హ్యూమరాలజీ
                                                                   (వాల్యుమ్ -2)    

                                                                          _యర్రంశెట్టి శాయి    

 

                                    


                                                        ట్రాఫిక్ జామ్


                                   


    మామూలుగానే రాత్రి పదకొండింటివరకూ బోఫర్స్ కుంభకోణాల గురించీ, ఎన్టీఆర్, హెగ్డేల అవినీతి గురించీ సరదాగా కబుర్లు చెప్పుకుని అందరం ఎవరిళ్ళకు వాళ్ళు బయల్దేరాం. అప్పటికే ఆడాళ్ళంతా విసుక్కుంటున్నారు మా మీద.

 

    "మీ అందరికీ పనీపాటా లేకుండాపోయింది. అక్కడికి మీరంతా నీతిపరులయినట్లు దేశంలోని కరప్షన్ గురించి ఊరికే హడావుడి పడిపోతున్నారు" అంది మా ఆవిడ.

 

    నాకు వళ్లు మండిపోయింది.

 

    "మేము అవినీతిపరులమా?" కోపంగా అడిగాను.

 

    "అబ్బే- అవినీతంటే మీకేం తెలుసని? సిగ్గులేపోతేసరి" అంది శాయిరామ్ భార్య.

 

    "మొన్నటికి మొన్న మీరు ఏదో ఫైల్ ఎవరికో అనుకూలంగా నోట్ రాసి పుటప్ చేసినందుగ్గాను ఆ పెద్దమనిషి ఓ ఎలక్ట్రానిక్ వాచీ ఇచ్చాడని తీసుకొచ్చారా లేదా?" జనార్ధన్ భార్య నిలదీసింది.

 

    జనార్ధన్ కి వళ్ళు మండిపోయింది. "అది వేరు! దాన్ని లంచం అనరు! గిఫ్ట్ అంటారు."

 

    దాంతో రంగాభార్య విరుచుకుపడింది. "అలాగా! అయితే మరి మొన్న మావారు ఎవరిదో ఫైల్ పుటప్ చేయకుండా ఆలస్యం చేసినందుగ్గాను వాడెవడిదగ్గరో పార్టీ తీసుకోలేదా? దాన్నేమంటారు?" వెటకారంగా అడిగిందామె.

 

    "మా వారు ఏం తక్కువ కాదులెండి! మొన్న ఆ సన్మాన సంఘం వాళ్ళు ఎవరిదగ్గరో డబ్బు తీసుకుని చేసిన సన్మానం తాలూకు న్యూసూ, ఫోటోలు 'ఈక్షణం' పేపర్ లో వేయించినందుకుగాను వాళ్ళిచ్చిన టేబుల్ ఫాన్ తీసుకున్నారా లేదా?"

 

    గోపాల్ రావ్ ముఖంలో కళ తగ్గిపోయింది.

 

    "ఛట్ ఛట్ ఛట్! అది అవినీతెలా అవుతుంది. "పరస్పర సహాయం" అంటారు దానిని."

 

    ఇంక వాగ్వివాదం కొనసాగితే పరువు పోయేట్లుందని యాదగిరి కయ్ మని లేచాడు ఆడాళ్ళమీద.

 

    "మీకేం దమాకున్నదా లేదా? మేమ్ తీసుకున్నాగానీ దాని వాల్యూ ఎంత? వంద లేక రెండొందలు! కాకుంటే నాల్గొందలు- మన నాయకుల్ తీస్కొనెడిది కోట్లు - దానికీ దీనికీ సంబంధమేమున్నది? పదండ్రి- అందు గురించే లేడీస్ దమాక్ దేడ్ దమాక్ అనెడిది"

 

    ఆడాళ్ళంతా అతని మీద నిరసన తెలియజేసినా మొత్తానికి ఎవర్దారిన వాళ్ళు డిస్పర్స్ అయిపోయారు.

 

    రాత్రి పన్నెండయింది. అప్పుడే నిద్రపడుతోంది నాకు.

 

    అంతలోనే తలుపు దబదబ బాదిన చప్పుడు. మళ్ళీ ఎవడికి ఏం ముంచుకొచ్చిందా అనుకుంటూ వెళ్ళి తలుపు తెరచాను.

 

    ఎదురుగ్గా రామచంద్రమూర్తిగారు నిలబడి వున్నారు విచారంగా. ఆయన మా కాలనీ వ్యక్తే కావటం వల్ల "ఏమిటి మాష్టారూ?" అనడిగాను.

 

    దాంతో ఆయన భోరున ఏడ్చేయటం ప్రారంభించాడు. ఆ ఏడుపు వినడంతోనే క్షణాల్లో మా వాళ్ళంతా పరుగుతో వచ్చేశారు.

 

    "ఏమిటి? ఏం జరిగింది? ఎన్ టిఆర్ మళ్ళీ రిటైర్ మెంట్ ఏజ్ తగ్గించాడా?" అనుమానంగా అడిగాడు రంగారెడ్డి. ఎందుకంటే మా కాలనీలో చాలామంది అదే భయంతో రోజులు గడుపుతున్నారు.

 

    "అది కాదండీ- మా అమ్మాయ్ సంధ్యారాణి..."

 

    మా గుండె ఝల్లుమంది-

 

    "ఆ! ఏమయిందా అమ్మాయికి?"

 

    "ఉదయం తొమ్మిదిగంటలకు మామూలుగానే ఆఫీస్ కెళ్ళింది. ఇంతవరకూ తిరిగిరాలేదు-" అంటూ మళ్ళీ భోరుమన్నాడతను.

 

    ఈలోగా వాళ్ళావిడ కూడా పెద్దగా ఏడుస్తూ వచ్చేసింది.

 

    "మీరే మా అమ్మాయిని మాకు తెచ్చియ్యండి దేవుడో" అంటూ శాయిరామ్ కాళ్ళమీద పడిపోయింది. వాళ్ళిద్దరినీ ఓదార్చి సంధ్యారాణి ఏమయిపోయివుంటుందా అని డిస్కషన్ మొదలుపెట్టాం.

 

    "మనదేశంలో వయసులో ఉన్న ఓ అమ్మాయి రాత్రి పన్నెండింటివరకూ ఇంటికి తిరిగిరాలేదంటే ఏమిటర్థం?" అడిగాడు రంగారెడ్డి.

 

    "ఇంకేముంటుంది? తప్పకుండా రేప్ కీ, మర్డర్ కీ ఆహుతయిపోయి వుంటుంది" అన్నాడు గోపాల్రావ్.

 

    అందరం వెంటనే గోపాల్రావ్ అభిప్రాయంతో ఏకీభవించక తప్పలేదు.

 

    "అయితే మరిప్పుడేమిటి చేయటం?" అడిగాడు రంగారెడ్డి.

 

    "మనం రెండు పార్టీలుగా విడిపోయి రెండు కార్యక్రమాలు చేపట్టాలి. మొదటి గ్రూప్ వాళ్ళు ఆమె శవం ఎక్కడయినా కనిపించిందేమో పోలీస్ స్టేషన్స్ లో ఎంక్వయిరీ చేయాలి. రెండో గ్రూప్ తెల్లారేసరికి ఆమె దహన సంస్కారానికి ఏర్పాట్లు చేయాలి." అన్నాడు శాయిరామ్.

 

    ఆ మాట వింటూనే ఆమె తల్లిదండ్రులిద్దరూ విరుచుకుపడి పోయారు.

 

    "అనుకున్నంతా అయింది దేవుడో! వద్దంటున్నా వినకుండా ఇవాళ బంగారు ఉంగరం కూడా పెట్టుకెళ్ళి ప్రాణం మీదకు తెచ్చుకుందిరా దేవుడో" అంటూ ఏడ్చేయసాగిందామె.

 

    వాళ్ళిద్దరినీ మా ఆడాళ్ళందరూ కలిసి బలవంతంగా వాళ్ళింటికి తీసుకెళ్ళారు.

 

    శాయిరామ్ గ్రూప్ వాళ్ళందరం ముందు పోలీస్ కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేయాలని నిర్ణయించుకుని మా కాలనీ దగ్గరలోనే ఉన్న హోటల్ ఓనర్ ని నిద్రలేపి లోపలవున్న పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచి రింగ్ చేయటం మొదలుపెట్టాము.

 

    ఎనిమిది అర్థరూపాయ బిళ్ళలు మింగాక అప్పుడు అందమయిన ఓ గొంతు ప్రేమగా మాట్లాడింది.

 

    "దయచేసి మీ ధ్యానం ఇటు మళ్ళించండి! ఫోన్ అవుటాఫ్ ఆర్డర్ లో యున్నదని తెలియజేయటానికి చింతిస్తున్నాం. మా టెలిఫోన్స్ డిపార్ట్ మెంట్ సదా మీకు సేవ చేస్తుందని తెలియజేయటానికి సంతోషిస్తూ మీకు మా నూతన సంవత్సరాభినందనలు తెలియజేస్తున్నాము.