జూన్ ఆరునే మృదులకు కూడా షరీఫ్ నుంచి ఇన్విటేషన్ అందింది.
    
    ఆ ఇన్విటేషన్ లో స్పెషల్ ఇన్ వైట్ అనే కాలం ఎదురుగా మాస్టర్ పేరుండడంతో ఆమె అనందానికి అవధులు లేకుండా పోయాయి.
    
    బొంబాయి షరీఫ్ ఇచ్చే పార్టీకి ఇన్విటేషన్ రావటం గొప్ప ప్రివిలేజ్ గా భావిస్తున్నారంతా.
    
    పార్టీ జరిగే స్థలం జుహు జూబ్లీ గార్డెన్స్.
    
    జూన్ : 6 సాయంత్రం 4-30కి షరీఫ్ నుంచి బొంబాయి పోలీస్ కమీషనర్ కి బందోబస్తు, సెక్యూరిటీ గురించి ఒక లెటర్ వెళ్ళింది.
    
                                                   *    *    *    *    *
    
    జూన్ 7 : జోహ్రా తెల్లవారుఝామున మూడున్నర గంటలకే షుట్ కోపర్ వెళ్ళాడు.
    
    అర్ధరాత్రి వరకు త్యాగరాజన్ ఇంటిముందు నిఘా వేసిన సి.బి.సి.ఐ.డి. ఇన్ స్పెక్టర్ కునుకు తీయటానికి ఇంటికి వెళ్ళిపోయాడు.
    
    జోహ్రాకి నిఘా అధికారుల మనస్తత్వం బాగా తెలుసు. అందుకే ఆ సమయాన్ని ఎన్నుకొని ఆ ప్రాంతానికి వచ్చాడు.
    
    కాలినడకన వడివడిగా నడుస్తూ త్యాగరాజన్ ఇంటివెనుక ప్రాంతానికి వెళ్ళి, కొద్దినిమిషాలు అక్కడే ఆగి అనుమానాస్పదమయిన వ్యక్తులెవరయినా ఉన్నారా అని పరిశీలనగా చూసి, లేరని నిర్దారించుకోగానే చటుక్కున త్యాగరాజన్ ఇంట్లోకి ప్రవేశించాడు.
    
    ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.
    
    చకచకా నేలమాళిగలోకి ప్రవేశించాడు.
    
    త్యాగరాజన్ ఆదమరచి నిద్రపోతున్నాడు.
    
    సీక్రెట్ ఫైర్ ఆర్మ్స్ తయారుచేస్తున్న ఆనవాళ్ళే లేవక్కడ.
    
    ఒక సాధారణ పౌరుడి గృహంలా ఉందాగది.
    
    అతని జాగ్రత్తకు జోహ్రా పెదాలు విడివడకుండా నవ్వుకున్నాడు.
    
    దగ్గరకు వెళ్ళి త్యాగరాజన్ తట్టిలేపాడు.
    
    త్యాగరాజన్ ఉలిక్కిపడి కళ్ళు నులుముకొని జోహ్రాకేసి చూసి భయంతో వణికిపోయాడు.
    
    అతనెందుకలా భయపడుతున్నాడో అర్ధంకాలేదు జోహ్రాకి.
    
    "మీరెవరు? ఎందుకొచ్చారు?" భయపడుతూనే ప్రశ్నించాడు త్యాగరాజన్.
    
    అప్పటికిగాని జోహ్రాకి అసలు విషయం అర్ధంకాలేదు.
    
    తను అంతకు ముందు త్యాగరాజన్ దగ్గరకు వచ్చినప్పుడు మామూలుగా ఉన్నాడు.
    
    ఇప్పుడు మేకప్ ద్వారా తననితానే గుర్తుపట్టలేనట్లుగా మార్చేసుకున్నాడు. బహుశా అందుకే తనని గుర్తుపట్టి ఉండడు అని ఆలోచించిన మీదట-
    
    "నాకింకా ఎంత రావాలని మీరడగాలి. అడగలేదేం?" అన్నాడు జోహ్రా.
    
    అప్పటికి త్యాగరాజన్ సర్దుకున్నాడు.
    
    "మీరు 'జె' మనిషా?" ప్రశ్నించాడు త్యాగరాజన్.
    
    "అవును" అన్నాడు జోహ్రా.

    "నాకింకా ఎంత రావాలి?" త్యాగరాజన్ ప్రశ్నించాడు.
    
    "మీకింకా 99,997-33 రావాలి. అవి తెచ్చాను. మీరివ్వవలసినది ఇచ్చేస్తారా?" అన్నాడు జోహ్రా.
    
    త్యాగరాజన్ జోహ్రాని జోహ్రామనిషే అనుకొని ఊపిరి తీసుకున్నాడు.
    
    "మీరు వచ్చేప్పుడు వెనుకా ముందు చూసుకొనే వచ్చారా?" తిరిగి ప్రశ్నించాడతను.
    
    "అలా చూసుకొని రావల్సిన అవసరం మీకేకాదు- నాకు ఉంది. ఇదిగోండి డబ్బు" అంటూ జోహ్రా ఒక లెదర్బ్యాగ్ ని త్యాగరాజన్ కి అందించాడు.
    
    అతను త్వరత్వరగా బ్యాగ్ ని ఓపెన్ చేసి క్షణాల్లో 99,997-33ని లెక్క పెట్టుకొని సంతృప్తిగా తల పంకించి బాత్ రూంలోకి వెళ్ళాడు. క్షణాల్ని లెక్కపెట్టుకుంటూ జోహ్రా అక్కడే ఉండిపోయాడు.
    
    కొద్దిక్షణాలకు ఒక జాజి చెక్కపెట్టెను తీసుకొని బాత్ రూంలోంచి వచ్చాడతను.
    
    అందులోనే తను ఆర్డర్ చేసిన ఫైర్ ఆర్మ్ ఉందని జోహ్రా ఊహిస్తుండగా త్యాగరాజన్ చకచక పెట్టెని ఓపెన్ చేశాడు. దానిలో వయొలెన్ కనిపించింది. దాన్ని చూసి జోహ్రా ఆశ్చర్యపోయాడు.
    
    జోహ్రా చూస్తుండగానే వయిలెన్ ని పార్ట్స్ పార్ట్స్ క్రింద విప్పదీసి విడిగా చూపించాడతను.
    
    అప్పుడర్ధమయింది జోహ్రాకి. అవి తను ఆర్డర్ చేసిన ఫైర్ ఆర్మ్ పార్ట్స్ ని.
    
    జోహ్రా మొఖంలో ఆనందం ఒక్కక్షణం తొణికిసలాడింది.
    
    క్షణాల్లో దాన్నెలా ఫిట్ చేయాలో, ఎలా ఎయియ్ చేయాలో చూపించి, తిరిగి దాన్ని వయిలెన్ షేప్ లో బిగించి జోహ్రాకి అందించాడు.
    
    "ఈ పెట్టెలోనే ఇన్నర్ లేయర్ లో బుల్లెట్స్ ఉన్నాయి, ఇది సరిగ్గా మీ ఊహకు తగ్గట్లుగానే రూపొందించాను. ఏమాత్రం తేడాలేదు. పొరపాటు రాదు. కమాన్ క్విక్... దీన్ని తీసుకొని త్వరగా వెళ్ళిపోండి" అంటూ త్యాగరాజన్ తొందర చేసాడు.
    
    అతని మొఖంలో కనిపిస్తున్న ఆదుర్దాని, ఆందోళనని అర్ధం చేసుకున్న జోహ్రా క్షణాల్లో అక్కడినుంచి అదృశ్యమయిపోయాడు.
    
    జోహ్రా వెళ్ళిన కొద్దినిమిషాలకే ఆ ఇంటిని వదిలేసి వెళ్ళిపోయాడు త్యాగరాజన్.
    
                                                 *    *    *    *    *
    
    జూన్ 8 :
    
    మాస్టర్ షరీఫ్ పార్టీకి ఖచ్చితంగా వస్తున్నట్లు మిల్లర్ పార్టీ నిర్వాహకులకు వర్తమానం పంపాడు. బొంబాయి పోలీసులే మాస్టర్ రక్షణ పట్ల భయపడుతుంటే మిల్లర్ అంత ధైర్యంగా ఆ ప్రోగ్రాంని ఎలా ఫిక్స్ చేసారు?
    
    ఎల్.ఆర్.ఎఫ్.బీ లే కాదు. మాస్టర్ కమెండోస్ అంతా ఆ విషయంలో తర్జనభర్జన పడ్డారు.
    
    తను ఏదైతే కోరుకున్నాడో దాన్నే మిల్లర్ స్వయంగా అంగీకరించటంతో మాస్టర్ చాలా సంతోషపడ్డాడు.
    
                                                  *    *    *    *    *