రేష్ గా డ్రయివ్ చేసి యాక్సిడెంట్ చేసింది నేనని ఒప్పుకుంటాను. అందుకు నాకు నాలుగు రోజులు జైలు శిక్ష పడుతుంది. నిజానికి అది నీకు పడవలసింది. నేను నెత్తిన వేసుకుంటాను"

 

    ఆ అమ్మాయికి విషయం కొంత అర్ధమయింది.

 

    "నీకేమిటి లాభం?" అమ్మాయి నెమ్మదిగా అడిగింది.

 

    "నువ్వు ఓ వెయ్యి రూపాయలిస్తావుగా. అదే లాభం"

 

    ఆ యువతికి విషయం అర్థమయిపోయింది.

 

    "ఇలాంటి వ్యక్తులు కూడా..." ఆమె మాటలింకా పూర్తి కాలేదు.

 

    "ఉంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళకు తప్పు చేసే ఆవేశం వుంటుంది కాని, శిక్ష అనుభవించే గుండె ధైర్యం వుండదు. పైగా పరుగు ప్రతిష్టలొకటి వుంటాయిగా? వాటిని కాపాడుకోవడానికి మాలాంటి వారిని అడ్డు పెట్టుకుంటారు. అడ్డం వుండడం అనే పనినే నేను వృత్తిగా పెట్టుకున్నాను."

 

    జనం అప్పటికే కారుని చుట్టేయబోతున్నారు.

 

    అతను కనురెప్పపాటు కాలంలో ఆమె హేండ్ బేగ్ ని అందుకొని, అందులోంచి వెయ్యి రూపాయల్ని తీసుకొని జేబులో కుక్కుమని వచ్చేవారిని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాడు.

 

    జనాలు రావడం, సామంత్ ని కారులోంచి బయటకు రమ్మనడం... అప్పటికప్పుడు అక్కడే పంచాయతీ పెట్టడం, వెయ్యిరూపాయలు జరిమానా విధించడం, ఆ ఎమౌంట్ ని ఆ యువతి చెల్లించడం నిమిషాల్లో జరిగిపోయింది.

 

    ఆ యువతీ కళ్ళల్లో క్షణకాలం కృతజ్ఞతా భావం మెరిసి అదృశ్యమైంది.

 

    కారు ముందుకెళ్ళి పోయింది.

 

    సామంత్ ఆరోజు కోటా పూర్తికావడంతో తన గమ్యానికేసి బయలుదేరాడు.


                               *    *    *    *


    వాళ్ళు రక్షకభటులు- వాళ్ళిప్పుడు రక్షకభట నిలయం వైపు సాగిపోతున్నారు.

 

    వాళ్ళు మొత్తం నలుగురు. వాళ్ళు మొత్తం సామంత్ ని బంధించి చేతులకి బేడీలు వేసి చుట్టూ సాయుధులై నడుస్తున్నారు.

 

    వాళ్ళు అప్రమత్తంగా వున్నారు.

 

    తల వంచుకు నడుస్తున్న వ్యక్తి సామాన్యుడు కాదు. విరిచి కట్టిన అతని చేతులుకున్న బేడీలు తీసివేస్తే అక్కడున్న నలుగుర్ని ముట్టుబెట్టడానికి అతనికి అరక్షణం చాలని సాయుధులైన వారికి తెలుసు.

 

    ఓ క్షణకాలం అప్రమత్తంగా వుంటే చాలు.

 

    అతడు ఆ అవకాశాన్ని తీసుకుని అక్కడి నుంచి చూపులకు కూడా అందనంత వేగంగా అదృశ్యమవుతాడని కూడా తెలుసు.

 

    అతను ఆయాసపడకుండా పది మైళ్ళు గూడ్స్ బండితో సమానంగా పరిగెత్తగలడు. పరుగెత్తే రైలులోకి పట్టుదలగా చేరగలడు. గాలి కన్నా వేగంగా దూసుకువెళ్ళే రైలులోంచి సుడిగాలిలా బయటకు రానూగలడు.

 

    అతను అవతలి వ్యక్తి కళ్ళలోకి కొద్ది క్షణాలు సూటిగాచూస్తే చాలు... ఆ వ్యక్తి భయంతోటో, భక్తితోటో, అదీ కాదనుకుంటే గగుర్పాటుతోటో ఇతనికి లొంగిపోతాడు.

 

    అయినా అతడా క్షణంలో అటువంటి ప్రయత్నాలేవీ చెయ్యడం లేదు.

 

    అతడు చేస్తున్న పనులు చట్టానికి వ్యతిరేకమైనవిగా భావించినా, ఎదుటి వ్యక్తికి అవి హాని కలిగించేవి కావని అతడి ఉద్దేశం. అలాంటి ఉద్దేశం వుండబట్టే అతను చట్టాన్ని గౌరవించి వారితోపాటు బయలుదేరాడు.

 

    అతను ఏ విషయాన్నయినా కరెక్ట్ గా జడ్జ్ చేయగలడు. అతడి జడ్జ్ మెంట్ పై అతనికా నమ్మకం వుంది.

 

    విశాలమైన నుదురు - ఎదుటివారి ఆలోచనలను క్షణాల్లో విశ్లేషించి నిక్షిప్తం చేసుకోగల జ్ఞాపకశక్తి అతడికి మాత్రమే ఉన్నాయి.

 

    కొనదేలిన ముక్కు, ఎర్రగా మెరుస్తున్న పెదవులు గుండెలోని పదునైన భావాలను తీక్షణంగా ప్రతిఫలిస్తున్నట్టుంటాయి. రెండు విశాలమైన బాహువుల మధ్య హైవే రోడ్డులాంటి విశాలమైన ఛాతీ... నిర్లక్ష్యంగా పెరిగిన గడ్డం. అతన్నో క్షణం చూస్తే చాలు చూడ చక్కని ఆ కనుముక్కు తీరును కాక రఫ్ నెస్ నే ఇష్టపడతారు ఎవరైనా. అతని మొరటుదనంలో ఆ ఆకర్షణ వుంది.

 

    పోలీసులు సరాసరి అతడ్ని తీసుకెళ్ళి ఎస్.ఐ. నరసింహం ముందుంచారు.

 

    సగం మనిషి, మరో సగం పశువుకి ఒకింత శాడిజాన్ని, ఒకింత రాక్షసత్వాన్ని కలిపితే ఏర్పడిన వ్యక్తి నరసింహం.

 

    అతను చూపులకే కాదు- ప్రవర్తన విషయంలో కూడా రాక్షసంగానే వుంటాడు.

 

    నాలుగు గోడల మధ్య ఎటువంటి వ్యక్తి చేతనైనా సరే నిజాన్ని చెప్పించగలడు- ఒప్పించగలడు- చేయని నేరాన్ని కూడా చేసినట్టు రుజువు చేయగలడు.

 

    ఆ టౌన్ కి ఎస్.ఐ.గా వచ్చి రెండు నెలలు కాలేదు; అప్పుడే అతను రెండు లాకప్ డెత్ లని, రేపు రేపుల్ని కళ్ళ చూశాడు.

 

    పదిమందిని చంపితేనేగాని డాక్టర్ కాడనేది పాత సూక్తి. పదిమంది ప్రాణాలు తీస్తేగాని ఎస్సై కాడనేది నేటి సూక్తి.

 

    అతను ఆ సూక్తిని నిరూపించే ప్రయత్నంలో వున్నాడు.

 

    కాని, ప్రజలు పత్రికలు అతనికి ఆ అవకాశం యివ్వలేదు. అందువల్లే అతడిలో అసహనం తొంగి చూస్తుంటుంది. రాక్షసత్వాన్నే ప్రవృత్తిగా పెట్టుకున్న అతనికి సరైన పనిని కల్పించనందుకు అతనిలోని సగం మానవుడు కూడా పశువుగా మారబోతున్నాడు.

 

    "దొంగతనం చేసింది నువ్వేనా?" తీక్షణంగా ప్రశ్నించాడు నరసింహం.

 

    అతడి నుంచి సమాధానం లేదు.

 

    మరోసారి ప్రశ్నించాడు ఎస్సై.

 

    "స్టేషన్ లోకి అడుగుపెట్టిన తరువాత నేరాన్ని ఒప్పుకోని వ్యక్తి వుండడనుకుంటాను. ఎందుకంటే నేరాన్ని ఒప్పుకోని వ్యక్తిని ఈ లోకంలో వుంచరు కాబట్టి" స్థిరంగా అన్నాడా వ్యక్తి.

 

    అతడి మాటలకి మరింత రెచ్చిపోయాడు నరసింహం. అతడి చెయ్యి వేగంగా పైకి లేచింది.

 

    "రేయ్... అడిగిన ప్రశ్నకి అడ్డమైన సమాధానాలు చెబుతావా?" అతడి మాటలింకా పూర్తి కాలేదు. నర్సింహం చేతిలోని లాఠీ అతని మొహాన్ని తాకింది.

 

    వెచ్చటి నెత్తురు చప్పున ఉబికింది.

 

    "మిస్టర్ ఎస్సై! నేరస్తుడు నేరాన్ని ఒప్పుకున్నా తరువాత కూడా చెయెత్తడం మంచిది కాదు" తిరిగి అతని కంఠంలో అదే స్థిరత్వం. వాళ్ళు కావాలనే మల్లేష్ చేసిన దొంగతనాన్ని తన మీదకు నెట్టారని తెలుసు. చేయలేదని నిజం చెప్పి వాళ్ళని మరింత రాక్షసుల్ని చేసి, రభస చేయడం యిష్టంలేక వెంటనే ఒప్పేసుకున్నట్టు వాళ్ళకు కూడా తెలుసు. నేరం ఒప్పుకుంటే ఏ కారణం చూపించి దండించాలో తెలీక పోలీసులు సాధారణంగా వెర్రెక్కిపోతారు.

 

    "వ్వాట్...? ఈ నర్సింహానికి లెక్చరిస్తున్నావా" జుట్టు పట్టుకుని మొహాన్ని పైకి ఎత్తాడు నర్సింహం. అదే ఇప్పుడతనికి దొరికిన కారణం.

 

    "నేను నేరాన్ని ఒప్పుకుంటున్నాను. నువ్వు అనవసరంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవాలని ప్రయత్నించకు" హెచ్చరించాడు సామంత్.

 

    "బెదిరిస్తున్నావా...? మాట్లాడుతున్నది ఎవరితోనో తెలుసా?" విసురుగా బూటు కాలుతో కడుపులో తన్నాడు- నర్సింహం.