"వద్దులే. అంత పని చెయ్యకు. నేనే మార్చుకు వస్తాను" అని వేదిత కొత్త బట్టలు తీసుకుని లోపలకు వెళ్ళిపోయింది. ఆమెలో కించిత్ కూడా కలవరపాటు లేదు.

 

    పదినిముషాలు గడిచాక ఆమె నూతన వస్త్రాలు ధరించి హాల్లోకి వచ్చింది. దాసీది కళ్ళు కుట్టేటట్లు ఆమెవంక చూస్తూ "అదీ! ఇప్పుడు అచ్చం దేవకన్యలా ఉన్నారు. ఆగండి, ఇంకా అయిపోలేదు. ఎన్నాళ్ళయింది తలకి నూనె రాసుకుని?" అంటూ ఆమెను చెయ్యి పట్టుకుని తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టి సక్సేనా కొనుక్కువచ్చిన తలనూనె సీసా తీసుకుని వెనుక నిలబడి ఆమె కురులకు నూనె రాయసాగింది.

 

    "అబ్బో! ఎంత బారమ్మా నీ జుట్టు? జడవేసి వొదిల్తే తాచు పాములా ఉంటుంది. ఈ ఊళ్ళో ఇంత జుట్టు ఎవరికీ లేదంటే నమ్మండి" అంది ఆశ్చర్యం కనబరుస్తూ.

 

    "ఉహూ! ఇంత పెద్దనగరంలో నా జుట్టువంటి జుట్టుగల వాళ్ళెవరూ నీకు కనబడలేదా?" అంది వేదిత నవ్వుతూ.

 

    "నవ్వుతాలు కాదమ్మగారూ! నేనబద్ధ మాడటంలేదు. ఇక్కడి నకిలీ జుట్లన్నీ మీ తలకట్టుముందు దిగదుడుపే."

 

    "అలాగా!" అంది వేదిత నవ్వాపుకుని.

 

    పనిమనిషి నూనె రాయటం ముగించి బల్లమీద కొత్త దువ్వెన తీసుకుని చక్కగా ఆమె తలదువ్వి జడవేయసాగింది.

 

    వేదిత అభ్యంతరం చెప్పలేదు. "ఎందుకని నా గురించి యింత శ్రమపడుతున్నావు నువ్వు?" అనడిగింది కొంచం ఆగి.

 

    "శ్రమేముంది అమ్మగారూ! నేను మీ దాసీదాన్ని. ఇది నా పని."

 

 

    "నువ్వు చాలా సలక్షణమయిన దాసీదానిలా ఉన్నావే. నీ పేరేమిటి?"

 

    "త్రిమూర్తులు"

 

    ఒక్క క్షణంపాటు ఆమె శరీరం కంపించినట్లయింది. ఒక్క క్షణమే అది. వెనువెంటనే తేరుకుని నవ్వుతూ "భలేపేరు, నేను కాదనుకున్నది నాతో పలికించేటట్లున్నావే. నిన్ను ఆ పేరు పెట్టి పిలవను. 'చిన్నమ్మీ' అని పిలుస్తాను. సరేనా?" అంది.

 

    "చిన్నమ్మీ అనా? మీ ఇష్టం. మీరు నన్ను అమాంతం చిన్నపిల్లను చేస్తానంటే కాదంటానా? పడుచుదనం మరోసారి అనుభవించాలని నాకూ ఇదిగానే ఉంది."

 

    "ఎందుకో అంత ఇది! అప్పుడే ముసలిదాని వయిపోయినట్లూ."

 

    త్రిమూర్తులు గలగల నవ్వి "ముప్పయ్యేళ్లు వచ్చాయి నాకు. ముసలి దాన్ననక మరేమంటారమ్మగారూ" అని జడవేయటం ముగించి "ఇంత పొడగాటి జడను ముడి వెయ్యటానికి నాకు మనసొప్పటం లేదు. ఇవాల్టికి ఇలాగే ఉంచేస్తాను" అని రిబ్బను ముడివేసింది.

 

    'అయిందా?' అంది వేదిత.

 

    "ఉండండి అప్పుడేనా?" అంటూ త్రిమూర్తులు చేత్తో చిన్న వస్తువేదో పట్టుకుని ఆమె కళ్ళచుట్టూ దిద్దసాగింది.

 

    "ఏమిటదీ? కాటుకా?"

 

    "అలాంటిదే. దీన్ని కాజతే అంటారు . ఇక్కడందరూ ఇలాంటివే వాడతారు."

 

    కళ్ళుదిద్దటం ముగించి "చంద్రబింబం వంటి యీ ముఖానికి చిన్నారి బొట్టుకూడా ఉంటే ఎంచక్కా ఉంటుంది" అంటూ గబగబ వెళ్ళి బల్లమీదనుంచి ఎర్రటి చిన్న  సీసావొకటి పట్టుకువస్తోంది.

 

    ఒక్కక్షణం... వేదిత శరీరమంతా సుడిగాలికి తరుపత్రంలా గజగజ వొణికిపోయింది. గొంతెత్తి వారించబోయింది. కాని ఒక్క క్షణమే అది. తర్వాత వొణుకూ లేదు; వారింపూ లేదు."

 

    త్రిమూర్తులు వచ్చి ఆమె నుదుటన సన్నని ఆకులా ఓ బొట్టు పెట్టేసింది. తర్వాత గర్వంగా "ఇప్పుడు చూసుకోండమ్మా ఎలా ఉన్నారో! ఆడదంటే ఇలా ఉండాలి. మిమ్మల్నలంకరించి ఇవాళ నా జన్మ సార్థకమయింది" అని చెయ్యిపట్టుకుని లోపల గదిలోకి తీసుకువెళ్ళి డ్రెస్సింగ్ టేబిల్ అద్దంముందు నిలబెట్టింది. వేదిత తన రూపాన్ని ఒకసారి ఆ అద్దంలో తిలకించింది. ఆమె ముఖంలో ఆశ్చర్యమూ లేదు. అపురూప భావమూలేదు. యథాలాపంగా చూసుకుంది.

 

    "ఎలా ఉన్నారు?"

 

    "నువ్వు చెప్పావుగా."

 

    "ఇంతేనా? మీకేమీ ఆనందంగా లేదన్నమాట."

 

    "లేకేం, ఉందిలే."

 

    "సరే. యిహ యిటు రండి" అని మళ్ళీ బయట హాల్లోకి తీసుకువెళ్ళి "ఇంత మంచి అలంకరణ చేసుకుని కాళ్ళకి జోళ్ళు లేకుండా ఉండటం ఫ్యాషన్ కాదు ఇక్కడ" అంటూ ఒక ప్యాకెట్ లోంచి ఎర్రటి కొత్త చెప్పులజత బయటకు తీసి "తొడుక్కుని చూడండి సరిపోతాయో లేదో" అంది.

 

    వేదిత తన మృదువైన పాదాలను ఆ జోళ్ళలో ఉంచి చూసింది. సరిగ్గా కొలత చూసి తీసుకున్నట్లు ఆమె పాదాలకు అమిరాయి. ఆమెవాటిని ధరించి హాల్లో అటూ ఇటూ నడవసాగింది.

 

    "అరె! హెచ్చు తగ్గులు లేకుండా భలే సరిపోయాయే . ఇదిగో, ఈ హేండ్ బ్యాగ్ చేతిలో పట్టుకోండి. అదీ! ఇప్పుడు అలా సరదాగా రోడ్డుమీదకు పోయివద్దాం రండి" అండి త్రిమూర్తులు.

 

    వేదిత అడ్డు చెప్పలేదు.

 

    ఇద్దరూ హాలుదాటి వసారాలోకి వచ్చాక తలుపులు మూసి తాళం పెట్టింది త్రిమూర్తులు. మెట్లుదిగి క్రిందికి వచ్చారు. రోడ్డుమీదకు వచ్చి ఒకరు ప్రక్క ఒకరు నడవసాగారు.

 

    "మీకీ ఊరు నచ్చిందా?" అనడిగింది త్రిమూర్తులు కొంతదూరం పోయాక.

 

    వేదిత చిరునవ్వు నవ్వి ఊరుకుంది జవాబెమీ చెప్పలేదు.