ఆనందం ఇంటి యజమాని ధ్రువీకరణ పత్రం రాస్తుండగా భువనేశ్వరీదేవి లోన్నించి పొడవాటి పాతకాలం ఇత్తడి గ్లాసుల్తో కాఫీలు తెచ్చిచ్చింది.

 

    "ఈ కాఫీ ఇప్పుడే తాగాలా? రేపు కొంచెం, ఎల్లుండి కొంచెం తాగొచ్చాండీ" వినయంగా అడిగాడు ఆంజనేయులు అంత పెద్ద గ్లాసుల్ని చూసి కంగారుపడుతూ.

 

    "ఈ గ్లాసుడు కాఫీ తాగకపోతే మీరేం కుర్రాళ్ళయ్యా బాబూ... తాగండి... రోజూ మూడు పూట్లా అలాంటి గ్లాసుల్తో మూడు గ్లాసుల కాఫీ తాగుతాను నేను" ధ్రువీకరణ పత్రమ్మీద సంతకం పెట్టేసి, తన గ్లాసుని అందుకుంటూ అన్నాడు భుజంగరావు.

 

    ఆ కాఫీల్ని తాగడానికి వాళ్ళిద్దరికీ అరగంట పట్టింది.

 

    ఇంకా రెండ్రోజుల వరకూ మరి కాఫీ జోలికి వెళ్ళాల్సిన పనిలేదు అని అనుకుని థాంక్స్ చెప్పి, రేపుదయాన్నే వస్తామని చెప్పి, బయటికొచ్చారు ఆంజనేయులు, ఆనందం.

 

    "తంతే... ముత్యాలముగ్గు బిల్డింగ్ లో పడ్డాంరా..." ఆనందంగా అన్నాడు ఆంజనేయులు.

 

    అప్పటికే ఆనందం జాతర్లలో వేసే కోయడాన్స్ వేస్తున్నాడు ఇల్లు దొరికిందన్న ఆనందాన్ని భరించలేక.

 

    ఆంజనేయులు ఒక్కటేశాక దారికొచ్చాడు.

 

    "ఇప్పుడు మనం ఈ వీధి పోస్ట్ మాన్ ని కలిసి ఇంకొక ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. తెలిసిందా?"

 

    "పోస్టాఫీసుకి పద" అన్నాడు ఆనందం హుషారుగా.

 

    "అంతా బాగానే వుంది. వారం రోజుల్లో అమ్మాయిని తీసుకురావాలి గదరా? ఎవరు దొరుకుతారు? రేపు మనకి ఛ... తప్పు... తప్పు... నాకు పెళ్ళి కాలేదని, ఇదంతా కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్రామా గ్రూప్ అని తెలిస్తే... గొడవలైపోవూ...?" భయంగా అన్నాడు ఆంజనేయులు.

 

    "ఒరేయ్... అంజిగా... బుద్ధిమంతుడు ఏం చేస్తాడో తెల్సా... జరిగిన దానిని గురించి సంతోషిస్తాడు... జరగాల్సిన దానిని గురించి మరిచిపోతాడు. ప్రస్తుతానికి నువ్వా పని చెయ్యి... పద..."

 

    ఇద్దరూ పోస్టాఫీసు కెళ్ళి, పోస్టుమాన్ ని పట్టుకుని ధ్రువీకరణ పత్రం తీసుకుని మెస్ కి వెళ్ళి భోజనాలు చేశాక ఆనందం టెలిఫోన్ బూత్ కి వెళ్ళిపోతే, ఆంజనేయులు అప్పలరాజు సప్లయింగ్ వరల్డ్ కి బయలుదేరాడు.


                             *    *    *    *


    ముప్పై మంది 'స్టాఫ్' అప్పలరాజు ఉపన్యాసం కోసం చెవులు రిక్కించుకుని ఎదురు చూస్తున్నారు.

 

    అందులో సగానికి కొత్త వాళ్ళే వున్నారు.

 

    మేనేజింగ్ డైరెక్టర్ అప్పలరాజు తన ఉపన్యాసాన్ని ప్రారంభించాడు.

 

    "మైడియర్ ఫ్రెండ్స్!"

 

    కొత్తగా ఈ సంస్థలో చేరిన మీకందరకూ మొదట అభినందనలు తెలుపుతూ మన సంస్థ గురించి ఒక్క నాలుగు ముక్కలు చెపుతున్నాను. మన సంస్థకు స్నేహితులెంతమందో, శత్రువులు కూడా అంతేనని తెలుసుకోవాలి. నాలుగు కుర్చీలు, నలుగురు మనుషులు తప్ప, అక్కడేం వుందని మన గురించి అందరూ ఎగతాళి చేస్తుంటారు మీరు పట్టించుకోవద్దు. ఎందుకంటే, అలాగ మనకు వ్యతిరేకంగా ప్రచారం చేసే వాళ్ళెవరో కాదు, మన సంస్థలో మానేసి వెళ్ళిపోయినావాళ్ళే. ఇక్కడ ఆర్నెల్లకంటే ఎవర్నీ వుంచరని, బయటకు పంపిచేస్తారని అందరూ అంటుంటారు... కష్టపడి పనిచేసే వాళ్ళకి యిక్కడ పర్మనెంటు ఉద్యోగాలుంటాయి ఆటలాడేవాళ్ళకి ఇక్కడ కుదరదు...

 

    కాగా ఈ కంపెనీ 'వర్కే'మిటని చాలా మందికి 'డౌట్' జంట నగరాల్లోని పౌరులకు కావల్సినవి కనుక్కుని వాళ్ళకు అందచేయడమే మన పని... ఇది నా 'మెదడు బిడ్డ' గత పదేళ్ళుగా యిది లాభాల్తో వర్థిల్లుతోందంటే దానికి కారణం సంస్థ సిబ్బందేనని నేను నమ్ముతున్నాను..."  

 

    ఆయన ఉపన్యాసం అయ్యాక కొత్త ఉద్యోగుల పరిచయ కార్యక్రమం అరగంటసేపు జరిగింది.

 

    అదయిపోయాక అందరూ వెళ్ళిపోదామనుకున్న తరుణంలో మళ్ళీ అప్పలరాజు లేచి "ఇప్పుడు అందరికీ ఆసక్తిదాయకమైన ఓ కార్యక్రమం వుంది... సంస్థ ఉద్యోగులందరూ తమ మేనేజింగ్ డైరెక్టర్ని గౌరవించుకుంటారు" అని ఎనౌన్స్ చేసి కుర్చీలో కూర్చున్నాడు.

 

    ఉద్యోగులు ఒకరి మొహాలు ఒకరు చూసుకుని, తప్పదన్నట్టు అప్పటికప్పుడు జేబుల్లోంచి డబ్బులు తీసుకుని దండలు తెప్పించి, అప్పలరాజు మెడలో వేసి ఆయన్ని పొగిడారు.

 

    ఆ కార్యక్రమం అంతా పి.ఆర్.ఓ. ఆంజనేయులు ఆధ్వర్యంలోనే నడిచింది.

 

    అదై పోయాక-

 

    మేనేజింగ్ డైరెక్టర్ని సన్మానించిన సందర్భంగా సంస్థకు సెలవు ప్రకటించాడు ఎం.డి. తరఫున పి.ఏ. చిదంబరం.

 

    "మిస్టర్ ఆంజనేయులూ... సెలవు అందరికీ వర్తిస్తుంది కానీ... పి.ఆర్.ఓ.లకు వర్తించదు... నువ్వు ఆఫీసులో కూర్చుని జాగ్రత్తగా ఫోన్లని రిసీవ్ చేసుకో... నాకు అర్జంటుగా పనుంది... అన్నపూర్ణా స్టూడియోలో కొత్త సినిమా షూటింగ్ జరుగుతోందట... చూసొస్తాను... నాకు సిన్మా షూటింగులంటే తగని పిచ్చిలే... వస్తే సాయంత్రం వస్తాను... లేకపోతే రేపు కలుద్దాం..." అని చెప్పేసి వెళ్ళిపోయాడు అప్పలరాజు.

 

    "వీడెక్కడి బాసు - ఇదెక్కడి ఆఫీసురా దేవుడోయ్..." అనుకుంటూ కుర్చీలో చేరబడ్డాడు ఆంజనేయులు.

 

    మరో ఐదు నిమిషాల్లో అతనక్కడ లేడు... అంటే భౌతికంగా వున్నా, మానసికంగా లేడన్నమాట. అప్పటికే అతను గుర్రుపెట్టి నిద్రపోతున్నాడు.

 

    ఆ సమయంలో -

 

    ప్రవేశించింది మేరీ మాథ్యూస్.

 

    "ఆంజనేయులుగారూ... ఆంజనేయులుగారూ..." అరిచి గోలెట్టినా లేవకపోవటంతో ఎం చేయాలో తోచక, వాచ్ మెన్ దగ్గరున్న 'విజిల్'ని తీసుకుని ఊదింది.

 

    "నా స్టాపొచ్చేసిందా... అప్పుడేనా...." ఆవలింతలు తీస్తూ చుట్టూ చూశాకగానీ తెలీలేదు.

 

    "ఏవండీ రాత్రంతా నిద్రలేదా... అలా 'రీ సౌండ్ స్లీప్'లో వున్నారు" అడిగింది మేరీ మాథ్యూస్ అమాయకంగా.

 

    "అలాంటిదే అనుకోండి... పక్కనున్నవాళ్ళు పడుకోనిస్తే గదా... పడుకోడానికి... నా పక్కనో వసపిట్ట ఉందిలెండి... నన్ను పడుకోనివ్వకుండా చంపేస్తుందది..." ఆంజనేయులు మాటల్ని ఇంకోరకంగా అర్థం చేసుకుంది మేరీ.

 

    "మీ భార్య వసపిట్టా అండీ..." అంది తను బోల్డంత సిగ్గు పడిపోతూ.

 

    "భార్యా... అంత అదృష్టమా... ఇంకా నాకు పెళ్ళి కాలేదండి... వసపిట్టంటే... పుంలింగమే, స్త్రీ లింగం కాదు... మా ఫ్రెండన్నమాట... మా రోడ్ మేట్"