం నీలోని దీక్షా, దక్షతల లోపం మూలంగా సంభవిస్తుంది.

 

    ఆరవమెట్టుపై ఎదురయ్యే అపజయం నీవాళ్ళని నువ్వు భావించే నీ ఆప్తులు, మిత్రులు, బంధువుల విశ్వాస ఘాతుకత్వం మూలంగా సంభవిస్తుంది.

 

    ఏడవమెట్టు మీలో నిరాశను, ఒంటరితనాన్ని పెంచి ఓడిస్తుంది.

 

    ఎనిమిదవ మెట్టు ఏడు అపజయాల్ని రుచి చూశావు గదా - ఇంకా విజయం సాధించగలవను కుంటున్నావా అంటూ నీ అస్తిత్వాన్ని, ఆశల్ని ప్రశ్నించి ఓడిస్తుంది.

 

    తొమ్మిదవ మెట్టు నీ ఆత్మ స్థయిర్యాన్ని నిలదీస్తూ, అపజయాల అనుభవాల నుంచి ఏం పాఠాలు నేర్చుకున్నావని నిగ్గదీస్తుంది.

 

    ఒకటి నుంచి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యలయిపోతాయి. ఇక మిగిలింది జీరో. నువ్వే ఓ జీరో అయినప్పుడు జీరో అయిన నేను నిన్నేం ప్రశ్నిస్తాను అని మౌనంగా మిన్నకుంటుంది జీరో.

 

    అప్పుడు జారిపోతే జీవితమే అంధకారం అవుతుంది.

 

    అప్పుడు సయితం వేసే నీ అడుగు అపజయాల నిచ్చెన ఆఖరి మెట్టుమీద పడుతుంది.

 

    అపజయాల నిచ్చెన తొలిమెట్టు ఒకటితో ప్రారంభమవుతుంది. ఆ జయాల నిచ్చెన ఆఖరి మెట్టు కూడా ఒకటితోటే అంతమవుతుంది. ఆ ఒకటి విజయాల నిచ్చెన తొలిమెట్టు.

 

    జయాపజయాలకు ఆ ఒక్క మెట్టు ఎప్పుడూ కామన్ గా వుంటుంది.

 

    ఆ మెట్టుపై నుంచే ఎవరు ఎదిగినా... ఎవరు దిగిపోయినా... ఎవరు విసిరివేయబడినా...

 

    అందుకే నీ అపజయాన్ని గురించి అపహాస్యం చేసిన మూర్ఖుడ్ని చూసి జాలిపడు. నీ ఆత్మ విశ్వాసాన్ని ప్రశ్నించిన అర్భకుడ్ని చూసి మరింత ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసుకొని గర్వపడు.

 

    అప్పుడు విజయం నీ నీడలా నిన్నే అంటిపెట్టుకుని వుంటుంది.

 

    అప్పుడు సక్సెస్ నీ అబ్సెషన్ అవుతుంది. మరి కొన్నాళ్ళకు విజయం ఎప్పుడూ నిన్నే వరించాలని అదే నీ వెనుక పడుతుంది. నువ్వే దానికి ఒక అబ్సెషన్ అవుతావు.

 

    ఇప్పుడు చెప్పు... అపజయం ఎదురైతే నువ్వు భయపడాలా?

 

    చీకటిపడగానే ఆందోళన చెందాలా? దుఃఖం ఎదురైతే కృంగిపోవాలా?

 

    లేదు - రేపు సాధించే విజయం...

 

    తెల్లవారితే వచ్చే వెలుగు... తేరుకుంటే ఎదురొచ్చే సుఖం...

 

    నీలోని భయాన్ని, ఆందోళనను, దుఃఖాన్ని మ్రింగేస్తాయి..." ఆపకుండా చెప్పింది నాగమ్మ.

 

    ఇప్పుడవన్నీ ఎందుకు చెప్పిందో అర్థంకాక నాయకి ఒకింత ఆశ్చర్యపోయింది.

 

    నాయనమ్మ ఎందుకంత సీరియస్ గా అవన్నీ చెప్పింది...ఆమె కళ్ళ లోతుల్లో ఎక్కడో పరాజయపు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.

 

    తన నాయనమ్మకి పరాజయమా...? నాయకి ఆలోచనలు ఒక నిర్దుష్టమైన స్వరూపాన్ని సంతరించుకోకుండానే నాగమ్మ లేచింది.

 

    నాయకి ఏదో అడగాలని, ఎన్నో అనుమానాల్ని తీర్చుకోవాలనే వుంది కాని నాయనమ్మ మోములో కనిపించిన గాంభీర్యాన్ని చూసి ఆ సాహసం చేయలేకపోయింది.


                                                       *    *    *    *


    "క్యాసెట్ లో రికార్డ్ చేయడం పూర్తి అయినట్లేగా...?" పీటర్ ఫోన్ లో అర్జునరావుని ప్రశ్నించాడు.

 

    "పూర్తయింది. మరో అరగంటలో అది నీ హోటల్ రూమ్ కి అందుతుంది. ఆ యువకుడ్ని దాన్ని జాగ్రత్తగా పరిశీలించమను. టైమ్ దగ్గర పడుతోంది. త్వరలోనే రంగప్రవేశం చేయవలసి వుంటుందని కూడా చెప్పు. వుంటాను" అర్జునరావు ఫోన్ పెట్టేశాడు.

 

    ఆ సంఘటన జరిగిన ఇరవై ఏడు నిమిషాలకు వీడియో కేసెట్ తీసుకుని ఓ కుర్రాడు పీటర్ వున్న హోటల్ కి వచ్చి దాన్ని రిసెప్షన్ లో యిచ్చి పీటర్ రూమ్ నెంబర్ చెప్పి వెళ్ళిపోయాడు.

 

    మరో నిమిషానికి ఆ కేసెట్ పీటర్ రూమ్ కి చేరుకుంది.

 

    ఆ కేసెట్ ని చేతిలోకి తీసుకుని, దాన్ని అటూ ఇటూ తిప్పి చూస్తూ చిన్నగా నవ్వుకున్నాడు.

 

    ఆ వెంటనే దాన్ని టీపాయ్ మీద వుంచి ఓ నంబర్ డయల్ చేశాడు.

 

    "ఎస్... కనకారావు స్పీకింగ్"

 

    "నేను... మాట్లాడుతున్నాను" పీటర్ కంఠం సీరియస్ గా వుంది.

 

    "ఎస్ సార్..." వినయంగా అన్నాడు కనకారావు.

 

    "ఎంతవరకొచ్చాడు...?"

 

    "దాదాపు చివరకు వచ్చాడు సార్"

 

    "వెరీగుడ్... వచ్చే వారంలో ఏ రోజైనా అతని అవసరం రావచ్చు జాగ్రత్త..."

 

    "మీరెప్పుడు వస్తున్నారు సార్...?"

 

    "నేనీ రోజే ఇండోర్ వెళ్తున్నాను. అతను ఎమ్ టెక్., పిహిచ్ డి. చేసినట్టు రుజువు చేసే సర్టిఫికెట్స్ సంపాదించాలి, సాయంత్రానికి అతని పాస్ పోర్ట్సు ఓ పది దాకా కావాలి. అలాగే అతని పుట్టుమచ్చల వివరాలు కూడా కావాలి. సాయంత్రానికి ఇవన్నీ నాకందాలి. అదీ ఆరున్నర లోపే. వుంటాను..." పీటర్ ఈవేపు ఫోన్ పెట్టేశాడు.

 

    కనకారావు చెమటతో ముద్దయ్యాడు భయంతో.

 

    సాయంత్రం ఆరున్నరలోపు సామంత్ పాస్ పోర్టు ఫోటోలు కావాలి.

 

    సామంత్ గంటక్రితమే బయటకెళ్లాడు. ఎప్పుడొస్తాడో తెలియదు. బహుశా సాయంత్రమైనా కావచ్చు... ఎలా...?

 

    ఒకింతసేపు కాలుగాలిన పిల్లిలా అటూ ఇటూ అనీజీగా తిరిగి ఓ నిర్ణయానికొచ్చి బయటకు దూసుకుపోయాడు.


                                                        *    *    *    *


    "నాకెందుకో భయంగా వుంది" అంది మధుమతి సామంత్ కేసి చూస్తూ.