"ఐ వాంట్ టుబి సిన్సియర్."

 

    "సిన్సియారిటీ అంటే దేశ ఉపప్రధాని కొడుకుతో పేచీ పెట్టుకోవడం కాదు."

 

    "పోలీసులంటే ప్రజానాయకుల చుట్టూ తిరిగే డాగ్స్ గా బ్రతకడం కాదు."

 

    "యుసీ..." మరేదో అనబోయిన శ్యాంసుందర్ ని అర్ధోక్తిగా ఖండించాడు శమంత్."

 

    "మిస్టర్ యస్పీ" నేను చచ్చి బ్రతికినవాడ్ని... కాబట్టి చస్తూ రాసిన రాజ్యం వుత్తరం ద్వారా మహేంద్రని, అదే గౌరవనీయులయిన ఉపప్రధాని కొడుకుగార్ని కస్టడీలోకి తీసుకోబోతున్నాను.

 

    అప్పటికే ఈ ఉత్తరాన్ని చించేసిన యస్పి "మహేంద్రని అరెస్టు చేయడానికి యిది చాలదు" అన్నాడు ఉక్రోషంగా.

 

    "ఒక సమస్యని సామాన్య పౌరుడు ఉత్తరంలా రాసిన దేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అప్పీల్ గా అంగీకరిస్తున్న వాస్తవం తెలిసిన మీరు యింత అమాయకంగా మాట్లాడటం బాధాకరం మిస్టర్ శ్యాం సుందర్" ద్వారం దాటబోయే క్షణం ఆగాడు శమంత్. "ఇప్పుడు మీరు చింపింది ఉత్తరం తాలూకు జిరాక్స్ కాపీ మాత్రమే."

 

    వెళ్ళిపోయాడు శమంత్...

 

    బ్రతుకునేర్చిన గుణం, అవకాశవాదం తెలిసిన అసలుసిసలయిన పెద్దమనిషి శ్యాంసుందర్. ఆ తర్వాత జరగబోయే అనర్థాలకు తను బాధ్యత వహించలేనంటూ వెంటనే మహేంద్రకి ఫోన్ చేశాడు.

 

    వేట ప్రారంభమైంది.

 

    స్వయంగా మహేంద్ర రంగంలోకి దిగాడు.

 

    శమంత్ కోసం గాలిస్తూ తన అనుచరులతో అతడి యింటికి వచ్చాడు.

 

    భయంతో కంపించిపోతున్న రేవతిని చూస్తూ అన్నాడు. "నిన్ను కిడ్నాప్ చేయడం లాంటి తెలివితక్కువ పని చేయను రేవతీ" ఎంతయినా ఓ పోలీసాఫీసరు పెళ్ళానివిగా. అందుకే ఈరాత్రికి మీ ఆయనతో చెప్పు "రేపటికల్లా ఆ ఉత్తరం నాకందించబడాలి. లేదూ అంటే ఆరేళ్ళ నీ కూతురిముందే నీతో ఓ బ్లూఫిలింలో నేను నటించేస్తాను."

 

    తల వంచుకుని యేడుస్తుందామె.

 

    ఏదో వూహించని అనర్థం జరగబోతుందని ఆమెకి తెలిసిపోయింది కాని నివారించడం తెలీదు...

 

    క్షణ క్షణం బితుకుమంటూ బ్రతకడం ఆమెకు కొత్తకాదు కాని యిలా ప్రత్యక్ష పోరాటంలో తను ప్రేక్షకురాలు కావడం తొలిసారి.

 

    "అర్థరాత్రి దాటుతున్నా భర్త జాడలేదు."

 

    ఆ సమయంలో అమాయకంగా అంతా చూస్తున్న లల్లూకి గుర్తుకొచ్చింది తండ్రికాదు.

 

    అంకుల్... తను దేవుడంకుల్ గా భావించే శ్రీహర్ష.


                                   *  *  *


    అలసటగా ఇసకలో నడుస్తున్నాడు శ్రీహర్ష. అర్థరాత్రి దాటుతున్నా హోటలుకి వెళ్ళాలనిపించలేదు. పదే పదే జూలీ గుర్తుకొస్తోంది.

 

    రేష్మి అడ్రస్ తెలుసుకోవడం కష్టంకాదు... కానీ జూలీని వెంటనే కలుసుకోవాలనుంది.

 

    ఈ దేశంలో యెలా అడుగుపెట్టిందో, ఏ స్థితిలోవుందో చూడాలని మనసు ఉద్రేకపడుతుంటే--

 

    శమంత్ కుటుంబంతో శాశ్వతంగా బంధాన్ని తెంచుకోవాలని నిర్ణయించుకున్న శ్రీహర్ష చుట్టు అలముకున్న చీకటిలో ఒంటరిప్రయాణికుడిలా నడుస్తున్నాడు.

 

    సమీపంలో సముద్రపు హోరు.

 

    నిర్జనంగా వున్న పరిసరాలు.

 

    కాళ్ళకేదో బరువుగా తాకింది.

 

    శవం కాదు. శవంలా ఓ వృద్ధురాలు.

 

    "నువ్వు" ఎండుటాకులా వణికిపోతూ పైకి లేచింది "నువ్వు వచ్చేశావా నాన్నా."

 

    పాలిపోయిన ఆ వృద్ధురాలి మొహం ముడతలమధ్య సన్నగా జ్వలిస్తున్న కాంతివలయం.

 

    "ఎవరు కావాలమ్మా"

 

    గొంతు గుర్తుపట్టేసినట్టు టక్కున వెనక్కు తిరిగింది.

 

    "హయ్యోరామా" నొచ్చుకుంటూ చేతిని నోటికి అడ్డం పెట్టుకుంది. "నా బిడ్డవనుకున్నానయ్యా! అయినా నా పిచ్చిగాని ఆరేళ్ళపిల్లడు, ఆకతాయి తండ్రి యింతుండాలిగాని నీ అంతెలా వుంటాడు."

 

    అర్థంకానట్టు చూస్తూ "ఇక్కడే ఉంటాడా" అన్నాడు నెమ్మదిగా.

 

    అహ, ఊపిరితిత్తుల అరల్లోనుండి జారిపోతున్న ప్రాణవాయువుని కూడగట్టుకుంటూ నిస్త్రాణంగా అంది. "అక్కడుంటాడు. అక్కడంటే సముద్రం నీళ్ళల్లో కాదు. అల్లక్కడ ఆకాశం నీరూ కలిసే చోట. ఏడేడు సంద్రాల ఆవలి ఒడ్డున. ఏడు గుర్రాల రథంపై కూర్చోనుంటాడు. సూరీడు నా స్నేహితుడంటాడు. చెప్పకుండా వెళ్ళిన తాను తప్పకుండా వస్తానంటాడు."

 

    క్రమంగా ఆమె కళ్ళు నీటికుండలయ్యాయి.

 

    "అయినా వాడెంత గడుగ్గాయో చూశావా నాన్నా"

 

    వెక్కిపడిపోయింది. "ఒకటి రెండు కాదు" రెండు పుష్కరాలుగా నన్ను ఆరడి పెడుతున్నాడు. తల్లిని కదయ్యా. తిడతానే తప్ప శపించను. కంటతడి పెట్టుకుంటానే తప్ప యింటికి రాకూ అనలేను. అయినా వాడికిది న్యాయమా"

 

    ఒక మతిభ్రమించిన తల్లిగా బాధపడిందనో లేక తనకీ అలాంటి ఓ తల్లి వుండి వుంటుందన్న భావం మెదిలినందుకో మనసు ధ్రవించింది.

 

    "ఇప్పుడప్పుడే రాడమ్మా"

 

    "చెప్పాడా"

 

    "ఆ... చెప్పమన్నాడు"

 

    ఉద్వేగంగా కళ్ళొత్తుకుంటూ ముసలితల్లి పద్దెనిమిది సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణలో యిలాంటి చల్లని కబురు చెప్పిన తొలి వ్యక్తి అయినందుకేమో "నా వరాల తండ్రి యింకేమన్నాడు? అమ్మ గురించి యింకేం అడిగాడు."

 

    "నిన్ను చలిలో యిలా ఎదురుచూడొద్దని చెప్పమన్నాడు. అందరిలోనూ తననే చూసుకోమన్నాడు."

 

    "పటికబెల్లం అడిగాడా"

 

    "లేదు"

 

    "సున్నుండలు తెమ్మన్నాడా"

 

    తల పంకించాడు అవునన్నట్టుగా.

 

    "మరి తీసుకురానా"

 

    "అలాగే"