ఆమె మళ్ళీ నవ్వింది. లేకపోతే నవ్వకపోయినా నవ్వినట్లుగా వుంది. "నిన్న అంత హఠాత్తుగా వెళ్ళిపోయారేం?" అని ప్రశ్నించింది.    
    ఆ ధోరణి ఎలా వుందంటే, నిన్ను నేను అక్కడినుండి వచ్చేశాక మళ్ళీ కలుసుకున్న వెంటనే అడిగిన మొదటిప్రశ్నలా వుంది.    
    "అబద్దమేనా!" అంటున్నాను కలవరిస్తున్నట్లుగా.    
    "లేదయ్యా డాక్టర్ నిన్న నేను నిజమే చెప్పాను" అందామె.    
    నేను విషన్నవదనుడనై యేమీ పలకకుండా వుండటం చూసి తిరిగి ఆమె చెప్పసాగింది. "అవును ఈ విషయం తేటతెల్లంచేసి పోదామనే యిప్పుడు మిమ్మల్ని వెనక్కి పిలిచాను. నేను నాస్తికురాలినంటే యెందుకు నమ్మరు? నాస్తికురాలు గుడికి రాకూడదా? భాగవతం చదవకూడదా? ప్రసాదం కళ్ళకు అద్దుకోకూడదా?    
    "మీ ఆశ్చర్యానికి హద్దులేకుండా వుందిగావును! అదృష్టవశాత్తూ నేను ప్రపంచంలో కొన్ని విచిత్రాలు చూశాను. నిత్యం దేముడిని పూజించే పూజారి అదేగుడిలో రాత్రిళ్ళు నీచకార్యాలు చేయటమే, ఆపదలో మొక్కుకొని ఆపద తీరాక ఆ మొక్కును తిట్టుకుంటూ తిమురుకుంటూ తీర్చుకోవటమూ, దేముడి పేరుచెప్పి అమాయకులయిన స్త్రీలను కురూపులను చేయటమూ, ఇలాంటివి ఎన్నో ఈ నిముషంలో వాదనకోసం భగవంతుడ్ని నిందించిన నాలికతో ఆ రాత్రి భయకంపితుడైన ఆయన్ని స్మరించి వేడుకోటానికి వెనుకాడటంలేదు. ప్రతివాడిలోనూ అస్పష్టత, సంఘర్షణ సమయానికి దేముడ్ని ఉపయోగించటం, తనకు జరిగిన అన్యాయాలన్నీ ఆయనమీద త్రోసి దుయ్యబట్టడం, ఇదంతా చూసి నా కసహ్యం కలిగింది. ఆ రోజుల్లో నాకూ నమ్మకం లేదు ఆయన వునికిని గురించి ఒక రోజొక విపరీత సంఘటన జరిగింది. నేను భగవంతుడ్ని నిందించాను. మళ్ళీ వెంటనే భయపడ్డాను. ఈ నా ప్రవర్తనమీద నాకే అసహ్యం కలిగింది. విరక్తి కలిగింది. ఇలా రెండు మనసులతో జీవించదలచుకోలేదు. దేనినో ఒకదాన్ని నమ్మి, ఆ సూత్రంపైనే జీవితమంతా గడపాలనుకున్నాను. అంతే, నా కలా అనిపించింది. అప్పుడప్పుడూ నా కలా అనిపిస్తూ వుంటుంది. నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయింది.    
    "మరయితే యీ నటన దేనికి? ఈ పూజలూ, పునస్కారాలూ దేనికీ?"    
    "దేనికా?" అంటూ ఆమె తిరస్కారసూచకంగా ఒక భంగిమ ప్రదర్శించింది. "ఆయన నన్ను కట్టుకున్న భర్త, ఆయన ఎంత దైవభక్తుడంటే, కొన్నివేలు ఖర్చుచేసి ఒక గుడికూడా కట్టించారు. ఆయనకు యిష్టం నేను పూజా పునస్కారాలూ, పురాణపఠనం చేయటం నేనాయన యిష్టాన్ని పాలిస్తున్నాను."    
    "పోతే మీరు పతిభక్తిలోని పరమార్ధాన్ని అంగీకరించారన్నమాట" అని హద్దులు దాటిపోతున్నాననుకుంటూనే అడిగాను.    
    ఆమె నిరసనగా నవ్వింది. "పతిభక్తి, పరమార్ధం? ఆహా! మాటలు వినటానికి యెంత ఇంపుగా వున్నాయి! మన పెద్దలు అసాధారణ ప్రజ్ఞా వంతులు, కొన్ని సూత్రాలను ప్రజలనెత్తిన రుద్దేటప్పుడు వాటికి తగిన పదాలనే యేర్చి, కూర్చి వెళ్ళారు."    
    మళ్ళీ తనే "నేను నటిస్తున్నాను డాక్టర్! అనవరతమూ నటన నాకు అత్యంత ప్రీతీపాత్రమైన వస్తువు. జబ్బు మనుషులు ఆరోగ్యవంతులుగా కనబడటానికి, తెలివిహీనులుగా తెలివిగా కనబడటానికి, గజదొంగలు పెద్దమనుషులుగా కనబడటానికీ నటిస్తారు. కాని నేను కసి తీర్చుకోవటానికి నటిస్తున్నాను. నాకు ఎవరయితే అసహ్యమో ఆ వ్యక్తి అంటే అత్యంత అభిమానమైనట్లు, ఏ మాటలు పడటానికి దుర్భరంగా వుంటాయో, అవి పడటం ఆమందానందకరమైన విషయమైనట్లూ నటిస్తున్నాను."    
    ఇలా అంటున్న ఆమెముఖంలోకి చూసి వులిక్కిపడ్డాను. నేత్రాలు ఉజ్వలమైన కాంతితో ప్రకాశిస్తున్నాయి. శరీరమంతా ఆవేశంతో వుప్పొంగుతున్నట్లుగా వుంది. క్షణంలో ఆమె విశాల నయనాలలో రక్తారుణిమ గమనించాను.    
    ఎట్లాగో తెప్పరిల్లి "అంత నటించవలసిన అవసరం ఏమొచ్చె? మీకు.....బాబాయంటే యిష్టంలేదా?"    
    "ఇష్టమా?" అని ఆమె నిర్లక్ష్యంగా నవ్వింది. "నేనెప్పుడూ ఆ రకం యిష్టాయిష్టాలను గురించి ఆలోచించలేదు. భార్యాభర్తల మధ్య అసలు యిష్టానికి ప్రాధాన్యత వున్నదని అనుకోను. పెళ్ళయ్యే క్షణంవరకూ ఒక స్త్రీకి తన భర్తగురించి అసలు యేమీ తెలియదు. వెంటనే అతను తరతరాల నుంచీ తమ యిద్దరకూ సంబంధం వున్నట్లుగా ప్రవర్తించనారంభిస్తాడు. ఇది ఒక గొప్ప పాశంలాంటిది. దీనికి తప్పనిసరిగా లొంగిపోయిన స్త్రీ ఏమీ ఆలోచించటానికి వ్యవధిలేని రోజుల్లోనే అతనితో కలిసి కాపురానికి వచ్చేస్తుంది.    
    "ఇలా చెప్పానుగా చుట్టాలూ పక్కాలూ వీళ్ళిద్దరకూ ఎన్నో యేండ్లుగా యెడతెగని సంబంధం వున్నట్లు ముచ్చట్లు జరిపి మురిసిపోతారు. ఈ దశలో స్త్రీ తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతుంది. భర్తమాటలకు తాళంవేస్తూ అతని అడుగులకు మడుగులొత్తుతూ తన యిచ్చను గురించి ఏమాత్రం ఆలోచించకుండా పూర్తిగా అతని పరమైపోతుంది. తనని తనే మోసం చేసుకుంటుంది. దీనికి లోకం భక్తి, అన్యోన్యత అని పేర్లుపెట్టి మెచ్చుకోనారంభిస్తుంది. ఇహ దానితో ఆమె కనులు పూర్తిగా మూసుకుపోయి తరతరాలనుంచీ తనలో హత్తుకుపోయి వున్న మత్తు యింకా యెక్కువై పరవశం చెందుతూ, తన పనికి గర్విస్తూ కీలుబొమ్మలా సంఘంచేతిలో తైతక్కలాడుతుంది."    
    నా నరాలు తెగి రక్తం ప్రవహించినట్లయింది. ఈ ధోరణిని సహించలేక "ఎంత దారుణమైన మాటలు! మీరు సహజ జీవితం మరిచిపోయారన్నమాట. సహజత్వంలోని..."    
    "సహజం" ఆమె వెటకారంగా అంది. "సహజంగా వుండటమే అసలు అభినయం. అంతకన్నా అసహ్యకరమైన నటన వుండబోదు. ఇది నా మాటే కాదు డాక్టర్" ఆమె గొంతులో పగ, అసహ్యం, స్వచ్చత, క్రూరత్వం వ్యక్తం అయాయి.    
    నేను ఆందోళనతో "ఇది దేవాలయం ఇటువంటి మాటలనకూడదు" అన్నాను.    
    "ఇది మీకు దేవాలయం నాకు వినోద సాధనాలయం"    
    నేను చెవులు రెండు మూసుకొని "రామ రామ... ఏమిటి యీ దారుణం? ఏమిటి ఈ విపరీతం? మిమ్మల్ని ఇలా తయారు చేసిందెవరు? మీచేత యీ మాటలు పలికిస్తున్నదెవరు?" అని స్పష్టంగా గొణిగాను.